'ఆమె తెలంగాణ ఉద్యమ ఐకాన్'
తెలంగాణ ఉద్యమానికి అలనాటి వీరవనిత చాకలి ఐలమ్మ ఒక ఐకాన్‌గా నిలిచిందని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి అలనాటి వీర వనిత చాకలి ఐలమ్మ ఒక ఐకాన్‌గా నిలిచిందని శాసన సభ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది ఉద్యమంలో భాగస్వాములయ్యారని చెప్పారు. ఆమె ఆశయాలు, ఆదర్శాల కొనసాగిద్దామని చెప్పారు. శనివారం తెలంగాణ రాష్ట్ర రజక సమాజం, సాంస్కృతిక శాఖ సౌజన్యాలతో దివంగత చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతి సభను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు.
మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె.పి. జీవన్ మాట్లాడుతూ నిరూపమాన సహస వంతురాలు చాకలి ఐలమ్మ అని చెప్పారు. ఆనాటి చాకలి వారి చైతన్యమే.. ఈనాటి తెలంగాణ చైతన్యమని చెప్పకతప్పదన్నారు. సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్ఫూర్తి ప్రదాయిని చాకలి ఐలమ్మ అని చెప్పారు. బడుగుల రుద్రమ్మ చాకలి ఐలమ్మ అని చెప్పారు. ఈ సందర్భంగా బుల్లి తెర డెరైక్టర్ నాగబాల సురేష్ కుమార్ రూపొందించి వీరానారి చాకలి ఐలమ్మ లఘు చిత్రం సీడీని ఆవిష్కరించారు. సభ ప్రారంభంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి జోహర్లు అర్పించారు.