Chakali Ailamma
-
Chakali Ailamma: ఆత్మగౌరవ ప్రతీక!
ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్య ఐలమ్మ.ఉమ్మడి నల్లగొండజిల్లా (నేటి జనగాం జిల్లా) పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య – ఐలమ్మలకు ఆరుగురు సంతానం. వారిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం. కులవృత్తితో బతకలేక పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది ఐలమ్మ. అదే విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది.అప్పుడే వెట్టి గొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చి... 1940–44 మధ్య కాలంలో విసునూరులో దేశ్‌ముఖ్‌లు, రజాకర్ల అరాచకా లపై ఎదురుతిరిగి ఎర్రజెండా పట్టి ఆంధ్రమహాసభ (సంఘం)లో చేరింది ఐలమ్మ. దీంతో రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. ఆమె కౌలుకు తీసుకున్న భూమిలో కాపు కొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండా లను పురమాయించారు. ‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలిగేది’ అంటూ తన పంటను దోచుకోవడానికి వచ్చిన దొరగూండాలతో పలికింది ఐలమ్మ.సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా కోర్టులో తీర్పువచ్చింది. ఐలమ్మ భూపోరాటం సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తి నిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. బడుగులను ఆదుకోవడమే ఆమెకు నిజమైన నివాళి! – ఆలేటి రమేష్, రజక విద్యార్థి సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శిఇవి చదవండి: మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్ -
మేధా వికాసంలో శ్రమశక్తి సంకేతం
హైదరాబాద్‌లో ‘కోఠి ఉమెన్స్ కాలేజీ’గా ఉన్న సంస్థకు ‘చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ’ అనే పేరును పెట్టడం గొప్ప సాంస్కృతిక మార్పునకు దారి తీస్తుంది. యుగాల బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డ వీరనారి ఐలమ్మ. ఈ దేశంలో స్కూళ్లలో, యూనివర్సిటీల్లో శ్రమ జీవన పాఠాలు చెప్పాలంటే తోలుపని, బట్టలుతికే పని, క్షవరం చేసే పని నుండే ప్రారంభించాలి. ఐలమ్మ విగ్రహాన్ని ఉమెన్స్ యూనివర్సిటీలో దర్బార్ హాల్ ముందు పెడితే, ఆమె ముఖం చూసి తరగతి గదుల్లోకి వెళ్లిన ప్రతి విద్యార్థిని మానవత్వంతో బతికే మేధావి అవుతుంది. ఏదేమైనా భారతదేశ చరిత్రలో ఒక చాకలి యోధురాలి పేరుతో మొట్టమొదటి ఉమెన్స్ యూనివర్సిటీ ప్రారంభం కావడమే ఒక సాంస్కృతిక విప్లవ ప్రారంభ ఘట్టం.10 సెప్టెంబర్ 2024 రోజున తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ డా‘‘ అలేఖ్య పుంజాల టీమ్ ఒక అద్భుతమైన బ్యాలేను వేసింది. ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతరమంత్రులు, శాసన సభ్యులు హాజరయ్యారు.ఈ చారిత్రక సమావేశంలో వేదిక మీది నుండి నేను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు కొత్తగా తెలంగాణలో ఏర్పడే ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడితే అది గొప్ప సాంస్కృతిక మార్పునకు దారి తీస్తుందని సూచించాను. అక్కడికక్కడే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మిగతా మంత్రులు మాట్లాడుకొని, ఇంతకుముందు ‘కోఠి ఉమన్స్ కాలేజీ’గా ఉన్న సంస్థకు ‘చాకలి ఐలమ్మ ఉమన్స్ యూనివర్సిటీ’ అనే పేరును ఇక్కడే ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది చాలా చరిత్ర ప్రాధాన్యం కలిగిన నిర్ణయం.గతంలో యూనివర్సిటీలకు దేవతలు, రాజులు, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న జాతీయ నాయకుల పేర్లు పెట్టేవారు. అందులో ద్విజ బ్రాహ్మణ, బనియా, కాయస్థ, ఖత్రి, క్షత్రి, క్షత్రియ వారి పేర్లే ఎక్కువ. అంబేడ్కర్, ఫూలే, పెరియార్లు ఆ స్థితిని కాస్తా మార్పు తెచ్చారు. కానీ వారంతా చదువుకున్నవారు. కానీ దేవతల పేర్లతో యూనివర్సిటీ పేర్లు పెట్టినప్పుడు చదువుతో సంబంధం చూడలేదు. ఉదాహరణకు తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీ.చాకలి ఐలమ్మ సమాజం బట్టలుతికి మొత్తం సమాజాన్ని రోగాల నుండి, మురికి జీవితం నుండి కాపాడిన కులం నుండి వచ్చింది. గ్రామాల్లోని అన్ని కులాల వారి బట్టలుతికి సాయంకాలం బుట్ట పట్టుకొని ‘చాకలి దాన్ని అవ్వా!’ అని అడుక్కొని తిని బతికిన కులం ఆమెది. పెండ్లి పనుల్లో ఎంతగా భాVýæమైనప్పటికీ, బంతిలో కూర్చొని అందరితో కలిసి బుక్కెడు బువ్వ తినలేని స్థితి వారిది. అదే పెండ్లిలో మిగిలిన కూడు తిని సేవ చేశారు. సమాజానికి సబ్బు అనే వస్తువు తెలవని రోజుల్లో మన దేశంలోని చాకలి స్త్రీలే ‘చవుడు మట్టి’ అనే సబ్బును కనిపెట్టారు. చవుడు మట్టి బట్టను శుభ్రం చేసినప్పటికీ రోగ క్రిములు బట్టలకంటుకునే ఉండేవి. వాటిని కూడా చంపి సమాజాన్ని అంటు వ్యాధుల నుండి కాపాడ టానికి చాకిరేవులో చవుడు బట్టలను ఉడుకబెట్టి, వాళ్లే ఈ సమాజాన్ని బతికించారు. కానీ ఈ దేశపు కుల విలువలు శుభ్రతకు మూలమైన స్త్రీలను అశుభ్రులుగా ప్రకటించి ఇంటి అరుగు కూడా తొక్కనివ్వలేదు. ప్రసవించే ప్రతి స్త్రీని చాకలి స్త్రీలే మంత్రసానులుగా మారి ప్రసవింపజేశారు. కానీ చాకలి – మంగలి స్త్రీలు కాపాడిన బాలింతలు కూడా వారిని మనుషులుగా చూడలేదు. ఇటువంటి వేల సంవత్సరాల అమానుష విలువలపై చాకలి ఐలమ్మ ఒక తిరుగుబాటు.యుగాల బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డ వీరనారి ఆమె. ఈమె రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీల కంటే వేయిరెట్లు ధైర్యశాలి. అందుకే నిజాం రాజరికంలో విసునూరి రామచంద్రారెడ్డి దొరతనంలో బట్టలుతుకుతూ ‘అడుక్క తినను, నాకున్న కొద్దిపాటి భూమిలో పండించుకొని తింటాను’ అని తన కొడవలిని చేత పట్టుకొని భూస్వామ్య కత్తుల మీద, రజాకార్ తుపాకుల మీద తిరుగుబాటు చేసింది. అలేఖ్య బ్యాలేలో కొడవలి, కర్రతో ఆమె, ఆమెతో పాటు ఆ చాకలి స్త్రీ – పురుషులు రజాకార్–భూస్వామ్య శక్తుల మీద చేసిన పోరాటం చూపరులను ఉత్తేజపర్చింది.రెండు దశల్లో స్త్రీల సాయుధ తిరుగుబాటు తెలంగాణకు ఎనలేని వన్నె తెచ్చింది. మొదటిది సమ్మక్క–సారక్క పోరాటం. వాళ్ళు ఇప్పుడు దేవతలయ్యారు. వాళ్ళ పేర్లు యూనివర్సిటీ గేటు బోర్డుల మీద ఎక్కాలనే నా కోరికను కేంద్ర ప్రభుత్వం తీర్చింది. ములుగు సమీపంలో 300 ఎకరాల్లోని ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క–సారక్క పేరు పెట్టింది. రెండవ స్త్రీ తిరుగుబాటు... గ్రామ స్థాయిలో అన్ని శూద్ర కులాల అట్టడుగున బతికి, బట్టలుతికి, మంత్రసానిగా పని చేసిన చాకలి ఐలమ్మ వీర వనితగా భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసింది. ఆమె పేరుతో వందల సంవత్సరాలు అన్ని కులాల అమ్మా యిలు ఉన్నత విద్య నేర్చుకునే ఒక ఉమెన్స్ యూనివర్సిటీ హైదరాబాద్ నడిబొడ్డులో ఉండబోతున్నది.కోఠి ఉమెన్స్ కాలేజీలో నేను పదకొండేడ్లు పాఠాలు చెప్పాను. ఐలమ్మ వేషం కట్టి ఆడిన అలేఖ్య ఆ కాలేజీలో చదువుకుంది. నా ఉపాధ్యాయ జీవితంలో ఒక క్లాసు ఎగ్గొట్టకుండా విద్యార్థులు ప్రతి రోజూ పాఠాలు విన్న కాలేజీ అదే. చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా వెలగబోతున్న ఆ యూనివర్సిటీ తరతరాలు అమ్మాయిల, అబ్బాయి లకు తల్లులుగా జీవించే స్త్రీల జీవితాలను మారుస్తుంది. ‘ఎవరు ఈ చాకలి ఐలమ్మ?’ అని పిల్లలు అడిగితే ఆమె శ్రమశక్తి గురించి, ఆమె పోరాట పటిమ గురించి ఎన్నో పాఠాలు చెప్పడానికి ఆమె జీవితం ఆధారంగా ఉంటుంది. అన్ని కులాలు, అన్ని మతాల పిల్లలు కుల మత వ్యత్యాసం లేకుండా జీవించడానికి ఆమె జీవిత చరిత్ర ఎంతో ఉపయోగపడుతుంది.ఈ దేశంలో స్కూళ్లలో, యూనివర్సిటీల్లో శ్రమ జీవన పాఠాలు చెప్పాలంటే తోలుపని, బట్టలుతికే పని, క్షవరం చేసే పని నుండే ప్రారంభించాలి. చాకలితనం హీనమైంది కాదు, అగౌరవప్రదమైనదేం కాదు. అది సమాజ శుభ్రతకు గొప్ప జ్ఞానంతో పనిచేసింది. మానవ జాతిని బతికించింది. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఉమెన్స్ యూనివర్సి టీలో దర్బార్ హాల్ ముందు పెడితే, ఆమె ముఖం చూసి క్లాసురూము ల్లోకి వెళ్లిన ప్రతి విద్యార్థిని మానవత్వంతో బతికే మేధావి అవుతుంది.బ్రిటిష్ వలస కాలంలో, నిజాం ప్రభుత్వ రెసిడెంట్ అధికారి, ఒక తెల్లదొర జీవించిన బంగ్లా అది. అది ఇప్పుడు మంచి హెరిటేజిబిల్డింగ్. అది ఒకవైపు దోపిడీ చిహ్నం అయితే, మరోవైపు సరిగా వంద సంవత్సరాల కింద, 1924లో మొట్టమొదటి ఉమెన్స్ కాలేజీగా ప్రారంభమైన స్త్రీ విద్యా వికాస కేంద్ర కూడా. అది కాలేజీగా ప్రారంభమైన వంద సంవత్సరాలకు చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా రూపు దిద్దుకోవడం ఒక్క తెలంగాణకే కాదు, మొత్తం దేశానికి ఒక సాంస్కృతిక విప్లవ చిహ్నం, ఒక మార్పునకు సూచిక.పాత తెలంగాణ తల్లి విగ్రహం ఒక దొరసాని రూపంలో ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని డిసెంబర్ 9న అంటే సోనియా గాంధీ జన్మదినాన ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ఆ కొత్త తెలంగాణ తల్లికి చాకలి ఐలమ్మ పోలికలుంటే రాష్ట్ర సాంస్కృతిక తత్వమే మారు తుంది. ఏదేమైనా భారతదేశ చరిత్రలో ఒక చాకలి పోరాట యోధు రాలి పేరుతో మొట్టమొదటి ఉమెన్స్ యూనివర్సిటీ ప్రారంభం కావ డమే ఒక కల్చరల్ రెవల్యూషన్ ప్రారంభ ఘట్టం.అయితే ఈ యూనివర్సిటీని బాగా అభివృద్ధి చెయ్యాల్సి ఉంది. ఈ యూనివర్సిటీలోనే ఒక ఉమెన్స్ మెడికల్ కాలేజీ, ఒక ఉమెన్స్ఇంజినీరింగ్ కాలేజీని కూడా ప్రారంభించాల్సి ఉంది. అందులోని అన్ని కోర్సుల్లో చదువుకునే స్త్రీ విద్యార్థులు దేశవిదేశాల్లో ఆ యూని వర్సిటీకి పేరు తేవలసి ఉంది. ఈ దేశాన్ని బీదరికం నుండి బయట పడవేసే మేధావులు ఇక్కడి నుండి ఎక్కువమంది వచ్చినప్పుడే చాకలి ఐలమ్మ పోరాటానికి ఫలితం దక్కుతుంది.నా దృష్టిలో ఈ పేరుతో వచ్చిన యూనివర్సిటీ ఈ దేశ తాత్విక, ఆధ్యాత్మిక, సామాజిక మార్పునకు పునాది రాయి అవుతుందనీ, ఆ మార్పు వస్తుందనీ ఆశిద్దాం.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి : ఆమె మహిళలకు ఆదర్శం
సాక్షి, ముంబై: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న రజక బాంధవులు వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్రను గురించి స్మరించుకున్నారు. బోరీవలిలో....గొరాయి రజక మిత్రమండల్ అధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వీరనారి చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. దొరలకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మకు జోహార్లు చెబుతూ.... కొవ్వొత్తులు వెలిగించి పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. ఐఈసందర్భంగా మండల్ కోశాధికారి చింతకింది మల్లేష్ మాట్లాడుతూ.... కోఠిలోని మహిళా యునివర్సిటికీ చాకలి ఐలమ్మ పేరిట నామకరణం చేయడం అభినందనీయమని, ఐలమ్మ ధైర్య, సాహసాలు ప్రతి మహిళకు ఆదర్శమని పేర్కొన్నారు. దీంతో బావితరాలకు ఐలమ్మ పేరు చిరస్మరణీయంగా మిగిలి పోతుందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ అధ్యక్షురాలియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు ముత్యాల బాల నరసయ్య, సెక్రటరీ బాగోలా అంజయ్య,కోశాధికారి చింతకింది మల్లేశ్, సంఘం సభ్యులు ముత్యాల భూ లచ్చయ్య, ముత్యాల స్వామి, యాదగిరి నిమ్మరాజు, మహిళలు నిమ్మరాజు భాగ్యలక్ష్మి, ముత్యాల వసంత, కిచిగారి కళావతి, చింతకింది కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు అంటాప్హిల్లో... ముంబై, అంటాప్ హిల్‌లోని తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆమె చేసిన త్యాగాలు, సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నదిగోటి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మరిపెళ్లి మల్లేష్ కోశాధికారి భూమ చిన్న నర్సింహ, ఉప కోశాధికారి భూమా యాదయ్య, కార్యవర్గ సభ్యులు అక్కనపెల్లి నరసింహ, తాందారి వెంకన్న, బొమ్మపాలెం వెంకటేష్బాసవాడ కృష్ణ, అయితే రాజు మల్లేష్, పొన్న సోమయ్య, రెడ్డిపల్లి ఎల్లయ్య, భూమా వెంకటేష్, రెడ్డిపల్లి లింగయ్య, చర్లపల్లి వెంకటే‹Ù, వడ్డెబోయిన నాగరాజు, మనపెద్ది శ్రీనివాస్, భూమా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కాందివలిలో... పశ్చిమ కాందివలి చార్కోప్లోని బుద్దవిహార్‌లో ముంబై రజక ఫౌండేషన్ అధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఈ కార్యక్రమంలో రజక ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చింతల మహేందర్, ముత్యాల సంతోష్, మదనాల సత్తన్న, మదనాల నర్సింహులు, అక్కోల శ్రీనివాస్, గోలి శంకర్, స్వామి నల్లూరి, పోగుల రాజేశ్, గాయకులు దుబ్బాక నరేష్ లక్ష్మణ్ ఎనగందుల మమత, దవనపల్లి సుమ, కూన స్వరూప, శోభ, పద్మ, పూజ, లలిత తదితరులు పాల్గొన్నారు. -
మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
సాక్షి, హైదరాబాద్: కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటాలన్న ఉద్దేశంతో మంత్రివర్గ సహచరుల సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే..ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గడీలలో గడ్డి మొలవాలన్న చాకలి ఐలమ్మ మాటలను, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని గుర్తుచేశారు. దొరల చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు, రైతులకు పంచేందుకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ తెచ్చిన భూ సంస్కరణలకు చాకలి ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి అన్నారు. భూమి అనేది పేదలకు ఆత్మగౌరవం, జీవన ఆధారం అని చాటి చెబుతూ పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచి ఇచ్చిన ఇందిరాగాంధీ ప్రతి పేదవాడి కుటుంబంలో దైవంగా నిలిచారన్నారు. భూహక్కులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, తెలంగాణలో పేదల చేతుల్లో లక్షలాది ఎకరాల భూమి ఉండడానికి ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలు, పీవీ నర్సింహారావు వాటిని అమలు చేయడమే కారణమని రేవంత్ చెప్పారు.లక్షల ఎకరాలు లాక్కొనేందుకు గత సర్కార్ కుట్ర..పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను, అసైన్మెంట్ పట్టాలను, పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను లాక్కొనేందుకు ధరణి ముసుగులో గత ప్రభుత్వంలో కుట్రలు చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పారు. సమాజంలో సామాజిక చైతన్యం తెచ్చిన వ్యక్తులు, పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల పేర్లు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉండేలా సంస్థల పేర్లు పెడుతున్నామన్నారు.ఆకట్టుకున్న నృత్యరూపకంచాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తొలిసారి కూచిపూడి, జానపద శైలిలో ప్రదర్శించిన నృత్య రూపకం ఉత్తేజభరితంగా సాగింది. ఐలమ్మ జీవితంలోని ప్రధాన ఘట్టాలను, ఆమె సాగించిన సాయుధ రైతాంగ పోరాటాలను తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్, ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల అద్భుత ప్రదర్శనతో కళ్లకు కట్టేలా చూపారు. దివంగత రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిన చాకలి ఐలమ్మ నృత్య రూపకం కాన్సెప్ట్, నృత్య దర్శకత్వం డా. అలేఖ్య పుంజాల నిర్వహించగా, వి.బి.ఎస్. మురళి బృందం సంగీత సహకారం అందించి రక్తి కట్టించారు. ఈ దృశ్యకావ్యాన్ని సీఎం, మంత్రులు సహా ప్రేక్షకులంతా ఆసక్తిగా తిలకించారు. ప్రతి ఘట్టంలో ప్రొ. అలేఖ్య ప్రదర్శించిన హావభావాలు, అద్భుత సమన్వయంతో మిగతా బృందం అందించిన సహకారంతో ప్రదర్శన ఆసాంతం ఆహూతులను అలరించింది. సీఎం రేవంత్ తన ప్రసంగంలోనూ ఈ ప్రదర్శనను ప్రస్తావించారు. ‘చాకలి ఐలమ్మ దృశ్యకావ్యాన్ని అలేఖ్య బృందం కళ్లకు కట్టినట్లు చూపింది. ఎంతో ఏకాగ్రత ఉంటే తప్ప ఇంత గొప్ప ప్రదర్శన సాధ్యం కాదు’ అని సీఎం ప్రశంసించారు. తాను ఇప్పటివరకు ఎన్నో పాత్రలు ప్రదర్శించానని, సాయుధ పోరాట స్ఫూర్తిని చాటిన చాకలి ఐలమ్మ పాత్రను పోషించడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని అలేఖ్య పుంజాల అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి సూచనతోనే దీన్ని రూపొందించినట్లు చెప్పారు.ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్‌లో చోటుచాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు సైతం ప్రభుత్వంలో భాగస్వాము లుగా ఉండాలని భావిస్తున్నామని... చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను సీఎం ఆదేశించారు. మహిళలపై దాడులను తిప్పికొట్టేందుకు, మహిళా హక్కుల పరిరక్షణకు ఉన్న మహిళా కమిషన్‌లో ఐలమ్మ వారసులు ఉండటం సము చితమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నించే గొంతుకలే తమకు కావాలని.. ప్రజాసమస్యలపై పోరాడి వాటిని పరిష్కరించే వాళ్లే కాంగ్రెస్ ప్రభు త్వానికి కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అంతకుముందు ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. -
కేసీఆర్ అంటేనే గ్యారంటీ
సాక్షి, సిద్దిపేట: ‘మీ గ్యారంటీ కార్డులు తెలంగాణలో పనిచేయవు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, కుమ్మర మోడ్రన్ యాంత్రిక పరిశ్రమకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని గ్యారంటీ కార్డులు, బాండ్‌పేపర్లు రాసిస్తున్నార న్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది, మాటతప్పని, మడమతిప్పని నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థికసాయం పథకాన్ని కాపీ కొట్టారని, అది అప్పు రూపంలో మోదీ అందిస్తున్నారని విమర్శించారు. ఉద్యమస్ఫూర్తి, పోరా టస్ఫూర్తిని చాకలి ఐలమ్మ అందించిందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు 71% ఫిట్మెంట్ ఇస్తోందన్నారు. త్వరలో సీఎం కొత్త పీఆర్సీ వేసి తీపికబురు చెబుతారన్నారు. అతి తక్కువ వేతనాలు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఉన్నాయని, చూసేందుకు వెజ్ గవర్న మెంట్, కానీ చేసేందుకు నాన్‌వెజ్ గవర్నమెంట్ అంటూ బీజేపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ నిర్ణయంతో బీసీలకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో వెనుకబడిన తరగతులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగతుల వారికి బీజేపీ వ్యతిరేకమని గవర్నర్ తాజా నిర్ణయంతో మరోమారు నిరూపితమైందన్నారు. శాసనమండలి ఆవరణలో మంగళవారం జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర మంత్రి మండలి ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేసిన ఇద్దరి పేర్లను తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని స్పష్టం చేశారు. దేశంలో భారత రాజ్యాంగానికి బదులు బీజేపీ రాజ్యాంగం నడుస్తుందనే అనుమానం కలిగేలా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు. -
రాజ్యాధికారంలో వాటా దక్కితేనే బీసీలకు న్యాయం..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాధి కారంలో బీసీలకు తమవంతు వాటా దక్కినప్పుడే వారికి న్యాయం జరిగినట్లు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. రాను న్న ఎన్నికల్లో బీసీలే ప్రధాన పాత్ర వహించాలని చెప్పారు. గత తొమ్మిళ్లలో బీసీలను ఆదుకునేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాలను ఆదరించి మద్దతుగా నిలవాలని కోరారు. దేశంలోని కుల, చేతివృత్తుల బలోపేతానికి మోదీ– పీఎం విశ్వకర్మ యోజన వంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చారని చెప్పా రు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను వంచించి దగా చేశాయి. బీసీలకు రాజకీయంగా ఇవ్వాల్సిన 33 శాతం వాటాకు కోతపెట్టి.. ఇప్పుడు ఓబీసీ ఎజెండా ఎత్తుకుని ఓట్ల కోసం పాకులాడుతు న్నాయి’ అని మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాల యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రప టానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆధి పత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, కుల వృత్తులు, వ్యవసాయాధారిత పేద కుటుంబాలకు మద్దతుగా ఐలమ్మ పోరాటం చేశారని కొనియాడారు. -
వీర వనితలకు వందనం
75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల ‘అమృత మహోత్సవం’ అజ్ఞాత వీర వనితల చరిత్రను వెలికి తెస్తోంది. దేశం కోసం వీరోచిత పోరాటం చేసి జీవితాలు త్యాగం చేసిన, ప్రాణాలు అర్పించిన మహిళలు కొందరు వెలుగుకు నోచుకోలేదు. అలాంటి 20 మంది వీర వనితల సచిత్ర కథలను కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ‘అమర చిత్ర కథ’ సంస్థతో కలిసి ‘ఇండియాస్ విమెన్ అన్సంగ్ హీరోస్’ పేరుతో రెండు రోజుల క్రితం వెలువరించింది. మాతంగిని అజ్రా, గులాబ్ కౌర్, చాకలి ఐలమ్మ, రాణి అబ్బక్క తదితరులను ఇప్పుడు దేశంలోని బాలలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో దొరల మీద తిరగబడింది చాకలి ఐలమ్మ. తాను కౌలుకు తీసుకున్న 40 ఎకరాల పొలాన్ని తిరిగి దొరలు హస్తగతం చేసుకోవాలనుకుంటే తాను దున్నుకుంటున్న భూమి తనదే అని తిరగబడింది ఆమె. పట్వారీలు, దొరలు ఆమెపై ఎన్నో విధాలుగా దాష్టీకాలు చేశారు. దొంగ కేసులు పెట్టారు. ఇంటికి నిప్పంటించారు. అయినా చెక్కు చెదరక నిలిచి ప్రజలలో దొర పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది. నిజాం కాలంలో తెలంగాణ రైతాంగ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఐలమ్మ కథ ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ఇక మీదట దేశమంతా చదువుకునేలా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘ఇండియాస్ విమెన్ అన్సంగ్ హీరోస్’ పుస్తకం ద్వారా బొమ్మలతో ఆబాల గోపాలం చదువుకునేలా తీసుకు వచ్చింది. ఐలమ్మే కాదు ఐలమ్మ వంటి మొత్తం 20 మంది వీర వనితలు దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం వివిధ సందర్భాల్లో చేసిన వీరోచిత పోరాటాన్ని భావితరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో బాలల కథలు విస్తృతంగా వెలువరించే ‘అమర చిత్ర కథ’ సంస్థతో కలిసి కేంద్రప్రభుత్వం ఈ పుస్తకం తెచ్చింది. వీరిలోని చాలామంది కథలు ఇంతకు మునుపు చరిత్ర గ్రంథాలకు కానీ పాఠ్యపుస్తకాలకు కాని ఎక్కనివి. ఉదాహరణకు 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారిపై గొప్పగా పోరాడిన తుళు ప్రాంతపు (తీర కర్ణాటక) రాణి అబ్బక్క కథ ఈ పుస్తకంలో ఉంది. గోవాను హస్తగతం చేసుకున్న పోర్చుగీసు వారు దక్షిణం వైపుగా తమ కన్ను వేసి మంగళూరువైపు ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. ఆ ప్రాంతానికి రాణిగా ఉన్న అబ్బక్క కేరళ రాజుల సహాయంతో సేనలను ఏర్పాటు చేసి పోర్చుగీసు వారిని సమర్థంగా ఎదుర్కొంది. కాని పోర్చుగీసు వారు బలపడి చివరకు అబ్బక్కను అరెస్టు చేశారు. అబ్బక్క ఎటువంటి క్షమాపణను కోరక రోషంతో జైలులోనే ఉంటూ అక్కడే మరణించింది. కర్నాటకలో అబ్బక్క గాథను నేటికీ యక్షగానంగా పాడతారు. ఆమె కథ ఈ పుస్తకంలో ఉంది. బెంగాల్లో బ్రిటిష్ కాలంలో మాతంగని హజ్రా ‘మహిళా గాంధీ’ అని ఖ్యాతి చెందింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆమె తములుక్ ప్రాంతంలో చురుకుగా పాల్గొంది. 12 ఏళ్లకే వితంతువు అయిన మాతంగని తెల్ల చీర ధరించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేది. క్విట్ ఇండియా ఉద్యమంలో స్త్రీలను ఏకం చేసి బ్రిటిష్ వారిని హడలు పుట్టించింది. 1942 సెప్టెంబర్ 29న ఆమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక ఊరేగింపు తీస్తుండగా తములుక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా బ్రిటిష్ సైనికులు ఆమెను కాల్చి చంపారు. పిరికి పందలే ఈ పని చేయగలరు. కాని మాతంగని హజ్రా స్ఫూర్తి మరణం లేకుండా నేటికీ కొనసాగుతోంది. ఆమె కథ ఈ పుస్తకంలో ఉంది. ఉత్తరాఖండ్‌కు చెందిన బిష్ని దేవి షా కథ కూడా ఈ పుస్తకంలో ఉంది. ఆమె కూడా చిన్న వయసులోనే వితంతువు అయ్యింది. అయితే తల్లిదండ్రులు కాని, అత్తమామలు కాని ఆమెను ఆదరించలేదు. ఆ సమయంలోనే గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమం లో పాల్గొంది ఆమె. ఉత్తరాఖండ్ నుంచి బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి జైలుకు పంపిన మొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కింది. ‘జైలును శ్రీకృష్ణుడి జన్మస్థానంగా భావించి చింతించకుండా ఉండండి’ అని ఆమె పిలుపు ఇచ్చింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన వేలూ నాచియార్, సరోజిని నాయుడు కుమార్తె పద్మజా నాయుడు, ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ నుంచి బ్రిటిష్ వారిపై తిరగబడిన దుర్గావతి దేవి, స్వాతంత్య్ర సమరయోధురాలిగా దేశంలో తొలి మహిళా సి.ఎంగా ఖ్యాతి చెందిన సుచేత క్రిపలానీ, పంజాబ్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా పోరు జరిపిన గులాబ్ కౌర్.... తదితర మొత్తం 20 మంది వీరవనితల కథలు ఈ పుస్తకంలో సచిత్రంగా ఉన్నాయి. అమరచిత్ర కథ యాప్‌లో ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు. దాచేస్తే దాగనిది చరిత్ర. స్వాతంత్య్ర పోరాటంలో ముందు వరస నాయకులతో పాటు దేశ వ్యాప్తంగా ఎందరో స్త్రీలు– అన్ని మతాల నుంచి గొప్ప పోరాటాలు చేశారు. వారి గురించి ఇప్పుడిప్పుడు ఇలా అన్వేషణ సాగుతోంది. తెలుస్తున్నది కొద్దిమంది. తెలియాల్సింది ఎంతమందో. అలాంటి అందరి కథలు వెలికి రావాలి. -
ఐలమ్మ.. తెలంగాణ ఐకాన్
పద్మా దేవేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాధన ఉద్యమానికి ఒక ఐకాన్‌గా నిలిచారని శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో ఎంతోమంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. త్యాగం, సాహసం,ఓర్పునకు ఆమె మారుపేరన్నారు. ఐలమ్మ ఆశయాలు, ఆదర్శాల కొనసాగించాల్సిన అవసరముందన్నారు. శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర రజక సమాజం, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిట్యాల(చాకలి) ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలం తా ముందుకు నడిచారన్నారు. అమరుల స్ఫూర్తితో ట్యాంక్‌బండ్‌పై స్తూపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ జడ్జి జె.పి.జీవన్, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా బుల్లి తెర డెరైక్టర్ నాగబాల సురేశ్‌కుమార్ రూపొందించిన ‘వీరనారి చాకలి ఐలమ్మ’ లఘుచిత్రం సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, రజక సమాజం రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఊద్యమాలకు చాకలి ఐలమ్మ ఊపిరి
ఆమె జీవితం స్ఫూర్తిదాయకం రూ. 20 లక్షలతో సిద్దిపేటలో స్మారక భవనం రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రూరల్: ఉద్యమాలకు ఊపిరి పోసి ఎన్నో పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మను మరువలేమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చాకలి ఐలమ్మ 31వ వర్ధంతిని పురస్కరించుకోని శనివారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో ఆమె విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శప్రాయమని, తెలంగాణ కోసం ఆమె పోరాడిన స్ఫూర్తి మరువలేనిదని కొనియాడారు. వరంగల్ జిల్లా పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చాకలి ఐలమ్మ మార్కెట్ కమిటీగా తానే నామకణం చేశానని గుర్తుచేశారు. అలాగే త్వరలో సిద్దిపేటలో రూ. 20 లక్షలతో ఐలమ్మ స్మారక భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆమె పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. చంద్లాపూర్‌కు రూ. 1.92 కోట్లు చంద్లాపూర్ గ్రామాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కింద రూ. 1.92 కోట్లతో గ్రామంలో తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు. పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు 1.50 లక్షల లీటర్లు, 40 వేల లీటర్లు, 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకుల నిర్మాణం గ్రామంలో చేపడుతున్నామన్నారు. ఈ సంవత్సరంలోనే చంద్లాపూర్‌లో ఇంటింటికి తాగునీరందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతకు ముందు చంద్లాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం రంగనాయక సాగర్ ముంపునకు గురవుతుండడంతో గ్రామ గౌడ సంఘం ప్రతినిధులకు రూ.12 లక్షల చెక్కును పరిహారం కింద మంత్రి అందించారు. మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల, సర్పంచ్ మంగమ్మ, ఎంపీటీసీ ఆరుణ, నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, బాల్‌రెడ్డి, ఒర్రెల రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
'ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహం'
హైదరాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించే విషయమై సీఎంతో మాట్లాడుతానని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం బాగ్‌లింగంపల్లిలో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 31 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రజకులను గ్రామ బహిష్కరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
'ఆమె తెలంగాణ ఉద్యమ ఐకాన్'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి అలనాటి వీర వనిత చాకలి ఐలమ్మ ఒక ఐకాన్‌గా నిలిచిందని శాసన సభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది ఉద్యమంలో భాగస్వాములయ్యారని చెప్పారు. ఆమె ఆశయాలు, ఆదర్శాల కొనసాగిద్దామని చెప్పారు. శనివారం తెలంగాణ రాష్ట్ర రజక సమాజం, సాంస్కృతిక శాఖ సౌజన్యాలతో దివంగత చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి సభను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె.పి. జీవన్ మాట్లాడుతూ నిరూపమాన సహస వంతురాలు చాకలి ఐలమ్మ అని చెప్పారు. ఆనాటి చాకలి వారి చైతన్యమే.. ఈనాటి తెలంగాణ చైతన్యమని చెప్పకతప్పదన్నారు. సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్ఫూర్తి ప్రదాయిని చాకలి ఐలమ్మ అని చెప్పారు. బడుగుల రుద్రమ్మ చాకలి ఐలమ్మ అని చెప్పారు. ఈ సందర్భంగా బుల్లి తెర డెరైక్టర్ నాగబాల సురేష్ కుమార్ రూపొందించి వీరానారి చాకలి ఐలమ్మ లఘు చిత్రం సీడీని ఆవిష్కరించారు. సభ ప్రారంభంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి జోహర్లు అర్పించారు. -
బతుకుపోరులో గెలిచిన బతుకమ్మ
నారీ విజయం నేను బతుకమ్మను మాట్లాడుతున్న. రంగురంగుల బతుకమ్మను. తీరొక్క పువ్వులను తనువెల్లా ధరించిన అమ్మను. నన్ను తలచుకుంటేనే తెలంగాణ ఆడబిడ్డల మనసు పులకిరిస్తది. సరే, నా గురించి అందరికీ తెలిసిందే కదా. కానీ, నేను చెప్పాలనుకున్నది, నా మనసుల ఉన్నది ఎవరికీ తెల్వదు. ఇయ్యాల ఆ ముచ్చట మీకు చెప్పాలని ఉంది. అచ్చట్లు ముచ్చట్లు కాదు, అది బతుకు ముచ్చట. బతుకుపోరు ముచ్చట. అది 1940ల సంగతి. తెలంగాణల మట్టి మనుషులు ఎట్టిలో మగ్గుతున్న దినాలు. ఒకరోజు మాగెండ మండుతాంది. మిట్టమధ్యాహ్నం. చుట్టూ చెట్టూ చేమలు, కొండ కోనలు. ఆ కంచెలకెల్లి ఒక నడివయసు ఆడమనిషి నడుసుకంట వస్తాంది. ఒంటి మీద ముతక చీర. నుదుట పెద్ద పైసంత జిట్టి బొట్టు. ఎత్తై మనిషి. ఒత్తై జుట్టు. చేతులకు మట్టిగాజులు. కాళ్లకు కడాలు. సిగలో బంతిపువ్వు తురుముకుంది. వస్తాంది పులిబిడ్డ లెక్క. ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూసి మోదుగుపువ్వులు మురిసిపోతున్నయి. ఒంటరిగా వెళుతున్న ఆమె ధైర్యాన్ని చూసి కామాంచ పువ్వులు రోమాంచితమవుతున్నయి. ఆమె పాదాలను సుతిమెత్తగా తాకుతూ సాగనంపుతున్నయి. తంగేడు పువ్వులు ఒక కొమ్మను అందించినై. ఏమైంది ఈ తల్లికి అని గునుగు పువ్వులు గుసగుసలాడుతున్నయి. ఎనుగుల్ల పువ్వులు ఏమైందని ఆరా తీస్తున్నయి. అప్పుడు సోంపువ్వులు చెబుతున్నయి వినసొంపుగా ఆమె కన్నీటి వెతను. పోరాట కతను. ఆమె పేరు ఐలమ్మ. అందరూ చాకలి ఐలమ్మ అంటరు. పుట్టింది వరంగల్ జిల్లా రాయపర్తిల చాకలింట. ఓరుగంటి మల్లమ్మ, సాయిలు నాలుగో సంతానం. మెట్టినిల్లు పాలకుర్తిల. చిట్యాల నర్సయ్యతో పదో ఏట ఆమె పెళ్లి అయింది. ఐదుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. బట్టలుతికి చాకిరి చేయడం ఇష్టంలేక రామారం దొర దగ్గర నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకుంది. ఇంటిల్లిపాది ఒళ్లొంచి పంటలు పండిస్తాంది. ఇంకా బండి మీద కుండలల్ల కల్లు తీసుకపోయి వేరే ఊర్లల్ల అమ్మేది. దొరల గడీల వెట్టి చేయనన్నది. కష్టం చేసి కడుపు నింపుకుంటనని కరాఖండిగా చెప్పింది. అంతే... విన్నూరు దొర కన్నెర్ర జేసిండు. ఆమెకు బతుకుదెరువుగా ఉన్న భూమిని కాజేయాలని కుయుక్తులు పన్నిండు. కౌలుభూమి ఆమెకు దక్కవద్దని కోర్టుల కేసు పెట్టిండు. గూండాలను పెట్టించి భూమిని గుంజుకోవాలని చూసిండు. ఆమె ఇంటికి నిప్పు పెట్టించిండు. దొర గూండాలు ఆమె ఇంట్ల ఉన్న వడ్లు, కందులు, పెసలు కాలబెట్టిండ్రు. భర్తను, కొడుకులను దొర జైలుపాలు జేసిండు. దొర దాష్టీకానికి ఐలమ్మ భయపడలేదు. ధైర్యాన్ని కూడదీసుకుని ముందుకు సాగింది. దొర సంగతి చెప్పేటందుకు సంగంల చేరింది. ఎర్రజెండాను ఎత్తిపట్టి భూస్వాములకు ఎదురు నిలిచింది. తన భూమిని, పంటలను కాపాడుకునేందుకు వకీళ్లను పెట్టుకుంది. కోర్టుల చుట్టూ తిరుగుతాంది. కొంగుల సంగం చిట్టి, గుండె నిండా పోరాట స్ఫూర్తి తోడుగా ఒంటరిగానే ఆమె జనగాం, భోనగిరి, హైదరాబాద్ వంటి పట్నాలకు వెళ్తాంది. సంగం నాయకులను కలుసుకుని, వారి సూచనలపై చుట్టుపక్కల ఊళ్లళ్ల సంగాలు పెట్టించింది. ఐలమ్మ తెగువ ఇచ్చిన స్ఫూర్తితో కమ్యూనిస్టు నాయకులు ఊరూరా తిరిగి వెట్టికి, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సబ్బండ జాతుల కష్టజీవులను ఏకం చేశారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పోరాటాలు వెల్లువెత్తాయి... ఒక్కసారిగా పూలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఆనందంతో వాటి కళ్లు చెమర్చాయి. ఐలమ్మకు ఎదురేగి... ‘బతుకమ్మా’ అని దీవించాయి. ఆమె నడిచిన దారి వెంట అండగా నిలిచాయి. తమ పరిమళాలతో ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి. రెట్టించిన ఉత్సాహంతో ఐలమ్మ ముందుకు సాగింది. ఆమె మెడలో విజయమాలగా మారాలని, ఉద్యమించే అక్కాచెల్లెళ్లకు, అమ్మలకు స్ఫూర్తిగా నిలవాలని, పువ్వులు తీర్మానించుకున్నయి. ఆ పువ్వుల నోములు ఫలించాయి. నా అక్కాచెల్లెళ్లతో నగ్నంగా బతుకమ్మలను ఆడించిన భూస్వాములు, దొరల కోటలు నేలకూలాయి. భైరాన్‌పల్లి, కొడకండ్లలో నరమేధాలు సృష్టించిన రజాకార్లు మట్టికరిచిన్రు. చివరకు కోర్టులో ఐలమ్మ కేసు గెలిచింది. భూమి ఆమె సొంతమైంది. ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి సాయంతో సీనియర్ వకీలు నాగులపల్లి కోదండ రామారావు, జూనియర్ వకీలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆమె తరఫున వాదించారు. ఆమె పోరాట స్ఫూర్తితో ప్రజలు సాయుధపోరు చేసి నిజాం రాజ్యాన్ని కూల్చేసిన్రు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బతుకు పోరు అంటే గిదీ అని తెలియజేయడానికి. ఐలమ్మ నిజంగా బతుకమ్మే. పోరాటంలో గెలిచి బతికింది. ఆమె పోరాటం చేసింది నాలుగెకరాల కోసమే కావచ్చు. కానీ, నాలుగు కాలాలపాటు నిలిచే స్ఫూర్తిని, తెగువను, ధీరత్వాన్ని ప్రదర్శించింది ఆమె. బానిస బతుకులు వద్దని, మనిషిగా తలెత్తుకు నిలవాలని చాటింది. ఈ దేశానికి ఆమె జీవితం ఒక సందేశంగా నిలిచింది. ఇప్పుడు కూడా పీడనలు, దాష్టీకాలు, దోపిడీలు, అవమానాలు, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, వివక్ష ఎక్కువై... అత్యధికులైన బహుజనులు అష్టకష్టాలు పడుతున్రు. సెజ్‌ల పేరిట నయా భూస్వాములు భూములు గుంజుకుంటున్రు. కంపెనీలకు వేలాది ఎకరాలు కట్టబెడుతున్రు. నా చెల్లెళ్లపై అత్యాచారాలు ఎక్కువవుతున్నయి. బడుగు, బలహీన వర్గాల మీద దాడులు పెరుగుతున్నయి. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్రు. సంచారజాతుల ప్రజలను కనీసం మనుషులుగా కూడా పరిగణించడం లేదు. ఉపాధి అవకాశాలు లేక యువత అలమటిస్తున్నది. నా రైతు బిడ్డలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్రు. సరైన తిండిలేక నా పిల్లలు బక్కచిక్కిపోతున్రు. నేను గంగ ఒడిలో అంతర్థానమై, ఐలమ్మనై, మీ బిడ్డనై 1895ల తెలంగాణ మట్టిని తొలుచుకొని వచ్చిన. బతుకుపోరుల సామాన్యులకు స్ఫూర్తినిచ్చేందుకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాను. - నీలం ఉపేంద్ర (నేడు సద్దుల బతుకమ్మ నాడు వీరనారి ఐలమ్మ 120వ జయంతి) -
ఐలమ్మ విగ్రహానికి నిప్పు
దుండగుల చర్యతో దెబ్బతిన్న విగ్రహం ఆగ్రహించిన రజక, ప్రజాసంఘాల నాయకులు అలంపూర్ : అలంపూర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న తెలంగాణ పో రాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న విగ్రహం ఇలా తగలబడిపోవడం తో ప్రజాసంఘాలు, రజక, అన్ని పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం రాత్రి దుండగలు పని కట్టుకొని ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టారు. ఆది వారం విషయం అందరికి తెలియడంతో వివిధ ప్రజా సంఘాలు, ఆయాపార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఇటీవలే రజక సంఘం నాయకులు చందాలు వేసుకొని ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆవిష్కరణ వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముసుగు వేసి ఆవిష్కరణకు సిద్ధం చేసి ఉంచారు. శనివారం రాత్రి విగ్రహం దగ్దం కావడంతో జీర్ణించుకోలేని రజకు లు ఆందోళనబాట పట్టారు. వారికి ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులతో సంఘీభావం తెలిపారు. అందరు మూకుమ్మడిగా ర్యాలీ నిర్వహించి విగ్రహం ఎదుట నిరసన తెలి పారు. అనంతరం సీఐ వెంకటేశ్వర్లుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్థానిక తహశీల్దార్ మంజుల, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పర్వతాలు వివరాలను సేకరించారు. నిరసనలో రజక ఉద్యోగ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, రజకసంఘం గౌరవ అధ్యక్షుడు శేషన్న, అధ్యక్షుడు శాలన్న, నాయకులు వేణు, వెంకటేశ్వర్లు, రంగన్న, ఇందిరమ్మ, మగమ్మ, వెంకటరంగమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. హేయమైన చర్య : ఎమ్మెల్యే అయిజ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చివేయడం, చాకలి ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టడం లాంటి సంఘటనలు అమానుషమని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఖండించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలే అయిజలో తెలంగాణ చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహాన్ని రాజకీయాల గ్రూపు తగాదాలదాడిలో కూల్చివేసిన సంఘటన మరిచిపోకముందే అలంపూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టారని ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నాయకులతోపాటు అన్నిపార్టీల నాయకులు, అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారని, తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. -
అగ్గి బరాటా.. ఐలమ్మ
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ రైతులు సాగించిన పోరాటంలో ముందుండి నడిచిన మహిళ చాకలి ఐలమ్మ. భర్తను, కుమారులను జైలు పాల్జేసి.. కష్టపడి పండించిన పంటను దోచుకోవాలని ప్రయత్నించిన విస్నూరు దేశ్‌ముఖ్‌కు ఎదురు నిలిచిన ధీశాలి. ఆమె భూ పోరాట చరిత్ర నేటికీ మహిళలకు స్ఫూర్తి. - పిన్నింటి గోపాల్, వరంగల్ నిజాంకు సేనాపతిగా ఉన్న విస్నూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి 60 గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండేవాడు. ఆయన, నిరంకుశ పాలనలో నిత్యం పీడనకు గురవుతున్న కుటుంబాల్లో ఐలమ్మ కుటుంబం ఒకటి. వరంగల్ జిల్లా రాయపర్తి సమీపంలోని కిష్టాపురంలో 1895లో ఐలమ్మ జన్మించింది. ఓరుగంటి సాయిలు, మల్లమ్మ దంపతుల ఆరుగురు కుమార్తెలు, నలుగురు కుమారుల్లో ఐలమ్మ నాలుగో సంతానం. పాలకుర్తికి చెందిన నర్సయ్యతో ఆమెకు వివాహమైంది. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. చాకలి వృత్తి చేస్తూ పొట్టపోసుకునేవారు. మరో ఇద్దరు పేద రైతులతో కలసి ఐలమ్మ రెండెకరాల భూమి కౌలు చేసేది. సొంత పనుల కంటే ముందు దేశ్‌ముఖ్ ఇంటి, పొలం పనులు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో 1944లో దేవరుప్పుల మండలం కడవెండిలో నల్ల నర్సింహులు, రావి నారాయణరెడ్డి ప్రోత్సాహంతో సంఘం (ఆంధ్ర మహాసభ) కార్యక్రమాలు మొదలయ్యాయి. రావి నారాయణరెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిరావు భూ పోరాటాలు సాగించారు. వెట్టి చాకిరికి నిరసనగా.. భూమిపై హక్కుల కోసం పోరాటంలో భాగంగా నల్ల నర్సింహలు, యాదగిరిరావు పాలకుర్తికి వచ్చిన ప్పుడు ఐలమ్మతో, ఆమె భర్త చిట్యాల నర్సయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రజలు అనుభవిస్తున్న దుర్భర బాధల నుంచి బయటపడేందుకు ప్రజలను సమీకరించిన సంఘం నాయకులు ఐలమ్మ ఇంటిపై ఎర్రజెండా ఎగురవేశారు. భూపోరాటానికి నాంది ఐలమ్మ సంఘం కార్యకర్తగా పాలకుర్తిలో 1945 శివరాత్రి రోజున ఆంధ్రమహాసభ మొదలైంది. ఆ సభను భగ్నం చేసేందుకు దేశ్‌ముఖ్ విఫలయత్నం చేశాడు. తర్వాత ఐలమ్మ భర్త నర్సయ్య, ఇద్దరు కుమారులు సోమయ్య, లచ్చయ్యలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇదే అదనుగా ఐలమ్మ కౌలుభూమిని దేశ్‌ముఖ్ స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. మల్లంపల్లికి చెందిన కొండల్రావు ఆమె భూమిని బలవంతంగా దేశ్‌ముఖ్ పేరిట రాయించాడు. పొలం తమదేనంటూ పొలంలోని పంటను ధ్వంసం చేసేందుకు పథకం రూపొందించాడు. దీంతో ఆంధ్ర మహాసభ భీంరెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మ గాని ధర్మభిక్షం, రామచంద్రారెడ్డి మరికొందరు కార్యకర్తలను పాలకుర్తికి పంపింది. వారు దేశ్‌ముఖ్ గుండాలను తరిమికొట్టారు. దేశ్‌ముఖ్ ఆంధ్ర మహాసభ నాయకులపై కేసు పెట్టించాడు. నిజాం పోలీసులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, యాదగిరిరావు తదితరులపై దొమ్మీ కేసు బనాయించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ కేసు వాదించి వారిని విడుదల చేయించారు. ఇలా తొలి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ స్ఫూర్తితో దేశ్‌ముఖ్‌లపై భూపోరాటాలు విస్తృతమయ్యాయి. ఐలమ్మ 1985 సెప్టెంబరు 10న తుదిశ్వాస విడిచారు. -
వీరనారి ఐలమ్మ కథ
ప్రీతినిగమ్ టైటిల్ రోల్లో మిరియాల రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరనారి చాకలి ఐలమ్మ’. బోళ్ళ సోమిరెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీజ ఫిలింస్ అధినేత శ్రీ వెంకట్రావు 300 థియేటర్స్‌లో ఈ నెల 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతకోట వేణుగోపాలరావు మాట్లాడుతూ - ‘‘నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరులో భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలు, దేశ్‌ముఖ్‌లపై పోరు సల్పిన వీరనారి చాకలి ఐలమ్మ కథతో ఈ సినిమా చేశాం. నేటి సమాజం హర్షించే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్, సెంటిమెంట్, లవ్, కామెడీ సమాహారంతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: వాసంశెట్టి వెంకటేశ్వరరావు, బోళ్ళ విక్రమాదిత్యారెడ్డి.