‘‘గత కొన్నేళ్లుగా నేను నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్స్ కాలేకపోయాయి. అనుకున్న రిజల్ట్‌తో సినిమాలు రావటం లేదని నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అనడంతో నాలో తెలియని భయం ప్రారంభమైంది. నాలో స్టోరీ జడ్జ్‌మెంట్ పోయిందా? మళ్లీ హీరోల కాంబినేషన్ లకే వెళ్లాలా? అని ఆలోచించాను. చిత్ర పరిశ్రమలో విజయాలు ఉంటేనే విలువ ఉంటుంది. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో కచ్చితంగా నేను కమ్ బ్యాక్ అవుతాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు.
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ చేంజర్’ ఈ నెల 10న, వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ నెల 14న విడుదల కానున్నాయి. ఈ సినిమాల నిర్మాత ‘దిల్’ రాజు సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ ‘గేమ్ చేంజర్’ నాకెంతో ప్రత్యేకమైన సినిమా. 2021 ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించాను. ఈ మూవీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశాను. ‘భారతీయుడు 2’ సినిమా తర్వాత శంకర్‌గారి నుంచి వస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్‌చరణ్ నటించిన సినిమా కూడా ఇదే. కాబట్టి ఈ మూవీ విజయం మా ముగ్గురికీ ఎంతో ముఖ్యం. అన్ని వాణిజ్య అంశాలతోపాటు గౌరవంగా ఫీల్ అయ్యే సినిమా ‘గేమ్ చేంజర్’.
⇒ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అని అంటున్నారు. ఈ బజ్ రావటానికి కారణం అనిల్ రావిపూడి. ‘ఎఫ్ 2’ లాగా సూపర్ హిట్ కొట్టాలని కష్టపడ్డాడు. ఈ సినిమా కూడా బిగ్ హిట్ కాబోతోంది. ఏపీలో సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ ధరలపై ఓ స్పష్టత వచ్చింది. ఈ విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని కూడా కలిసి వినతి చేస్తాను. అయితే తుది నిర్ణయం ప్రభుత్వానిదే.
మృతులకు సాయం
ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి, తిరిగి వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి కుటుం బాలకు హీరో రామ్‌చరణ్ ఐదు లక్షల చొప్పున పది లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే నిర్మాత ‘దిల్’ రాజు కూడా చెరో ఐదు లక్షల చొప్పున పది లక్షలు సాయం అందించడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉంటానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment