‘‘అణగారిన జనం సకాలంలో పురోగమించకపోతే కులం అనే విసుర్రాయి కిందపడి నలిగిపోతారని నేను భయపడుతున్నాను. అణగారిన కులాలను బలపరచట మంటే కుల విద్వేషాలను ప్రోత్సహించినట్లు కాదు. మనుషుల్ని వారి పుట్టుకను బట్టి హీనులుగా పరిగణించే పద్ధతి మనలో అంతరించిపోయిన రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు అవుతుంది’’ అన్న ఛత్రపతి సాహూ మహరాజ్... బలహీనవర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ 1902 జులై 26న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో బడుగులు మరిచి పోలేని రోజు.
.వందేళ్ళ క్రితమే సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానంలో దళితులను గ్రామాల్లో పట్వారీలుగా నియమించారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్ళ తర్వాత కూడా బీసీ కులాల గణన చేసి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల సీట్లు కేటాయించమని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారంటే దేశంలో ఆధిపత్య వర్గాలు నేటికినీ పల్లెలను ఎంతగా తమ చేతుల్లో పెట్టుకుని అధికారాల్ని చలాయిస్తున్నారో అవగతమవుతుంది. కులగణన ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిందంటే పాలకులు ఇప్పటి దాకా ఎంత నిర్లక్ష్యంగా పాలిస్తూ వస్తున్నారో తెలుస్తుంది.
బడుగులు బాగుపడకుండా ఈ దేశం బాగుపడ దని తెలిసి కూడా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ‘బీసీ సబ్ ప్లాన్’ను పెట్టాలనీ, దానికి అత్యధిక నిధులివ్వాలనీ బీసీలు వూరేగింపులు చేస్తున్నారంటే ఇంతకంటే దేశానికి దరిద్రం మరేముంటుంది! కులగణనను కాంగ్రెస్ తాత్సారం చేస్తుంటే, బీజేపీ కులగణన చేయనని చెబుతోంది. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల హక్కుల కోసం చట్టసభలు మాట్లాడకుండా దాటవేస్తూ రావటం ప్రజాస్వామ్యాన్ని హననం చేసినట్లుగానే భావించాలి. సగం దేశంగా ఉన్న బీసీ కులాల జీవన విధానం ఎట్లా ఉందో తెలుసుకోకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో ఎట్లా నడిపిస్తారో మన సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య పాలకులే చెప్పాలి.
దేశాన్ని మొత్తం ఆవరించి ఉన్న బీసీ ఉత్పత్తి కులాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో కీలక స్థానాలలోకి, నాయకత్వ దశకు రాకుండా దేశం అభి
వృద్ధి చెందదు. ఆధిపత్య కులాల పెట్టుబడి దారుల చేతుల్లో అధికార పగ్గాలు ఉన్నంత కాలం బీసీలు దుర్భరమైన పరిస్థితుల్లోనే మగ్గిపోక తప్పదు. దేశం అన్ని రంగాల్లోకి దూసుకు పోవాలంటే దేశాన్ని ప్రభావితం చేయగల బీసీలు అన్నిరంగాల్లో శిరసెత్తుకుని నిలవాలి. ఉత్పత్తి కులాల చేతులు పడకుండా దేశం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
మనం చైనా దేశ జనాభాను దాటి ముందుకొచ్చాం. ఉత్పత్తి శక్తుల చేతుల్లోకి దేశ ప్రగతి రథచక్రాలు వచ్చినప్పుడే చైనా ప్రగతిని మించి ముందుకు సాగుతాం. నేటికినీ బడుగు వర్గాలకు, ఉత్పత్తి కులాలకు పాలించే లక్షణాలు లేవని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లే అవుతుంది. ఉత్పత్తి కులాలు ఉత్పత్తి శక్తులై పారిశ్రామికవేత్తలుగా తయారైనప్పుడే దేశం అన్ని రంగాల్లో అసలు సిసలు ప్రగతిని సాధిస్తుంది. దేశాన్నీ, రాష్ట్రాన్నీ పాలించే పాలకులు సాహూ మహరాజ్ లాగా ఆలోచించాలి. ఆధిపత్య వర్గాల నాయకులు తమ హ్రస్వదృష్టిని విడిచిపెట్టి బడుగుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. తమ కులం గొప్పదని, బడుగుల కులాలు తక్కువన్న దుర్మార్గపు ఆలోచన నుంచి ఆధిపత్య కులాలు బైట పడాలి.
బడుగుల బాగే దేశం బాగు అని ఆలోచించగలిగినవారే సాహూ మహారాజులు కాగలుగుతారు. సమ రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. బహుజన హితం కోరి దేశం అభివృద్ధిని కాంక్షించి బడుగులకు పల్లెనుంచి పార్లమెంటు దాకా వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ వాళ్ళ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కుల గణన చేస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల కుల గణన చేసినాకే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోవాలన్నది బీసీల సామూహిక డిమాండ్. తమ వాటా స్థానాలను కోల్పోయిన బీసీలు తమ హక్కుల సాధనకు వారే గొంతెత్తి గర్జించాలి.
– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు (బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ సాహు మహారాజ్ ఉత్తర్వులు జారీ చేసిన రోజు... జూలై 26)
Comments
Please login to add a commentAdd a comment