భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula) కేసులో విద్యార్థుల, ఎన్నారైల పోరాటం ఫలించింది. ఆమె మృతికి కారణమైన అధికారిని విధుల్లోంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మరణం గురించి చులకనగా మాట్లాడిన అధికారిపై సైతం వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో న్యాయం జరిగినట్లైంది!.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల(23).. 2023,జనవరి 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి అతివేగంగా పాట్రోలింగ్ వాహనం నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న ఆమెను ఢీ కొట్టాడు. దీంతో.. ఆమె చాలాదూరం ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
అయితే విధి నిర్వహణలో భాగంగానే ఆయన అంత వేగంగా వెళ్లాల్సి వచ్చిందని.. కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తొలుత పోలీస్ శాఖ భావించింది. అలాగే ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన అధికారి విషయంలోనూ క్షమాగుణం ప్రదర్శించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి. జస్టిస్ ఫర్ జాహ్నవి పేరుతో విద్యార్థులు ఫ్లకార్డులతో రోడ్డెక్కి నిరసనసలు చేపట్టారు. దీంతో సియాటెల్ పోలీస్ శాఖ దిగొచ్చింది. ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూసింది. చివరకు చర్యలకు ఉపక్రమించింది.
ఇదీ చదవండి: జాహ్నవికి మరణానంతర డిగ్రీ
‘‘ఘటనలో ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి ఉండకపోవచ్చు. డ్రగ్స్ ఓవర్‌డోస్ అయిన బాధితుడ్ని రక్షించాలని ఆయన తాపత్రయపడ్డారు. ఆ క్రమంలోనే తన వాహనంతో ఢీ కొట్టి ప్రాణం పోయేందుకు కారణం అయ్యారు. అయితే ఆయన తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడిపారు. సియాటెల్ పోలీస్ విభాగానికి చెడ్డ పేరు తెచ్చారు. డిపార్ట్‌మెంట్ పాలసీల్లో నాలుగింటిని ఆయన ఉల్లంఘించారు. అందుకే సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి డేవ్‌ను తొలగించాం’’ అని సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ సూ రెహర్ ప్రకటించారు. ఆమె ప్రకటనను సియాటెల్ టైమ్స్ సోమవారం ప్రచురించింది. అంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మృతి పట్ల అనుచితంగా మాట్లాడిన అధికారి డేనియల్ అడెరెర్‌ను సైతం గతేడాది సెప్టెంబర్‌లో విధుల్లోంచి తొలగించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా.. ఆమె ప్రాణం విలువ గురించి మరో అధికారి చులకనగా మాట్లాడారు.
‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఈ మరణానికి విలువలేదు. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నారైల నుంచి, విద్యార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో దర్యాప్తు అనంతరం అతన్ని విధుల్లోంచి తొలగించింది. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని డేనియల్ అడెరె వివరణ ఇచ్చినప్పటికీ వేటు మాత్రం తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment