Armenia
-
ఆర్మేనియాలో ఆంధ్రా యువకుడి మృతి
పెద్దదోర్నాల: జీవనాధారం కోసం ఆర్మేనియాకు వెళ్లిన ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దదోర్నాల మండల పరిధిలోని హసానాబాదకు చెందిన చిన్న ఆవులయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఒంటేరు శివనారాయణ (31) బీటెక్ పూర్తి చేసి యూరప్‌లోని ఆర్మేనియాలో ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం తల్లిదండ్రులకు తాను మరో కంపెనీలో ఉద్యోగంలో చేరానని, అక్కడే నలుగురు కలిసి రూం తీసుకుని ఉంటున్నామని తెలిపాడు. గురువారం మద్యం పార్టీ చేసుకున్న మిత్రులు తనకు ఓ బాటిల్లో నీరు ఇచ్చారని, అది తాగటం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపాడు. అనంతరం తాను వైద్యశాలలో చేరినట్లు శుక్రవారం సమాచారం అందించాడు. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులకు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలను పంపించిన సహచరులు.. అదే రోజున శివనారాయణ చనిపోయాడంటూ సమాచారం అందించడంతో తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. సహచరుల తీరుపై అనుమానాలు.. ‘రూ.2 లక్షల పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే మృతదేహాన్ని ఇండియాకు తీసుకొస్తాం’ అంటూ ఫోన్లు చేసిన శివనారాయణ సహచరులపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, సమాచారం ఇచ్చినప్పటి నుంచి వారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఏం చేయాలో అర్ధంకాక మృతుని తల్లిదండ్రులు, దిక్కతోచని స్థితిలో విలపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. -
Tata Steel Chess: రన్నరప్ ఎరిగైసి అర్జున్
కోల్‌కతా: భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ టాటా స్టీల్ ఇండియా బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్... ప్రపంచ మాజీ బ్లిట్జ్ చాంపియన్ లెవాన్ అరోనియన్ (అర్మేనియా) 11.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఒంటరి విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య రెండు గేమ్‌ల టైబ్రేక్‌ను నిర్వహించారు. ఈ రెండు గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. దాంతో అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహించారు. అర్మగెడాన్ గేమ్‌లో అరోనియన్ 38 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. అర్జున్ రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. ఇదే టోర్నీలో ర్యాపిడ్ విభాగంలో అర్జున్ విజేతగా నిలి చిన సంగతి తెలిసిందే. బ్లిట్జ్ టోర్నీ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగు పాయింట్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. -
ఆర్మేనియా, అజర్బైజాన్ శాంతి ఒప్పందం
ఎరేవాన్(ఆర్మేనియా): అజర్ బైజాన్‌లోని నాగోర్నో – కారాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఘర్షణ పడుతోన్న ఆర్మేనియా, అజర్బైజాన్లు ఘర్షణలకు స్వస్తి పలుకుతూ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి 2000 మంది రష్యన్ శాంతి దళాలను వివాదాస్పద ప్రాంతంలో మోహరించాలని తీర్మానించారు. 1994లో కుదిరిన యుద్ధ విరమణ సంధి ప్రకారం నాగోర్నో కారాబాఖ్, ఆర్మేనియా దళాల నియంత్రణలో ఉంది. అంతకు ముందు జరిగిన భీకర పోరాటంలో 30,000 మంది చనిపోయారు. అప్పటి నుంచి, అప్పుడప్పుడు కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ, పూర్తి స్థాయి యుద్ధం ఈ యేడాది సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం అయ్యింది. అనేక సార్లు కాల్పుల విరమణకు పిలుపునిచ్చి నప్పటికీ అవి అమలు కాలేదు. వ్యూహాత్మక నగరం సుషిని అజర్బైజాన్ తన అదుపులోకి తెచ్చుకుంది. దీనితో ఈ ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నారు. తాజా ఒప్పందం ప్రకారం ఆర్మేనియాకు చెందిన భద్రతా బలగాలు నాగర్నో కారాబఖ్ సరిహద్దులోని ప్రాంతాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ళ పాటు ఈ ప్రాంతంలో రష్యా దళాలు ఉంటాయి. -
పార్లమెంట్ స్పీకర్‌పై దాడి..
యెరెవాన్: వివాదాస్పదమైన నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య భీకర పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతన్న సైనిక ఘర్షణకు స్వస్తి పలికేందుకు గాను ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ అజర్బైజాన్, రష్యాలతో శాంతి ఒప్పందాన్ని ప్రకటించాడు. దాంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆర్మేనియన్ పార్లమెంటుపై దాడి చేసి స్పీకర్ అరరత్ మిర్జోయన్‌ను గాయపర్చారు. రష్యన్ వార్తా సంస్థ ప్రకారం.. యెరెవాన్ నగరంలోని ఆర్మేనియన్ పార్లమెంట్ బయట మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన నిరసనలలో పాల్గొన్న ఆందోళనకారుల చేతిలో స్పీకర్ మిర్జోయన్ గాయపడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాని నికోల్ పషిన్యన్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో మిర్జోయన్‌కు ఆపరేషన్ జరిగినట్లు వెల్లడించారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రధాని శాంతి ఒప్పందం ప్రకటించడంతో నిరసనకారులు యెరెవాన్ వీధుల్లో హింసాయుత చర్యలకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందటు ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక పార్లమెంట్‌పై దాడి చేసిన నిరసనకారులందరికి శిక్ష పడుతుందని పషిన్యన్ మరో ప్రకటనలో తెలిపారు. (చదవండి: ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ) శాంతి ఒప్పందం దేని గురించి నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలో తలెత్తిన సైనిక ఘర్షణకు స్వస్తి పకలడానికి ఆర్మేనియా శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. దీన్ని కీలక పరిణామంగా పేర్కొన్నది. ఇక వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడానికి శాంతి ఒప్పందానికి అంగీకరించానని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంత నాయకుడు అరైక్ హరుతున్యన్ ఫేస్బుక్ లైవ్‌లో తెలిపారు. ఇక తాజా ఒప్పందం ప్రకారం.. అజర్బైజాన్ ఇటీవలి పోరాటంలో ఆక్రమించిన భూభాగం దాని అధీనంలోనే ఉంటుంది. ఇక వచ్చే నెలలో ఆర్మేనియా అదనపు భూభాగాన్ని ఆక్రమిస్తుందని తెలిపింది. అంతేకాక నాగోర్నో-కరాబాఖ్లను ఆర్మేనియాతో అనుసంధానించే రహదారికి కాపలాగా రష్యన్ భద్రతా దళాలను ఉంచారని ఆర్టీ.కామ్ నివేదించింది.(చదవండి: అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా క్షిపణి దాడులు!) సెప్టెంబర్ 27 న, నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజ్ర్బైజాన్ మధ్య తాజా వివాదం చెలరేగింది. నాగోర్నో-కరాబాఖ్ అజర్బైజాన్ పరిధిలోకి వస్తోంది. కాని దక్షిణ కాకసస్ పొరుగుదేశాల మధ్య తలెత్తిన యుద్ధం ముగిసినప్పటి నుంచి అంటే 1994 నుంచి ఈ ప్రాంతం ఆర్మేనియన్ దళాల నియంత్రణలో ఉంది. -
ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ
చేతిలో తుపాకీ ఉంటే ముఖం మీద నవ్వు ఉంటుందా?! యానా హకోబియాన్ అంతే. దేశంలో శాంతి పావురం. సరిహద్దుల్లో సమర శంఖం. దేశ ప్రధాని సతీమణి ఆమె! నలుగురు పిల్లల తల్లి. రాబోతున్న యుద్ధం కోసం... సైన్యంలో చేరారు. శిక్షణ తీసుకుంటున్నారు. ముఖం మీది నవ్వును చూడకండి. చేతిలోని తుపాకీని చూడండి. ఇప్పుడేమనిపిస్తోంది?! భారత్ చైనాల సరిహద్దులో పరిస్థితి ఇప్పుడెంత ఉద్రిక్తంగా ఉందో ఆర్మీనియా, అజర్బైజాన్ల మధ్య అంతకు మంచిన ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. నెల రోజులుగా ఆ రెండు దేశాలు పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతం అయిన నగోర్నో–కరాబఖ్ కోసం వాళ్ల యుద్ధం. అవును, యుద్ధమే! ‘‘వెరీ సీరియస్, ఆర్మీనియన్లంతా ఆయుధాలు తియ్యవలసినంత సీరియస్’’ అని ఆర్మీనియా ప్రధాని నికోల్ పషిన్యాన్ తాజాగా ప్రకటన చేశారు! మూడు దశాబ్దాల క్రితం సోవియట్ యూనియన్ పతనం అవడంతో సొంత దేశాలుగా అవతరించిన రెండు ముక్కలు.. ఆర్మీనియా, అజర్బైజాన్. ఆర్మీనియా ప్రస్తుతం ఆసియాలో ఉంది. అజర్బైజాన్ కాస్పియన్ సముద్రానికి పశ్చిమాన తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల మధ్య పరచుకుని ఉంది. ఆర్మీనియా, అజర్బైజాన్ ఎక్కడ ఉన్నప్పటికీ రెండూ పక్కన పక్కన ఉన్నాయి. పశ్చిమాన ఆర్మీనియా, తూర్పున అజర్బైజాన్. వివాద స్థలం నగోర్నో–కరాబఖ్ అజర్బైజాన్ వైపు ఉన్నప్పటికీ అక్కడంతా ఆర్మీనియన్లే. అందుకే ఆ ప్రాంతం తమది అని ముప్పైయేళ్లుగా ఆర్మీనియా పోరాడుతోంది. ఎవరు ఉన్నారని కాదు, ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం అని అజర్బైజాన్. సుమారు 30 వేల మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయిన 1990 ల నాటి యుద్ధాలలో అజర్బైజాన్ రాజధాని బకు నుంచి కరాబఖ్ ప్రావిన్స్ విడిపోయింది. దానిని నిలుపుకునేందుకు ఇప్పుడు అజర్బైజాన్ అంతిమ పోరాటానికి సిద్ధం అయింది. ∙∙ ‘వెరీ సీరియస్’ అని ఆర్మీనియా ప్రధాని ప్రకటించాక మొదట యుద్ధ రంగంలోకి దుమికింది ఆయన భార్య యానా హకోబియాన్! ఫ్రంట్ లైన్ సైనికురాలిగా శిక్షణ తీసుకునేందుకు ఆమె మిలటరీలో చేరారు. యానా వయసు 42 సంవత్సరాలు. నలుగురు పిల్లల తల్లి. దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ‘ఆర్మీనియన్ టైమ్స్’ పత్రికకు ఎడిటర్–ఇన్–చీఫ్. మంగళవారం మిలటరీ ట్రైనింగ్‌కి వెళుతూ.. ‘‘మన సైన్యంతో కలిసి శత్రువుతో యుద్ధం చేయడానికి కొద్ది రోజుల్లోనే సరిహద్దులకు వెళ్లబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ ఆత్మగౌరవాన్ని, దేశ భూభాగాన్ని వదులుకునేది లేదు’’ అని ట్వీట్ పెట్టారు. ఇది ఆమెకు రెండవ విడత శిక్షణ. గత ఆగస్టులో వారం రోజులు యుద్ధ శిక్షణ పొందారు. ఆమెతో పాటు కరాబఖ్ ప్రాంతానికి చెందిన కొంతమంది ఆర్మీనియా యువతులు కూడా శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు పదిహేను మంది మహిళలతో కలిసి ఒక ‘డిటాచ్మెంట్’గా (విడి సేనాదళం) యానా ప్రత్యేక శిక్షణ అందుకుంటున్నారు. గత సెప్టెంబర్ 27 న రెండు దేశాల మధ్య జరిగిన భీకర పోరులో వందలాది మంది మరణించారు. 1994 నుంచీ కరాబఖ్ కోసం ఆర్మీనియా చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలం అవుతూ వస్తోంది. ఏది ఏమైనా నగోర్నో–కరాబఖ్ చేజిక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తన వంతుగా ఇప్పుడు ఆర్మీనియా ప్రధాని సతీమణి యానా కూడా యుద్ధంలోకి దిగారు. ఆమె ఒక్కరే కాదు. ఆ ఇంట్లోంచి మరొకరు కూడా. ఆమె పెద్ద కొడుకు అషాట్ (20). మిగతా ముగ్గురు కూతుళ్లు. వాళ్లు చిన్నపిల్లలు. చదువుల్లో ఉన్నారు. యానా హకోబియాన్ ప్రధాని భార్యే అయినప్పటికీ ‘ప్రథమ మహిళ’గా గౌరవం పొందుతున్నారు. సాధారణంగా దేశాధ్యక్షుల భార్యలకు ప్రథమ మహిళలన్న హోదా ఉంటుంది. ఆర్మీనియాకు అధ్యక్షుడు ఉన్నప్పటికీ, అనధికారికంగా యానాకు మాత్రమే ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఆర్మీనియా’ అనే గుర్తింపు లభించింది! తొలి నుంచీ పాలన నిర్ణయాలను ఆమె ప్రభావితం చేస్తుండటమే అందుకు కారణం కావచ్చు. ఆర్మీనియా రాజధాని పట్టణం ఎరెవాన్లోని ‘ఎరవాన్ స్టేట్ యూనివర్సిటీ’ నుంచి డిగ్రీ చేశారు యానా. తర్వాత జర్నలిస్టుగా స్థిరపడ్డారు. కాలేజ్‌లో పరిచయం అయిన నికోల్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఒక వేడుకగా కాక, ఒక మామూలు కార్యక్రమంలా మాత్రమే జరిగింది. 2012లోనే ఒక పత్రికకు ఎడిటర్‌గా చేరారు యానా. దేశ రాజకీయాలను మలుపు తిప్పడానికి ఆ పత్రికను ఆయుధంగా మలచుకున్నారు. 2018 ‘ఆర్మీనియన్ రివల్యూషన్’లో కీలక పాత్ర పోషించారు. నాటి అధ్యక్షుడు వరుసగా మూడోసారి పదవిలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన శాంతియుతమైన ఆ ప్రజా పోరాటం.. ‘వెల్వెట్ రివల్యూషన్’గా (అహింసా విప్లవం) పేరు పొందింది. యానానే పరోక్షంగా ఆ తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. ఆ పరిణామం తర్వాత అదే ఏడాది ఆమె భర్త ప్రధాని అయ్యారు. 2018 ఆగస్టులో అమెరికన్ పత్రిక ‘ఉమెన్స్ వరల్డ్’ నిర్వహించిన సర్వేలో ‘ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫస్ట్ లేడీ’గా యానా ఎంపిక అయ్యారు. ఇక ఆమె నిరంతరం నడిపించే సేవా కార్యక్రమాలు ఆమె అంతస్సౌందర్యానికి నిదర్శనాలు. -
అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా క్షిపణి దాడులు!
బాకూ(అజర్బైజాన్): ఇరుగు పొరుగు దేశాలైన అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రష్యా చొరవతో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల వ్యవధిలోనే ఉల్లంఘనకు గురైంది. ఆర్మేనియా సైనిక దళాలు తమ దేశంపై క్షిపణి దాడులకు పాల్పడ్డాయని అజర్బైజాన్ ఆదివారం ఆరోపించింది. తమ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం గాంజాలో ఆర్మేనియా జరిపిన క్షిపణి దాడుల్లో 9 మంది పౌరులు మరణించారని, మరో 30 మంది గాయపడ్డారని, ఒక నివాస భవనం ధ్వంసమైందని వెల్లడించింది. మింగచెవిర్ నగరంలోనూ క్షిపణి దాడులు జరిగాయని తెలిపింది. నగొర్నో–కరాబాఖ్ అనే ప్రాంతంపై పట్టుకోసం అజర్బైజాన్, ఆర్మేనియా కత్తులు దూసుకుంటున్నాయి. శతాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్బైజాన్లో ఉన్నప్పటికీ.. దానిపై ఆర్మేనియా ఆధిపత్యం వహిస్తోంది. -
సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ.. ఎదురుకాల్పులు
ఎరెవాన్: వివాదాస్పద నగొర్నొ–కరబక్ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య ఆది, సోమవారాల్లో తీవ్ర ఘర్షణ జరిగింది. ఘర్షణలకు నువ్వంటే నువ్వు కారణమని ఇరు దేశాలు దుమ్మెత్తి పోసుకున్నాయి. దాదాపు చిన్నపాటి యుద్ధాన్ని తలపించే ఈ ఘర్షణల్లో ఇరుపక్షాల్లో కలిపి దాదాపు 20–30 వరకు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. సోమవారం తర్‌తర్ నగరంపై ఆర్మేనియా ఆర్మీ కాల్పులు జరిపిందని అజర్బైజాన్ రక్షణ మంత్రి ఆరోపించారు. ప్రతిగా తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దాదాపు 550 మంది ఆర్మేనియా సైనికులు మరణించారని చెప్పగా ఈ ఆరోపణలను, మరణాలను ఆర్మేనియా తోసిపుచ్చింది. (చదవండి: డ్రాగన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ సిద్ధం!) కాగా ఘర్షణలకు దిగుతున్న ఆర్మేనియా, అజర్బైజాన్ రెండింటితో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఘర్షణపై భారత్ ఆచితూచి స్పందించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య ఎన్నో ఏళ్లుగా నగర్నొ–కబరక్ ప్రాంత ఆధిపత్యంపై ఘర్షణ జరుగుతూనే ఉంది. దట్టమైన అడవులు, పర్వతాలుండే ఈ ప్రాంతం ఇరుదేశాలకు మధ్యన ఉంది. పేరుకు ఈ ప్రాంతం అజర్బైజాన్ ఆధీనంలో ఉన్నట్లు చెబుతున్నా, పాలన రిపబ్లిక్ ఆఫ్ అర్ట్‌సక్ ప్రభుత్వం జరుపుతుంది. -
భారత పురుషుల జట్టుకు చుక్కెదురు
చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు పతకం గెలిచే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. జార్జియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో భారత పురుషుల జట్టు 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోగా... ఇటలీతో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పురుషుల జట్టులో అరోనియన్‌తో ఆనంద్; సర్గిసియాన్‌తో హరికృష్ణ; మెల్కుమ్యాన్‌తో ఆధిబన్ ‘డ్రా’ చేసుకోగా... మర్టిరోసియాన్ చేతిలో శశికిరణ్ ఓడిపోయాడు. మహిళల విభాగంలో జిమినా ఓల్గాతో కోనేరు హంపి; మోవిలెనుతో పద్మిని గేమ్‌లు ‘డ్రా’గా ముగించారు. సెడీనాపై హరిక గెలుపొందగా... బ్రునెలో చేతిలో తానియా ఓటమి చవిచూసింది. తొమ్మిదో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు 15వ స్థానంలో... మహిళల జట్టు 16వ స్థానంలో ఉన్నాయి. -
అర్మేనియా అల్లకల్లోలం
యెరెవాన్: ప్రతిపక్ష నేత సహా ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలతో పశ్చిమ ఆసియా దేశం అర్మేనియా అల్లకల్లలంగా మారింది. వివాదాస్పద 'నాగోర్నో-కరాబఖ్' ప్రాంతంపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య తలెత్తిన వివాదం.. అల్లర్లు, సాయుధపోరుగా మారింది. అధ్యక్షుడు షెర్జ్ సర్గ్ శ్యాన్.. ప్రతిపక్ష నాయకుడైన జిరాయిర్ సెఫిల్యాన్ ను జైలుకు పంపడంతో గొడవలు ముదిరి పాకానపడ్డాయి. శుక్రవారం ఓ పోలీస్ స్టేషన్ కేంద్రంగా భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఇరుపక్షాలకు చెందిన వందలమంది గాయాలపాలయ్యారని అర్మేనియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పోలీస్ స్టేషన్ ఆక్రమణ.. బాంబుల మోత జైలులో ఉన్న ప్రతిపక్ష నేత సెఫిల్యాన్ ను విడుదల చేయాలంటూ ఆయన అనుకూలురైన 40 మంది సాయుధులు.. జులై 17న దేశ రాజధాని యెరెవాన్ లోని ఓ పోలీస్ స్టేషన్ పై దాడిచేసి, పోలీసులను బందీలుగా పట్టుకున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టి కాల్పులు జరుపగా కొందరు సాయుధులు చనిపోయారు. మిగిలవారు గత 13 రోజుల నుంచి అదే పోలీస్ స్టేషన్ లో దాక్కొని...బందీలను ఒక్కొక్కరిగా విడుదల చేశారు. కాగా, శుక్రవారం పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ప్రతిపక్ష పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, భద్రతా బలగాలతో తలపడ్డారు. ఇదే అదనుగా పోలీస్ స్టేషన్ లోని సాయుధులు.. భద్రతా బలగాలపై బాంబులు విసిరారు. ఇటు నుంచి కూడా కాల్పులు జరిగాయి. గంటల తర్వాతగానీ హోరాహోరీ ఘర్షణలు ఆగలేదు. చివరకు 26 మంది అరెస్ట్ అయినట్లు, వందలమంది గాయపడ్డట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ 24 మంది సాయుధులు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. పొరుగుదేశం టర్కీలో సైనిక తిరుగుబాటు విఫలమైన తర్వాత అర్మేనియాలోనూ రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధ సూచనలు పెరుగుతున్నాయి. 'నాగోర్నో-కరాబఖ్'వివాదం.. యూఎస్ఎస్ఆర్ పతనమైన తర్వాత స్వతంత్ర్య దేశాలుగా విడిపోయిన అర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య రావణకాష్ట్రంలా రగులుతున్నది 'నాగోర్నో-కరాబఖ్' వివాదం. ప్రస్తుతం అజర్బైజాన్ దేశంలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతంలో అర్మేనియన్లదే మెజారిటీ. దీంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని అర్మేనియాలోని కొన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ లేవనెత్తాయి. క్రమంగా 'నాగోర్నో-కరాబఖ్'వివాదమే అక్కడి రాజకీయపార్టీల మనుగడకు ప్రధానాంశంగా మారింది. -
కొండంత ఆణిముత్యం!
ఆర్మేనియా నాగరికత తొలి ఆనవాళ్లను కథలు కథలుగా చెప్పే దేశం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత సొంత దారి వెదుక్కొని తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న దేశం... ఆర్మేనియా అనే పేరుకు ఏ అర్థం ఉన్నా... ఆర్మేనియా అంటే ఆణిముత్యంలాంటి దేశం! తూర్పు యూరప్, పశ్చిమ ఆసియాల మధ్య ఉన్న దేశం ఆర్మేనియా. ఈ దేశానికి పశ్చిమంలో టర్కీ, ఉత్తరంలో జార్జియా, తూర్పులో అజర్బైజాన్, దక్షిణంలో ఇరాన్ దేశాలు ఉన్నాయి. భౌగోళికంగా రెండు ఖండాల మధ్య ఉండడం వల్ల ఎన్నో జాతులు ఆర్మేనియాపై దండెత్తాయి. గ్రీకులు, ఒట్టమన్లు, ఇరానీయులు, రష్యన్లు... ఆర్మేనియా ప్రాంతాలపై దండెత్తారు. ఒకప్పుడు సోవియట్ రిపబ్లిక్లో భాగమైన ఆర్మేనియా, సోవియట్ యూనియన్ పతనం తరువాత ‘ఆర్మేనియా రిపబ్లిక్’గా అవతరించింది. పది పరిపాలనా విభాగాలుగా ఆర్మేనియా విభజించబడింది. అవి: 1. అగ్రాట్సన్, 2. అరాత్, 3. అర్మవిర్, 4. జెఘర్కునిక్, 5. కోతక్, 6.లొరి, 7.సిరక్, 8. సియునిక్, 9. తవుష్ 10.వయొత్స్ద్జర్... ఈ విభాగాల నిర్వహణాధికారిని మర్జ్‌పెట్ అంటారు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. యెరెవన్ నగరానికి రాజధాని నగరంగా స్వయంప్రతిపత్తి ఉంది. ఆర్మేనియా రిపబ్లిక్‌గా అవతరించిన తరువాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఉపాధికల్పనలో వ్యవసాయరంగం వాటా పెరిగింది. ఆహారభద్రత పెరిగింది. పర్యాటకరంగంలో ఎన్నో అనుబంధ పరిశ్రమలు వెలిశాయి. పర్యావరణ సంబంధిత అంశాలపై ఆర్మేనియా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. గాలి, నీటి కాలుష్యంపై విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు వినియోగిస్తుంది. ‘నేచర్ ప్రొటెక్షన్’ పేరుతో ఒక మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేసింది. టర్కీ, అజర్బైజాన్ మినహా ప్రపంచంలోని ప్రతి దేశంతో ఆర్మేనియా సత్సంబంధాలను కొనసాగిస్తుంది. ‘ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్’, ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’తో సహా నలభై అంతర్జాతీయ సంస్థలలో ఆర్మేనియాకు సభ్యత్వం ఉంది. ఆర్థిక సంస్కరణల వల్ల ద్రవ్యోల్బణం తగ్గి స్థిరమైన అభివృద్ధి దిశలో సాగిపోతుంది ఆర్మేనియా. టాప్ 10 1. ఆర్మేనియన్ భాషలో దేశం పేరు హయక్. హయక్ అనేది ఆర్మేనియన్ మూల పురుషుడి పేరు. 2. ఆర్మేనియాలోని ‘అపోస్టోలిక్ చర్చి’ ప్రపంచంలోనే పురాతనమైన చర్చి. 3. ‘క్రిస్టియన్ కంట్రీ’గా తనను తాను ప్రకటించుకున్న తొలిదేశం ఆర్మేనియా. 4. రాజధాని యెరెవన్లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒపెరా హౌస్ ఉంది. 5. ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ’గా ఆర్మేనియాకు మంచి పేరు ఉంది. 6. ఆర్మేనియా జాతీయ చిహ్నం మౌంట్ ఆరాత్. అయితే భౌగోళికంగా ఇది టర్కీలో ఉంది. 7. అరస్... ఆర్మేనియాలో పొడవైన నది. 8. రాజధాని నగరం యెరెవన్కి ‘పింక్ సిటీ’ అని పేరు. 9. మద్యం జన్మస్థలం ఆర్మేనియా అని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. 10. ఆర్మేనియాలో అత్యధిక ఆదరణ ఉన్న క్రీడ... మల్లయుద్ధం. దేశం : రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా రాజధాని : యెరెవన్ అధికార భాష : ఆర్మేనియన్ కరెన్సీ : డ్రామ్ జనాభా : 29 లక్షల 99 వేలు (సుమారుగా) అక్షరాస్యత : 99 శాతం -
20 ఏళ్ల తర్వాత రగిలిన చిచ్చు
యెరెవన్: మరోసారి ఆర్మేనియా, అజర్‌బైజానీ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 20 ఏళ్లు దాటిని తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు గుండా ఇరు సైనికులు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో రెండు దేశాల సైనికుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. హెలికాప్టర్లు, ట్యాంకర్లు, రాకెట్ లాంఛర్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 18మంది ఆర్మీనియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 35మందికి పైగా గాయాలపాలయ్యారు. 1994 తర్వాత ఆ రెండు దేశాల మధ్య ఇదే అతిపెద్ద సంఘర్షణ. నిత్యం ఘర్షణకు తావిచ్చే కరాబక్ జోన్ వద్దే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మేనియన్ అధికారులు చెప్పారు. -
ఈ పిల్లి ఇంటర్నెట్లో చిన్నపాటి సెలబ్రిటీ
దీని పేరు ముని.. ప్రస్తుతం ఈ పిల్లి ఇంటర్నెట్లో చిన్నపాటి సెలబ్రిటీ అయి కూర్చుంది. ఏంటి విశేషం అని అనుకుంటున్నారా.. ఓసారి దాని కళ్లవైపు లుక్కేయండి.. మెల్లకన్ను.. ఈ మెల్లకన్నే ఈ మార్జాలానికి పాపులారిటీని తెచ్చిపెట్టింది. అర్మేనియాకు చెందిన అనిహోవ్సెపియన్ దీని యజమాని. రోడ్లపై తిరుగాడుతూ ఉన్న మునిని ఇంటికి తెచ్చి.. అనిహోవ్సెపియన్ పెంచుకున్నారు. మెల్లకన్ను వల్లే దీన్ని ఎవరూ పెంచుకోకుండా రోడ్డుపై వదిలేసి ఉంటారని చెబుతున్నారు. ఈ మధ్య ముని ఫొటోలను దాని యజమాని ఇంటర్నెట్లో పెట్టారు. అంతే.. విపరీతమైన లైకులు, కామెంట్లు. ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. అయితే.. మెల్లకన్ను ఒక విధంగా దీనికి అదృష్టం తెచ్చిపెడితే.. మరోవిధంగా దురదృష్టంగానూ మారిందట. పిల్లులు చేయాల్సిన మెయిన్ పని దీనికి రాదట. అదేనండి ఎలుకలు పట్టడం.. మెల్లకన్ను ఎఫెక్ట్‌కి ఎలుక సరిగ్గా ఎక్కడుందో తెలియక ముని తెగ తికమకపడిపోతుందట. -
పేరులో నేముంది
అర్మేనియా అర్మేనియా... చాలా చిన్నదేశమైనా, పురాతన కాలం నుంచి మనుగడలో ఉన్న దేశం. కనీసం గాలి కూడా చొరబడదేమో అన్నంత ఇదిగా టర్కీ, ఇరాన్, జార్జియా దేశాలు ఆవరించి ఉంటాయి ఈ దేశం చుట్టూ. అంతేకాదు, క్రైస్తవమతాన్ని అధికార మతంగా స్వీకరించిన మొట్ట మొదటి దేశం అర్మేనియానే. అర్మీనా అనే ప్రాచీన పర్షియన్ పదం నుంచి పుట్టింది అర్మేనియా...దీనికే హేక్ అనే మరో పేరు కూడా ఉంది. నోవా సంతతికి చెందిన హేక్ అనే రాజు పాలించిన దేశం కాబట్టి దీనికి హేక్ అనీ, హయస్థాన్ అనీ కూడా పేరు వచ్చింది. అదేవిధంగా హేక్ వంశస్థుడైన అరమ్ అనే రాజు పాలించాడు కాబట్టి అతని పేరు మీదుగా ఈ దేశానికి అర్మేనియా అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర పరిశోధకులు చెబుతారు.