గెలుపును చూసిన కళ్లు | BLK reddy talks about his career while on india pakistan's world war | Sakshi
Sakshi News home page

గెలుపును చూసిన కళ్లు

Published Sun, Apr 12 2015 1:17 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

గెలుపును చూసిన కళ్లు - Sakshi

గెలుపును చూసిన కళ్లు

యుద్ధ క్షేత్రం: కెప్టెన్ బీఎల్‌కే రెడ్డిది వ్యవసాయ కుటుంబం. హెలికాప్టర్‌ను నడిపిన అనుభవం. నాటి భారత విజయంతో ఉప్పొంగిన ఉత్సాహం నేటికీ ఆ కళ్లలో... కనిపిస్తూనే ఉంది ఆయన మాటల్లో ధ్వనిస్తూనే ఉంది.
 
‘‘అది 1971వ సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతోంది. మాకు తూర్పు పాకిస్తాన్ సరిహద్దులో డ్యూటీ వేశారు. మన సైనికులను 15 హెలికాప్టర్లలో మేఘన నది అవతలికి దాటించాలి. నా హెలికాప్టర్‌లో మూడు ట్రిప్పులు తరలించాను. ల్యాండింగ్ సమయంలో ప్రత్యర్థి దళాలు కాల్పులు జరిపాయి. అప్పుడు సమయం తెల్లవారు జామున నాలుగు గంటలు. టేకాఫ్ అయిన ఇరవై నిమిషాల్లో మంటలు ఇంధనం ట్యాంకుకు చేరాయి. పరిస్థితి అర్థమవుతోంది. కానీ ఎక్కడా ల్యాండ్ చేయడానికి చదునైన నేల లేదు. శీతకాలం కావడంతో పర్వతాలను మంచు కప్పేసింది. గాల్లో ఉన్నా పేలి పోక తప్పనప్పుడు నేల మీదకు దిగడానికి ఓ ప్రయత్నం చేయడమే ప్రత్యామ్నాయం. అప్పటికే కాక్‌పిట్ నిండా పొగ కమ్మేసింది.

మాకు శిక్షణలో నేర్పించిన విన్యాసాలు చేస్తూ స్పీడ్ తగ్గించి దించేశాను. దేవుని దయ వల్ల పర్‌ఫెక్ట్‌గా ల్యాండ్ అయింది. వెంటనే నేను, కో పైలట్, ఒక గన్నర్, ఇద్దరు వైద్యసిబ్బంది దిగి, మూడు మృతదేహాలను (పాక్ భూభాగంలో ప్రాణాలు వదిలిన సైనికులవి) బయటకు తీయగానే హెలికాప్టర్ పేలి పోయింది. మా హెలికాప్టర్‌కు ఎదురైన ప్రమాదాన్ని గుర్తించిన బేస్‌స్టేషన్ మాకు సహాయంగా మరో హెలికాప్టర్‌ను పంపించింది. అందులో మా క్యాంపునకు చేరాం. అప్పట్లో మనదేశానికి రష్యన్‌లు వాడి రీ కండిషన్ చేసిచ్చిన హెలికాప్టర్లే ఆధారం.
 
 అలాంటిదే మరో సంఘటన అదే నెలలో 21వ తేదీన ఎదురైంది. అప్పటికి యుద్ధం సద్దుమణిగింది. అగర్తల నుంచి కుంభీగ్రామ్ వెళ్తుండగా హెలికాప్టర్ ఇంజన్ ఫెయిలైంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి కిందకు దిగి చూసుకుంటే హెలికాప్టర్ ప్రధాన భాగం మనదేశంలో ఉంది, తోక బంగ్లాదేశ్‌లో ఉంది. మొత్తానికి యుద్ధం సమయంలో సరుకులు, యుద్ధసామగ్రిని చైనా, బర్మా, నాగాలాండ్ వంటి క్లిష్టమైన ప్రదేశాల్లో చాకచక్యంగా రవాణా చేసినందుకు ‘వాయుసేన మెడల్’ అందుకున్నాను.
 
 మాది మెదక్ జిల్లా జోగిపేట దగ్గర కుస్సంగి. నా చదువు హైదరాబాద్‌లోనే. ఇంజనీరింగ్‌లో ఉండగా రక్షణరంగంలోకి వెళ్లి, 1967 డిసెంబర్‌లో హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఉద్యోగంలో చేరాను. పెళ్లయ్యాక నా భార్య ఉషతో అస్సాంలోని దిబ్రూఘర్‌లో ఏడేళ్లు ఉన్నాను. అడవుల్లో వెదురు కర్రల మీద గుడిసెలో జీవించాం. చండీగఢ్‌లో నాలుగువేల మంది ఉద్యోగులను పర్యవేక్షించడం, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేయడం వంటివి వృత్తిపరమైన సంతృప్తినిచ్చాయి. 1978లో ముందస్తు పదవీవిరమణ తీసుకుని ‘హాలెండ్ షెర్నర్ ఎయిర్‌వేస్’లో కమర్షియల్ పైలట్‌గా పనిచేశాను. 28 దేశాల పైలట్లను చూశాను. కానీ భారతీయ పైలట్లలో ఉండే అంకితభావం మరెవరిలోనూ చూడలేదు’’ అంటున్న బీఎల్‌కే రెడ్డి ఇప్పుడు హైదరాబాద్‌లోని గోల్ఫ్ అసోసియేషన్ సెక్రటరీగా గోల్ఫ్‌ను విస్తరించే పనిలో ఉన్నారు.
 
 భారతీయుడిగా...
 నా రక్షణ రంగ జీవితాన్ని తలుచుకున్నప్పుడల్లా గర్వంగా ఛాతీ ఉప్పొంగేది... సరెండర్ అవుతూ పాక్ సైన్యం లెటర్ రాసిన సన్నివేశమే. డిసెంబర్ 16వ తేదీ ఢాకాలో ఇండో-పాక్ సైనికాధికారులు సమావేశమయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ఎ.ఎ.కె. నియాజీ సరెండర్ లెటర్ రాయడం, దాని మీద మన లెఫ్టినెంట్ జనరల్ జగత్‌సింగ్ అరోరా కూడా సంతకం చేయడం నా కళ్ల ముందే జరిగింది.
 - కెప్టెన్ బీఎల్‌కే రెడ్డి, వాయుసేన మెడల్ గ్రహీత
 - వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement