ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ | PM Nikol Pashinyan Wife Anna Hakobyan Military Training | Sakshi
Sakshi News home page

ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ

Published Thu, Oct 29 2020 2:36 AM | Last Updated on Thu, Oct 29 2020 4:42 AM

PM Nikol Pashinyan Wife Anna Hakobyan Military Training - Sakshi

చేతిలో తుపాకీ ఉంటే ముఖం మీద నవ్వు ఉంటుందా?! యానా హకోబియాన్‌ అంతే.  దేశంలో శాంతి పావురం.  సరిహద్దుల్లో సమర శంఖం. దేశ ప్రధాని సతీమణి ఆమె! నలుగురు పిల్లల తల్లి.  రాబోతున్న యుద్ధం కోసం... సైన్యంలో చేరారు.  శిక్షణ తీసుకుంటున్నారు.  ముఖం మీది నవ్వును చూడకండి.  చేతిలోని తుపాకీని చూడండి.  ఇప్పుడేమనిపిస్తోంది?!

భారత్‌ చైనాల సరిహద్దులో పరిస్థితి ఇప్పుడెంత ఉద్రిక్తంగా ఉందో ఆర్మీనియా, అజర్‌బైజాన్‌ల మధ్య అంతకు మంచిన ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. నెల రోజులుగా ఆ రెండు దేశాలు పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతం అయిన నగోర్నో–కరాబఖ్‌ కోసం వాళ్ల యుద్ధం. అవును, యుద్ధమే! ‘‘వెరీ సీరియస్, ఆర్మీనియన్‌లంతా ఆయుధాలు తియ్యవలసినంత సీరియస్‌’’ అని ఆర్మీనియా ప్రధాని నికోల్‌ పషిన్యాన్‌ తాజాగా ప్రకటన చేశారు! మూడు దశాబ్దాల క్రితం సోవియట్‌ యూనియన్‌ పతనం అవడంతో సొంత దేశాలుగా అవతరించిన రెండు ముక్కలు.. ఆర్మీనియా, అజర్‌బైజాన్‌. ఆర్మీనియా ప్రస్తుతం ఆసియాలో ఉంది. అజర్‌బైజాన్‌ కాస్పియన్‌ సముద్రానికి పశ్చిమాన తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల మధ్య పరచుకుని ఉంది.

ఆర్మీనియా, అజర్‌బైజాన్‌ ఎక్కడ ఉన్నప్పటికీ రెండూ పక్కన  పక్కన ఉన్నాయి. పశ్చిమాన ఆర్మీనియా, తూర్పున అజర్‌బైజాన్‌. వివాద స్థలం నగోర్నో–కరాబఖ్‌ అజర్‌బైజాన్‌ వైపు ఉన్నప్పటికీ అక్కడంతా ఆర్మీనియన్‌లే. అందుకే ఆ ప్రాంతం తమది అని ముప్పైయేళ్లుగా ఆర్మీనియా పోరాడుతోంది. ఎవరు ఉన్నారని కాదు, ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం అని అజర్‌బైజాన్‌. సుమారు 30 వేల మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయిన 1990 ల నాటి యుద్ధాలలో అజర్‌బైజాన్‌ రాజధాని  బకు నుంచి కరాబఖ్‌ ప్రావిన్స్‌ విడిపోయింది. దానిని నిలుపుకునేందుకు ఇప్పుడు అజర్‌బైజాన్‌ అంతిమ పోరాటానికి సిద్ధం అయింది. 
∙∙ 
‘వెరీ సీరియస్‌’ అని ఆర్మీనియా ప్రధాని ప్రకటించాక మొదట యుద్ధ రంగంలోకి దుమికింది ఆయన భార్య యానా హకోబియాన్‌! ఫ్రంట్‌ లైన్‌ సైనికురాలిగా శిక్షణ తీసుకునేందుకు ఆమె మిలటరీలో చేరారు. యానా వయసు 42 సంవత్సరాలు. నలుగురు పిల్లల తల్లి. దేశంలో అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన ‘ఆర్మీనియన్‌ టైమ్స్‌’ పత్రికకు ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌. మంగళవారం మిలటరీ ట్రైనింగ్‌కి వెళుతూ.. ‘‘మన సైన్యంతో కలిసి శత్రువుతో యుద్ధం చేయడానికి కొద్ది రోజుల్లోనే సరిహద్దులకు వెళ్లబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ ఆత్మగౌరవాన్ని, దేశ భూభాగాన్ని వదులుకునేది లేదు’’ అని ట్వీట్‌ పెట్టారు. ఇది ఆమెకు రెండవ విడత శిక్షణ. గత ఆగస్టులో వారం రోజులు యుద్ధ శిక్షణ పొందారు. ఆమెతో పాటు కరాబఖ్‌ ప్రాంతానికి చెందిన కొంతమంది ఆర్మీనియా యువతులు కూడా శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు పదిహేను మంది మహిళలతో కలిసి ఒక ‘డిటాచ్‌మెంట్‌’గా (విడి సేనాదళం) యానా ప్రత్యేక శిక్షణ అందుకుంటున్నారు. గత సెప్టెంబర్‌ 27 న రెండు దేశాల మధ్య జరిగిన భీకర పోరులో వందలాది మంది మరణించారు. 1994 నుంచీ కరాబఖ్‌ కోసం ఆర్మీనియా చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలం అవుతూ వస్తోంది. ఏది ఏమైనా నగోర్నో–కరాబఖ్‌ చేజిక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తన వంతుగా ఇప్పుడు ఆర్మీనియా ప్రధాని సతీమణి యానా కూడా యుద్ధంలోకి దిగారు. ఆమె ఒక్కరే కాదు. ఆ ఇంట్లోంచి మరొకరు కూడా. ఆమె పెద్ద కొడుకు అషాట్‌ (20). మిగతా ముగ్గురు కూతుళ్లు. వాళ్లు చిన్నపిల్లలు. చదువుల్లో ఉన్నారు. 

యానా హకోబియాన్‌ ప్రధాని భార్యే అయినప్పటికీ ‘ప్రథమ మహిళ’గా గౌరవం పొందుతున్నారు. సాధారణంగా దేశాధ్యక్షుల భార్యలకు ప్రథమ మహిళలన్న హోదా ఉంటుంది. ఆర్మీనియాకు అధ్యక్షుడు ఉన్నప్పటికీ, అనధికారికంగా యానాకు మాత్రమే ‘ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ఆర్మీనియా’ అనే గుర్తింపు లభించింది! తొలి నుంచీ పాలన నిర్ణయాలను ఆమె ప్రభావితం చేస్తుండటమే అందుకు కారణం కావచ్చు. ఆర్మీనియా రాజధాని పట్టణం ఎరెవాన్‌లోని ‘ఎరవాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ’ నుంచి డిగ్రీ చేశారు యానా. తర్వాత జర్నలిస్టుగా స్థిరపడ్డారు. కాలేజ్‌లో పరిచయం అయిన నికోల్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఒక వేడుకగా కాక, ఒక మామూలు కార్యక్రమంలా మాత్రమే జరిగింది. 2012లోనే ఒక పత్రికకు ఎడిటర్‌గా చేరారు యానా.

దేశ రాజకీయాలను మలుపు తిప్పడానికి ఆ పత్రికను ఆయుధంగా మలచుకున్నారు. 2018 ‘ఆర్మీనియన్‌ రివల్యూషన్‌’లో కీలక పాత్ర పోషించారు. నాటి అధ్యక్షుడు వరుసగా మూడోసారి పదవిలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన శాంతియుతమైన ఆ ప్రజా పోరాటం.. ‘వెల్వెట్‌ రివల్యూషన్‌’గా (అహింసా విప్లవం) పేరు పొందింది. యానానే పరోక్షంగా ఆ తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. ఆ పరిణామం తర్వాత అదే ఏడాది ఆమె భర్త ప్రధాని అయ్యారు. 2018 ఆగస్టులో అమెరికన్‌ పత్రిక ‘ఉమెన్స్‌ వరల్డ్‌’ నిర్వహించిన సర్వేలో ‘ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఫస్ట్‌ లేడీ’గా యానా ఎంపిక అయ్యారు. ఇక ఆమె నిరంతరం నడిపించే సేవా కార్యక్రమాలు ఆమె అంతస్సౌందర్యానికి నిదర్శనాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement