Jayadheer Thirumala rao
-
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్‌లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్‌కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో కొంతకాలం చేసి, మహబూబ్‌నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్‌లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్‌కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్‌లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్‌కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
తెలంగాణ తొలి పోరాట భేరి
మూడు తరాల తెలం గాణవాది ముచ్చర్ల సత్య నారాయణ. అతని జీవితం ఒక మహా ప్రవాహం. అలాంటి నాయకులు అతి తక్కువ. ఆ విలక్షణతే అతడిని ప్రజలకు దగ్గర చేసింది. స్కూలు విద్యా ర్థిగా ఉన్నప్పుడే ఊరిని గెలిచాడు. పాటలు పాడి, బుర్రకథలు చెప్పి ఊరి ప్రజల తరపున నిలబడ్డాడు. ఊళ్లో భూపోరాటా లకు అక్షరమై మద్దతునిచ్చాడు. కంఠస్వరమై వారికి రక్షణ కవచమయ్యాడు. కాసం లింగారెడ్డి దొర ప్రజల భూములు లాక్కుంటుంటే ప్రజలు ప్రతిఘ టించారు. తన భూముల్లోకి ఎవరూ రాకుండా దారికి అడ్డంగా దొర గోడ కట్టించాడు. అది గమ నించిన ముచ్చర్ల ఓ అర్థరాత్రి తన స్నేహితుల్ని తీసుకెళ్ళి గోడల్ని పగలగొట్టి ఆధిపత్యాల్ని ధిక్క రించాడు. సత్యనారాయణ ఇంటిపేరు సంగంరెడ్డి. సొంతూరు హనుమకొండ పక్కనే ఉన్న ముచ్చర్ల. అందుకే ముచ్చర్ల ఇంటిపేరైంది. ముందు తన ఊరికి సేవ చేయాలను కున్నాడు. తన బాల్య స్నేహితులలో ఎరుకల, యానాది, హరిజన, గిరి జన కులాల వారు ఎందరో. చివరివరకు వారి స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించిన ప్రజల బంధువు. వ్యవసాయ కుటుంబమే అయినా ఎన్నో ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొన్నాడు. ఒకే జత బట్టలతో స్కూలు విద్య పూర్తి చేశాడు. స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే పొరుగురాష్ట్రం నుండి కుప్పలు తెప్పలుగా వచ్చిన అధికారులు, టీచర్ల వివక్షని ఎదుర్కొన్నాడు. ఫీజు కట్టలేదనే నెపంవేసి పరీక్షలు రాయనివ్వలేదు. ఐతే ఇలాంటి ఎన్నో విషయాలను తనదైన శైలిలో ఎదుర్కొని నిలబడ్డాడు. ఒకవైపు రైతాంగం, ప్రజలు నిజాంకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే ముచ్చర్ల గ్రామ ప్రజలు ఊళ్ళోని దొరలకు వ్యతిరేకంగా పోరాడు తుంటే ఆ ప్రజలకు అనుకూలంగా నిలిచాడు. ఆయన తండ్రి నర్సయ్య, తల్లి నర్సమ్మ. ఐదుగురు అన్నదమ్ములు. అందరు కూడా అన్యాయాలను ఎదిరించే గుణం కలిగినవారే. ఇదే లక్షణం చివరి కంటా సత్యనారాయణని వదిలిపెట్టలేదు. ఎన్టీ రామారావు పిలిచి తెలుగుదేశం టిక్కెట్టు ఇప్పిం చాడు. గెలిచాక రవాణా శాఖ మంత్రిగా నియమిం చాడు. కానీ తన ఆత్మగౌరవానికి ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగినప్పుడు చేస్తున్న పదవిని తృణ ప్రాయంగా పడేసి వచ్చాడు. ఆ తరువాత ప్రజా జీవితంలో అతి సామాన్య జీవితం గడిపాడు. చదువులకు దూరమైన కుటుం బంలో పుట్టినా తన స్వంతశక్తితో పై చదువులు చదివాడు. ధిక్కార కెరటం లాంటి అతనిలో బలమైన కవి, కళాకారుడు దాగి ఉన్నాడు. పాటలు పాడుతూ బుర్రకథలు చెబుతూ అన్యాయంపై యుద్ధభేరి ప్రకటించాడు. అందుకే ‘‘ తెలంగాణ తొలి పోరాట భేరి’’ అని తనను పిలుచుకున్నారు. ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అని నినదించిన తొలితరం ఉద్యమకారుల్లో ముచ్చర్ల మొదటి శ్రేణిలో నిలు స్తాడు. ఈయన వేసే నాటకాలలో ప్రొ. జయ శంకర్ గారు స్త్రీ వేషాలు వేసేవారు. అంతేకాదు ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు. తెలంగాణ వారిని మరింత దగ్గరకు చేర్చింది. ఏనాడు అనుచర ప్రవృత్తిని దరిచేరనివ్వలేదు. నాయకుని గానే నిలి చాడు. ప్రజలకు దూరంగా ఉండి సేవ చేయాలని ఏనాడు భావించలేదు. అందుకే ప్రజల మధ్య, ప్రజలలో ఒకడిగా ఉంటూ కలెక్టర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళని తీసు కెళ్ళి న్యాయం జరిగేలా చూసే వాడు. ప్రేక్షక పాత్ర వహించడానికి ఆమడదూరంలో ఉండేవాడు. తన దైన స్థానాన్ని తాను నిర్మించుకో గల దిట్ట. అది ఉపన్యాసం కావచ్చు. పాట కావచ్చు. అక్షరశక్తి అతనికి వరం. తెలంగాణ సోదరా తెలు సుకో నీ బతుకు అని పాడినా ‘రావోయి రావోయ్ మర్రి చెన్నా రెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి’ అని గళ మెత్తినా ఇసుక వేస్తే రాలని జనం ఏకగాన ప్రవాహంలో లీనం కావలసిందే. ముచ్చర్ల పాటల మాటలు వినడానికి వేలాదిమంది జనం పిలవ కున్నా వచ్చేవారు. అతని పాటలు ఒక్కొక్కటి ఆయా సందర్భంలో పిడిబాకులవలె దిగేవి. శ్రోతలు అగ్రహోదగ్రులు అయ్యేవారు. ఆలోచించే వారు. తన మాటలతో వారిని కనికట్టు చేసేవారు. మంత్రముగ్ధులై వినేవారు. అంతటితో తనపని పూర్తయిందని ఇంటికెళ్ళి పడుకుంటాడు. ముచ్చర్ల ఆశావాది. గాలికెదురీదుతాడు. సభా నంతరం వారిలో వెలిగిన చైతన్యాన్ని ఏ రూపంలో ఏ దారిలో ముందుకు తీసుకెళ్ళాలో ప్రణాళికలు వేసేవాడు. గాలివాటిన్ని బట్టి పోడు. తానే సుడి గాలై దారిచూపుతాడు. సాహిత్యంలోనే కాదు రాజకీయ ఎత్తుగడలు నిర్మించడంలో అతను దిట్ట. పట్టువిడుపులు లేవని కాదు. కానీ తనకు, తన జాతి, ప్రాంతాలకు అన్యాయం ఎదురైనా, ఆత్మ గౌరవానికి దెబ్బతగిలినా సహించలేడు. వరంగల్ లోనే తనకు పోటీగా ఎన్టీఆర్ మరొకరిని ప్రోత్స హిస్తే దానిని వ్యతిరేకించాడు. కులమో, స్థలమో, బంధు త్వమో, ఏదో ఒక పేరుతో గ్రూపులు పెట్ట డాన్ని సహించలేదు. ఆ విష యాన్ని అధిష్టానానికి స్పష్టం చేసిన గుండెదిటవు గల మనిషి. అందుకే ఒకచోట ఇలా అన్నాడు. ఊరిలో సర్పం చుగా పనిచేసిన ప్పుడు ఇంట్లో ఉన్నట్లు అనిపిం చింది. సమితి ప్రెసిడెంట్ అయ్యాక స్కూల్లో విద్యార్థులతో ఉన్నట్లు అనిపిం చింది. మంత్రి అయినాక మాత్రం జైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అని తన పరిస్థితి వివరించాడు. ఇల్లు గడవకుంటే ముచ్చర్ల చివరి దశలో కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఉన్న ఆస్థిని కరిగించడంలో దిట్ట. ఏనాడూ వెనకంజ వేయలేదు. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికన్నా సుమారు రెండు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఇంటా బయటా ఎలా మోసపోతున్నదో కళ్ళారా చూసినవాడు. భవిష్యత్‌ని అంచనా వేశాడు. అందుకు వ్యతిరేకంగా పావులు కదిలించాడు. తాను కదలుతూ ప్రజలను కదిల్చాడు. మలి ఉద్యమం ఆరంభం నుండి నగారాలా మోగిన వాడు. తెలంగాణ కోసం ఒక సెంట్రీలాగ పనిచేశాడు. తానే ఒక సైరన్ అయి మోగాడు. తెలంగాణ ప్రయో జనాలకు పరిరక్షకుడిగా నిలబడ్డాడు. ముచ్చర్ల జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. కానీ అన్ని మలుపుల్లో కూడా తెలంగాణానే శాసించాడు. ఒక రాష్ట్రం కోసం దాని ఏర్పాటు నుండి సాధించిన దశ వరకు జీవించిన వ్యక్తి మరొకరు లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఎందుకోగాని ముచ్చర్ల పక్కనే ఉండిపోయాడు. ఎంతో గుర్తింపు పొందాల్సిన వాడు చాలా మందిలాగే సైడ్‌లైన్ కాబడ్డాడు. అలాంటివాడికి ఒక విగ్రహం కూడా లేకపోవడం వింతే. ఒక రాష్ట్రం కోసం ఒక వ్యక్తి జీవితాన్ని ధారపోసి కనుమరుగయ్యాడు. అలా కావాలనే కనుమరుగు చేశారని అతని మిత్రులు అంటారు. ఏమైనా ముచ్చర్ల రాష్ట్రం కోసం చేసిన కృషి చరిత్ర పుటల నుండి బయటపడక తప్పదు. మలి పోరా టంలో కనిపించీ కనబడని వాళ్ళకే అందలాలు, తాయిలాలు, అందుతున్న కాలంలో చరిత్రకే ముచ్చెమటలు పోయించిన ముచ్చర్లల చరిత్ర రేపటి అవసరం. వలపోతల మధ్య చరిత్ర మరో మహోజ్వల ఉద్యమాన్ని కలగంటున్న వేళ అది అవసరం. జయధీర్ తిరుమలరావు వ్యాసకర్త కవి, పరిశోధకులు మొబైల్: 99519 42242 (ముచ్చర్ల సత్యనారాయణ ఐదో వర్ధంతి సందర్భంగా నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంస్మరణ సభ) -
మేడారం.. కథ కాదు ఓ చరిత్ర
సాక్షి, హైదరాబాద్: కోయ, ఆదివాసీల వీరగాథలపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని ప్రముఖ రచయిత, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. సమ్మక్క – సారక్కపై ఎన్నో కట్టు కథలున్నాయని, ఇప్పుడు చారిత్రక దృక్కోణంలోంచి వాటిని చూడాల్సి ఉందన్నారు. మేడారంలో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతర నేపథ్యంలో వారి గాథలపై అధ్యయనం చేసిన ఆయన ‘వీరుల పోరు గద్దె –మేడారం’ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం జయధీర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక్క కథ చరిత్ర సృష్టించింది.. సమ్మక్క–సారలమ్మ ఒక్క గాథే చరిత్రను సృష్టించింది. మరి మిగిలిన ఎనిమిది గాథల మాటేమిటి..? ఈ గాథలోనే కాదు పగిడిద్దరాజు, గడికామరాజు, ఎరమరాజు, గాదిరాజు, గోవిందరాజు, తోటుమనెడి కర్ర, గుంజేటి ముసలమ్మల కథలు కూడా ఈనాటికీ ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో సమక్క సారాలమ్మల చరిత్ర నుండి ప్రేరణ పొందినందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం పరిశోధనల వైపు దృష్టి సారించాలి. అప్పుడే అసలు గాథలు బయటికి వచ్చి ఆదివాసీలకు మేలు జరుగుతుంది. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తూ స్థానిక కోయ సంస్కృతి, పుజా విధానం మారకుండా కాపాడాలి. బ్రాహ్మణ పురోహితులు అక్కడ కన్పించకూడదు. చరిత్ర విషయంలో చరిత్రకారులు ఇలాంటి పరిశోధనలు చేసి ప్రజల పక్షం వహించినపుడే ఆ చరిత్రకు సార్థకత ఉంటుంది. ఇంతవరకు సమక్క–సారాలమ్మలకు సంబంధించి కాల్పానిక గాథలే ఉన్నాయి. ఇప్పుడు చారిత్రక ఘటనల క్రమం నుంచి వీరి చరిత్రను వెలికి తీశా. అంతేకాదు చరిత్ర ఆధారాలు కనిపించని చోట కోయల జ్ఞాపకాల్లోని మౌఖిక ఆధారాలే చరిత్రగా మార్చాలి. సమ్మక్క – సారక్క జాతరగానే పిలవాలి ఇప్పటి వరకు సమక్క – సారలమ్మ జాతరగా పిలుస్తున్నాం. ఇది సరికాదు. ‘సమ్మక్క–సారక్క’ జాతరగా పిలవడం సుమచితం. ఆదివాసీలకు అక్క దేవతలు ఉంటారు. ‘అక్కలు’ అని పిలవడం సరైన పద్ధతి. ఒకరు ఒకలాగా మరొకరు మరోలా కాకుండా.. అందరూ ఒకే తీరుతలో పిలవాలి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే జాతరను సమ్మక్క – సారక్క జాతరగా పిలవడం ప్రాచర్యంలోకి తేవాలి. ఈ విషయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. కోయ వీరుల పాటలకు ప్రాచుర్యం అవసరం ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క – సారక్క జాతరకి ఎనిమిది మంది కోయ వీరుల పగిడె పాటలు తీసుకరావాలి. వాటికి జాతరలో నాలుగు రోజుల పాటు వారి గాథలు చెప్పించటం అవసరం. అప్పడే ఆ వనదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. చరిత్రకు న్యాయం జరుగుతుంది. గొప్ప చారిత్రక ప్రదేశం.. మేడారంలో సమ్మక్క – సారక్క జాతర జరిగే స్థలం గొప్ప చారిత్రక ప్రదేశం. అక్కడ యుద్ధం జరిగింది. పడిపోయిన తన భర్తను సమక్క మోసుకొని వచ్చింది. మేడారం వద్దకు రాగానే అలసిపోయి అక్కడే ఆగింది. ఆ తర్వాత ఆమె తన కూతురు సారక్క అక్కడే ఉండి, కొంత కాలానికి మరణించారు. కాబట్టి కోయలకు అది పవిత్ర స్థలం. నిజానికి అది ఓ చారిత్రక ప్రదేశం మాత్రమే. 14 ఏళ్ల అన్వేషణ ఇది.. ‘వీరుల పోరు గద్దె–మేడారం’ పేరుతో సమ్మక్క, సారక్కలపై కోయడోలీల కథ పుస్తకం తీసుకరావటానికి 14 ఏళ్లు పట్టింది. ఇది ఒకరితో సాధ్యమైంది కాదు. ప్రొఫెసర్ గూడూరు మనోజ, పద్దం అనసూయ.. వీరితో పాటు ఎంతో మంది శ్రమించారు. తొలుత ఖమ్మం జిల్లా తొగ్గూడెం ప్రారంభించి మేడారం వరకు చరిత్ర అన్వేషణ ప్రయాణం సాగించాం. అక్కడ పగిడె తీశారు. మౌఖిక కథనాలకి ఆధార భూతాలు పగిడెలు మాత్రమే. అవసరమైన చోట పాఠ్యగానం సకిన రామచంద్రయ్య బృందం అందించారు. -
గొప్ప రచయిత మహా శ్వేతాదేవి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఆదివాసీల కోసం పోరాటాలు చేసి వారి సమస్యలపై అనేక రచనలు చేసిన గొప్ప రచయిత మహా శ్వేతాదేవి అని, అందుకే ఆమె కలానికి అంత పదును వచ్చిందని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు అన్నారు. ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక, ప్రజాస్వామిక రచయితల వేదిక, తెలంగాణ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి మహా శ్వేతా దేవి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ.. అభూత కల్పనలు చెప్పకుండా వచనాన్ని గొప్పగా చెప్పే శక్తి ఆమెకు వచ్చిందని అన్నారు. గోపారాజు నారాయణ రాజు మాట్లాడుతూ హిరోషిమ ఘటన మానవత్వం మసి అయిపోయినట్లు అయిందని అన్నారు. ఈ సందర్భంగా కొడవాటి కుటుంబరావు అనువాదం చేసిన ‘ హిరోషిమా’ నవలను శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ఆవిష్కరించారు. స్త్రీ సంఘటన ఎడిటర్ యం.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయితలు భూపతి వెంకటేశ్వర్లు, భూపాల్, విమల, జనసాహితి అధ్యక్షులు రాంమోహన్ , కొండవీటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
శాసనాలకు గొంతునిచ్చి..
సందర్భం పురావస్తు శాఖలో చేరిన నాటి నుంచి ఆయనకు శాసనాలే లోకం. చరిత్రతోనే సంభాషణం. ఉంటే ఆఫీసులో. లేదా క్షేత్ర పర్యటనలో. శిలపై చెక్కిన అక్షరం ఎక్కడ ఉంటే అక్కడ శాస్త్రిగారు వాలేవారు. ఒక చరిత్ర విజ్ఞానశాస్త్ర శకం ముగిసింది. చరిత్ర ఆధారాల సేకరణ, చరిత్ర రచనల జమిలి శక్తి ఆవలి తీరం చేరింది. తెలుగువారి చరి త్రకు సమగ్ర స్వరూపం చేకూర్చిన కొద్దిమందిలో డాక్టర్ పి.వి. పరబ్రహ్మశాస్త్రి ఒకరు. పాతతరం చరిత్రకా రుల అధ్యాయం ముగిసింది. తొంభై ఐదేళ్ల చరిత్ర కన్నుమూసింది. కొన్ని వేల ఎకరా లలో చరిత్ర శకలాలను నిక్షిప్తం చేసుకున్న శాతవాహ నుల కాలంనాటి మహా నగరం కొండాపూర్ (మెదక్ జిల్లా)కు బుధవారం మిత్రులతో కలిసి వెళ్లివస్తున్న సమయంలోనే శాస్త్రిగారు కన్నుమూశారన్న సమాచారం కలచి వేసింది. 1959లో హైదరాబాద్‌లోని పురావస్తు శాఖలో శాసన పాఠాల సేకరణ విభాగంలో చేరారు. అదే చరిత్ర సముద్రంలో వారి మొదటి అడుగు. ఒక్కో చరిత్ర మెట్టు ఎక్కి, సహాయ సంచాలకులుగా చేరి డిప్యూటీ డెరైక్టరుగా పదవీవిరమణ చేశారు. కన్నడ ప్రాంతంలోని కర్ణా టక విశ్వ విద్యాలయంలో కాకతీ యుల పరిపాలనా కాలంపై పరి శోధించారు. రాళ్లకు అంటిన మరకల్ని, బురదని తొలగించి, చరిత్ర పొరల నుంచి చారిత్రక సంపదని తవ్విపోశారా యన. తవ్విపోసింది చెక్కిన అక్షరాలను. ఆ అక్షరాల లోనిదే-ఒక జాతికి, రాష్ట్రానికి, ప్రాంతానికి ఆత్మగౌరవ చరిత్ర. బలవంతుల చేతిలో బందీ చరిత్ర. శాతవాహ నులు మహారాష్ట్రులే అని ఆ ప్రాంతపు పరిశోధకులు కోడై కూసే వేళ శాస్త్రిగారు ఆ వాదంలోని అచారిత్రికతని బట్టబయలు చేసి, శాతవాహనులు తెలుగువారే అని నిరూపించారు. కోటిలింగాల నాణేలను ఆధారం చేసు కుని పూర్వ శాతవాహన రాజులు కూడా కరీంనగర్ ప్రాంతంలోని వారే అని చెప్పారు. రాణి రుద్రమదేవి యుద్ధరంగంలో మరణించారని చందుపట్ల శాసనం ఆధారంగా చెప్పారు. ఇతరులు సేకరించిన చారిత్రకాధారాల సహకా రంతో చరిత్రను రాసేవారు కొందరు. తామే కష్టపడి నేల మాళిగల నుంచి శకలాలను తవ్వి తీసి మట్టిచేతు లతో చరిత్రను నిర్మిస్తారు ఇంకొందరు. అలాంటి కోవకు చెందిన పరిశోధకులు శాస్త్రి. పురావస్తు శాఖలో చేరిన నాటి నుంచి ఆయనకు శాసనాలే లోకం. చరిత్రతోనే సంభాషణం. ఉంటే ఆఫీసులో. లేదా క్షేత్ర పర్యటనలో. శిలపై చెక్కిన అక్షరం ఎక్కడ ఉంటే అక్కడ శాస్త్రిగారు వాలేవారు. రాగి పలక మీద చెక్కుళ్లు ఉన్నాయంటే రెక్కలొచ్చేవి ఆయనకు. చరిత్ర శకలం దొరికితే ఒక కొత్త అధ్యాయం తెరుచుకున్నట్లే. భారతీయ లిపుల చరిత్రను ఔపోసన పట్టారు శాస్త్రిగారు. ఆయన చేసిన గొప్ప కృషి తెలుగు లిపిపై అధ్యయనం. లిపి కేవలం రాతి మీద రాత కాదు. చారిత్రక దశల ప్రతిబింబం. పద స్వరూపం, అర్థం, అన్వయం వంటి వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసినవారిలో శాస్త్రిగారిని మించిన వారు లేరు. అందుకే ఇప్పుడు చరిత్ర లిపి విజ్ఞానశాస్త్రం శకం ముగిసింది అన్నాను. నాలుగు దశాబ్దాలుగా శాస్త్రిగారి దగ్గర సహాయకునిగా పనిచేసిన కొమురయ్య ఇంటికి ఆరునెలల క్రితం వెళ్లి సన్మానించి వచ్చారు. ఐదువేల రూపాయలు ఇచ్చారు. కొము రయ్య కాలు తొలగించిన విషయం తెలిసి శాస్త్రిగారు వెళ్లారు. శాస్త్రిగారు ఎన్నో పురస్కారాలు పొందారు. కానీ కొమురయ్యను సన్మానించి ఒక గొప్ప పనిచేశారు. కొమురయ్య శాసనప్రతులు తీయ డంలో సిద్ధహస్తుడు. ఇద్దరు కలసి ఎన్నో శాసనాలకు జీవంపోశారు. ఉద్యోగం చేస్తూనే కొమురయ్యతో బీఏ, ఎం.ఏ చదివించి శాసన పరిశోధక సహాయకునిగా ప్రమోషన్ ఇప్పించారు. ఆకాశమంత గంభీర మైన చరిత్ర నేల పొరలలోనే ఉంటుంది. శాస్త్రిగారి ఔన్నత్యం కొమురయ్య చరిత్ర సేవని గుర్తించ డంలోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపా యలతో సన్మానం చేసింది. ఐసీహెచ్ఆర్ సంస్థ నేషనల్ ఫెలోగా గుర్తించింది. భారతీయ పురాభిలేఖ పరిశోధన కిగాను ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 1974లో రాగి శాసనం చెక్కించి బహూకరించారు. ఇలాంటి ఎన్నో పురస్కారాలు పొందినా పద్మ అవా ర్డుని మాత్రం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం, ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పించుకోలేక పోవడం అవమానం. ఇదేమాట ఆయనతో అన్నప్పుడు నేను పురస్కా రాల కోసం, గుర్తింపు కోసం చేయలేదు కదా. వారు వారి గుర్తింపు కోసం చేస్తున్నారాయెను అని అన్నారు. ఓ ఏడాదిపాటు శాస్త్రిగారు ఎస్.ఎస్. రామచంద్రమూర్తి గారితో తెలుగులిపి ప్రారంభ వికాసాలు పుస్తకం రాయిస్తున్న సమయంలో తరచుగా కలుసుకునే వాళ్లం. ఈ పుస్తకం వచ్చాక తెలుగు లిపిపై మైసూరులో జరిగిన ఒక సదస్సులో చదివిన ముప్ఫై పత్రాలలో ఈ పుస్తకంలోని సమాచారం తీసుకుని పద్దెనిమిది పత్రాలు చదివారు. శాస్త్రిగారు నిగర్వి. వారిది నిండు జీవితం. సన్నగా, పీలగా, పొట్టిగా కనిపించే శాస్త్రిగారు ఇంత చరిత్రని ఎలా తవ్వి తీశారా అని అనిపించక మానదు. తొంభై ఐదేళ్ల చరిత్రే ఆయన ప్రాణం. ముక్కు పొడుంలా చరిత్రని సునాయాసంగా పీల్చే శాస్త్రిగారి శ్వాస ఆగిపోవడం తెలుగువారి చరిత్ర మొలకెత్తడం కూడా ఆగినట్లేనా? (వ్యాసకర్త: జయధీర్ తిరుమల రావు, కవి, రచయిత మొబైల్ : 99519 42242).