రచయిత జయధీర్ తిరుమలరావు
సాక్షి, హైదరాబాద్: కోయ, ఆదివాసీల వీరగాథలపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని ప్రముఖ రచయిత, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. సమ్మక్క – సారక్కపై ఎన్నో కట్టు కథలున్నాయని, ఇప్పుడు చారిత్రక దృక్కోణంలోంచి వాటిని చూడాల్సి ఉందన్నారు. మేడారంలో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతర నేపథ్యంలో వారి గాథలపై అధ్యయనం చేసిన ఆయన ‘వీరుల పోరు గద్దె –మేడారం’ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం జయధీర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఒక్క కథ చరిత్ర సృష్టించింది..
సమ్మక్క–సారలమ్మ ఒక్క గాథే చరిత్రను సృష్టించింది. మరి మిగిలిన ఎనిమిది గాథల మాటేమిటి..? ఈ గాథలోనే కాదు పగిడిద్దరాజు, గడికామరాజు, ఎరమరాజు, గాదిరాజు, గోవిందరాజు, తోటుమనెడి కర్ర, గుంజేటి ముసలమ్మల కథలు కూడా ఈనాటికీ ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో సమక్క సారాలమ్మల చరిత్ర నుండి ప్రేరణ పొందినందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం పరిశోధనల వైపు దృష్టి సారించాలి. అప్పుడే అసలు గాథలు బయటికి వచ్చి ఆదివాసీలకు మేలు జరుగుతుంది. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తూ స్థానిక కోయ సంస్కృతి, పుజా విధానం మారకుండా కాపాడాలి. బ్రాహ్మణ పురోహితులు అక్కడ కన్పించకూడదు. చరిత్ర విషయంలో చరిత్రకారులు ఇలాంటి పరిశోధనలు చేసి ప్రజల పక్షం వహించినపుడే ఆ చరిత్రకు సార్థకత ఉంటుంది. ఇంతవరకు సమక్క–సారాలమ్మలకు సంబంధించి కాల్పానిక గాథలే ఉన్నాయి. ఇప్పుడు చారిత్రక ఘటనల క్రమం నుంచి వీరి చరిత్రను వెలికి తీశా. అంతేకాదు చరిత్ర ఆధారాలు కనిపించని చోట కోయల జ్ఞాపకాల్లోని మౌఖిక ఆధారాలే చరిత్రగా మార్చాలి.
సమ్మక్క – సారక్క జాతరగానే పిలవాలి
ఇప్పటి వరకు సమక్క – సారలమ్మ జాతరగా పిలుస్తున్నాం. ఇది సరికాదు. ‘సమ్మక్క–సారక్క’ జాతరగా పిలవడం సుమచితం. ఆదివాసీలకు అక్క దేవతలు ఉంటారు. ‘అక్కలు’ అని పిలవడం సరైన పద్ధతి. ఒకరు ఒకలాగా మరొకరు మరోలా కాకుండా.. అందరూ ఒకే తీరుతలో పిలవాలి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే జాతరను సమ్మక్క – సారక్క జాతరగా పిలవడం ప్రాచర్యంలోకి తేవాలి. ఈ విషయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.
కోయ వీరుల పాటలకు ప్రాచుర్యం అవసరం
ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క – సారక్క జాతరకి ఎనిమిది మంది కోయ వీరుల పగిడె పాటలు తీసుకరావాలి. వాటికి జాతరలో నాలుగు రోజుల పాటు వారి గాథలు చెప్పించటం అవసరం. అప్పడే ఆ వనదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. చరిత్రకు న్యాయం జరుగుతుంది.
గొప్ప చారిత్రక ప్రదేశం..
మేడారంలో సమ్మక్క – సారక్క జాతర జరిగే స్థలం గొప్ప చారిత్రక ప్రదేశం. అక్కడ యుద్ధం జరిగింది. పడిపోయిన తన భర్తను సమక్క మోసుకొని వచ్చింది. మేడారం వద్దకు రాగానే అలసిపోయి అక్కడే ఆగింది. ఆ తర్వాత ఆమె తన కూతురు సారక్క అక్కడే ఉండి, కొంత కాలానికి మరణించారు. కాబట్టి కోయలకు అది పవిత్ర స్థలం. నిజానికి అది ఓ చారిత్రక ప్రదేశం మాత్రమే.
14 ఏళ్ల అన్వేషణ ఇది..
‘వీరుల పోరు గద్దె–మేడారం’ పేరుతో సమ్మక్క, సారక్కలపై కోయడోలీల కథ పుస్తకం తీసుకరావటానికి 14 ఏళ్లు పట్టింది. ఇది ఒకరితో సాధ్యమైంది కాదు. ప్రొఫెసర్ గూడూరు మనోజ, పద్దం అనసూయ.. వీరితో పాటు ఎంతో మంది శ్రమించారు. తొలుత ఖమ్మం జిల్లా తొగ్గూడెం ప్రారంభించి మేడారం వరకు చరిత్ర అన్వేషణ ప్రయాణం సాగించాం. అక్కడ పగిడె తీశారు. మౌఖిక కథనాలకి ఆధార భూతాలు పగిడెలు మాత్రమే. అవసరమైన చోట పాఠ్యగానం సకిన రామచంద్రయ్య బృందం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment