అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు | NRI from Andhra Pradesh’s Bapatla district shot dead at a grocery store in Dallas | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు

Published Mon, Jun 24 2024 4:17 AM | Last Updated on Mon, Jun 24 2024 4:17 AM

NRI from Andhra Pradesh’s Bapatla district shot dead at a grocery store in Dallas

సూపర్‌ మార్కెట్‌లో ఘటన.. చికిత్స పొందుతూ మృతి 

బాపట్ల జిల్లా యాజలిలో విషాదం 

గోపీకృష్ణ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన యువకుడు దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గోపీకృష్ణ. బీటెక్‌ వరకు చదివి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హెచ్‌–1బి వీసా రావటంతో ఉద్యోగం కోసం సుమారు 11 నెలల కిందట అమెరికా వెళ్లాడు.

ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు టెక్సాస్‌ రాష్ట్రం డెల్లాస్‌ సిటీలోని సూపర్‌ మార్కెట్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ దుండగుడు సూపర్‌ మార్కెట్‌కు వచ్చి గోపీకృష్ణపై గన్‌తో కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోగా స్థానికులు ఓ వైద్యశాలలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ ఆది­వారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ సహకారంతో తమ బిడ్డ భౌతికకాయాన్ని త్వరగా తీసుకువచ్చేలా చర్య­లు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

గోపీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: వైఎస్‌ జగన్‌
అమెరికాలోని సూపర్‌ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందటం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. మృతుడి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement