జయశంకర్ జిల్లా ఎస్పీ భాస్కరన్
భూపాలపల్లి : వనం నుంచి జనంలోకి సమ్మక్క రాకను పురస్కరించుకుని చిలకలగుట్ట దగ్గర ప్రభుత్వం తరపున గాలిలో కాల్పులు జరిపి ఆహ్వానం పలకడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిందని జయశంకర్ జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ అన్నారు. ట్రైనీ ఐపీఎస్‌గా, భద్రాచలం ఓఎస్‌డీగా గతంలో రెండు సార్లు జాతరలో నిర్వహణలో పాల్గొన్నా.. తన కెరీర్‌లో 2018 జాతర ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. మహా జాతర విజయవంతంగా ముగిసిన సందర్భంగా.. జాతరలో తన అనుభూతులు, అనుభవాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.
టెక్నాలజీ సాయంతో..
గతంతో పోల్చితే ఈసారి జాతర నిర్వహణలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించాం. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు పొందాం. ముఖ్యంగా రద్దీ నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో సహకరించాయి. గత జాతరలో ఐటీడీఏ గెస్ట్‌హౌస్ వైపు ఉన్న క్యూలైన్ ద్వారా ఎక్కువ మంది దర్శనం చేసుకునేవారు. ఆర్టీసీ క్యూలైన్ వైపు రద్దీ తక్కువ ఉండేది. దీంతో ఐటీడీఏ క్యూలైన్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకున్నాం. ఈ క్యూలైన్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని గమనించిన వెంటనే హరిత హోటల్ దగ్గర ఉన్న చెక్‌పోస్టు సిబ్బందిని అలర్ట్ చేశాం. వారు జంపన్న వాగు నుంచి వచ్చే భక్తులను ఆర్టీసీ క్యూ లైన్ వైపు మళ్లించాం. డ్రోన్ కెమెరాల వినియోగంతో అన్ని రోడ్లను మానిటరింగ్ చేశాం. ఎక్కడైనా రద్దీ పెరిగిపోతున్నట్లు గమనిస్తే వెంటనే అక్కడికి అదనపు సిబ్బందిని పంపాం. వీడియో మానిటర్ స్క్రీన్లు ఉపయోగపడ్డాయి. వీటి ద్వారా 33 మంది తప్పిపోయిన వారిని వెతికి పట్టుకున్నాం. క్రౌడ్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలు సాధ్యమైనంత కచ్చితత్వంతో సేకరించాం.
లైటింగ్ పెరగాలి...
జాతర జరిగే మేడారం, ఊరట్టం, ఆర్టీసీ బస్‌స్టేషన్, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, రెడ్డిగూడెం, జంపన్నవాగు వంటి ప్రదేశాల్లో రాత్రి వేళ లైటింగ్‌ను పెంచాలి. అన్ని చోట్ల మంచినీటి సౌకర్యం కల్పించాలి. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి గట్టమ్మ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. గుట్ట మలుపులో ఈ ఆలయం ఉంది. పక్కన ఎక్కువ స్థలం అందుబాటులో లేదు. ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పార్కింగ్ ఏరియాను విస్తరించాలి. మేడారం జాతరను సందర్భంగా అనుమానితులుగా ఉన్న దొంగలను ముందుగానే అదుపులోకి తీసుకున్నాం. ఇలా సుమారు 70 మందిని అదుపులో ఉంచుకున్నాం. జాతర సందర్భంగా వివిధ నేరాలకు పాల్పడుతున్న మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment