విభిన్న కథనాలతో సన్నిహితుల తీరుపై అనుమానాలు
కుమారుడి మృతదేహాన్ని తెప్పించాలని తల్లిదండ్రుల వేడుకోలు
పెద్దదోర్నాల: జీవనాధారం కోసం ఆర్మేనియాకు వెళ్లిన ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దదోర్నాల మండల పరిధిలోని హసానాబాదకు చెందిన చిన్న ఆవులయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఒంటేరు శివనారాయణ (31) బీటెక్ పూర్తి చేసి యూరప్‌లోని ఆర్మేనియాలో ఉద్యోగం సంపాదించాడు.
ఈ క్రమంలో 15 రోజుల క్రితం తల్లిదండ్రులకు తాను మరో కంపెనీలో ఉద్యోగంలో చేరానని, అక్కడే నలుగురు కలిసి రూం తీసుకుని ఉంటున్నామని తెలిపాడు. గురువారం మద్యం పార్టీ చేసుకున్న మిత్రులు తనకు ఓ బాటిల్లో నీరు ఇచ్చారని, అది తాగటం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపాడు.
అనంతరం తాను వైద్యశాలలో చేరినట్లు శుక్రవారం సమాచారం అందించాడు. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులకు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలను పంపించిన సహచరులు.. అదే రోజున శివనారాయణ చనిపోయాడంటూ సమాచారం అందించడంతో తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు.
సహచరుల తీరుపై అనుమానాలు..
‘రూ.2 లక్షల పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే మృతదేహాన్ని ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేసిన శివనారాయణ సహచరులపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.
కాగా, సమాచారం ఇచ్చినప్పటి నుంచి వారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఏం చేయాలో అర్ధంకాక మృతుని తల్లిదండ్రులు, దిక్కతోచని స్థితిలో విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment