చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
ఐలమ్మ స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తుంది
ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలకు ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి
ఐలమ్మ కుటుంబ సభ్యులు మా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలనుకుంటున్నాం
మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు వెల్లడి
అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల
సాక్షి, హైదరాబాద్: కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటాలన్న ఉద్దేశంతో మంత్రివర్గ సహచరుల సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే..
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గడీలలో గడ్డి మొలవాలన్న చాకలి ఐలమ్మ మాటలను, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని గుర్తుచేశారు. దొరల చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు, రైతులకు పంచేందుకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ తెచ్చిన భూ సంస్కరణలకు చాకలి ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి అన్నారు.
భూమి అనేది పేదలకు ఆత్మగౌరవం, జీవన ఆధారం అని చాటి చెబుతూ పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచి ఇచ్చిన ఇందిరాగాంధీ ప్రతి పేదవాడి కుటుంబంలో దైవంగా నిలిచారన్నారు. భూహక్కులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, తెలంగాణలో పేదల చేతుల్లో లక్షలాది ఎకరాల భూమి ఉండడానికి ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలు, పీవీ నర్సింహారావు వాటిని అమలు చేయడమే కారణమని రేవంత్ చెప్పారు.
లక్షల ఎకరాలు లాక్కొనేందుకు గత సర్కార్ కుట్ర..
పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను, అసైన్‌మెంట్ పట్టాలను, పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను లాక్కొనేందుకు ధరణి ముసుగులో గత ప్రభుత్వంలో కుట్రలు చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు.
పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పారు. సమాజంలో సామాజిక చైతన్యం తెచ్చిన వ్యక్తులు, పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల పేర్లు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉండేలా సంస్థల పేర్లు పెడుతున్నామన్నారు.
ఆకట్టుకున్న నృత్యరూపకం
చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తొలిసారి కూచిపూడి, జానపద శైలిలో ప్రదర్శించిన నృత్య రూపకం ఉత్తేజభరితంగా సాగింది. ఐలమ్మ జీవితంలోని ప్రధాన ఘట్టాలను, ఆమె సాగించిన సాయుధ రైతాంగ పోరాటాలను తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్, ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల అద్భుత ప్రదర్శనతో కళ్లకు కట్టేలా చూపారు. దివంగత రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిన చాకలి ఐలమ్మ నృత్య రూపకం కాన్సెప్ట్, నృత్య దర్శకత్వం డా. అలేఖ్య పుంజాల నిర్వహించగా, వి.బి.ఎస్. మురళి బృందం సంగీత సహకారం అందించి రక్తి కట్టించారు.
ఈ దృశ్యకావ్యాన్ని సీఎం, మంత్రులు సహా ప్రేక్షకులంతా ఆసక్తిగా తిలకించారు. ప్రతి ఘట్టంలో ప్రొ. అలేఖ్య ప్రదర్శించిన హావభావాలు, అద్భుత సమన్వయంతో మిగతా బృందం అందించిన సహకారంతో ప్రదర్శన ఆసాంతం ఆహూతులను అలరించింది. సీఎం రేవంత్ తన ప్రసంగంలోనూ ఈ ప్రదర్శనను ప్రస్తావించారు. ‘చాకలి ఐలమ్మ దృశ్యకావ్యాన్ని అలేఖ్య బృందం కళ్లకు కట్టినట్లు చూపింది.
ఎంతో ఏకాగ్రత ఉంటే తప్ప ఇంత గొప్ప ప్రదర్శన సాధ్యం కాదు’ అని సీఎం ప్రశంసించారు. తాను ఇప్పటివరకు ఎన్నో పాత్రలు ప్రదర్శించానని, సాయుధ పోరాట స్ఫూర్తిని చాటిన చాకలి ఐలమ్మ పాత్రను పోషించడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని అలేఖ్య పుంజాల అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి సూచనతోనే దీన్ని రూపొందించినట్లు చెప్పారు.
ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్‌లో చోటు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు సైతం ప్రభుత్వంలో భాగస్వాము లుగా ఉండాలని భావిస్తున్నామని... చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను సీఎం ఆదేశించారు.
మహిళలపై దాడులను తిప్పికొట్టేందుకు, మహిళా హక్కుల పరిరక్షణకు ఉన్న మహిళా కమిషన్‌లో ఐలమ్మ వారసులు ఉండటం సము చితమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నించే గొంతుకలే తమకు కావాలని.. ప్రజాసమస్యలపై పోరాడి వాటిని పరిష్కరించే వాళ్లే కాంగ్రెస్ ప్రభు త్వానికి కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అంతకుముందు ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment