స్టెత్ పోయి తుపాకీ వచ్చె...
యుద్ధ క్షేత్రం
డాక్టర్ కాబోయి యాక్టర్‌నయ్యాననే మాట చాలా సందర్భాల్లో వింటుంటాం. డాక్టర్‌ని కాబోయి సోల్జర్‌నయ్యానని చెప్పగలిగింది బహుశా ఈయనే కావొచ్చు. అలాంటి కల్నల్ పి.ప్రసాద్
అనుభవాలు ఈవారం...
విజయవాడలో పుట్టాను. పదహారో ఏట జబల్‌పూర్ వెళ్లాను. అది నా గమ్యాన్ని మార్చేసింది. నిజానికి నేను వెళ్లింది మెడికల్ సీటు కోసం.
అక్కడ మెడిసన్ సీటు సులభం అని వెళ్లిన వాణ్ణి కాస్తా అక్కడ ఆర్మీ ఉద్యోగాలను చూసి ప్రభావితుణ్ణయ్యాను. అలా 1966లో ఆర్టిలరీ విభాగంలో చేరి, 1998లో కల్నల్‌గా రిటైర్ అయ్యే వరకు సంతోషంగా ఉద్యోగం చేశాను.
నా మొదటి పోస్టింగ్ అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ‘సెలా టాప్’. ఆ సమయంలో ప్రభుత్వం సైనిక శిక్షణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతకు నాలుగేళ్ల ముందు భారత్- చైనా యుద్ధంలో మన వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల మన సరిహద్దు ప్రదేశాలు, ప్రత్యర్థులు దాడి చేయడానికి అవకాశం ఉన్న పాయింట్ల మీద క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. భారత్- చైనా సరిహద్దులో ఉన్న కొండలన్నీ ఎక్కించారు. ఒక్కొక్కటి పదిహేను- పదహారు వేల అడుగుల ఎత్తు! సైనికులకు ఆర్మీతో అనుబంధం పెరిగే విధంగా పాఠాలుండేవి. దేశ ప్రయోజనాలే ప్రధానంగా మాట్లాడడం, సైనిక దళాలకు ఆదేశాలిస్తూ నడిపించడం ప్రధానంగా ఉండాలి. వ్యక్తిగత సౌకర్యం, వ్యక్తిగత సమస్యల గురించి ప్రస్తావించడం మూడవ అంశంగా ఉండాలని చెప్పేవారు.
ఒకసారి నా ఒన్ టన్నర్ వాహనం రెండు వేల అడుగుల లోయలో పడబోయి ఆగింది. తృటిలో ప్రమాదం తప్పింది. అప్పుడు కూడా డ్యూటీ గురించి తప్ప మా ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచనే రాలేదు. పాకిస్తాన్ 1971 తర్వాత తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండేది. అప్పుడు గుజరాత్‌లోని బరోడా నుంచి రాజస్థాన్‌లోని జైసల్మేర్ వరకు 650 కిలోమీటర్ల దూరం భారీ ప్రదర్శన చేపట్టాం. దాడిని ఎదుర్కోవడమే కాదు, దాడి చేయగల సత్తా మా దేశానికి ఉందని హెచ్చరిక జారీ చేయడమది!
శ్రీనగర్‌లో రోడ్ ట్రాఫిక్ కంట్రోల్ నా ఆధీనంలో ఉండేది. అప్పుడు నాకు పిల్లలతో అనుబంధం ఏర్పడింది. అక్కడి సామాజిక, రాజకీయ కారణాల దృష్ట్యా రెండేళ్లుగా పరీక్షలు జరగలేదు. ఆ ఏడాది కూడా సాంకేతిక అంతరాయం వల్ల పరీక్ష హాలుకు చేరలేని పరిస్థితి. ఏడాది వృథా అవుతుందేమోనని పిల్లలు బిక్కముఖాలతో ఉన్నారు. ఆర్మీ కాన్వాయ్‌తో పిల్లలను బాదామి కంటోన్మెంట్ దాటించాను.
అప్పట్లో సియాచిన్ గ్లేసియర్ స్టాక్స్ తరలించే బాధ్యత నాదే. ఒక్కసారిగా వరుసకు 500 వాహనాలు ప్రయాణించాలి. ఈ ప్రణాళికలో ఏ మాత్రం తేడా వచ్చినా అటు వైపు నుంచి మరో 500 వాహనాల రాకకు అంతరాయం కలుగుతుంది. ఇంత భారీగా ఎందుకంటే... ఏడాదికి సరిపడిన సరుకు (ఆహారం, నీరు, ఎనర్జీ పౌడర్, బొగ్గు, ఆయిల్, యుద్ధసామగ్రి లాంటివి) అంతటినీ మూడు నెలల కాలంలోనే తరలించాలి. మంచుతో రహదారులు మూసుకుపోయాయంటే సరుకులను హెలికాప్టర్ ద్వారా తరలించాల్సిందే. అలా తరలిస్తే ఒక కోడి గుడ్డు రవాణాకి అరవై రూపాయలు ఖర్చవుతుంది. కార్గిల్ మీదుగా వెళ్లాల్సిన ఈ వాహనాలను అదుపు చేయగలిగితే సియాచిన్ గ్లేసియర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం సులువవుతుందని పాక్ ఓ కన్నేసి ఉంటుంది. అన్నేళ్లలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా రవాణా నిర్వహించిన అధికారిగా ఇప్పటికీ గర్వపడతాను.
రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి
manjula.features@sakshi.com
ఫొటో: రాజేశ్
ఆ పిలుపు కోసం...
దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించి పదిలక్షల మంది పిల్లలను చైతన్యవంతం చేశాను. నీటి నిర్వహణ, దేశభక్తి, సృజనాత్మకత పెంచే కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. దానిని బయటకు తీయాలని చెప్పే ‘కిడ్ ద గ్రేట్’ అనే రేడియో కార్యక్రమం చేశాను. ‘కల్నల్ అంకుల్’ అనే చిన్నారి పిలుపు కోసం మా పిల్లలు అమెరికాలో సెటిలైనప్పటికీ నేను ఇండియాలోనే ఉంటున్నాను.
- కల్నల్ పి.ప్రసాద్