మేడారంలో వనదేవతలను దర్శించుకుంటున్న సీఎం కేసీఆర్ దంపతులు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరొందిన మేడారం మహాజాతర అభివృద్ధి పనులు మళ్లీ అటకెక్కాయి. జాతర జరిగే నాలుగు రోజుల్లో ఇక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు ఎడాపెడా హామీలు గుప్పించడం, అంతకు ముందు రెండు నెలల పాటు పనుల పేరుతో అధికారులు హడావుడి చేయడం తప్ప.. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడంపై ఎవరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క–సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా ఇచ్చిన హామీలు నాలుగున్నర నెలలు గడిచినా ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటికి పైగా మంది భక్తులు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని సమ్మక్క– సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు.
మూడో రోజు సీఎం రాక..
ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో మహా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర మూడో రోజున సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా మేడారాన్ని సందర్శించారు. వనదేవతల దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తాం.. 2018–19 బడ్జెట్‌లోనే ఈ నిధులు మంజూరు చేస్తాం.. జాతరకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖకు ఇక్కడ తగినంత స్థలం అందుబాటులో లేదు.. జాతర ఏర్పాట్ల కోసం కనీసం 200 నుంచి 300 ఎకరాల స్థలం కావాలి.. ఎంత ఖర్చయినా ఇక్కడ భూమిని సేకరిస్తాం.. ఈ విషయాలపై చర్చించేందుకు జాతర ముగిసిన తర్వాత తాను 15 రోజుల్లో మరోసారి మేడారం వచ్చి అధికారులతో మాట్లా డతా’’ అని పేర్కొన్నారు. అంతేకాదు జంపన్న వాగులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీరు ఉండేలా డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైనందుకు తాను మొక్కులు చెల్లించానని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలని తిరిగి వనదేవతలను మొక్కుకున్నట్లు చెప్పారు.
ఒక్కటీ జరగలేదు..
జాతర ముగిసి నాలుగున్నర నెలలు గడిచినా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. 15 రోజుల్లో మళ్లీ మేడారం వచ్చి అ«ధికారులతో సమావేశం ఏర్పా టు చేస్తానన్న సీఎం.. ఇటువైపు కన్నెత్తి కూడా చూ డడం లేదు. దీంతో 200 ఎకరాల స్థల సేకరణ అంశం మరుగున పడిపోయింది. తర్వాత రాష్ట్ర బడ్జెట్ 2018–19లో మేడారం జాతరకు ఒక్క రూ పాయి కూడా కేటాయించలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్న అభివృద్ధి పెరి గింది. అయితే అంతకు రెట్టింపు సంఖ్యలో జాతర ప్రాధాన్యత పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ వంటి వీఐపీలు గత జాతరలో మేడారం వచ్చారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన సంక్షేమశాఖ మంత్రులు వస్తున్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా మేడారం వచ్చే భక్తు ల సంఖ్య పెరిగింది. సెలవుదినాల్లో వందల వాహనాలు మేడారం వైపు పరుగులు పెడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జాతర సమయంలో తప్పితే ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడక పోవడంతో అభివృద్ధి పనుల్లో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. 2016 జాతర సమయంలో రూ. 14 కోట్లతో తలపెట్టిన నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం నేటికీ పూర్తి కాకపోవడం ఇందుకు నిదర్శనం.
ఇప్పుడు ఒక్క ఎకరమే..
ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఈ పల్లెలో 155.8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. సమ్మక్క–సారలమ్మకు కేవలం ఎకరం భూమి మాత్రమే ఉంది. మేడారం పరిసరాల్లో మొత్తం 155.08 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో 8 ఎకరాల్లో ప్రభు త్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాం కేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. జాతర జరిగే సమయంలో యంత్రాంగం ఈ భూముల ను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. అయితే శాశ్వతంగా వనదేవతలకు భూములను కేటాయించలేదు. జాతర సమయంలో ఇచ్చిన హామీలను సీఎం
కేసీఆర్ నెరవేర్చాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment