తెలంగాణ తొలి పోరాట భేరి | Professor Jayadheer Tirumala Rao Guest Column On Telangana Activist Mucharla Satyanarayana | Sakshi
Sakshi News home page

తెలంగాణ తొలి పోరాట భేరి

Published Sun, Oct 10 2021 1:17 AM | Last Updated on Sun, Oct 10 2021 8:49 AM

Professor Jayadheer Tirumala Rao Guest Column On Telangana Activist Mucharla Satyanarayana - Sakshi

ముచ్చర్ల సత్యనారాయణ

మూడు తరాల తెలం గాణవాది ముచ్చర్ల సత్య నారాయణ. అతని జీవితం ఒక మహా ప్రవాహం. అలాంటి నాయకులు అతి తక్కువ. ఆ విలక్షణతే అతడిని ప్రజలకు దగ్గర చేసింది. స్కూలు విద్యా ర్థిగా ఉన్నప్పుడే ఊరిని గెలిచాడు. పాటలు పాడి, బుర్రకథలు చెప్పి ఊరి ప్రజల తరపున నిలబడ్డాడు. ఊళ్లో భూపోరాటా లకు అక్షరమై మద్దతునిచ్చాడు. కంఠస్వరమై వారికి రక్షణ కవచమయ్యాడు. కాసం లింగారెడ్డి దొర ప్రజల భూములు లాక్కుంటుంటే ప్రజలు ప్రతిఘ టించారు. తన భూముల్లోకి ఎవరూ రాకుండా దారికి అడ్డంగా దొర గోడ కట్టించాడు. అది గమ నించిన ముచ్చర్ల ఓ అర్థరాత్రి తన స్నేహితుల్ని తీసుకెళ్ళి గోడల్ని పగలగొట్టి ఆధిపత్యాల్ని ధిక్క రించాడు. 

సత్యనారాయణ ఇంటిపేరు సంగంరెడ్డి. సొంతూరు హనుమకొండ పక్కనే ఉన్న ముచ్చర్ల. అందుకే ముచ్చర్ల ఇంటిపేరైంది. ముందు తన ఊరికి సేవ చేయాలను కున్నాడు. తన బాల్య స్నేహితులలో ఎరుకల, యానాది, హరిజన, గిరి జన కులాల వారు ఎందరో.  చివరివరకు వారి స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించిన ప్రజల బంధువు. వ్యవసాయ కుటుంబమే అయినా ఎన్నో ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొన్నాడు. ఒకే జత బట్టలతో స్కూలు విద్య పూర్తి చేశాడు.

స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే పొరుగురాష్ట్రం నుండి కుప్పలు తెప్పలుగా వచ్చిన అధికారులు, టీచర్ల వివక్షని ఎదుర్కొన్నాడు. ఫీజు కట్టలేదనే నెపంవేసి పరీక్షలు రాయనివ్వలేదు. ఐతే ఇలాంటి ఎన్నో విషయాలను తనదైన శైలిలో ఎదుర్కొని నిలబడ్డాడు. ఒకవైపు రైతాంగం, ప్రజలు నిజాంకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే ముచ్చర్ల గ్రామ ప్రజలు ఊళ్ళోని దొరలకు వ్యతిరేకంగా పోరాడు తుంటే ఆ ప్రజలకు అనుకూలంగా నిలిచాడు. ఆయన తండ్రి నర్సయ్య, తల్లి నర్సమ్మ. ఐదుగురు అన్నదమ్ములు. అందరు కూడా అన్యాయాలను ఎదిరించే గుణం కలిగినవారే. ఇదే లక్షణం చివరి కంటా సత్యనారాయణని వదిలిపెట్టలేదు. ఎన్టీ రామారావు పిలిచి తెలుగుదేశం టిక్కెట్టు ఇప్పిం చాడు. గెలిచాక రవాణా శాఖ మంత్రిగా నియమిం చాడు. కానీ తన ఆత్మగౌరవానికి ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగినప్పుడు చేస్తున్న పదవిని తృణ ప్రాయంగా పడేసి వచ్చాడు. 

ఆ తరువాత  ప్రజా జీవితంలో అతి సామాన్య జీవితం గడిపాడు. చదువులకు దూరమైన కుటుం బంలో పుట్టినా తన స్వంతశక్తితో పై చదువులు చదివాడు. ధిక్కార కెరటం లాంటి అతనిలో బలమైన కవి, కళాకారుడు దాగి ఉన్నాడు. పాటలు పాడుతూ బుర్రకథలు చెబుతూ అన్యాయంపై యుద్ధభేరి ప్రకటించాడు. అందుకే ‘‘ తెలంగాణ తొలి పోరాట భేరి’’ అని తనను పిలుచుకున్నారు. ‘నాన్‌ ముల్కీ గో బ్యాక్‌’ అని నినదించిన తొలితరం ఉద్యమకారుల్లో ముచ్చర్ల మొదటి శ్రేణిలో నిలు స్తాడు. ఈయన వేసే నాటకాలలో ప్రొ. జయ శంకర్‌ గారు స్త్రీ వేషాలు వేసేవారు. అంతేకాదు ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు. తెలంగాణ వారిని మరింత దగ్గరకు చేర్చింది. ఏనాడు అనుచర ప్రవృత్తిని దరిచేరనివ్వలేదు. నాయకుని గానే నిలి చాడు. ప్రజలకు దూరంగా ఉండి సేవ చేయాలని ఏనాడు భావించలేదు. అందుకే ప్రజల మధ్య, ప్రజలలో ఒకడిగా ఉంటూ కలెక్టర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళని తీసు కెళ్ళి న్యాయం జరిగేలా చూసే వాడు. ప్రేక్షక పాత్ర వహించడానికి ఆమడదూరంలో ఉండేవాడు. తన దైన స్థానాన్ని తాను నిర్మించుకో గల దిట్ట. 

అది ఉపన్యాసం కావచ్చు. పాట కావచ్చు. అక్షరశక్తి అతనికి వరం. తెలంగాణ సోదరా తెలు సుకో నీ బతుకు అని పాడినా ‘రావోయి రావోయ్‌ మర్రి చెన్నా రెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి’ అని గళ మెత్తినా ఇసుక వేస్తే రాలని జనం ఏకగాన ప్రవాహంలో లీనం కావలసిందే. ముచ్చర్ల పాటల మాటలు వినడానికి వేలాదిమంది జనం పిలవ కున్నా వచ్చేవారు. అతని పాటలు ఒక్కొక్కటి ఆయా సందర్భంలో పిడిబాకులవలె దిగేవి. శ్రోతలు అగ్రహోదగ్రులు అయ్యేవారు. ఆలోచించే వారు. తన మాటలతో వారిని కనికట్టు చేసేవారు. మంత్రముగ్ధులై వినేవారు. అంతటితో తనపని పూర్తయిందని ఇంటికెళ్ళి పడుకుంటాడు. 

ముచ్చర్ల ఆశావాది. గాలికెదురీదుతాడు. సభా నంతరం వారిలో వెలిగిన చైతన్యాన్ని ఏ రూపంలో ఏ దారిలో ముందుకు తీసుకెళ్ళాలో ప్రణాళికలు వేసేవాడు. గాలివాటిన్ని బట్టి పోడు. తానే సుడి గాలై దారిచూపుతాడు. సాహిత్యంలోనే కాదు రాజకీయ ఎత్తుగడలు నిర్మించడంలో అతను దిట్ట. పట్టువిడుపులు లేవని కాదు. కానీ తనకు, తన జాతి, ప్రాంతాలకు అన్యాయం ఎదురైనా, ఆత్మ గౌరవానికి దెబ్బతగిలినా సహించలేడు. వరంగల్‌ లోనే తనకు పోటీగా ఎన్టీఆర్‌ మరొకరిని ప్రోత్స హిస్తే దానిని వ్యతిరేకించాడు. కులమో, స్థలమో, బంధు త్వమో, ఏదో ఒక పేరుతో గ్రూపులు పెట్ట డాన్ని సహించలేదు. ఆ విష యాన్ని అధిష్టానానికి స్పష్టం చేసిన గుండెదిటవు గల మనిషి. అందుకే ఒకచోట ఇలా అన్నాడు. ఊరిలో సర్పం చుగా పనిచేసిన ప్పుడు ఇంట్లో ఉన్నట్లు అనిపిం చింది. సమితి ప్రెసిడెంట్‌ అయ్యాక స్కూల్లో విద్యార్థులతో ఉన్నట్లు అనిపిం చింది. మంత్రి అయినాక మాత్రం జైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అని తన పరిస్థితి వివరించాడు.

ఇల్లు గడవకుంటే ముచ్చర్ల చివరి దశలో కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఉన్న ఆస్థిని కరిగించడంలో దిట్ట. ఏనాడూ వెనకంజ వేయలేదు. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికన్నా సుమారు రెండు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఇంటా బయటా ఎలా మోసపోతున్నదో కళ్ళారా చూసినవాడు. భవిష్యత్‌ని అంచనా వేశాడు. అందుకు వ్యతిరేకంగా పావులు కదిలించాడు. తాను కదలుతూ ప్రజలను కదిల్చాడు. మలి ఉద్యమం ఆరంభం నుండి నగారాలా మోగిన వాడు. 

తెలంగాణ కోసం ఒక సెంట్రీలాగ పనిచేశాడు. తానే ఒక సైరన్‌ అయి మోగాడు. తెలంగాణ ప్రయో జనాలకు పరిరక్షకుడిగా నిలబడ్డాడు.  ముచ్చర్ల జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. కానీ అన్ని మలుపుల్లో కూడా తెలంగాణానే శాసించాడు. ఒక రాష్ట్రం కోసం దాని ఏర్పాటు నుండి సాధించిన దశ వరకు జీవించిన వ్యక్తి మరొకరు లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఎందుకోగాని ముచ్చర్ల పక్కనే ఉండిపోయాడు. ఎంతో గుర్తింపు పొందాల్సిన వాడు చాలా మందిలాగే సైడ్‌లైన్‌ కాబడ్డాడు. అలాంటివాడికి ఒక విగ్రహం కూడా లేకపోవడం వింతే. ఒక రాష్ట్రం కోసం ఒక వ్యక్తి జీవితాన్ని  ధారపోసి కనుమరుగయ్యాడు. అలా కావాలనే కనుమరుగు చేశారని అతని మిత్రులు అంటారు. ఏమైనా ముచ్చర్ల రాష్ట్రం కోసం చేసిన కృషి చరిత్ర పుటల నుండి బయటపడక తప్పదు. మలి పోరా టంలో కనిపించీ కనబడని వాళ్ళకే అందలాలు, తాయిలాలు, అందుతున్న కాలంలో చరిత్రకే ముచ్చెమటలు పోయించిన ముచ్చర్లల చరిత్ర రేపటి అవసరం. వలపోతల మధ్య చరిత్ర మరో మహోజ్వల ఉద్యమాన్ని కలగంటున్న వేళ అది అవసరం.


జయధీర్‌ తిరుమలరావు 
వ్యాసకర్త కవి, పరిశోధకులు
మొబైల్‌: 99519 42242
(ముచ్చర్ల సత్యనారాయణ ఐదో వర్ధంతి సందర్భంగా నేడు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో సంస్మరణ సభ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement