Military training
-
యుద్ధ ట్యాంక్‌ను నడిపిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా ట్యాంకును నడిపారు. బుధవారం ఆయన దేశ సైనిక దళాల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. యుద్ధానికి సిద్ధం అయ్యేందుకు పెద్ద ప్రయత్నాలు చేయాలని సేనలకు పిలుపునిచ్చారు. అధికార వార్తా సంస్థ(కేసీఎన్ఏ) గురువారం ఈ విషయం వెల్లడించింది. పొరుగుదేశం దక్షిణ కొరియా, అమెరికా 11 రోజులుగా కొనసాగిస్తున్న భారీ సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. అందుకు బదులుగా అన్నట్లు కిమ్ యుద్ధ ట్యాంకుల పోరాట సన్నద్ధతను పరిశీలించారు. -
మా ఆర్మీకి శిక్షణ ఇవ్వండి
మిన్స్క్: రష్యాలో స్వల్పకాలిక తిరుగుబాటు విఫలయత్నం అనంతరం తమ దేశానికి చేరుకున్న వాగ్నర్ గ్రూప్‌నకు బెలారస్ అధ్యక్షుడు ఓ ఆఫర్ ఇచ్చారు. తమ దేశ మిలటరీకి శిక్షణ ఇవ్వాలంటూ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్‌ను అధ్యక్షుడు లుకషెంకో కోరారు. ‘ఇక్కడికి వచ్చి మన సైన్యానికి యుద్ధ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని వాగ్నర్ గ్రూప్‌ను కోరాం. వారి అనుభవం మాకెంతో అవసరం’అని ఆయన అన్నట్లు అధికార వార్తా సంస్థ బెల్టా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పోరాడుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్న వాగ్నర్ గ్రూప్‌ను పశి్చమదేశాలు ద్వేషిస్తున్నాయన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో ప్రపంచ సైనిక–రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోందని హెచ్చరించారు. దీనిని పరిష్కరించడానికి చర్చల అవసరాన్ని పశి్చమదేశాలు గుర్తించడం లేదని విమర్శించారు. పోలెండ్ మరో ఉక్రెయిన్ మాదిరిగా మారబోతోందని, ఆ దేశానికి ఈయూ, అమెరికా ఆయుధాలు అందిస్తున్నాయని ఆరోపించారు. -
ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ
చేతిలో తుపాకీ ఉంటే ముఖం మీద నవ్వు ఉంటుందా?! యానా హకోబియాన్ అంతే. దేశంలో శాంతి పావురం. సరిహద్దుల్లో సమర శంఖం. దేశ ప్రధాని సతీమణి ఆమె! నలుగురు పిల్లల తల్లి. రాబోతున్న యుద్ధం కోసం... సైన్యంలో చేరారు. శిక్షణ తీసుకుంటున్నారు. ముఖం మీది నవ్వును చూడకండి. చేతిలోని తుపాకీని చూడండి. ఇప్పుడేమనిపిస్తోంది?! భారత్ చైనాల సరిహద్దులో పరిస్థితి ఇప్పుడెంత ఉద్రిక్తంగా ఉందో ఆర్మీనియా, అజర్బైజాన్ల మధ్య అంతకు మంచిన ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. నెల రోజులుగా ఆ రెండు దేశాలు పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నాయి. సరిహద్దు ప్రాంతం అయిన నగోర్నో–కరాబఖ్ కోసం వాళ్ల యుద్ధం. అవును, యుద్ధమే! ‘‘వెరీ సీరియస్, ఆర్మీనియన్లంతా ఆయుధాలు తియ్యవలసినంత సీరియస్’’ అని ఆర్మీనియా ప్రధాని నికోల్ పషిన్యాన్ తాజాగా ప్రకటన చేశారు! మూడు దశాబ్దాల క్రితం సోవియట్ యూనియన్ పతనం అవడంతో సొంత దేశాలుగా అవతరించిన రెండు ముక్కలు.. ఆర్మీనియా, అజర్బైజాన్. ఆర్మీనియా ప్రస్తుతం ఆసియాలో ఉంది. అజర్బైజాన్ కాస్పియన్ సముద్రానికి పశ్చిమాన తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియాల మధ్య పరచుకుని ఉంది. ఆర్మీనియా, అజర్బైజాన్ ఎక్కడ ఉన్నప్పటికీ రెండూ పక్కన పక్కన ఉన్నాయి. పశ్చిమాన ఆర్మీనియా, తూర్పున అజర్బైజాన్. వివాద స్థలం నగోర్నో–కరాబఖ్ అజర్బైజాన్ వైపు ఉన్నప్పటికీ అక్కడంతా ఆర్మీనియన్లే. అందుకే ఆ ప్రాంతం తమది అని ముప్పైయేళ్లుగా ఆర్మీనియా పోరాడుతోంది. ఎవరు ఉన్నారని కాదు, ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం అని అజర్బైజాన్. సుమారు 30 వేల మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయిన 1990 ల నాటి యుద్ధాలలో అజర్బైజాన్ రాజధాని బకు నుంచి కరాబఖ్ ప్రావిన్స్ విడిపోయింది. దానిని నిలుపుకునేందుకు ఇప్పుడు అజర్బైజాన్ అంతిమ పోరాటానికి సిద్ధం అయింది. ∙∙ ‘వెరీ సీరియస్’ అని ఆర్మీనియా ప్రధాని ప్రకటించాక మొదట యుద్ధ రంగంలోకి దుమికింది ఆయన భార్య యానా హకోబియాన్! ఫ్రంట్ లైన్ సైనికురాలిగా శిక్షణ తీసుకునేందుకు ఆమె మిలటరీలో చేరారు. యానా వయసు 42 సంవత్సరాలు. నలుగురు పిల్లల తల్లి. దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ‘ఆర్మీనియన్ టైమ్స్’ పత్రికకు ఎడిటర్–ఇన్–చీఫ్. మంగళవారం మిలటరీ ట్రైనింగ్‌కి వెళుతూ.. ‘‘మన సైన్యంతో కలిసి శత్రువుతో యుద్ధం చేయడానికి కొద్ది రోజుల్లోనే సరిహద్దులకు వెళ్లబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ ఆత్మగౌరవాన్ని, దేశ భూభాగాన్ని వదులుకునేది లేదు’’ అని ట్వీట్ పెట్టారు. ఇది ఆమెకు రెండవ విడత శిక్షణ. గత ఆగస్టులో వారం రోజులు యుద్ధ శిక్షణ పొందారు. ఆమెతో పాటు కరాబఖ్ ప్రాంతానికి చెందిన కొంతమంది ఆర్మీనియా యువతులు కూడా శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు పదిహేను మంది మహిళలతో కలిసి ఒక ‘డిటాచ్మెంట్’గా (విడి సేనాదళం) యానా ప్రత్యేక శిక్షణ అందుకుంటున్నారు. గత సెప్టెంబర్ 27 న రెండు దేశాల మధ్య జరిగిన భీకర పోరులో వందలాది మంది మరణించారు. 1994 నుంచీ కరాబఖ్ కోసం ఆర్మీనియా చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలం అవుతూ వస్తోంది. ఏది ఏమైనా నగోర్నో–కరాబఖ్ చేజిక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తన వంతుగా ఇప్పుడు ఆర్మీనియా ప్రధాని సతీమణి యానా కూడా యుద్ధంలోకి దిగారు. ఆమె ఒక్కరే కాదు. ఆ ఇంట్లోంచి మరొకరు కూడా. ఆమె పెద్ద కొడుకు అషాట్ (20). మిగతా ముగ్గురు కూతుళ్లు. వాళ్లు చిన్నపిల్లలు. చదువుల్లో ఉన్నారు. యానా హకోబియాన్ ప్రధాని భార్యే అయినప్పటికీ ‘ప్రథమ మహిళ’గా గౌరవం పొందుతున్నారు. సాధారణంగా దేశాధ్యక్షుల భార్యలకు ప్రథమ మహిళలన్న హోదా ఉంటుంది. ఆర్మీనియాకు అధ్యక్షుడు ఉన్నప్పటికీ, అనధికారికంగా యానాకు మాత్రమే ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఆర్మీనియా’ అనే గుర్తింపు లభించింది! తొలి నుంచీ పాలన నిర్ణయాలను ఆమె ప్రభావితం చేస్తుండటమే అందుకు కారణం కావచ్చు. ఆర్మీనియా రాజధాని పట్టణం ఎరెవాన్లోని ‘ఎరవాన్ స్టేట్ యూనివర్సిటీ’ నుంచి డిగ్రీ చేశారు యానా. తర్వాత జర్నలిస్టుగా స్థిరపడ్డారు. కాలేజ్‌లో పరిచయం అయిన నికోల్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఒక వేడుకగా కాక, ఒక మామూలు కార్యక్రమంలా మాత్రమే జరిగింది. 2012లోనే ఒక పత్రికకు ఎడిటర్‌గా చేరారు యానా. దేశ రాజకీయాలను మలుపు తిప్పడానికి ఆ పత్రికను ఆయుధంగా మలచుకున్నారు. 2018 ‘ఆర్మీనియన్ రివల్యూషన్’లో కీలక పాత్ర పోషించారు. నాటి అధ్యక్షుడు వరుసగా మూడోసారి పదవిలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన శాంతియుతమైన ఆ ప్రజా పోరాటం.. ‘వెల్వెట్ రివల్యూషన్’గా (అహింసా విప్లవం) పేరు పొందింది. యానానే పరోక్షంగా ఆ తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. ఆ పరిణామం తర్వాత అదే ఏడాది ఆమె భర్త ప్రధాని అయ్యారు. 2018 ఆగస్టులో అమెరికన్ పత్రిక ‘ఉమెన్స్ వరల్డ్’ నిర్వహించిన సర్వేలో ‘ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫస్ట్ లేడీ’గా యానా ఎంపిక అయ్యారు. ఇక ఆమె నిరంతరం నడిపించే సేవా కార్యక్రమాలు ఆమె అంతస్సౌందర్యానికి నిదర్శనాలు. -
నవంబర్ 23 నుంచి సూర్యలంకలో మిలిటరీ శిక్షణ
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో వచ్చే నెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు 12 రోజుల పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో మిలిటరీ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తున్నట్లు సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఫైరింగ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆరు నుంచి ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్‌లు ఇందులో పాల్గొననున్నాయి. శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే సూర్యలంక చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ప్రమాదకర ప్రాంతంగా పేర్కొంటూ ప్రవీణ్ ప్రకాశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ధోని.. సైన్యంలో చేరిపోయాడు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన రెండు నెలల సైనిక శిక్షణను ప్రారంభించాడు. పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని... బెంగళూరులోని బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశాడు. అతడు ఈ నెల 31 నుంచి ఆగస్ట్ 19 వరకు బెటాలియన్‌తో ఉంటాడు. విక్టర్ ఫోర్స్‌లో భాగంగా దీని యూనిట్ కశ్మీర్ లోయలో విధులు నిర్వర్తిస్తోంది. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని... పహారా, గార్డ్, సెంట్రీ పోస్ట్, దళంలో భాగమవడం తదితర బాధ్యతలు చేపడతాడు. ‘ధోనిలాంటి భారత క్రికెట్ దిగ్గజం తీసుకున్న నిర్ణయం.. దేశ యువతలో సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది. అతడు కోరుకునేది కూడా అదే’ అని ఓ అధికారి తెలిపాడు. వైమానిక దళ విమానం నుంచి ఐదు పారాచూట్ జంపింగ్‌లు చేయడం ద్వారా ధోని 2015లోనే పారాట్రూపర్‌గా అర్హత సాధించాడు. -
అఫ్గాన్‌లో మరో ఉగ్రదాడి..11 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఓ సైనిక శిక్షణా కేంద్రానికి కాపలాగా ఉన్నవారిపై దాడి చేసి 11 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటిం చింది. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారు. వారిలో ఇద్దరు ఆత్మాహుతి చేసుకోగా మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నామని అఫ్గాన్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. -
స్టెత్ పోయి తుపాకీ వచ్చె...
యుద్ధ క్షేత్రం డాక్టర్ కాబోయి యాక్టర్నయ్యాననే మాట చాలా సందర్భాల్లో వింటుంటాం. డాక్టర్ని కాబోయి సోల్జర్నయ్యానని చెప్పగలిగింది బహుశా ఈయనే కావొచ్చు. అలాంటి కల్నల్ పి.ప్రసాద్ అనుభవాలు ఈవారం... విజయవాడలో పుట్టాను. పదహారో ఏట జబల్పూర్ వెళ్లాను. అది నా గమ్యాన్ని మార్చేసింది. నిజానికి నేను వెళ్లింది మెడికల్ సీటు కోసం. అక్కడ మెడిసన్ సీటు సులభం అని వెళ్లిన వాణ్ణి కాస్తా అక్కడ ఆర్మీ ఉద్యోగాలను చూసి ప్రభావితుణ్ణయ్యాను. అలా 1966లో ఆర్టిలరీ విభాగంలో చేరి, 1998లో కల్నల్‌గా రిటైర్ అయ్యే వరకు సంతోషంగా ఉద్యోగం చేశాను. నా మొదటి పోస్టింగ్ అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ‘సెలా టాప్’. ఆ సమయంలో ప్రభుత్వం సైనిక శిక్షణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతకు నాలుగేళ్ల ముందు భారత్- చైనా యుద్ధంలో మన వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల మన సరిహద్దు ప్రదేశాలు, ప్రత్యర్థులు దాడి చేయడానికి అవకాశం ఉన్న పాయింట్ల మీద క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. భారత్- చైనా సరిహద్దులో ఉన్న కొండలన్నీ ఎక్కించారు. ఒక్కొక్కటి పదిహేను- పదహారు వేల అడుగుల ఎత్తు! సైనికులకు ఆర్మీతో అనుబంధం పెరిగే విధంగా పాఠాలుండేవి. దేశ ప్రయోజనాలే ప్రధానంగా మాట్లాడడం, సైనిక దళాలకు ఆదేశాలిస్తూ నడిపించడం ప్రధానంగా ఉండాలి. వ్యక్తిగత సౌకర్యం, వ్యక్తిగత సమస్యల గురించి ప్రస్తావించడం మూడవ అంశంగా ఉండాలని చెప్పేవారు. ఒకసారి నా ఒన్ టన్నర్ వాహనం రెండు వేల అడుగుల లోయలో పడబోయి ఆగింది. తృటిలో ప్రమాదం తప్పింది. అప్పుడు కూడా డ్యూటీ గురించి తప్ప మా ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచనే రాలేదు. పాకిస్తాన్ 1971 తర్వాత తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండేది. అప్పుడు గుజరాత్‌లోని బరోడా నుంచి రాజస్థాన్‌లోని జైసల్మేర్ వరకు 650 కిలోమీటర్ల దూరం భారీ ప్రదర్శన చేపట్టాం. దాడిని ఎదుర్కోవడమే కాదు, దాడి చేయగల సత్తా మా దేశానికి ఉందని హెచ్చరిక జారీ చేయడమది! శ్రీనగర్‌లో రోడ్ ట్రాఫిక్ కంట్రోల్ నా ఆధీనంలో ఉండేది. అప్పుడు నాకు పిల్లలతో అనుబంధం ఏర్పడింది. అక్కడి సామాజిక, రాజకీయ కారణాల దృష్ట్యా రెండేళ్లుగా పరీక్షలు జరగలేదు. ఆ ఏడాది కూడా సాంకేతిక అంతరాయం వల్ల పరీక్ష హాలుకు చేరలేని పరిస్థితి. ఏడాది వృథా అవుతుందేమోనని పిల్లలు బిక్కముఖాలతో ఉన్నారు. ఆర్మీ కాన్వాయ్‌తో పిల్లలను బాదామి కంటోన్మెంట్ దాటించాను. అప్పట్లో సియాచిన్ గ్లేసియర్ స్టాక్స్ తరలించే బాధ్యత నాదే. ఒక్కసారిగా వరుసకు 500 వాహనాలు ప్రయాణించాలి. ఈ ప్రణాళికలో ఏ మాత్రం తేడా వచ్చినా అటు వైపు నుంచి మరో 500 వాహనాల రాకకు అంతరాయం కలుగుతుంది. ఇంత భారీగా ఎందుకంటే... ఏడాదికి సరిపడిన సరుకు (ఆహారం, నీరు, ఎనర్జీ పౌడర్, బొగ్గు, ఆయిల్, యుద్ధసామగ్రి లాంటివి) అంతటినీ మూడు నెలల కాలంలోనే తరలించాలి. మంచుతో రహదారులు మూసుకుపోయాయంటే సరుకులను హెలికాప్టర్ ద్వారా తరలించాల్సిందే. అలా తరలిస్తే ఒక కోడి గుడ్డు రవాణాకి అరవై రూపాయలు ఖర్చవుతుంది. కార్గిల్ మీదుగా వెళ్లాల్సిన ఈ వాహనాలను అదుపు చేయగలిగితే సియాచిన్ గ్లేసియర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం సులువవుతుందని పాక్ ఓ కన్నేసి ఉంటుంది. అన్నేళ్లలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా రవాణా నిర్వహించిన అధికారిగా ఇప్పటికీ గర్వపడతాను. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి manjula.features@sakshi.com ఫొటో: రాజేశ్ ఆ పిలుపు కోసం... దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించి పదిలక్షల మంది పిల్లలను చైతన్యవంతం చేశాను. నీటి నిర్వహణ, దేశభక్తి, సృజనాత్మకత పెంచే కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని బయటకు తీయాలని చెప్పే ‘కిడ్ ద గ్రేట్’ అనే రేడియో కార్యక్రమం చేశాను. ‘కల్నల్ అంకుల్’ అనే చిన్నారి పిలుపు కోసం మా పిల్లలు అమెరికాలో సెటిలైనప్పటికీ నేను ఇండియాలోనే ఉంటున్నాను. - కల్నల్ పి.ప్రసాద్ -
బూట్ ఫర్ బెనిఫిట్
సెంట్రల్ ఏసీ... మోడ్రన్ ఎక్విప్మెంట్, చెమటలు పట్టిన శరీరం నుంచి వచ్చే స్మెల్, నియంత్రించేందుకు ఉపయోగించే ఆర్టిఫిషియల్ పరిమళం... వీటి నుంచి ఉపశమనం కలిగిస్తూ అందుబాటులోకి వచ్చినవే బూట్ క్యాంప్స్. నాలుగు గోడల మధ్య కన్నా గాలి, వెలుతురుధారాళంగా ఉండే చోటే ఎక్సర్సైజ్కు సరైన నెలవని భావిస్తున్నారు సిటీజనులు. కాళ్లకు బూట్లు తొడుక్కొని పచ్చదనం పరుచుకున్న ప్రదేశాల్లో ప్రత్యక్షం అవుతున్నారు. క్యాహై ‘క్యాంప్’? సైనిక శిక్షణలో భాగంగా అమెరికాలో ప్రారంభమైన బూట్‌క్యాంప్ యాక్టివిటీ.. దేహాన్ని కొన్ని క్లిష్టమైన పరిస్థితులకు, పరిసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించినది. కామన్ పబ్లిక్ దీనికి చేరువ కావడానికి కారణం.. ఇది సమూహంతో కలసి చేసే ఓపెన్ ఎయిర్ వర్కవుట్ కావడమే. సిటీలో పార్క్‌లు.. స్పేసియస్ గ్రౌండ్స్.. అవుట్ కట్స్‌లో కొండ గుట్టలు ఈ బూట్క్యాంప్స్కు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఫిట్నెస్ కోసం తపిస్తున్న సిటీవాసులు.. ప్రకృతి ఒడిలో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ బూట్‌క్యాంప్ మంత్రాన్ని పఠిస్తున్నారు. వెయిట్ నిల్.. ఎనర్జీ ఫుల్.. ఈ బూట్‌క్యాంప్‌లో వయసు, ఫిట్నెస్ స్థాయిల వారీగా బృందాలను విభజిస్తారు. ఆయా బృందాలకు తగ్గట్టుగా ఫిట్నెస్ ఫార్ములా రూపొందిస్తారు. వారి సామర్థ్యాలకు అనుగుణంగా పరికరాలు సమకూరుస్తారు. ఇందులో బాడీ వెయిట్ తగ్గించే వ్యాయామాలకే ఫ్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాకింగ్‌తో మొదలయ్యే బూట్‌క్యాంప్ వ్యాయామం.. స్ట్రెచ్ లేదా యోగా భంగిమలతో పూర్తవుతుంది. ఈ మధ్యలో విభిన్న రకాలుగా చేసే పుషప్స్, జంపింగ్ జాక్స్, ట్విస్టింగ్, క్రాస్ జాక్స్, ఫ్రంట్ జాక్స్, డక్ వాక్, టైగర్ వాక్, క్రొకడైల్ వాక్, క్రాబ్ వాక్, రన్నింగ్, జాగింగ్, స్ప్రింటింగ్.. ఇలా సరికొత్త థీమ్స్‌తో వర్కవుట్స్ చేయిస్తారు. ఈ వ్యాయామంలో భాగంగా కోన్స్, స్విస్బాల్స్, ఫ్లోర్నెట్స్, క్లైంబర్ నెట్స్, చాపింగ్ స్టిక్స్, రెసిస్టెన్స్ ట్యూబ్స్, హ్యామర్స్, బ్యాగ్స్ వంటి పరికరాలను సైతం వినియోగిస్తారు. ఈ శిబిరాల్లో ఆర్గానిక్ ఫుడ్ అందిస్తారు. వీటిలో హెల్త్-ఫిట్నెస్ సెషన్స్ కూడా భాగమే. ఆరోగ్యమే.. బెని‘ఫిట్’ ఈ తరహా బూట్ క్యాంప్‌లను నిర్వహించడానికి నగరానికి చెందిన కార్పొరేట్ కంపెనీలు బాగా ఆసక్తి చూపిస్తున్నాయని వావ్ ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకురాలు పూర్ణిమారావు అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని, పనిలో చురుకుదనాన్ని ఆశిస్తున్న కంపెనీలు.. వారి కోసం బూట్క్యాంప్స్ను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. ఈ క్యాంప్‌ల నిర్వహణ కోసం విశాల ప్రాంగణాలను కూడా నిర్వాహకులు అద్దెకు తీసుకుంటున్నారు. అనుభవ జ్ఞులైన ఫిట్నెస్ ట్రైనర్స్, ఫిజియో థెరపిస్ట్, డైటీషియన్.. వంటి నిపుణుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో పిక్నిక్లా ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుండడంతో బూట్‌క్యాంప్‌లకు సిటీలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. హ్యాపీనెస్.. ఎక్సర్సైజ్లకు ఎక్కువ స్పేస్ దొరుకుతూ, టైర్డ్‌గా అనిపించకపోవడం, డిఫరెంట్ టైప్ వర్కవుట్స్‌తో పాటు ఫన్నీగేమ్స్, క్లీన్ వెదర్ బూట్‌క్యాంప్‌ల ప్రత్యేకత. మా ఫిట్నెస్ స్టూడియో ఆధ్వర్యంలో వారానికి రెండు సార్లయినా ఈ తరహా క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. వీటి వల్ల ఫిట్నెస్తో పాటు హ్యాపీనెస్ కూడా అదనంగా దొరుకుతుంది. - పూర్ణిమారావు, వావ్ ఫిట్నెస్ స్టూడియో