నేడు చాకలి ఐలమ్మ జయంతి
ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్య ఐలమ్మ.
ఉమ్మడి నల్లగొండజిల్లా (నేటి జనగాం జిల్లా) పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య – ఐలమ్మలకు ఆరుగురు సంతానం. వారిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం. కులవృత్తితో బతకలేక పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది ఐలమ్మ. అదే విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది.
అప్పుడే వెట్టి గొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చి... 1940–44 మధ్య కాలంలో విసునూరులో దేశ్‌ముఖ్‌లు, రజాకర్ల అరాచకా లపై ఎదురుతిరిగి ఎర్రజెండా పట్టి ఆంధ్రమహాసభ (సంఘం)లో చేరింది ఐలమ్మ. దీంతో రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. ఆమె కౌలుకు తీసుకున్న భూమిలో కాపు కొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండా లను పురమాయించారు. ‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలిగేది’ అంటూ తన పంటను దోచుకోవడానికి వచ్చిన దొరగూండాలతో పలికింది ఐలమ్మ.
సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా కోర్టులో తీర్పువచ్చింది. ఐలమ్మ భూపోరాటం సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తి నిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. బడుగులను ఆదుకోవడమే ఆమెకు నిజమైన నివాళి! – ఆలేటి రమేష్, రజక విద్యార్థి సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి
ఇవి చదవండి: మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment