గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర గీతంపై ఒక తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ గీతానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అనగానే చాలామందికి ఇది ఆత్మ గౌరవంతో ముడిపడిన వ్యవహారంగా కనబడింది. తెలంగాణ గీతానికి తెలంగాణేతర సంగీత దర్శకులు వుండ కూడదా? ఉంటే వచ్చే నష్టం ఏమిటి?
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న తరుణంలో ఎక్కడ చూసినా ‘జయ జయహే తెలంగాణ’ అన్న గీతాన్నే నాలుగున్నర కోట్ల గొంతుకలు ఒక్కటై నినదించాయి. పది జిల్లాల గొప్పతనం గురించి అత్యద్భుతంగా అల్లిన అక్షర మాలను అందెశ్రీ ఎంతో ప్రేమతో, తెలంగాణపై భక్తితో జాతికి అంకితం చేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని, తెలంగాణ సిద్ధించిన తర్వాత మాత్రం ఆ గేయానికి ప్రభుత్వం మాత్రం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నది అందరికీ తెలిసిన విషయమే.
మరి అప్పటి ప్రభుత్వానికి ఆత్మ గౌరవం అంటే తెలియలేదమో. లేక అందెశ్రీ అక్షరాలపై వివక్ష వున్నదో తెలియదు కాని, దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టటానికి మనసు రాలేదు. ఇన్నాళ్ళకు మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించింది. కాని, ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది. తెలంగాణ జాతికి అంకితం చేసే గీతానికి మరింత వన్నె తెచ్చి యావత్ తెలంగాణకు ఒక గొప్ప రాష్ట్ర గీతం అందివ్వాలని ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణికి దానికి సంగీతం అందించే బాధ్యతను అప్పగించింది ప్రభుత్వం. వెంటనే మేధావులు, నాయకులు, కళాకారులు అందరూ ఒక్కసారిగా ఆంధ్ర వాళ్ల చేతిలో ఆత్మ గౌరవం ఎలా పెడతారు అని అడుగుతున్నారు.
పాటకి అక్షరమే ప్రాణం. సంగీతం కేవలం పాటకి హంగు మాత్రమే. తెలంగాణేతరులు సంగీతం అందిస్తే తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతింటుందా? కళకు ప్రాంత, లింగ, వర్ణ విభేదాలు ఉండవు. అది విశ్వజనీనం. మరి ఈ విషయం అర్థమయ్యేలా ఈ విమర్శకులకు ఎలా చెప్పాలి? – రామ్ ఠాకూర్, విశ్లేషకులు, రచయిత
Comments
Please login to add a commentAdd a comment