
అజర్‌బైజాన్‌లో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
బాకూ(అజర్‌బైజాన్): ఇరుగు పొరుగు దేశాలైన అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రష్యా చొరవతో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల వ్యవధిలోనే ఉల్లంఘనకు గురైంది. ఆర్మేనియా సైనిక దళాలు తమ దేశంపై క్షిపణి దాడులకు పాల్పడ్డాయని అజర్‌బైజాన్ ఆదివారం ఆరోపించింది. తమ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం గాంజాలో ఆర్మేనియా జరిపిన క్షిపణి దాడుల్లో 9 మంది పౌరులు మరణించారని, మరో 30 మంది గాయపడ్డారని, ఒక నివాస భవనం ధ్వంసమైందని వెల్లడించింది. మింగచెవిర్ నగరంలోనూ క్షిపణి దాడులు జరిగాయని తెలిపింది. నగొర్నో–కరాబాఖ్ అనే ప్రాంతంపై పట్టుకోసం అజర్‌బైజాన్, ఆర్మేనియా కత్తులు దూసుకుంటున్నాయి. శతాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతం భౌగోళికంగా అజర్‌బైజాన్‌లో ఉన్నప్పటికీ.. దానిపై ఆర్మేనియా ఆధిపత్యం వహిస్తోంది.