Sammakka - saralamma Jatara
-
వైభవంగా మినీ మేడారం జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
అర్ధరాత్రి గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ
-
మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కరణ.. గద్దెపైకి సమ్మక్క
ములుగు, సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర బుధవారం ప్రారంభమైంది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు మొదటిరోజు తండోపతండాలుగా తరలి వచ్చారు. రెండో రోజైన ఇవాళ.. మేడారంలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువు దీరింది. సమ్మక్కను ప్రధాని పూజారి ప్రతిష్టించారు. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలికారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించారు. మేడారం జన జాతరగా మారింది. గత రాత్రి సారలమ్మతో పాటు సారలమ్మ, పడిగిద్ద రాజు, గోవిందా రాజులు గద్దెపై కొలువుదీరారు. వనదేవతలకు మొక్కు చెల్లించుకునే క్రమంలో.. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమక్క-సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. -
'వెన్నెలమ్మ.. వచ్చిందమ్మా..' గుట్ట నుంచి గద్దెపైకి వరాల తల్లిరాక!
వరంగల్: కన్నెపల్లి నుంచి వెన్నెలమ్మ తరలిరాగా.. భక్తజనం పారవశ్యంలో ఓలలాడారు. శివసత్తుల పూనకాలు.. భక్తుల శిగాలతో కన్నెపల్లి ఆలయ ప్రాంగణం మారుమోగింది. జై..సారలమ్మ.. అంటూ భక్తులు గద్దెల వరకు తోడువచ్చారు. మేడారం శ్రీ సమ్మక్క– సారలమ్మ మహాజాతరలో ప్రథమ ఘట్టం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మకు దారిపొడవునా భక్తులు నీరాజనం పలికారు. గుడిలో సాయంత్రం 6 గంటలనుంచి సారలమ్మ తరలివచ్చే తంతు ప్రారంభమైంది. సుమారు గంటన్నరపాటు ఆలయంలో ఒకవైపు కాకవంశీయుల ఆటపాటలతో సందడిగా మారింది. ఇంటినుంచి పూజాసామగ్రితో ఆడపడుచులతో కలిసి ఆలయానికి చేరుకున్న ప్రధాన వడ్డె కాక సారయ్య ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. పూజారి హారతివ్వగా.. కొద్దిసేపటి తరువాత మరో పూజారి బూర ఊదారు. బుధవారం రాత్రి 7.40 గంటలకు ప్రధాన పూజారి కాక సారయ్య.. సారలమ్మను చేతిలో పట్టుకోగా.. హనుమాన్జెండాతో బయటకు తీసుకువచ్చారు. హనుమంతుడి నీడలో రావడం అమ్మవారి అభయంగా ఉంటుందని విశ్వాసం. అమ్మవారి గుడి ముందు పెళ్లికాని కన్నెపిల్లలు, యువకులు, అనారోగ్యం, సమస్యలతో బాధపడుతున్న భక్తులు వరం పట్టారు. నేలపై పడుకున్నవారి పైనుంచి సారలమ్మ వెళ్తే శుభం కలుగుతుందని విశ్వాసం. అక్కడినుంచి మేడారం బయలుదేరారు. కన్నెపల్లిలోని కాక వంశీయులు ఆడబిడ్డల ఇళ్లవద్దకు సారలమ్మ తరలివెళ్లగా వారు మంగళహారతులు ఇచ్చి నీళ్లు ఆరబోశారు. ఎర్రనీళ్లతో దిష్టితీసి కొబ్బరికాయలను కొట్టారు. తల్లివస్తుందని తెలుసుకున్న భక్తులు విడిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరి పసుపు, కుంకుమలను ఎదురుచల్లారు. నాలుగంచెల రోప్‌పార్టీని దాటుకొని వడ్డెలు, పూజారులను తాకాలనే అతృతతో ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వడ్డె సారయ్య.. జంపన్నవాగులో అమ్మవారి కాళ్లుకడిగి మేడారం చేరుకున్నారు. తల్లి సమ్మక్క గుడికి చేరి దర్శించుకోవడానికి ముందుగానే..అప్పటికే సమ్మక్క గుడి వద్దకు చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మ గద్దెలపై కొలువుదీరింది. అమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును వారి వారి గద్దెలపై పూజారులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. సారలమ్మను ప్రతిష్ఠించే సమయంలో గద్దెల దర్శనాలను గంటపాటు నిలిపివేశారు. ఈ క్రమంలో మూడుమార్లు విద్యుత్ లైట్లను నిలిపివేసి మళ్లీ ఆన్‌చేశారు. పోలీసుల భారీ బందోబస్తు.. కన్నెపల్లి నుంచి సారలమ్మను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గద్దెలపైకి తీసుకువచ్చారు. సారలమ్మ గద్దైపె కొలువుదీరడానికి ముందే పోలీసులు నాలుగు రోప్‌పార్టీలు ఏర్పాటు చేసి వాటి మధ్యలో కన్నెపల్లి ఆదివాసీ యువకులు పూజారులతో కలిసి తల్లిని గద్దైపెకి తీసుకొచ్చారు. రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ సారలమ్మను జంపన్నవాగు నీటిలో నుంచి తీసుకురావడం ఆనవాయితీ. ఉదయం ఎస్పీలు శబరీష్, గాష్‌ఆలం, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో జంగిల్ డ్రెస్‌తో కూడిన బలగాల మధ్య రోప్ పార్టీ సాగింది. దగ్గరుండి తరలించిన మంత్రి సారలమ్మను తీసుకురావడానికి రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కన్నెపల్లి గుడికి చేరుకున్నారు. అక్కడ పూజాక్రతువును స్వయంగా పరిశీలించి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సారలమ్మను తీసుకువచ్చారు. కిక్కిరిసిన జనం ఎటు చూసినా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మంగళవారం రాత్రి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం రాత్రివరకు మేడారం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయాయి. జంపన్నవాగు వద్ద ఇసుకేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు చేరడానికి కాలినడకన వస్తుండడంతో ఒక్క వాహనం కూడా ముందుకు కదలలేని పరిస్థిత నెలకొంది. రెడ్డిగూడెం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వనదేవతలను దర్శించుకునేందు కు గద్దెల ప్రాంగణంలో పెద్ద ఎత్తున బారులుదీరా రు. వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ నెలకొంది. మూడు కిలోమీటర్లకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లుల దర్శనం, జంపన్నవాగుకు దారి, ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లపై అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సమాచారాన్ని మైకుల్లో తెలుపుతూ తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. తాడ్వాయి: వరాల తల్లి సమ్మక్క నేడు(గురువారం) చిలకలగుట్ట పైనుంచి గద్దెకు చేరే ఘడియలు ఆసన్నమయ్యాయి. వనం నుంచి జనంలోకి సమ్మక్క రానుంది. ఈ సందర్భంగా వరాల తల్లికి స్వాగతం పలికేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మవారి రాకకు ముందుగా సమ్మక్క పూజారులు గుడిలో శక్తిపీఠాన్ని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి రహస్య క్రతువు చేపడతారు. అనంతరం గుడి నుంచి పూజా సామగ్రి తీసుకువచ్చి గద్దె అలికి కంకవనాలను కట్టి కుంకుమ, పసుపులతో అలంకరిస్తారు.. ఏకాంతంలో నిర్వహించే ఈ ప్రక్రియ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వరు. అలాగే మేడారంలోని ఆడపడుచులు, ఆదివాసీ కుటుంబాలు, పూజారులు, వడ్డెలు సైతం సమ్మక్క రాకకు ఆహ్వానంగా వారి ఇళ్లను ముగ్గులతో అలంకరిస్తారు. ఇదిలా ఉండగా.. పోలీసులు, రోప్‌పార్టీ సిబ్బంది చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రిహార్సల్స్ చేశారు. అమ్మవారు వచ్చే దారికి ఇరువైపులా బారికేడ్లు అమర్చిన పోలీసులు బుధవారం నుంచి బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి ఆగమనం కోసం కోటి మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ -
తెలంగాణ కుంభమేళాకు వేళాయె
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు పూజలతో తెలంగాణ కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధవారం రోజునే ఈ మహా ఉత్సవం మొదలవుతుంది. దానికి సరిగ్గా 14 రోజుల ముందు గుడిమెలిగె పండుగ జరుగుతుంది. బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిలో పూజారులు తలస్నానాలు అచరించి తల్లుల అలయాలను శుద్ధి చేసి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క పూజారి సిద్దబోయిన మనీందర్ ఇంటి వద్ద పూజారులు కంకణాలు కట్టుకోగా, ఆడపడుచులు పసుపు, కుంకమలు, పూజారులు, వడ్డెలు పవిత్ర జలం, దూపం, యాటతో డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క గుడికి చేరారు. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క గుడి ఈశాన్యం మూలన ఎట్టి గడ్డి ఉంచగా, ఆడపడుచులు సమ్మక్క శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించారు. అనంతరం సమ్మక్క గుడి గుమ్మం బయట ముగ్గులు వేసి అందంగా అలంకరించగా. పూజారులు అమ్మవారికి దూప, దీపాలు వెలగించి పూజలు నిర్వహించి యాటను నైవేద్యంగా సమర్పించారు. కన్నెపెల్లిలోని సారలమ్మ గుడిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఇతర పూజారులతో కలిసి గుడిమెలిగె పండగ పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఆడపడుచులు సారలమ్మ గుడి ముందు ముగ్గులు వేసి అలంకరించారు. బుధవారం సమ్మక్కకు బోనం పెట్టడం ఆనవాయితీ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నెల 14న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మండమెలిగె పండుగ జరుగుతుంది. జాతరకు మరో 13 రోజులే... పనుల పూర్తిలో ఇంకా జాప్యమే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మరో 13 రోజులే ఉంది. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ప్రతిసారీ కనీసం నాలుగు నెలల ముందు నుంచే జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. గతేడాది జూలైలో పంపిన ప్రతిపాదనలను మించి మొత్తం 21 శాఖలకు రెండు విడతల్లో రూ.105 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దాదాపుగా రెండు నెలలుగా సాగుతున్న పనులు చాలా వరకు పూర్తి కాలేదు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు అధికారులతో విడతల వారీగా ఇప్పటికే నాలుగైదు సమీక్షలు నిర్వహించారు. రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, డంప్‌యార్డులు తదితర నిర్మాణాలు ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంది. కొందరు భక్తులు జాతరకు ముందుగానే మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో ఇప్పటికే మేడారం వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా ఉంటోంది. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరగనున్న జాతరకు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాకు చెందిన భక్తులు 365వ జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తారు. గూడూరు, వరంగల్ జిల్లా ఖానాపురం మండలాల్లో అసంపూర్తి పనులతో ప్రయాణికులకు కష్టాలు తప్పేలాలేవు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి ములుగు జిల్లా మల్లంపల్లి వరకు 189 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట వరకు 32 కిలోమీటర్ల దూరం విస్తరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. అతిపెద్ద జాతరకు ఆ కమిటీనే వేయలే.. మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటులో ఎప్పుడూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 2012 వరకు సజావుగానే సాగినా 2014 జాతర నుంచి ధర్మకర్తల మండలి ఏర్పాటులో ప్రతీసారి జాప్యమే అవుతోంది. 2014లో కోర్టు వివాదాల వల్ల ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో అధికారుల పర్యవేక్షణలోనే జాతర నిర్వహించారు. 2016లో పునరుద్ధరణ కమిటీని నియమించారు. 2018 మహాజాతరకు కాక లింగయ్యను చైర్మన్‌గా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు. 2020, 2022 జాతరలు పునరుద్ధరణ కమిటీతో నిర్వహించగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తారని ఆదివాసీలు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పెసా) చట్టం ప్రకారం ఆదివాసీలనే నియమించాలని కూడా కోరుతున్నారు. అయితే జాతరకు మరో 13 రోజులు ఉండగా ఇంకా ఆ కమిటీపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి మహాజాతరను ధరకర్తల కమిటీ వేసి నిర్వహిస్తారా? లేక పునరుద్ధరణ కమిటీతో నడిపిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. -
ఆశ్చర్యం! కాకతీయ వారసులకు సమ్మక్క సారే
కాకతీయుల రాజులతో పోరాడి అమరులై ఆ తర్వాత దైవత్వం సాధించుకున్న వీర వనితలుగా సమ్మక్క సారలమ్మలకు పేరుగాంచారు. వారి వీరత్వం, త్యాగాలకు స్మరిస్తూ ప్రతీఏడు జాతర జరుపుకోవడం వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే గతాన్ని పక్కన పెట్టి కొత్త సంబంధాలకు తెర తీశారు సమ్మక్క పూజారులు. కాకతీయు వారసులకు సమ్మక్క తరఫున సారెను పంపారు. ప్రతాపరుద్రుడి మరణంతో వరంగల్ కేంద్రంగా కొనసాగిన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. అయితే ప్రతాపరుద్రుడి కుటుంబ సభ్యులు గోదావరి తీరం వెంట సాహాస ప్రయాణం చేస్తూ దండకారణ్యం చేరుకున్నారు. కాకతీయ వారసుడిగా అన్నమదేవ్ జగదల్పూర్ కేంద్రంగా కొత్త సామ్ర్యాజ్యం స్థాపించాడు. బ్రిటీష్ వారి చారిత్రక పరిశోధనల్లోనూ అన్నమదేవ్ కాకతీయ వారసుడిగా తేలింది. ప్రస్తుతం అన్నమదేవ్ పరంపరలో చంద్రదేవ్భంజ్ కొనసాగుతున్నారు. రాజరికం అంతరించినా.. జగ్దల్పూర్ కోటలో ఉంటూ స్థానిక పండుగుల్లో గత సంప్రదాయాలను, వైభవాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 16న మొదలైన జాతర ఫిబ్రవరి 23న తిరుగు వారం పండుగతో ముగిసింది. జాతర ముగిసిన తర్వాత సమ్మక్క పూజారులుగా చెప్పుకునే సిద్ధబోయిన వంశస్తులు కాకతీయ వారుసుడైన చంద్రదేవ్భంజ్కి సమ్మక్క సారెగా బంగారం (బెల్లం), గాజులు, కుంకుమ భరిణి, చీర, కండువాలను పంపించారు. వందల ఏళ్ల క్రితమే ఉన్న బంధాన్ని మరోసారి తట్టి లేపారు. మేడారం జాతర, బస్తర్ దసరా వేడుకలపై పరిశోధనలు చేస్తున్న టార్చ్ సంస్థ కన్వీనర్ అరవింద్ పకిడె ద్వారా ఈ సారేను సమ్మక్క పూజారులు పంపించారు. తిరుగువారం పండుగ ముగిసిన వెంటనే వీటిని తీసుకుని టార్చ్ బృందం జగదల్పూర్ వెళ్లింది. కాగా ఫిబ్రవరి 25 శుక్రవారం రాజమాత కృష్ణకుమారి దేవికి ఈ సారెను సమ్మక్క తరఫున అందించారు. పరిశోధనలు జరగాలి - సిద్ధబోయిన అరుణ్‌కుమార్ (సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు) కాకతీయ రాజులు, సమ్మక్క కుటుంబీల మధ్య ఉన్న సంబంధాలు నెలకొన్న వివాదాలపై అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై విస్తారమైన పరిశోధనలు జరగలేదు. పైపై విషయాలకే ఎక్కువ ప్రచారం దక్కింది. కానీ ఆనాదిగా దండకారణ్యంతో ఆదివాసీలకు వారిలో ఒకరైన సమ్మక్క ఆమె కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయి. మా పూర్వీకులు మాకు అదే విషయం చెప్పారు. మరోవైపు కాకతీయ రాజులకు దండకారణ్యంతో సంబంధాలు ఉన్నాయి. దీంతో కాకతీయ వారసులకు సారెను పంపి కొత్త బంధవ్యాలకు తెర తీశాం. వచ్చే జాతరకు వారిని ఆహ్వానించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. మహిళా శక్తికి ప్రతిరూపం - చంద్రదేవ్భంజ్ (కాకతీయుల వారసుడు) వీర నారీమణి, త్యాగానికి మరోపేరైన సమ్మక్క సారేను మా కుటుంబం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. దండకారణ్యంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఉంటుంది. ఆనాదిగా మేము స్త్రీలను శక్తి స్వరూపాలుగా చూస్తున్నాం. సమ్మక్కను ఇక్కడ సడువలిగా కొలుస్తారు. ఇక్కడే దంతేశ్వరి ఆలయం కూడా ఉంది. వరంగల్ - దండకారణ్యంల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సారెతో అవి మరింత బలపడనున్నాయి. -
వనం చేరిన తల్లులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నాలుగు రోజులపాటు లక్షల మంది భక్తులను ఆశీర్వదించిన వనదేవతలు జనం నుంచి వనంలోకి వెళ్లారు. మేడారంలో గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు వనంలోకి తీసుకెళ్లారు. ఈ ఘట్టంతో మేడారం మహా జాతర ముగిసింది. జనసంద్రమైన అడవులు మళ్లీ మామూలుగా మారాయి. కిక్కిరిసిన భక్తులతో కాలు కదిపేందుకు వీలుగాని గద్దెల ప్రాంతం ఖాళీ అయ్యింది. ఆదివాసీ వాయిద్యాలు, సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) శనివారం సాయంత్రం ఆరుగంటలకు వనప్రవేశ ప్రక్రియను ప్రారంభించారు. ఉద్విగ్నంగా ఈ ఘట్టం సాగింది. జాతర చివరి రోజు దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆఖరి రోజున భారీగా జనం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవతల వనప్రవేశం తర్వాత సైతం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీర, సారె, బంగారం, పసుపు కుంకుమలను మేడారం వాసులు తీసుకున్నారు. దేవతల ప్రసాదాన్ని(బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దీంతో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభించారు. గోవిందరాజును దబ్బగట్ల గోవర్ధన్, పొదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం గద్దెల నుంచి 7:20 తరలించారు. వీరు అర్ధరాత్రి ఏటూరునాగారం మండలం కొండాయికి చేరుకున్నారు. అనంతరం 7:18 గంటలకు సమ్మక్కను గద్దెల నుంచి తరలించారు. కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించింది. గద్దెల సమీపంలోని ఎదుర్కోళ్ల ప్రదేశం వద్ద మేక బలితో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సమ్మక్కను చిలకలగుట్టకు చేర్చారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును7:20 గంటలకు వడ్డెల నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం నుంచి కొత్తగూడ మండ లం పూనుగొండ్లకు వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వీరు గమ్యాన్ని చేరుకోనున్నారు. మేడారం గద్దెపై ఉన్న సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మెంటె (వెదురు బుట్ట) ను 7:21 గంటలకు తీసుకుని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. దేవతల వనప్రవేశంతో మేడా రం మహా జాతర అధికారికంగా ముగిసింది. కాగా, వచ్చే బుధవారం మేడా రం పూజారులు చేసే తిరుగువారం పండుగతో మహా జాతర అంకం పరిసమాప్తమవుతుంది. మేడారం రావడం సంతోషంగా ఉంది: గవర్నర్ మేడారంలో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మేడారం చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే సీతక్క పుష్పగుచ్ఛంతో ఆమెకు స్వాగతం పలికారు. తర్వాత గవర్నర్ నిలువెత్తు బంగారాన్ని తల్లుల కు సమర్పించుకున్నారు. అనంతరం పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకున్నట్లు తెలిపారు. కాగా, గవర్నర్ రాకకు కొద్దిముందే.. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ కృష్ణాదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి.. మేడారం జాతర విజయవంతమైనట్టు ప్రకటించారు. గవర్నర్ వచ్చే సమయానికి వీరు లేరు. దీంతో జేసీ ఒక్కరే స్వాగతం పలికారు. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: బండి సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విషయంలో ప్రొటోకాల్ పాటించకుండా ఘోరంగా అవమానించినందుకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేడారంలో మంత్రులు, అధికారులెవరూ గవర్నర్ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆరోపించారు. -
భక్తజన సంద్రమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (ఫోటోలు)
-
దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది..
మేడారంలో ఇప్పుడు కొత్త రోడ్లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి వందల కెమెరాలతో ఎప్పటికప్పుడు తాజా సమాచారం చేరుతోంది. కానీ మూడు దశాబ్దాల క్రితం ఇదో దట్టమైన అడవి. కనీసం కరెంటు కూడా లేదు, ఫోన్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో సమ్మక్క రాక భక్తులకు తెలిసేందుకు ఒకే ఒక కొండ గుర్తు ఉండేది. ఇప్పుడు మేడారం జాతరకు ఆర్టీసీ 3500ల బస్సులు నడిపిస్తోంది. లక్షల సంఖ్యలో ఆటోలు, జీపులు, ట్రాక్టర్లలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మేడారం వచ్చే భక్తులు ఎడ్లబండ్లలోనే ఎక్కువ వచ్చేవారు. ఆది, సోమవారాల్లో బయల్దేరి మంగళవారానికి మేడారం చేరుకునేవారు. ఇలా వచ్చే భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో అడవుల్లో బస చేసేవారు. జంపన్నవాగులో చెలమల్లో నీళ్లు తాగేవారు. అడవుల్లో కంకవనం నరికి పందిల్లు వేసుకునేవారు. వాటి కిందే బస చేసేవారు. కరెంటు వెలుగులు లేవు. సాయంత్రం ఆరు గంటల కల్లా వంటలు పూర్తి చేసి వెన్నెల వెలుగుల్లో సమ్మక్క, సారలమ్మల కోసం వేయి కళ్లతో ఎదురు చూసేవారు. బుధవారం సాయంత్రం సారలమ్మ, గురువారం సాయంత్రం సమ్మక్క వస్తుదన్న విషయం తెలిసి పొద్దుగూకే సమయంలో మొక్కులు చెల్లించేందుకు అనువుగా సిద్దమయ్యేవారు. ముఖ్యంగా జాతరలో కీలకమైన సమ్మక్క రాక ఎప్పుడెప్పుడా అని ఒకరినొకరు ఆరా తీసేవారు. గురువారం సాయంత్రం అయ్యిందంటే భక్తులందరూ చిలకలగుట్టవైపుకు చూసేవారు. రహస్య పూజల అనంతరం సమ్మక్కను తీసుకుని వడ్డేలు చిలకలగుట్ట దిగేవారు. అంతే ఒక్కసారిగా అక్కడున్న భక్తులు సమ్మక్కను అనుసరించేవారు. ఆ కోలాహాలానికి మట్టిరోడ్డుపై దుమ్ము ఆకాశాన్ని తాకేలా పైకి లేచేది. ఈ దుమ్ము మేఘాలు కదలాడుతున్న దిశగా భక్తులు సమ్మక్కకు ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. నలువైపుల నుంచి భక్తులు దుమ్ము మేఘాలను అనుసరిస్తూ కదిలేవారు. పసుపు కుంకుమ కలిపిన ఒడిబియ్యం సమ్మక్కపైకి జల్లుతూ,, మేకలు కోళ్లు బలిస్తూ తమ మొక్కులు చెల్లించడం చేసేవారు. ఒక్కసారిగా భక్తుల ఒత్తిడి పెరిగిపోవడంతో తొక్కిసలాట కూడా చోటుచే సుకునేది. తర్వాత కాలంలో సమ్మక్క రాకను సూచిస్తూ గాల్లోకి కాల్పులు జరిపే సంప్రదాయాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది‡. కాల్పుల శబ్దాన్ని బట్టి సమ్మక్క వస్తున్న సమాచారం జాతర ప్రాంగణంలో తెలిసేది. ఆ తర్వాత కాలంలో మేడారం చుట్ట పక్కల రోడ్లు, హోటళ్లు, సెల్‌ఫోన్ టవర్లు వచ్చి ప్రతీ సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. -
మేడారంలో నేడు మండమెలిగె పండుగ.. జాతరలో ఇది కీలక ఘట్టం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతుంది. మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. నాలుగు రోజులు కార్యక్రమాలు... ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారానికి పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు క్రితంసారి 1.20 కోట్లమందికిపైగా హాజరు కాగా.. ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. మేడారం జాతరలో ప్రధానంగా నాలుగు రోజులు 4 ఘట్టాలు ఉంటాయి. ఫిబ్రవరి 16న సారలమ్మ ఆగమనం.. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. సమ్మక్క కూతురైన సా రలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సు మారు 3 కి.మీ. దూరంలో ఉండే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించిన సారలమ్మను ఫిబ్రవరి 16న బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే కొండాయి నుంచి గోవిందరాజును.. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 17న సమ్మక్క ఆగమనం.. జాతరలో ముఖ్యమైన దినం రెండోరోజు. ఫిబ్రవరి 17న గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. సాయంత్రం 6గం. సమయంలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోతుంది. ఫిబ్రవరి 18న గద్దెలపై తల్లులు.. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క–సారలమ్మలు శుక్రవారం భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతరలో ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు. ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశం.. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు. మండ మెలిగే ప్రక్రియ ఇలా... ప్రధాన పూజారి(వడ్డె) నేతృత్వంలోని బృందం బుధవారం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తా రు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేధ్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. -
భక్తులు భారీగా..
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివచ్చి.. జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఉదయం 11 గంటల వరకే గద్దెలపైకి భక్తులను అనుమతించిన పోలీసులు ఆ తర్వాత గ్రిల్స్‌కు తాళాలు వేశారు. అనంతరం భక్తులు బయటి నుంచే అమ్మవార్లకు మొక్కుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలి రావడంతో అక్కడ క్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కా గా.. మేడారం వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి జంపన్న వాగు వద్ద ఫిట్స్‌తో మృతి చెందాడు. -
మేడారం మహా జాతర.. భక్తులకు టీఎస్ ఆర్టీసీ తీపికబురు
సాక్షి, వరంగల్: సమ్మక్క , సారలమ్మ మేడారం మహా జాతర - 2022 దేవతల దర్శనార్థం వెళ్లే భక్తుల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ వరంగల్ -2 డిపో మేనేజర్ బి.మహేష్ కుమార్ తెలిపారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు మహ జాతర జరుగనుందని, జాతర సమయం లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో కొంత మంది భక్తులు ముందుగానే దర్శనానికి వెళ్లి వస్తుంటారని వారి కోసం ఈ నెల 5 నుంచి ప్రతీ రోజు మేడారానికి బస్సు నడుపనున్నట్లు మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని బట్టి అదనంగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి రోజు.. హన్మకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు, 8 గంటలకు, మధ్యాహ్నం 01.15 , 02.15 గంటలకు బస్సు బయలు దేరుతుందన్నారు. మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 10 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 02.30 గంటలకు, 03.30 గంటలకు బయలు దేరుతుందని వివరించారు. ములుగు నుంచి మేడారానికి ఉదయం 08.15 , 09.15 , మధ్యాహ్నం 2.30, 3.30 గంటలకు, మేడారం నుంచి ములుగుకు ఉదయం 10, 11 గంటలకు , సాయంత్రం 04.15, 05.15 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. హనుమకొండ నుంచి మేడారానికి పెద్దలకు చార్జీ రూ .120 , పిల్లలకు రూ. 60 గా ఉంటుదని తెలిపారు. ములుగు నుంచి మేడారానికి పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 35 గా నిర్ణయించినట్లు వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు . -
ప్రారంభమైన సమ్మక్క–సారలమ్మ జాతర
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బీసీ మర్రిగూడెం పంచాయతీలోని రంగరాజాపురం కాలనీలో శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం అమ్మవార్లను పులి వాహనంపై మండల కేంద్రంలో ఊరేగించారు. అమ్మవారి జాతరను తిలకించేందుకు వెంకటాపురం, వాజేడు మండలాల నుంచే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు. ఘనంగా తిరుగువారం పండుగ ములుగు రూరల్: మండంలొని పొట్లాపురంలో నూతనంగా వెలిసిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మినీ జాతర సందర్భంగా పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు తిరుగువారం పండుగను పూజారులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తిరుగువారం సందర్భంగా పూజారులు అమ్మవార్లకు చీరసారెలు, పసుపు, కుంకుమలు సమర్పించి, యాటపోతులను బలిచ్చారు. సర్పంచ్ కుమ్మిత లతఅంకిరెడ్డి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈసం పాపయ్య, వార్డు సభ్యురాలు కవితయుగేంధర్, లక్ష్మీనారాయణ, రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మేడారం జాతరలో కొత్త ట్విస్ట్
-
మేడారం జాతరలో కొత్త ట్విస్ట్
సాక్షి, భూపాలపల్లి : మేడారం మహా జాతర ముగింపులో కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఎప్పటిలాగా జాతర ముగియగానే సమ్మక్క-సారలమ్మను వనప్రవేశం చేస్తారు. అయితే ఈ సారి ఈ తంతు నిర్వహించాల్సిన ఆదివాసీ పూజారులు అలిగి కూర్చున్నారు. దేవతలను తీసుకుపోమంటూ భీష్మించుకుపోయారు. శనివారం సాయంత్రం అయిదు గంటలకు జరగాల్సిన ఈ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. దీంతో అధికారులు బుజ్జగింపు చర్యలకు దిగారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేరుగా రంగంలోకి దిగారు. మరోవైపు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం చేశాయి. (వన దేవతలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు) మరోవైపు మేడారంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో జాతరకు తరలి వచ్చిన భక్తులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక జాతర ముగింపు సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడారం జాతరను ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రతి రోజు 15 లక్షల మందిని దేవాలయానికి పంపించడం ఒక ఘనత. జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు. జాతీయ పండుగగా ప్రకటించండి మేడారం మహా జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాకు.. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి భక్తులను ఆకర్షిస్తున్న జాతరగా మేడారంకు ఈ గుర్తింపును ఇవ్వాలని కోరారు. శనివారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన అర్జున్ ముండాకు మేడారంలో ఇంద్రకరణ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. (మేడారం: ఎత్తుబంగారం సమర్పించిన గవర్నర్లు) -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ మేడారం జన జాతర
-
గద్దెనెక్కిన సారలమ్మ
అడవి బిడ్డల మహా జాతర జిల్లాలో వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కోయపూజారుల మంత్రోచ్చరణలు.. డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల నడుమ సారలమ్మ గద్దెకు చేరుకుంది. దీంతో జాతరలో మొదటిఘట్టం కన్నుల విందుగా సాగింది. బుధవారం సాయంత్రం నుంచే జిల్లాలోని సమ్మక్క గద్దెల వద్దకు భక్తులు తరలివస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ నగరపాలక పరిధిలోని రేకుర్తి, శంకరపట్నం, వేగురుపల్లి– నీరుకుల్ల, వీణవంక, హుజూరాబాద్, కొత్తపల్లి మండలం చింతకుంట(శాంతినగర్), చొప్పదండి మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సమ్మక్క– సారలమ్మ జాతరకు వేలాది మంది పయనమవుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నేడు సమ్మక్కతల్లి గద్దెకు చేరుకోనుంది. శుక్రవారం అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. సాక్షి, కరీంనగర్: జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తిలో జరుగుతున్న సమ్మక్క– సారలమ్మ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు బుధవారం వరకే లక్షమందికి పైగా భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. రేకుర్తి కరీంనగర్లో విలీనమైన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న జాతర సందర్భంగా బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. సారలమ్మకు ఘనస్వాగతం.. రేకుర్తి శ్రీ సమ్మక్క– సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కోయ పూజారులు, ఆలయ ఈవో రత్నాకర్‌రెడ్డి, వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో పక్కనే ఉన్న కొండపైకి వెళ్లారు. అక్కడ సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఊరేగింపు మధ్య గద్దెవద్దకు తీసుకొచ్చారు. అమ్మవారు వచ్చే సమయంలో భక్తులు ఘనస్వాగతం పలికారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సాయంత్రం 5.10 గంటలకు సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలకు చేరనుంది. అప్పటి నుంచి ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనం ఇస్తారు. శుక్రవారం అమ్మవార్లకు మొక్కులు ఉంటాయి. శనివారం సాయంత్రం వనప్రవేశం చేస్తారు. ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం సాయంత్రానికే లక్షమందికి పైగా భక్తులు వచ్చారు. గురువారం, శుక్రవారం మరో ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తాగునీరు, సానిటేషన్, బందోబస్తు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లను కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జాతర నోడల్ అధికారి క్రాంతి బుధవారం పరిశీలించారు. భక్తులకు శానిటేషన్, మంచినీరు, స్నానపుగదులు, దుస్తులు మార్చుకునే గదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన సమయంలో తీసుకునే చర్యలను అధికారులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా సందడి.. సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది. జిల్లాలో రేకుర్తితో పాటు శంకరపట్నం, హుజూరాబాద్, వీణవంక, వేగురుపల్లి– నీరుకుల్ల, చింతకుంట(శాంతినగర్), చొప్పదండి మండలంలోని ఆర్నకొండ తదితర ప్రాంతాల్లో జాతర ఘనంగా ప్రారంభమైంది. సారలమ్మ తల్లి ఆగమనంతో అన్ని ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. అందుకు అనుగుణంగా అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేటి నుంచి సమక్క,సారలమ్మ జాతర
-
వనంలో జనజాతర
-
మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
సాక్షి, హైదరాబాద్ : సమ్మక్క - సారలమ్మల మహాజాతర సందర్భంగా పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగం పేట ఎయిర్ పోర్టు వరకు హెలికాఫ్టర్ సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు. (మేడారం జాతర: నిలువెత్తు దోపిడి) హైదరాబాద్ నుండి ఆరుగురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలుతో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. విమాన సర్వీసులతో పాటు సమ్మక్క, సారలమ్మ దర్శనం కల్పిస్తామని, అదేవిధంగా రూ.2999 అదనంగా చెల్లిస్తే మేడారం జాతరను హెలికాప్టర్ ద్వారా తిలకించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ అద్బుత అవకాశం కల్పించిందన్నారు. పర్యాటకులు ఈ సదుపాయన్ని ఉపయోగించుకునేందు 9400399999 నంబర్‌ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (మేడారం జాతర : మండమెలిగె.. మది వెలిగె) మేడారంకు ప్రత్యేక రైళ్లు మేడారం జాతర సందర్భంగా సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి వరంగల్‌కు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ శనివారం ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-వరంగల్ (07014/07015) స్పెషల్ ట్రైన్ ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 3.40 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు సాయంత్రం 5.45కు వరంగల్ నుంచి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్-వరంగల్ (07017/07018) స్పెషల్ ట్రైన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు బయల్దేరి ఉదయం 9.30 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు ఉదయం 11 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. -
మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు
-
ఫిబ్రవరి 6న గద్దెపైకి సమ్మక్క
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో 2020లో నిర్వహించే శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి గడియల ఆధారంగా నిర్ణయించిన జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటిం చారు. ఆదివారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువస్తారు. 6న గురువారం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తెస్తారు. 7న వనదేవతలకు మొక్కుల చెల్లింపు, 8న తల్లుల వనప్రవేశం ఉంటుందని వెల్లడించారు. మహాజాతర తేదీల ఖరారుకు సంబంధించిన లేఖను మేడారం దేవాదాయశాఖ అధికారులకు అందజేయనున్నట్లు పేర్కొ న్నారు. 2018లో జరిగిన మహాజాతరకు సంబంధిం చిన తేదీలను 6 నెలల ముందుగా ప్రకటించిన పూజారులు 2020లో జరిగే జాతర తేదీలను మాత్రం 9 నెలలు ముందుగా ప్రకటించారు. జాతర తేదీలను ముందుగా ప్రకటించడంతో అభివృద్ధి పనులు, ఏర్పాట్లు చేపట్టడానికి ప్రభుత్వానికి వీలుంటుంద న్నారు. సమావేశంలో పూజారుల సంఘం ప్రధాన కార్యదర్శి చందా గోపాల్‌రావు, ఉపాధ్యక్షు డు కాక సారయ్య, కార్యదర్శులు సిద్దబోయిన స్వామి, భోజరావు తదితరులు పాల్గొన్నారు. వరుస ఎన్నికలతో నిధుల ప్రతిపాదనలు మూలకు.. 2018లో జరిగిన పెద్ద జాతరకు హాజరైన సీఎం కేసీఆర్ జాతర శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చారు. దీంతో జాతర అనంతరం ఆ మేరకు చేపట్టనున్న అభివృద్ధి పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ముంద స్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత పార్లమెం టు ఎన్నికలు, ఆపై స్థానిక సంస్థల ఎన్నికలు రావడం తో జాతర నిధుల విషయం అటకెక్కింది. -
సార్ హామీ.. నెరవేరదేమి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరొందిన మేడారం మహాజాతర అభివృద్ధి పనులు మళ్లీ అటకెక్కాయి. జాతర జరిగే నాలుగు రోజుల్లో ఇక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు ఎడాపెడా హామీలు గుప్పించడం, అంతకు ముందు రెండు నెలల పాటు పనుల పేరుతో అధికారులు హడావుడి చేయడం తప్ప.. మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడంపై ఎవరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క–సారలమ్మ మహాజాతరను పురస్కరించుకుని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా ఇచ్చిన హామీలు నాలుగున్నర నెలలు గడిచినా ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు కోటికి పైగా మంది భక్తులు వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని సమ్మక్క– సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. మూడో రోజు సీఎం రాక.. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో మహా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర మూడో రోజున సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా మేడారాన్ని సందర్శించారు. వనదేవతల దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తాం.. 2018–19 బడ్జెట్లోనే ఈ నిధులు మంజూరు చేస్తాం.. జాతరకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖకు ఇక్కడ తగినంత స్థలం అందుబాటులో లేదు.. జాతర ఏర్పాట్ల కోసం కనీసం 200 నుంచి 300 ఎకరాల స్థలం కావాలి.. ఎంత ఖర్చయినా ఇక్కడ భూమిని సేకరిస్తాం.. ఈ విషయాలపై చర్చించేందుకు జాతర ముగిసిన తర్వాత తాను 15 రోజుల్లో మరోసారి మేడారం వచ్చి అధికారులతో మాట్లా డతా’’ అని పేర్కొన్నారు. అంతేకాదు జంపన్న వాగులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీరు ఉండేలా డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైనందుకు తాను మొక్కులు చెల్లించానని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలని తిరిగి వనదేవతలను మొక్కుకున్నట్లు చెప్పారు. ఒక్కటీ జరగలేదు.. జాతర ముగిసి నాలుగున్నర నెలలు గడిచినా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. 15 రోజుల్లో మళ్లీ మేడారం వచ్చి అ«ధికారులతో సమావేశం ఏర్పా టు చేస్తానన్న సీఎం.. ఇటువైపు కన్నెత్తి కూడా చూ డడం లేదు. దీంతో 200 ఎకరాల స్థల సేకరణ అంశం మరుగున పడిపోయింది. తర్వాత రాష్ట్ర బడ్జెట్ 2018–19లో మేడారం జాతరకు ఒక్క రూ పాయి కూడా కేటాయించలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్న అభివృద్ధి పెరి గింది. అయితే అంతకు రెట్టింపు సంఖ్యలో జాతర ప్రాధాన్యత పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ వంటి వీఐపీలు గత జాతరలో మేడారం వచ్చారు. దేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన సంక్షేమశాఖ మంత్రులు వస్తున్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా మేడారం వచ్చే భక్తు ల సంఖ్య పెరిగింది. సెలవుదినాల్లో వందల వాహనాలు మేడారం వైపు పరుగులు పెడుతున్నా యి. ఈ నేపథ్యంలో ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జాతర సమయంలో తప్పితే ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడక పోవడంతో అభివృద్ధి పనుల్లో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. 2016 జాతర సమయంలో రూ. 14 కోట్లతో తలపెట్టిన నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం నేటికీ పూర్తి కాకపోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఒక్క ఎకరమే.. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఈ పల్లెలో 155.8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. సమ్మక్క–సారలమ్మకు కేవలం ఎకరం భూమి మాత్రమే ఉంది. మేడారం పరిసరాల్లో మొత్తం 155.08 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో 8 ఎకరాల్లో ప్రభు త్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాం కేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. జాతర జరిగే సమయంలో యంత్రాంగం ఈ భూముల ను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. అయితే శాశ్వతంగా వనదేవతలకు భూములను కేటాయించలేదు. జాతర సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చాలని భక్తులు కోరుతున్నారు. -
మేడారం హుండీ ఆదాయం రూ. 7 కోట్లు
హన్మకొండ కల్చరల్: జయశంకర్భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారక్క మహాజాతర హుండీల లెక్కింపు మూడో రోజు గురువారం కొనసాగింది. హన్మకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు రాత్రి 8 గంటల వరకు జరిగింది. దేవాదాయ శాఖ ఎస్జీఎఫ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయశాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, మేడారం జాతర ఈఓగా వ్యవహరించిన తాళ్లూరి రమేష్‌బాబు, దేవాదాయశాఖ జేఈఓ కట్టా అంజనీదేవి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రాముల సునీత, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ బెయిల్సింగ్, మేడారం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, ధర్మకర్తలు జవహర్లాల్, సారయ్య, లింగయ్య, ట్రస్ట్ బోర్డు కోఆప్షన్ సభ్యులు, మేడారం జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర వడ్డె చింతబోయిన నర్సింగరావు పాల్గొని పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు మూడో రోజు లెక్కింపు ముగించిన తర్వాత తాళ్లూరి రమేష్‌బాబు ఆదాయం వివరాలు ప్రకటించారు. మూడో రోజు 140 హుండీలను లెక్కించగా ఆదాయం రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల నలభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ.2,48,46,341 ) రూపాయలు లభించాయని, మొదటి రోజు ఆదాయం రూ. 1,72,40,000, రెండో రోజు ఆదాయం రూ. 3,15,00,000లతో కలుపుకుని ఏడు కోట్ల మూఫ్పై ఏడు లక్షల ఎనభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ. 7,35,86,341) ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత మూడు రోజులుగా 342 హుండీలను తెరిచి లెక్కించామని పేర్కొన్నారు. గురువారం నగదును హెచ్డీఎఫ్ఫీ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు నక్కలగుట్ట బ్రాంచ్‌లో జమ చేశారు. పోలీస్ బందోబస్తు కొనసాగింది. 350 మంది సిబ్బంది లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల మొక్కుబడుల్లో వింతలు.. ఒకే భక్తుడు రూ.2 లక్షల యాబై వేల రూపాయలను.. రూ.2 వేలు, రూ.5 వందల నోట్ల కట్టలను మూటగా కట్టి వేశాడు. మరో భక్తుడు రూ.లక్ష పదహారువేలను హుండీలో వేసి ‘తన కూతురికి వివాహం కావాలని, మనవడు పుట్టాలని.. వచ్చే జాతర నాటికి తన భార్య కూతురు, అల్లుడు మనవడితో జాతరకు వస్తానని ఓ పేపర్‌పై రాశాడు. మరొకరు రూ.5 వందల నోటుపై ‘సేవ్ వాటర్, సేవ్ ట్రీస్’ అని రాశారు. అలాగే, ఒకే వ్యక్తి 400 అమెరికన్ డాలర్లు వేయడం విశేషం. కంబోడియా, నేపాల్ మలేషియా, అరబ్ దేశాల కరెన్సీ ఎక్కువగా వచ్చాయి. -
ఆహ్వానం అనిర్వచనీయం
భూపాలపల్లి : వనం నుంచి జనంలోకి సమ్మక్క రాకను పురస్కరించుకుని చిలకలగుట్ట దగ్గర ప్రభుత్వం తరపున గాలిలో కాల్పులు జరిపి ఆహ్వానం పలకడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిందని జయశంకర్ జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ అన్నారు. ట్రైనీ ఐపీఎస్‌గా, భద్రాచలం ఓఎస్డీగా గతంలో రెండు సార్లు జాతరలో నిర్వహణలో పాల్గొన్నా.. తన కెరీర్లో 2018 జాతర ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. మహా జాతర విజయవంతంగా ముగిసిన సందర్భంగా.. జాతరలో తన అనుభూతులు, అనుభవాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. టెక్నాలజీ సాయంతో.. గతంతో పోల్చితే ఈసారి జాతర నిర్వహణలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించాం. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు పొందాం. ముఖ్యంగా రద్దీ నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో సహకరించాయి. గత జాతరలో ఐటీడీఏ గెస్ట్‌హౌస్ వైపు ఉన్న క్యూలైన్ ద్వారా ఎక్కువ మంది దర్శనం చేసుకునేవారు. ఆర్టీసీ క్యూలైన్ వైపు రద్దీ తక్కువ ఉండేది. దీంతో ఐటీడీఏ క్యూలైన్‌పై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకున్నాం. ఈ క్యూలైన్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని గమనించిన వెంటనే హరిత హోటల్ దగ్గర ఉన్న చెక్‌పోస్టు సిబ్బందిని అలర్ట్ చేశాం. వారు జంపన్న వాగు నుంచి వచ్చే భక్తులను ఆర్టీసీ క్యూ లైన్ వైపు మళ్లించాం. డ్రోన్ కెమెరాల వినియోగంతో అన్ని రోడ్లను మానిటరింగ్ చేశాం. ఎక్కడైనా రద్దీ పెరిగిపోతున్నట్లు గమనిస్తే వెంటనే అక్కడికి అదనపు సిబ్బందిని పంపాం. వీడియో మానిటర్ స్క్రీన్లు ఉపయోగపడ్డాయి. వీటి ద్వారా 33 మంది తప్పిపోయిన వారిని వెతికి పట్టుకున్నాం. క్రౌడ్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలు సాధ్యమైనంత కచ్చితత్వంతో సేకరించాం. లైటింగ్ పెరగాలి... జాతర జరిగే మేడారం, ఊరట్టం, ఆర్టీసీ బస్‌స్టేషన్, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, రెడ్డిగూడెం, జంపన్నవాగు వంటి ప్రదేశాల్లో రాత్రి వేళ లైటింగ్‌ను పెంచాలి. అన్ని చోట్ల మంచినీటి సౌకర్యం కల్పించాలి. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి గట్టమ్మ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. గుట్ట మలుపులో ఈ ఆలయం ఉంది. పక్కన ఎక్కువ స్థలం అందుబాటులో లేదు. ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పార్కింగ్ ఏరియాను విస్తరించాలి. మేడారం జాతరను సందర్భంగా అనుమానితులుగా ఉన్న దొంగలను ముందుగానే అదుపులోకి తీసుకున్నాం. ఇలా సుమారు 70 మందిని అదుపులో ఉంచుకున్నాం. జాతర సందర్భంగా వివిధ నేరాలకు పాల్పడుతున్న మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నాం. -
నేడు తిరుగువారం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో సమ్మక్క–సారలమ్మకు నేడు (బుధవారం) తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగిన మహా జాతర తల్లుల వనప్రవేశంతో ముగిసిన విషయం తెలిసిందే. గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనప్రవేశం అయ్యేంత వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించిన పూజారులు బుధవారం తిరుగు వారం పండుగ నిర్వహించనున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఒర్చుకుని తల్లుల చెంతకు వచ్చిన మొక్కులు చెల్లించిన భక్తజనాన్ని, గ్రామస్తులను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ తిరుగువారం పండుగ సందర్భంగా దేవతలను వేడుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా దేవతలను మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలిరానున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు తిరుగువారం పండుగా నిర్వహిస్తారు. పూజారులు గుడిని నీటితో శుద్ధి చేయనున్నారు. పూజారులు తలస్నానాలు అచారించి గుడిలో సమ్మక్క తల్లికి ధూప, దీపాలతో ప్రత్యేక పూజాలు నిర్వహిస్తారు. యాటను బలిచ్చి నైవేద్యంగా పెడతారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో కూడా పూజారులు తిరుగువారం పండుగాను నిర్వహిస్తారు. ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి వస్త్రాలు, పూజ సామగ్రిని శుద్ధి చేస్తారు. వడెరాల కుండాలను పసుపు, కుంకుమలతో అలకరిస్తారు. సారలమ్మకు ధూప, దీపాలతో పూజలు నిర్వహిస్తారు. తిరుగువారం పండుగతో తల్లుల పూజలు ముగిస్తాయి. మహా జాతరలో తల్లుల సేవలో తరించిపోయిన పూజారులు తిరుగువారం పండుగ పూజల అనంతరం మళ్లీ ఏడాది మధ్యలో నిర్వహించే మినీ జాతర వరకు సా«ధారణ వ్యక్తులుగా మారిపోతారు. పూజారుల ఇళ్లలో కూడా.. మేడారం కన్నెపల్లిలోని సమ్మక్క–సారలమ్మ పూజారులు, ఆదివాసీలు తమతమ ఇళ్లలో తిరుగువారం పండుగాను ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసుకుని ఇంటిì గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. అమ్మవార్ల గుడికి వెళ్లి కూడా పూజలు నిర్వహిస్తారు. కోళ్లు, యాటలను సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. పండుగ సంరద్భంగా సమ్మక్క గుడి వద్ద కూడా ఆదివాసీలు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా ఇంటికి ఆహ్వానించిన బంధువులు, ఆడబిడ్డలకు కొత్త దుస్తులు పెట్టి సాగనంపుతారు. ఈ సందర్భంగా బంధువులు పూజారుల ఆశీస్సులు తీసుకుంటారు. మంగపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ముగిసి మూడు రోజులు అవుతోంది. నేడు తిరుగువారం పండుగ అయినప్పటికీ భక్తులు ఇంకా మేడారానికి వస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించి గద్దెల సమీపం ప్రాంతాలు, ఆర్టీసీ బస్‌పాయింట్ వద్ద వంటలు వండుకుని భోజనాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. బుధవారం తిరుగువారం పండుగ రోజు సమక్క–సారలమ్మను దర్శించుకునేందుకు కూడా భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
అప్పుడే తేలిపోయింది
ములుగు: మేడారం జాతరలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, నల్లాల పనితీరు తేలిపోయింది. రూ. కోట్లు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. వాస్తవానికి సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసినప్పటికీ, సంప్రదాయం ప్రకారం మరో వారంపాటు తిరుగు వారం పేరుతో వేలాది మంది అమ్మలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శనివారం అమ్మలు వన ప్రవే శం చేసినా.. ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. పలు ప్రాంతాల్లో మరుగుదొడ్ల, మంచినీటి నల్లాలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్లు లేవు.. నీళ్లు రావు.. మహా జాతరను పురస్కరించుకుని ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఈసారి 10 వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఇందులో సుమారు 6 వేల మరుగుదొడ్లను ప్రధానంగా చిలుకలగుట్ట, జంపన్న వాగు స్నానఘట్టాలు, పడిగాపురం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, ఆర్టీసీ బస్ పాయింట్, కొంగల మడుగు, నార్లాపురం, చింతల్‌క్రాస్‌తో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో నిర్మించారు. వాటికి నీటి సరఫరా విషయంలో మొదట్లో తడబడిన అధికారులు జాతర ముగింపు సమయంలో తేరుకుని భక్తుల అవసరాలకు అనుగణంగా అందించడంతో సఫలీ కతమయ్యారు. కాని, శనివారం రాత్రి నుంచి మరుగుదొడ్ల తీ రు అధ్వానంగా మారింది. అత్యవసరానికి మరుగుదొడ్ల వైపు పరుగులు తీసిన భక్తులకు నిరాశను కల్పించిం ది. ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల ద్వారాలు, బేషన్లు పూర్తిగా ధ్వంసమై ఉం డడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా జాతర పరిసరాల్లో మహిళాలు తంటాలు పడ్డా రు. జంపన్న వాగు పక్కన సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు, శాశ్వ త ప్రాదిపదికన నిర్మించిన సులభ్ కాం పెక్స్‌లను ఆశ్రయిం చారు. మరుగుదొడ్ల సంగతి ఇలా ఉండగా.. వంటలు, ఇతర అవసరాల కోసం అధికారులు ఏర్పా టు చేసిన నల్లాలు అలంకార ప్రాయంగానే మారాయి. నల్లా ల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో నల్లాలు నేలకొరిగి కనిపించాయి. మొత్తానికి జాతర జరిగిన నాలుగు రోజులు మాత్రమే పనికి వచ్చే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారని భక్తులు వాపోయారు. -
నాలుగు రోజులు.. మొక్కుల పరవళ్లు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం.. ఓ అద్భుతం.. సమ్మక్క–సారలమ్మ జాతర పేరుకే నాలుగు రోజుల పండుగ.. కానీ, ఈ మహా ఘట్టం నడక మాత్రం దాదాపు నెల రోజులకుపైగా సాగింది. జనవరి నెలలో సంక్రాంతి సెలవులతో ఊపందుకున్న భక్తుల రాకపోకలు తల్లుల వన ప్రవేశం ముగిసినా.. ఇంకా కొనసాగుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మహా జాతర ఎంతో కనుల పండువగా సాగింది. సంక్రాంతి పండుగ తర్వాత రోజుకు లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు జాతరకు ముందస్తుగా తరలివచ్చి మొక్కులు చెల్లించారు. గుడిమెలిగె, మండమెలిగె పండుగతో ప్రారంభమైన జాతర సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి వచ్చేంత వరకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి తరలివచ్చారు. ఆనాటి నుంచి జాతర నాలుగు రోజుల్లో కోటి మంది భక్తులు తరలివచ్చి దేవతలను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 31న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనంతో భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 1న వరాల తల్లి సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరడంతో భక్తులతో మేడారం పోటెత్తింది. 2న సర్వత్ర మొక్కులు చెల్లించి మనసార అమ్మలను దర్శించుకున్నారు. 3న సమ్మక్క చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపెల్లికి వనమెళ్లగా, పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు వెళ్లారు. అయినప్పటికీ ఆదివారం రోజు కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చిన మొక్కులు చెల్లించారు. ఇబ్బందు పడిన భక్తులు... జాతర ప్రారంభానికి ముందుగా భక్తులకు అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లు భక్తుల రద్దీ పెరగడంతో కులాయి వద్ద నీళ్లు లేకపోవడంతో భక్తులు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడ్డారు. జాతరకు వారం రోజుల ముందే మేడారానికి తరలిచ్చిన భక్తులకు తాగునీటి సమస్య వెంటాడింది. అధికారులు మేల్గొనప్పటికీ అంతంతా మాత్రంగానే తాగునీటిని సరఫరా చేశారు. రెడ్డిగూడెం రోడ్లన్నీ కూడా బురదగా మారడంతో రోడ్లపై నడిచేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి బుధ, ఆదివారాల్లో సైతం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి విడిది చేసి అమ్మలకు మొక్కులు చెల్లించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. సెలవు రోజుల వచ్చిదంటే ఆ రోజు మేడారం అంత భక్తులతో కిటకిటలాడుతోంది. మాయమైన మహా నగరం... తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులతో కుగ్రామంగా ఉన్న మేడారం మహా నగరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతర ప్రాంతంలో గుడారులు వేసుకుని అమ్మల రాక కోసం ఎదురుచూశారు. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలకు మొక్కులు చెల్లించారు. దేవతల వనప్రవేశంతోనే భక్తులు సైతం తమ గ్రామాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో మహా నగరం ఒక్కసారి గా మాయమైనట్లుగా కనిపిస్తోంది. -
బోసిపోయిన మేడారం
మహా నగరంగా మారిన మేడారం ఖాళీ అవుతోంది. ఆదివాసీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మ శనివారం వన ప్రవేశం చేడయంతో జాతర వచ్చిన భక్తులు, వ్యాపారస్తులు ఇంటి దారి పట్టారు. దీంతో ఆదివారం జాతర ప్రాంగణం ఖాళీగా దర్శనమిచ్చింది. నిన్నమొన్నటి వరకు భక్తులతో కిటకిటలాడిన జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. ట్రాఫిక్ రోదనలు, భక్తుల కోలాహలం కనిపించిన మేడారం ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. ఏటూరునాగారం: ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతరైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అశేష భక్తజనం తరలివచ్చారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన మహా జాతర శనివారం దేవతల వనప్రవేశంతో ముగిసింది. భక్తులంతా వచ్చిన దారికి తిరుగు పయనమయ్యారు. జనవరి 12 నుంచి ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు జాతరకు వచ్చి భక్తులకు తన వస్తువులను అమ్ముకుని వ్యాపారాన్ని సాగించుకున్నారు. ఆశించిన మేర వ్యాపారం సాగకపోవడంతో మిగిలిన సామానును వెనుకకు పట్టుకుపోలేక రూ. 50, వంద రూపాలయ విక్రయించడం మొదలు పెట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వీరికి బొమ్మలు, ఇతర వస్తువులను అగ్గువకు విక్రయించడం గమనార్హం. వ్యాపారులకు పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చాయని, లాభాలు రాలేదని వాపోయారు. మిగిలిన సామానును తీసుకెళ్లే ట్రాస్టుపోర్ట్ భారం మీద పడుతుందని, ఇక్కడే తక్కువకు విక్రయిస్తున్నట్లు అన్నం కృష్ణ అనే వ్యాపారి తెలిపారు. కొంత మంది వ్యాపారులు వారి సామగ్రిని సర్దుకుని తిరుగు ప్రయాణం కట్టారు. మేడారం జాతరలోని షాపులన్ని దాదాపుగా ఖాళీ కావడంతో అంతా బోసిపోయి కనిపిస్తోంది. మళ్లీ రెండేళ్లకు వస్తా.. తల్లీ సల్లంగా చూడు.. అని వ్యాపారులు వారివారి సొంత గ్రామాల దారిపట్టారు. దీంతో మేడారం అంతా ప్యాకప్ అయ్యింది. మ్యూజియం మూసివేత... మేడారం వచ్చే పర్యాటక భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆదివాసీ మ్యూజియాన్ని మూసివేశారు. మేడారం జాతర సందర్భంగా హడావుడి చేసి ప్రారంభించిన మ్యూజియానికి ఎవరు రావడం లేదనే సాకుతో మూసివేయడం బాధాకరం. సెలవు దినాలు, ఇతర సమయాలో కూడా మ్యూజియాన్ని ప్రదర్శనకు ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. మేడారం వచ్చే వారికి దేవతలను దర్శించుకోవడమే కాకుండా ఇలాంటి పూర్వపు కాలపు చరిత్రలను తెలిపే మ్యూజియం పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు. పేరుకుపోయిన ఖాళీ సీసాలు జాతరకు వచ్చిన భక్తులు తాగి పడేసిన బీరు సీసాలు, వాటర్ బాటిళ్లను ప్రతి ఒక్కటిని సేకరించే పనిలో పడ్డారు కొంత మంది పాతసామాను సేకరించే వ్యాపారులు. మేడారం జాతరలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వేలాది బాటిళ్లు కుప్పలు తెప్పలు పేరుకుపోయాయి. వాటిని కొంత మంది పాతసామాను వ్యాపారులు పోగు చేసి రిసైక్లింగ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే బస్తాల్లో నింపి బాటిళ్లు సుమారు పది లారీల, ఇతర వాహనాల్లో వరకు తరలించుకుపోయారు. -
మేడారం జాతర సంపూర్ణం
-
వనంలోకి జనదేవత!
సాక్షి ప్రతినిధి, వరంగల్: భక్తుల ఇలవేల్పు.. కొంగు బంగారమై కోరికలు తీర్చే కల్పవల్లులు.. భక్త కోటిని చల్లగా కాచిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు వన ప్రవేశం చేశారు. భక్తులను కాపాడేందుకు మళ్లీ రెండేళ్లకు వస్తామంటూ వీడ్కోలు పలికారు. దీంతో సమ్మక్క–సారలమ్మ నినాదాల హోరుతో మార్మోగిన మేడారం గిరులు నిశ్శబ్దంలోకి జారిపోయాయి. భక్తుల పాద స్పర్శతో రేగిన ధూళిమేఘాలు ఆగిపోయాయి. సమ్మక్క–సారలమ్మతో పాటే పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు పయనమయ్యారు. వచ్చే జాతర నాటికి వస్తామంటూ భక్తులు ఇంటిముఖం పట్టారు. అక్కడక్కడ స్వల్ప ఇబ్బందులు తప్ప మేడారం జాతర ప్రశాంతంగా ముగిసింది. మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించేందుకు తులాభారం వేసుకుంటున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ మళ్లీ వస్తాం.. వనదేవతల వనప్రవేశంలో భాగంగా శనివారం సాయంత్రం 6.30 గంటలకు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజలు ప్రారంభమయ్యాయి. డోలు వాయిద్యాలు, బూరలు లయబద్ధంగా వాయిస్తూ గద్దెలపై పూజలు చేశారు. ఎవరికీ కనిపించకుండా చుట్టూ చీరలు అడ్డుగా పెట్టారు. సుమారు అరగంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత 6.50 గంటలకు సమ్మక్కను తీసుకుని పూజారులు గద్దె దిగారు. ఆ తర్వాత విడిది గృహం వద్దకు చేరుకుని నాగులమ్మను తాకి అక్కడ్నుంచి వేగంగా చిలకలగుట్టకు పయనమయ్యారు. సాయంత్రం 6.51 గంటలకు పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకుని మరికొందరు పూజారులు గద్దె దిగారు. చివరగా సాయంత్రం 6.55 గంటలకు సారలమ్మను తీసుకుని కన్నెపల్లికి బయల్దేరారు. అమ్మల వనప్రవేశ కార్యక్రమం జరిగినంత సేపూ భక్తులు రెప్ప వాల్చకుండా తన్మయత్వంతో తిలకించారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. మేడారం జాతర తొలిరోజు వరంగల్–పస్రా మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అనేకచోట్ల టాయిలెట్లకు నీటి సరఫరా కాలేదు. తాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మేడారంలో 4 రోజుల పాటు బస చేసి స్వయంగా పర్యవేక్షించారు. జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు కోటి మంది భక్తులు వనదేవతలను సందర్శించుకున్నట్లు అంచనా. జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ కర్ణన్, జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ భాస్కరన్ నిరంతరం జాతరను పర్యవేక్షించారు. ప్రముఖుల తాకిడి ఆదివాసీలు, సామాన్యుల జాతరగా పేరొందిన సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈసారి వీఐపీల తాకిడి పెరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరలో భాగంగా లగ్జరీ టెంట్లు, ఎకోటెంట్లు, హరిత హోటల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర నిఘాలో డ్రోన్ కెమెరాలను వినియోగించారు. వీఐపీల తాకిడి పెరగడంతో పలుమార్లు క్యూలైన్లు గంటల పాటు నిలిపేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన భక్తులు తరలివచ్చి నాలుగు రోజులు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతర విశేషాలు తెలుసుకునేందుకు అంతర్జాతీయ మీడియా ఈసారి ఇక్కడే 4 రోజుల పాటు ఉంది. తొలిసారిగా ఇటలీ, అమెరికా, సింగపూర్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు 4 రోజుల పాటు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం, క్యూలైన్లలో కొబ్బరి చిప్పలు, బెల్లం ముద్దలు పేరుకుపోవడంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మళ్లీ రెండేళ్లకు.. జాతర ముగియడంతో తిరిగి 2020 మాఘమాసంలో మేడారం జాతర జరగనుంది. మేడారం జాతర ముగియడంతో భక్తులు ఇంటి బాట పట్టారు. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. ఆర్టీసీ బస్సులు నిర్విరామంగా సేవలందించాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య పస్రా–తాడ్వాయి–మేడారం మధ్య ట్రాఫిక్ రద్దీ పెరగడంతో వన్‌వే విషయంలో సడలింపు ఇచ్చారు. ప్రైవేట్ వాహనాలను పస్రా–మేడారం మార్గంలో అనుమతించారు. -
మేడారంలో పోటెత్తిన భక్తులు
సాక్షి, భూపాలపల్లి: చివరి రోజైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. నాలుగు రోజుల పాటు జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ మహా జాతర శనివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో భారీ ఎత్తున భక్తులు మేడారానికి తరలివచ్చారు. అదేవిధంగా తెలంగాణ సీఎస్ ఎస్కె జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డిలు కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వారు సమీక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
నా జన్మ ధన్యమైంది...
మేడారం: మేడారం సమక్క–సారలమ్మలను వనం నుంచి జనంలోకి తీసుకువచ్చే బృహత్తర ఘట్టంలో అవకాశం లభించడంతో తన జన్మ ధన్యమైందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మేడారంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మలను తీసుకొచ్చే బృందంలో తనకు చోటు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనిని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయ ప్రస్థానంలో ఈ స్థాయికి చేరుకుని సేవలు అందించే భాగ్యం కలగడానికి కారణం అమ్మల ఆశీస్సులే అని అన్నారు. మేడారంలో ఉంటూ జాతరలో భక్తులకు సేవలు అందిస్తానని తాను ఊహించలేదన్నారు. మేడారంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య కార్మికులు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. మేడారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 56 స్వచ్ఛ ఆటోలు, 20 ట్యాంకర్లు, 600మంది పారిశుద్ధ్య కార్మికులు, 30మంది జవాన్లు, ఆరుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఒక సూపర్వైజర్తో పాటు ఎంహెచ్ఓలు జాతరలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారని మేయర్ చెప్పారు. ఇక నాలుగు రోజులుగా మేడారంలో సారలమ్మ, సమ్మక్క దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు తన వంతు బాధ్యతలను నిర్వర్తించినట్లు తెలిపారు. ఇక జాతరలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన, వసతులు ఏర్పాటు చేశామన్నారు. మూడు షిఫ్ట్‌ల్లో కార్మికులు జాతరలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నారని, తాను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. కాగా, గత పాలకుల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మేడారం జాతరలో భక్తులకు ఎన్నో విధాలుగా సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించుకున్న భక్తులకు అదే తరహాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సేవలు అందిస్తోందని చెప్పారు. -
ఆర్టీసీ ఆదాయం రూ. 9 కోట్లు
మేడారం: మేడారం మహాజాతరకు భక్తులను చేర్చడంతో ఆర్టీసీ కీలకపాత్ర పోషించిందని ఆర్టీసీ ఎండీ జీవీ రమణరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నంనాటికి ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాల నుంచి జాతరకు సు మారు 5 లక్షల మంది ప్రయాణికులను, జాతర నుంచి గమ్యస్థానాలకు సుమారు 2 లక్షల మందిని చేర్చినట్లు తెలిపారు. ఇలా ఆర్టీసీకి సుమారు రూ.9 కోట్ల ఆదా యం వచ్చిందని ఆయన వెల్లడించారు. పాత జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాల నుంచి సుమారు 2,200 బస్సులు నడుపగా ఇతర జిల్లాల నుంచి సుమారు 2000 బస్సులను అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. తొలిసారి ఉచితంగా.... నార్లాపూర్ నుంచి జంపన్న వాగుకు భక్తులను చేర్చేందుకు ఆర్టీసీ తొలిసారిగా ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసింది. జంపన్నవాగుకు ఉచిత బస్సుల ద్వారా సుమారు 40 వేల మందిని చేర్చారు. మహారాష్ట్ర సిరొంచ ప్రాంతం నుంచి జాతరకు తొలిసారిగా బస్సు సౌకర్యం కల్పించారు. సుమారు 40 బస్సు సర్వీసులు నడిపారు. జాతరకు వచ్చి తిరుగు ప్రయాణంలో ములుగు రోడ్డులో దిగి వరంగల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులను లింక్ బస్సుల ద్వారా ఉచితంగా చేర్చినట్లు ఎండీ రమణరావు తెలిపారు. దీంతోపాటు జాతరకు 6 వజ్ర 85 సూపర్ లగ్జరీ, 27 ఏసీ బస్సులు నడిపినట్లు ఆయన పేర్కొన్నారు. సేవలు అమోఘం : రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి భూపాలపల్లి: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రశంసనీయమైన సేవలు అందిస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 8 లక్షలమందికిపైగా భక్తులను తరలించినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న అనంతరం ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్‌లోని కంట్రోల్ కమాండ్ రూంలో ప్రయాణికుల క్యూరేలింగ్లను ఎండీ రమణారావు, ఈడీలు రవీందర్, పురషోత్తంనాయక్, సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎంలు సూర్యకిరణ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆర్టీసీ సేవలు భేష్.. మేడారం: మేడారం మహాజాతరకు అశేష భక్తజనాన్ని తరలిస్తున్న ఆర్టీసీ సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనం కోసం వచ్చిన ఆయన ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని భక్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులను క్షేమంగా ఇంటికి చేర్చాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా అంతకు ముందు ఆయన వాహనం భక్తుల మధ్య ఇరుక్కుపోవడంతో ద్విచక్ర వాహనంపై ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. చైర్మన్‌ను కలిసిన వారిలో అధికారులు ఆర్టీసీ ఎండీ జీవీ రమణరావు, పురుషోత్తం, సత్యనారాయణ, వెంకట్రావు, సూర్యకిరణ్, మునిశేఖర్, రాములు తదితరులు ఉన్నారు. -ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ -
పోలీసుల ఓవరాక్షన్
ములుగు: సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడానికి శుక్రవారం మేడారానికి చేరుకున్న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు దూకుడు ప్రదర్శిం చారు. నిబంధనల పేరుతో సామాన్య భక్తులను ము ప్పుతిప్పలు పెట్టారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు, సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో గంటపాటు భక్తులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అప్పటికే అమ్మలను దర్శించుకోవడానికి క్యూలైన్లలో ఉన్న భక్తులు తాగునీటి సౌకర్యం లేక, ఉక్కపోతతో తంటాలుపడ్డారు. ఉపరాష్ట్రపతి, సీఎంలు దర్శించుకొని తిరుగుపయనమైన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. భక్తులపై అరవడంతోపాటు వారిని నెట్టివేశారు. ముఖ్యంగా ఎగ్జిట్ గేటు వద్ద ఉన్న పోలీసులు తొందరగా ఖాళీ చేయాలంటూ మహిళలు, పురుషులు అని చూడకుండా పరుషభాషను ప్రయోగిస్తూ గేటు అవతలికి చొక్కాపట్టి మరీ లాగేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సింగరేణి రెస్క్యూటీం, కేయూ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు స్ట్రెచర్ల ద్వారా బాటధితులను హుటాహుటిన టీటీడీ కళ్యాణ మండపంలోని 50పడకల ఆస్పత్రికి తరలించారు. ప్రముఖుల రాకతో నిలిచిన దర్శనాలు ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమ్మవార్లకు మొక్కులు సమర్పించే క్రమంలో గద్దెల ప్రాంగణంలో భక్తులు ఎవరు లేకుండా పోలీసులు ఖాళీ చేయించారు. ఓపిక నశించిన భక్తులు క్యూలైన్ల నుంచే కేకలు వేశారు. పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం అసహనం కాటారం: మేడారం జాతరలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీసుల తీరుపై శుక్రవారం ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీస్ సిబ్బంది భక్తులను అదుపుచేయాల్సింది పోయి గుంపులుగుంపులు గా గద్దెల వద్దకు వెళ్లి బంగారం తీసుకోవడాన్ని వారు గమనించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు పలుమార్లు మైక్సెట్లో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పోలీస్ సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతోపాటు మంచె వద్దగల ఎమర్జెన్సీ గేట్‌ను తమ కుటుంబ సభ్యుల కోసం ఓ పోలీస్ అధికారి ఓపెన్ చేయించగా ఒకేసారి వందలాది మంది భక్తులు లోపలికి వెళ్లడానికి అక్కడికి చేరుకోవడంతో పెద్దఎత్తున తోపులాట జరిగింది. ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఓ పోలీస్ ఉన్నతాధికారిని అప్రమత్తం చేసి గేట్ వెంటనే మూసి వేయాలని ఆదేశించారు. మొన్న కాళిదాసు.. నిన్న కంపాటి.. నేడు సాయి చైతన్య.. ప్రతి మహాజాతర సమయంలో జిల్లా పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. 2014 మహాజాతరలో అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ కాళీదాసు ప్రణాళిక లోపంతో వరంగల్ రూరల్ జిల్లా గుడెప్పాడ్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రా వరకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. 2016 జాతరలో ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ జాతరలో యువ ట్రైనీ ఐపీఎస్ అధికారి సాయి చైతన్య, మరో ఇద్దరు ట్రైనీ పోలీసు అధికారులు డీఎస్.చౌహాన్, చేతన కలిసి గద్దెల వద్ద వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఉన్నప్పటికీ నెట్టివేయడంతో ముగ్గురు రిపోర్టర్లు పడిపోయారు. దీంతో మీడియా ప్రతినిధులు గద్దెల వద్ద ఉన్న వాచ్ టవర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఐజీ నాగిరెడ్డి వచ్చి మీడియా ప్రతినిధులకు నచ్చజెప్పినా శాంతించలేదు. ప్రతి జాతరలో పోలీసులు ఇదేతీరుగా వ్యవహరిస్తున్నారని ఆయనతో చెప్పారు. పోలీసులు డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేయడాన్ని వనదేవతల దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గమనించారు. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తే మీడియా ప్రతినిధులు బహిష్కరించే అవకాశాలుండడంతో ఐజీ నాగిరెడ్డి వచ్చి ఇప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చినప్పటికీ మీడియా ప్రతినిధులు గద్దెల వద్ద కవరేజీని బహిష్కరించారు. -
రాయల్ స్టాగ్ రూ.1,050 !
వరంగల్: మేడారం జాతరలో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. జాతరలో అధికారికంగా 22 మద్యం షాపులు ఏర్పాటుచేయగా.. యజమానులు సిండికేట్ అయి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సిండికేట్ వద్ద భారీ మొత్తంలో అధికారులు మాముళ్లు మాట్లాడుకున్నందునే పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. జాతరలోని హోల్‌సేల్ షాపుల నిర్వహకులు ఎంఆర్పీ రూ. 560 ఉన్న రాయల్‌స్టాగ్ బాటిల్‌ను చిరు వ్యాపారులకు రూ. 900 – 950కు ఇవ్వగా వారు రూ.100 కలిపి విక్రయిస్తున్నారు. ఇక ఆఫీసర్స్ ఛాయిస్ ఎమ్ఆర్పీ 110 అయితే.. ఇద్దరు చేతులు మారాక రూ.150, బీరు ధర రూ.150 చేరినా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం. కొబ్బరికాయ రూ. 40 .. కొత్తిమీర రూ.50 ములుగు రూరల్/వెంకటాపురం(కె): మండలంలోని గట్టమ్మ వద్ద టెండరు దక్కించుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇదంతా చూస్తూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరకు వెళ్తున్న భక్తులు గట్టమ్మకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నెల రోజులుగా భక్తుల సంఖ్యలో పెరిగింది. ఇదే అదనుగా కొబ్బరికాయల దుకాణదారుడు ఉదయం రూ. 40 చొప్పున, సాయంత్రం వరకు రూ.35 చొప్పున విక్రయిస్తున్నాడు. కాగా మేడారం మహాజాతరలో కొత్తిమీర కట్ట రూ.50కు విక్రయిస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మేకలు, కోళ్లతో మొక్కులు చెల్లిస్తున్నారు. అనంతరం మాంసం కూర వండుకుంటున్నారు. వాటిలో వేసుకునే కొత్తమీర కొనాలం టే ధర భారీగా ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు. అయినా తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. (కొత్తిమీర విక్రయిస్తున్న వ్యాపారులు ) ఏస్కో కల్లు సారా.. మేడారం జాతర అంటేనే కోళ్లు, యాటలు, కల్లు, మందుతో మజా చేసే ఉత్సవం. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూంటారు. తొలుత వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. అనంతరం విడిది చేసే ప్రాంతంలో కోళ్లు, యాటలు కోసుకుని సరదాగా గడుపుతుంటారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మేడారం సమీపంలోని కొంతమంది ప్రజలు చీప్‌లిక్కర్ మందు, తాటికల్లు, గుడాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. -
గద్దె వద్ద తొక్కిసలాట
ఏటూరునాగారం: గద్దెపైన సమ్మక్కను ప్రతిష్ఠించిన తర్వాత మొదటి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు గద్దెలపైకి ఎగబాకారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహిళలు కింద పడి పోలీసుల కాళ్లను పట్టుకుని పైకి లేచే ప్రయత్నిం చేశారు. ఈ క్రమంలో పలువురు భక్తులు తమ సెల్ఫోన్లు, పర్సులు పోగొట్టుకున్నారు. పోలీసుల ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుని కొందరు గాయపడ్డారు. సమ్మక్కకు మొక్కుల పరవళ్లు మేడారం: వనదేవత సమ్మక్కకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమక్కను మేడారంలోని గద్దెకు తీసుకొచ్చే ఆపూర్వ ఘట్టంలో ఆదివాసీ, గిరిజన సంస్కృతి అడుగడుగునా ప్రతిబింబించింది. అడవితల్లి సమ్మక్కను స్మరించుకుంటూ చిలకలగుట్ట నుంచి గద్దె వరకు భక్తులు నీళ్లతో అలికి వివిధ రకాలు ముగ్గుల వేసి తరించారు. రోడ్డుపై కోళ్లు, గొర్రెలు, మేకలు బలిచ్చి కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మను మనసారా వేడుకున్నారు. కొందరు ముగ్గులపై పూలు వేసి, నిమ్మకాయలు పెట్టి పసుపు, కుంకుమ రుద్దీ కొబ్బరికాయలు కొట్టి అక్కడే మొక్కులు చెల్లించారు. మరికొంత మంది ఆనందంతో బాణాసంచి కాల్చి సమ్మక్కకు స్వాగతం పలికారు. చెట్లు, బస్సులు ఎక్కి.. చిలకలగుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్కను తీసుకొచ్చే అపురూప క్షణాలను కనులారా వీక్షించేందుకు భక్తులు వివిధ మార్గాలను ఆశ్రయించారు. రోడ్డు పక్కన ఉన్న పెద్దపెద్ద చెట్లను, రోడ్డు పక్కన నిలిచిన బస్సులను ఎక్కి జై సమ్మక్క.. జై జై సమ్మక్క అంటూ నినాదాలు చేశారు. భక్తుల ఈలలు, కేరింతలతో చిలకలగుట్ట నుంచి మేడారం మార్గమంతా మార్మోగింది. ఈ సందర్భంగా పలువురు శివసత్తులు రోడ్డుపైన డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. మహిళలు పూనకంతో ఊగిపోయి సమ్మక్కను స్మరించారు. తల్లీ.. చల్లంగా చూడు అంటూ వేడుకున్నారు. -
సాహో సమ్మక్క
ఎస్ఎస్ తాడ్వాయి/ఏటూరునాగారం: కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవత.. వీరవనిత.. సమ్మక్క తల్లి అధికారిక లాంఛనాలు, భక్తుల జయజయధ్వానాలు, ఉయ్యాల పాటలు, ఒడిబియ్యపు జల్లులు, శివసత్తుల పూనకాల నడుమ చిలకలగుట్టను వీడి భక్తులను దీవించేందుకు మేడారంలోని గద్దెను అధిష్టించింది. తొలుత ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు, వడ్డెలు సమ్మక్కను గుట్ట నుంచి కిందకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జయశంకర్భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్, ఎస్పీ ఆర్. భాస్కరన్ ప్రభుత్వ లాంఛనాలతో అమ్మకు ఘనస్వాగతం పలికారు. చిలకలగుట్ట నుంచి మేడారంలోని గద్దెల వరకు 2.19 గంటల పాటు జరిగిన సమ్మక్క ప్రయాణం ఆద్యంతం కనుల పండుగగా, ఉద్విగ్నభరితంగా సాగింది. హోరెత్తిన చిలకలగుట్ట.. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తోడ్కొని వచ్చేందుకు పూజారులు సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దూప వడ్డే నాగేశ్వర్రావు, కొమ్ము బూర జనార్దన్ సాయంత్రం 4 గంటల సమయంలో చిలకలగుట్ట పైకి ఎక్కారు. ఈ సందర్భంగా అమ్మ రాక కోసం భక్తులు, ప్రభుత్వ అధికారులు గుట్ట కింద ఎదురుచూశారు. రెండు గంటల పాటు డప్పు వాయిద్యాలతో ఆది వాసీ నృత్యాలు చేశారు.జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్‌పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ భాస్కరన్, జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, జాతర చైర్మన్ కాక లింగయ్య నృత్యాలు చేశారు. గాలిలోకి నాలుగు సార్లు కాల్పులు.. సమ్మక్క ఆగమనం కోసం రెండు గంటలుగా అలుపెరుగకుండా భక్తులు చిలకలగుట్ట కింద ఎదురు చూశారు. ఈ క్రమంలో గుట్టపై నుంచి పూజారులు, వడ్డెలు దిగుతున్న ఆనవాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా భక్తులు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం సరిగ్గా 6:14 గంటలకు సమ్మక్కను తీసుకుని ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్ట దిగారు. ఆయనకు తోడుగా ప్రధాన పూజారులు, వడ్డెలు వచ్చారు. సమ్మక్క రాక సందర్భంగా ప్రభుత్వ లాంఛనంగా జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. గుట్ట నుంచి సమ్మక్క కొద్దిగా ముందుకు కదలగానే మొదటిసారిగా 6:15 గంటలు, రెండోసారి 6:17 గంటలకు, మూడోసారి 6.19, నాలుగోసారి చిలకలగుట్ట ఫెన్సింగ్ గేటు వద్ద 6:32 నిమిషాలకు గాలిలోకి కాల్పులు జరిపి అమ్మ రాకను భక్తులకు తెలిపారు. కాగా, రెండోసారి కలెక్టర్, ఎస్పీ ఇరువురు కలిసి గాలిలోకి కాల్పులు జరిపారు. దారిపొడవునా నీరాజనం.. మేడారంలోని గద్దెల వైపు సమ్మక్క ప్రయాణం ప్రారంభంకాగానే మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఒడిబియ్యం విసిరారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క రాక అపురూప క్షణాలను పురస్కరించుకుని యాటలు, కోళ్లు బలిచ్చారు. సమ్మక్కను కనులారా వీక్షించేందుకు దారికి ఇరువైపులా ఉన్న గోడలు, ఇళ్లు, చెట్లు, వాహనాలు ఎక్కి వరుసగా నిలబడి చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి 8:33 గంటలకు గద్దెపైకి.. గద్దెల ప్రాంగణంలోకి 8:20 గంటలకు సమ్మక్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అక్కడ పది నిమిషాల పాటు పూజారులు రహస్య పూజ లు నిర్వహించారు. తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఆలయ ప్రాంగణంలో వెలు గులు ప్రసరించే సమయానికి పగిడిద్దరాజు గద్దె వద్ద సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సరిగ్గా 8:33 గంటలకు సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిం చారు. అక్కడ పూజ లు నిర్వహించిన తర్వాత 8:40 గంటలకు సారలమ్మ గద్దె వద్దకు వెళ్లిన సమ్మక్క పూజారులు బిడ్డకు తల్లి ఆశీస్సులు అందించారు. నలుగురు ఒక్కచోట.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరా జు లు గద్దెలపై ఉండడంతో తల్లులను దర్శించుకునేందు కు భక్తులు పోటీపడ్డారు. జంపన్నవాగు, గద్దెల అన్ని దారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తొలి రోజు ట్రాఫిక్ జామ్ కారణంగా రాని భక్తులు గురువారం మేడారానికి పెద్దసంఖ్యలో వచ్చారు.తల్లులను దర్శిం చుకున్న భక్తులు తిరుగుపయనమయ్యారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించిన వెంటనే జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ వీపీ గౌతమ్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు గద్దెపైకి చేరుకుని తొలి మొక్కులు చెల్లించారు. -
సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగిన సీఎం!
సాక్షి, వరంగల్ : మేడారం జాతరకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే... సీఎం రమణ్‌సింగ్ గురువారం జారతకు వచ్చారు. ఆయన సమ్మక్కను దర్శించుకుని సారలమ్మ వద్దకు వెళుతుండగా మరోవైపు...క్యూలైన్లోని భక్తులు సమ్మక్క గద్దెపైకి కొబ్బరి కాయలు విసిరారు. అదే సమయంలో సీఎం రమణ్ సింగ్ అక్కడే ఉండటంతో కొబ్బరికాయలు వేగంగా వచ్చి పడ్డాయి. అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన సురక్షితంగా అక్కడ నుంచి బయటపడ్డారు. దీంతో ఆయన సారలమ్మను దర్శించుకోకుండా తిరుగు ప్రయాణం అయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,గవర్నర్ నరసింహన్, కేంద్ర కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఓరం తదితరులు శుక్రవారం మేడారం జాతరకు రానున్నారు. ఈ నేపథ్యంలో గద్దెల ప్రాంగణం సమీపంలో తాత్కాలిక హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మేడారం చేరుకొని, 1.25 గంటలకు గద్దెల ప్రాంగణానికి వస్తారు. ఇరవై నిమిషాలపాటు అక్కడే ఉండి, సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. -
పరిమితంగా బీఎస్ఎన్ఎల్ సేవలు
మేడారం: జాతరలో భక్తులకు ఉచితంగా ఇంటర్నెట్ డాటా సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేసిన బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు పరిమితంగా అందుబాటులోకి వచ్చాయి. జాతర జరిగే ప్రాంతాల్లో 20 హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసి ఒకరికి 500 ఎంబీ డాటా ఉచితంగా లక్షలాది మందికి అందిస్తామని బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రకటించారు. కానీ ఐటీడీఏ, అమ్మవారి గద్దెలు, జంపన్నవాగు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో తప్పా, రెడ్డిగూడెం, శివరాంసాగర్, కొత్తూరు, బస్టాండ్, నార్లాపూర్, కాల్వపల్లి తదితర ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉచిత డాటా సౌకర్యం అధికారులకు మాత్రమే ఉపయోగపడ్డాయి తప్పా భక్తులు వినియోగించుకోలేకపోయారు. ఇతర ప్రైవేట్ సంస్థలకు సైతం డాటా ప్రొవైడ్ చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. డాటా లేకున్నా కాల్స్ కూడా చేసుకోలేని పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు ఆవేదన చెందారు. కాల్స్ కూడా అంతంతే... మేడారం జాతరలో పెద్ద సంఖ్యలో టవర్లు ఏర్పాటు చేసి భక్తులకు సిగ్నల్ అందిస్తామని ఊదర కొట్టిన సెల్ కంపెనీలు వాస్తవంలో ఎలాంటి సదుపాయాలు అందించడంలో ఘోరంగా విఫలమయ్యా యి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సుమారు 16 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు రోజూ ఒకేసారి 3.5లక్షల మంది మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేయగా, అందుబాటులోకి తేలేకపోయింది. దీంతో భక్తులు సెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. -
మేడారానికి పయనమైన గోవిందరాజులు
ఏటూరునాగారం: సమ్మక్క మరిది గోవిందరాజులు బుధవారం మేడారానికి బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. గుడిలో గోవిందరాజుల ప్రధాన పూజారి దబ్బగట్ల జనార్దన్, వడ్డె పొదెం బాబు, దబ్బగట్ల కిష్టయ్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముం దుగా గోవిందరాజుల ఆలయం వద్ద తహసీల్దార్ నరేందర్ సమక్షంలో దబ్బగట్ల వంశస్తులు గోవిందరాజులను వడ్డెలకు అప్పగించారు. డప్పుచపుళ్ల నడుమ గోవిందరాజుల పడగను వడ్డె పొదెం బాబు ఎత్తుకొని నాగుల చుట్టూ ప్రదక్షిణలు చేసి బయలుదేరడంతో భక్తులు, గ్రామస్తులు బెల్లపు శాకను ఆరబోశారు. నీళ్లతో స్వాగతం పలుకుతూ మల్యాలలోని సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. వడ్డె పాదాలకు పసుపు, కుంకుమ్మపూసి దూపం వేసి పూజలు చేశారు. అనంతరం సమ్మక్కను సాదుకున్న మల్లెల మూర్తి ఇంటిలోకి కింద నేలను తాకకుండా చాపలు, చద్దర్లను వేసి లోనికి పూజారులు, వడ్డెలను పడగను పట్టుకొని వెళ్లడంతో వారి సంప్రదాయబద్ధంగా ముడుపులు చెల్లించి వడ్డెలకు పాలను ఇచ్చారు. పాలు తాగిన వడ్డెలు మళ్లీ గోవిందరాజులను కొండాయికి తీసుకువచ్చేవరకు ఇలా ఉపవాసంతో ఉండడం వారి ఆనవాయితీగా వస్తోంది. గోవిందరాజులు వెళ్లే క్రమంలో అందరు నేలపై పడుకుంటే వారిపై నుంచి ఆయన దాటిపోతే సకల సౌభాగ్యాలు కలుగుతాయని వారి ప్రగాఢ నమ్మకం. అనంతరం అడవి మార్గంలో గోవిందరాజులను మేడారానికి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై బత్తుల సత్యనారాయణ, స్పెషల్ పార్టీ పోలీసులు భారీ బందోబస్తు నడుమ గోవిందరాజులను మేడారానికి సాగనంపారు. అంతేకాకుండా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో గ్రేహౌండ్స్ దళాలు అడవిలో పెద్ద ఎత్తున మోహరించాయి. కాగా గోవిందరాజులను తీసుకెళ్లే రోడ్డు మార్గం బాగాలేదని పూజారి దబ్బగట్ల గోవర్ధన్, అట్టం నాగరాజు, దబ్బగట్ల రాజారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అన్న కుడితేనే చెల్లికి సంబురం
ఎస్ఎస్ తాడ్వాయి: కన్నెపల్లి జాబిలమ్మ సారలమ్మను గద్దెల మీదకు తీసుకువచ్చే ముందు ప్రధాన పూజారి కాక సారయ్యను సారలమ్మ రూపంలో అలంకరించి పట్టు చీరె, పట్టు జాకెట్ తొడిగించి ఆదివాసీ సంప్రదాయంగా తీసుకువస్తారు. ఈ వస్త్రాలను ప్రత్యేకంగా ఆదివాసీ బిడ్డ అయిన మంగపేటకు చెందిన మద్దెల పాపారావు కుట్టిన వస్త్రాలను తొడగడం ఆనవాయితీగా వస్తోంది. సారలమ్మ అవతారమెత్తిన కాక సారయ్యకు వరుసకు అన్న అయిన పాపారావు కుట్టిన దుస్తులనే ధరిస్తారు. అన్న కుడితేనే చెల్లెకు సంబురంగా పండుగ జరుపుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన పాపారావుకు సారలమ్మకు ప్రత్యేకంగా దుస్తులను కుట్టడంతో పాటు, హనుమాన్ జెండాను స్వయంగా పవిత్రంగా ఉపవాస దీక్షలతో తయారు చేయడం విశేషం. ఈ దుస్తులు కూడా కాక సారయ్య ఇంటి వద్దనే నియమనిష్టలతో కుట్టడం విశేషం. -
గద్దె చేరిన సారలమ్మ
కొత్తపల్లి/కరీంనగర్‌రూరల్ : శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం సారలమ్మ గద్దెనెక్కడంతో తొలిఘట్టం పూర్తయింది. సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య వనజాతర మొదలైంది. శివసత్తుల పూనకాలు, భక్తుల సందడి మధ్య జాతర ప్రదేశం జనజాతరగా మారింది. రెండేళ్లకోసారి వైభవంగా జరిగే శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరకు కరీంనగర్ మండలం ఇరుకుల్ల, నగునూరు, హౌసింగ్‌బోర్డుకాలనీ, కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంట గ్రామాల్లో నిర్వాహకు లు ఏర్పాట్లు చేశారు. మినీ మేడారంగా పేరొందిన రే కుర్తిలో ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలివ చ్చారు. సాయంత్రం మేడారం నుంచి వచ్చిన కోయ పూజారి పీరీల సాంబయ్య, స్థానికుడు సుదగోని శ్రీని వాస్‌గౌడ్ రేకుర్తిలోని ఎరుకలిగుట్ట నుంచి సారల మ్మను ఊరేగింపుగా తెచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. శ్రీ సమ్మక్క–సారలమ్మ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, దేవాదాయశాఖ ఈవో కె.ప్రభాకర్, సర్పంచ్ నందెల్లి పద్మప్రకాష్, ఉపసర్పంచ్ సుదగోని కృష్ణకు మార్‌గౌడ్, ఎంపిటిసీలు జక్కుల నాగరాణి మల్లేశం, ఏ దుళ్ల రాజశేఖర్, మొక్కలు చెల్లించారు. చంద్ర గ్రహణ ప్రభావం.. చంద్రగ్రహణం ప్రభావంతో కరీంనగర్ మండలంలో సమ్మక–సారలమ్మ జాతర ఆలస్యంగా ప్రారంభమైంది. నగునూర్, ఇరుకుల్లలో రాత్రి వేళ సారలమ్మను గద్దెలపైకి తెచ్చారు. హౌసింగ్‌బోర్డుకాలనీలో చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో సాయంత్రం 4గంటలకే అ మ్మవారిని గద్దెపైకి తెచ్చారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఎదురెళ్లి స్వాగతం పలికారు. జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ ఉయ్యాల ముత్యం గౌ డ్, సభ్యులు తోట మోహన్, కొండూరి అనిల్, బీజే పీ నాయకులు ఉప్పు రవీందర్, సుజాతరెడ్డి, లింగమూర్తి పాల్గొన్నారు. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో విద్యు త్, తాగునీటి సౌకర్యం కల్పించారు. నగునూరు సర్పం చ్ కన్నెమల్ల సుమలత–కోటి, ఉపసర్పంచ్ వినయ్‌సాగర్, ఎంపీటీసీ సభ్యులు భద్రయ్య, చంద్రమ్మ, కమిటీ చైర్మన్ కస్తూరి అశోక్‌రెడ్డి, ఇరుకుల్లలో జాతర వ్యవస్థాపక చైర్మన్ బుర్ర చంద్రయ్యగౌడ్, వైస్‌చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు. నేడు సమ్మక్క రాక గురువారం సమ్మక్క ఆగమనంతో జాతర పులకించనుంది. తొలిరోజు సుమారు 40–50 వేల మంది భక్తులు గద్దెలను దర్శించుకున్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. గురు, శుక్రవారాలు సుమారు 5 లక్షల వరకు భక్తులు దర్శించుకునే అంచనాలతో భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. జాతరకు సెలవులు ప్రకటించాలి శాతవాహనయూనివర్సిటీ : సమ్మక–సారలమ్మ జాతరకు సెలవులు ప్రకటించాలని శాతవాహన యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పెంచాల శ్రీనివాస్ ప్రకటనలో కోరారు. దేశంలోనే గుర్తింపుపొందిన గిరిజన జాతరకు సెలవులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లించాలి కొత్తపల్లి : మండలంలోని రేకుర్తిలో సమ్మక్క–సారల మ్మ జాతరకు అధికసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో జగిత్యాల వైపు నుంచి వచ్చే వాహనాలను కొత్తపల్లి బైపాస్ నుంచి చింతకుంట, పద్మనగర్ మీ దుగా కరీంనగర్ మళ్లించాలని కోరుతూ ఏసీపీ టి.ఉషారాణికి బుధవారం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గం మారుతి వినతిపత్రం ఇచ్చారు. శ్రావణ్‌కుమార్, సతీష్‌కుమార్, అంజయ్య, రాంచందర్, రాములు, సాయికుమార్, అవినాశ్ పాల్గొన్నారు. -
తొలిరోజే ట్రా‘ఫికర్’
సాక్షి ప్రతినిధి, వరంగల్: సారలమ్మ గద్దెలపైకి రావడానికి ముందే భక్తులు మేడారం చేరుకోవడం ఆనవాయితీ. మంగళవారం ఉదయం నుంచే మేడారం వచ్చే భక్తుల రాక మొదలై, మ«ధ్యాహ్నం సమయానికి రద్దీ పెరిగిపోయి సాయంత్రానికి పతాకస్థాయికి చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఆర్టీసీ 2,450 బస్సులు మేడారానికి కేటాయించింది. మరోవైపు ప్రైవేట్ వాహనాల ద్వారా వరంగల్ నుంచి మేడారం వచ్చే భక్తుల రద్దీ సాయంత్రానికి పెరిగింది. దీంతో వరంగల్–మేడారం మధ్య వాహనాల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. మేడారం వెళ్లే భక్తులు తొలి మొక్కులు గట్టమ్మ వద్ద చెల్లించుకోవడం ఆనవాయితీ. మేడారం వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు గట్టమ్మ వద్ద ఆపారు. ఇక్కడ పార్కింగ్‌కు తక్కువ స్థలం కేటాయించడంతో వాహనాలు నిలిపేందుకు స్థలం లేదు. దీంతో గట్టమ్మ నుంచి వరంగల్ వైపు వాహనాలు జాకారం వరకు నిలిచిపోయాయి. దీంతో మంగళవారం సాయంత్రం 6:30 గంటలకే తొలిట్రాఫిక్ జామ్ ఎదురైంది. కొరవడిన వ్యూహం గట్టమ్మ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇక్కడ వాహనాలు ఆపకుండా ముందుకు వెళ్లాలంటూ పోలీసులు ఆదేశించారు. దీంతో గట్టమ్మ దాటి ముందుకు వెళ్లిన వాహనదారులు డిగ్రీ కాలేజీ సమీపంలో ఆపి, వెనక్కి వచ్చి దర్శనాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆప్పటికే హన్మకొండ, వరంగల్, కాజీపేట బస్స్టేషన్లలో భక్తుల తాకిడి పెరిగిపోవడంతో మేడారం వెళ్లిన బస్సులు త్వరగా రావాలనే ఆదేశాలు ఆర్టీసీ సిబ్బందికి అందాయి. దీంతో మేడారం వెళ్లే వాహనాలు.. మేడారం నుంచి తిరుగుప్రయాణమైన ఆర్టీసీ బస్సులు, గట్టమ్మ దర్శనం కోసం నిలిపిన వాహనాలతో ములుగు నుంచి గట్టమ్మ వరకు రెండోసారి ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం రాత్రి 9 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ములుగు, గట్టమ్మ, మల్లంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. మధ్యాహ్నం వరకు అదే పరిస్థితి.. బుధవారం నుంచి జాతర మొదలవడంతో అన్ని వైపుల నుంచి వాహనాల రద్దీ పెరిగిపోయింది. మంగళవారం సాయంత్రం మేడారం బయల్దేరిన వాహనాలు అప్పటికీ రోడ్లపై ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, గోదావరిఖని, భూపాలపల్లి, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు జంగాలపల్లి క్రాస్‌రోడ్డు వరకు వచ్చాయి. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం అయింది. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ట్రాఫిక్ అదుపులోకి రాలే దు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టింది. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఉదయం 8 వరకు ట్రాఫిక్ క్లియర్ అయింది. ప్రణాళిక లేమి.. మేడారం జాతరలో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. అయితే.. మేడారం వెళ్లే దారిలో హాల్టింగ్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హాల్టింగ్ పాయింట్లకు సంబంధించి కనీస ప్రచారం నిర్వహించలేదు. వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టలేదు. çహాల్టింగ్ పాయింట్లలో కనీస సౌకర్యాలు లేవు. దీంతో మేడారం వెళ్లే వాహనదారులు మార్గమధ్యలో ఎక్కడా ఆగేందుకు ఆసక్తి చూపలేదు. మంగళవారం సాయంత్రం మేడారానికి పోటెత్తే వాహనాల రద్దీని అంచనా వేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల ప్రణాళిక లేమి కారణంగానే ట్రాఫిక్ కష్టాలు వచ్చాయని భక్తులు అంటున్నారు. -
చిలకలగుట్టపై సమ్మక్క శక్తి
ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క. కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దేవత. చిలకలగుట్టపై కొలువైన సమ్మక్కను జాతర సందర్భంగా గద్దెల మీదకు తీసుకురావడం ఉద్విగ్న ఘట్టం. రెండేళ్లకోసారి సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి కిందకు తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు.. గురువారం సమ్మక్క రాకను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -సాక్షి ప్రతినిధి, వరంగల్ మేడారంలో ఆలయంలో సమ్మక్క తల్లి వడేరా కుండ రూపంలో కొలువై ఉంటుంది. సమ్మక్క పూజారులు, గ్రామస్తులకు ఈ దేవత దర్శనం ఉంటుంది. అదే.. సమ్మక్క తల్లి గద్దెలపై సకల జనులకు వెదురు రూపంలో దర్శనమిస్తుంది. పూజారులకు సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉండని సమ్మక్క రూపం అత్యంత శక్తిభరితం. ఈ శక్తిని అన్ని వేళలా భరించడం సామాన్యులకు కష్టం. అందువల్లే పూజారులు అత్యంత రహస్య పద్ధ్దతుల్లో సమ్మక్కను చిలకలగుట్టపై ఉంచుతారు. ప్రతీ రెండేళ్లకోసారి సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం సందర్భంగా సమ్మక్క శక్తి స్వరూపాన్ని చిలకలగుట్ట నుంచి కిందకు తీసుకొస్తారు. ఇందుకోసం మొత్తం 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండు వారాల ముందుగా.. సమ్మక్క శక్తిని మేలుకొలిపే ప్రక్రియ జాతరకు రెండు వారాల ముందుగా మొదలవుతుంది. గుడిమెలిగె పండగ రోజు సమ్మక్క వడ్డెలు(పూజారులు), ఇంటి ఆడపడుచులు మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఒక్కడే చిలకలగుట్టకు చేరుకుని సమ్మక్కకు ఆదివాసీ పద్ధతుల ప్రకారం శక్తిని మేల్కొలిపే ప్రక్రియ చేపడతారు. అనంతరం మండె మెలిగే రోజు మరోసారి చిలకలగుట్టకు చేరుకుని రహస్య పూజలు నిర్వహిస్తారు. చిలకలగుట్టపై సమ్మక్క ఎక్కడ ఉంటుందనేది ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌కు సైతం తెలియదు. చిలకలగుట్ట సగం వరకు ఎక్కిన తర్వాత సమ్మక్క పూనుతుంది. ఆ తర్వాత సమ్మక్క ఆదేశాల ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో సమ్మక్క.. గుట్ట దిగేందుకు సిద్ధమవుతుంది. శాంతి ప్రక్రియ గద్దెలపైకి గురువారం సాయంత్రం చేరిన సమ్మక్క శుక్రవారం అక్కడే ఉండి జాతర నాలుగో రోజు శనివారం తిరిగి చిలకలగుట్టకు చేరుకుంటుంది. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్, వడ్డె కొక్కెర కృష్ణయ్య ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జాతర అనంతరం వచ్చే బుధవారం రోజున తిరుగు వారం పండగ జరుపుతారు. ఈ రోజు గద్దెల ప్రాంగణం శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. సిద్ధబోయిన మునీందర్ మూడోసారి చిలకలగుట్టకు చేరుకుని శక్తి రూపం ధరించిన సమ్మక్క తల్లిని శాంతపరుస్తారు. మళ్లీ రెండేళ్లకు సమ్మక్కను మేలుకొలుపుతామని మాట ఇచ్చి తిరుగుపయనమవుతారు. సమ్మక్క గుడి, గద్దెపై ప్రత్యేక పూజలు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలగుట్ట నుంచి గురువారం సమ్మక్క తల్లిని గద్దెల మీదికి తీసుకురానున్న నేపథ్యంలో సమ్మక్క పూజారులు, వడ్డెలు సంప్రదాయ బద్దంగా సిద్దబోయిన మునేందర్ ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు, కుంకుమ వడేరాల కుండల్లో గద్దె మీ దకు తీసుకు వచ్చారు. అక్కడ గద్దెపైన అలికి సమ్మక్క ముగ్గులను వేసి పూజ నిర్వహించారు. సమ్మక్క బిడ్డ సారక్క గద్దెపై న కూడా ముగ్గులతో అలంకరించారు. అనంతరం నాగుల వి డిది వద్ద వెళ్లి అక్కడ పూజలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. శక్తి మేలుకోవడం.. సారలమ్మ గద్దెలపైకి చేరిన(బుధవారం) మరుసటి రోజు(గురువారం) సమ్మక్క పూజారులు, వడ్డెలు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేశ్(బాల పూజారి), దోబె పగడయ్య కుమారుడు నాగేశ్వర్రావు, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతోపాటు మేడారం గ్రామానికి చెందిన ఆదివాసీలు చిలకలగుట్టకు బయల్దేరుతారు. చిలకలగుట్టపైకి ఎక్కి దారిలో అందరూ ఆగిపోతారు. అక్కడి నుంచి సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేష్(బాల పూజారి), దోబె నాగేశ్వరరావు.. చిలకలగుట్టపై ఉన్న రహస్య ప్రాంతానికి చేరుకుంటారు. దోబె నాగేశ్వరావు ధూపం పడతారు. మిగిలినవారు అక్కడ రహస్య క్రతువులు నిర్వహించి సమ్మక్కను కిందకు తీసుకొస్తారు. సమ్మక్క రాక కోసం గుట్టపై ఎదురుచూస్తున్న కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతో పాటు మిగిలిన వడ్డేలు, పూజారులు సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. జనసంచారం లేని వనంలో కొలువై ఉండే సమ్మక్క, కాళ్ల తొక్కుళ్లు ఉండే జనంలోకి వస్తుండడంతో.. దీనికి నివారణగా అక్కడ ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మరోసారి రహస్య పద్ధతిలో పూజలు చేస్తారు. తుపాకులగూడెం సమీపంలో ఉన్న ఇప్పచెట్ల నుంచి సేకరించిన ఇప్ప పువ్వుతో చేసిన సారాను సమ్మక్కకు ఆరగింపు చేస్తారు. ఆ తర్వాత ఆదివాసీ పద్ధతిలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెలపైకి చేర్చే బాధ్యతను కొక్కెర కృష్ణయ్యకు సిద్ధబోయిన మునీందర్ అప్పగిస్తారు. అప్పటికే పూజా క్రతువు నిర్వహిస్తుండగానే కొక్కెర కృష్ణయ్యను దేవత ఆవహించగా... అచేతన స్థితిలోకి వెళ్తాడు. కొక్కెర కృష్ణయ్యను ఇద్దరు వడ్డెలు పట్టుకుని ముందుకు నడిపిస్తారు. మల్లెల ముత్తయ్య జలకం పట్టితో కృష్ణయ్య పక్కనే ఉంటూ ముందుకు సాగుతారు. దారి మధ్యలో ఎలాంటి దుష్టశక్తుల దృష్టి పడకుండా జలకంలోని నీళ్లు చల్లుతాడు. వసంతరావు, స్వామి, జనార్దన్ కొమ్ముబూరలు ఊదుతూ వేగంగా సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కింది వైపుకు తీసుకువస్తారు. కొమ్మబూరల శబ్దం వినగానే చిలకలగుట్ట పొదల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమవుతారు. సమ్మక్క రాకను సూచిస్తూ గాలిలోకి కాల్పులు జరుపుతారు. చిలకలగుట్ట కిందకు చేరిన సమ్మక్కకు ఎదుర్కోళ్ల పూజా మందిరం వద్ద మరోసారి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించకుంటే సమ్మక్క అస్సలు ముందుకు కదలదని చెప్తారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్కను మేడారం గ్రామం వైపునకు వడివడిగా తీసుకొస్తారు. గ్రామ పొలిమేరలో మేడారానికి చెందిన 11 మంది మహిళలు బిందెలు, కుండల్లో నీళ్లు పట్టుకుని ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. బొడ్రాయికి కోడిపిల్లను తిప్పేస్తారు. -
గద్దెనెక్కిన సారలమ్మ
మేడారం నుంచి సాక్షిప్రతినిధి: వనమంతా జనంతో నిండిపోయింది. జంపన్నవాగు భక్తజన హోరుతో మార్మోగింది. అడవితల్లుల మహాజాతర మొదలైంది! కన్నెపల్లి నుంచి సారలమ్మ.. పూనుగొండ నుంచి పగిడిద్దరాజు.. కొండాయి నుంచి గోవిందరాజులు.. ఈ ముగ్గురి రాకతో బుధవారం మేడారం వన జాతర అంగరంగవైభవంగా షురూ అయింది. సుమారు రాత్రి 12.20 గంటల సమయంలో భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మ గద్దెనెక్కింది. అంతకుముందు సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8.12 గంటల సమయంలో గుడి నుంచి మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. మార్గం మధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పగిడిద్దరాజు–సమ్మక్క వివాహం కనులపండువగా సాగింది. అనంతరం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ముగ్గురి రూపాలను అర్ధరాత్రి మేడారం గద్దెలపై చేర్చారు. సంతాన ‘వరం’కోసం.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె(వెదురు బుట్ట)లో తీసుకొస్తుండగా ఆలయం ప్రహరీ నుంచి వంద మీటర్ల పొడవునా సంతాన భాగ్యం ఎదురు చూసే భక్తులు నేలపై పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. అక్కడ్నుంచి జంపన్నవాగుకు సారలమ్మ చేరుకుంది. వంతెన ఉన్నా.. నీటిలో నుంచే నడుస్తూ సారలమ్మ పూజారులు వాగును దాటారు. ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ దుగ్యా ల అమయ్‌కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే సీతక్క పూజా కార్యక్రమాలను దగ్గరుండి వీక్షించారు. కన్నెపల్లి నుంచి మేడారం వరకు సారలమ్మ ప్రయాణించే సమయంలో చంద్రగ్రహణం ఉంది. అయినా ఆదివాసీ వడ్డెలు దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. గ్రహణం కొనసాగుతున్నా.. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జంపన్నవాగులో జనహోరు సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెత్తాయి. మేడారం నలువైపులా కిలోమీటర్ల మేర దారులు వాహనాలు, భక్తులతో నిండిపోయాయి. నేడు సమ్మక్క రాక మేడారం జాతరలో అద్భుత సన్నివేశంగా భావించే సమ్మక్క గద్దెలపైకి చేరే ఘట్టం గురువారం జరుగనుంది. సమ్మక్క ప్రధాన పూజారులు, వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను తీసుకువచ్చేందుకు వెళ్తారు. అశేష భక్త జనులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతుండగా.. సమ్మక్కను భరిణె రూపంలో గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వన దేవతలు నలుగురు గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గర్భిణి, మరొకరి మృతి నిర్మల్ జిల్లా బాసర మండలం గాంధీనగర్‌కు చెందిన గర్భిణి సారాబాయి(33) మేడారం వస్తుండగా.. తాడ్వాయి వద్ద పురిటి నొప్పులు వచ్చాయి. ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. బాబు జన్మించాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో సారాబాయిని అంబులెన్స్‌లో వరంగల్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో పస్రా–జంగాలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్ జాంలో సుమారు 3 గంటలపాటు కాలయాపన జరిగింది. ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జంపన్న వాగు సమీపంలో సొమ్మసిల్లి పడిపోయిన భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన తాటికొండ రాజనర్సయ్య (50)ను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మరణించాడు. తీరని ట్రాఫిక్ చిక్కులు జాతర ప్రారంభానికి ముందే ట్రాఫిక్ సమస్యలు చుట్టుముట్టాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల పాటు వరంగల్–మేడారం మార్గం మధ్యలో మల్లంపల్లి, గట్టమ్మ, ములుగు, జంగాలపల్లి, పస్రాల వద్ద ట్రాఫిక్ జాం అయింది. వరంగల్ నుంచి మేడారం వరకు సగటున మూడు గంటల ప్రయాణం కాగా.. ఆరేడు గంటల సమయం పట్టింది. ట్రాఫిక్, బందోబస్తును డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. పోటెత్తిన భక్తజనం కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకువచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. మాజీ ఎమ్మెల్యే సీతక్క కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ఆదివాసీ నృత్యం చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. రాత్రి 7:15 గంటలకు సారలమ్మ పూజారులు కాక సారయ్య, లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావు సారలమ్మ పూజా క్రతువులు ప్రారంభించారు. అనంతరం కన్నెపల్లి ఆలయం నుంచి మేడారం బయల్దేరారు. సమ్మక్క–సారక్క జాతర ప్రత్యేక వెబ్సైట్ సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారక్క జాతర ప్రత్యేక వెబ్‌సైట్‌ను గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఐ–యుగ సీఈవో రజిత్ ఆకుల, ప్రతినిధులు వెంకట్, రజనీకాంత్ తదితరులు ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనిలో మేడారం సమ్మక్క–సారక్క చరిత్ర, ముఖ్య ఘట్టాలు, భక్తులకు అందే సేవలు, అత్యవసర సమయంలో కావాల్సిన వివిధ శాఖల సమాచారం, అధికారుల ఫోన్ నంబర్లు, జాతరకు వెళ్లే మార్గాలు, గూగుల్ మ్యాప్ లింకులు, సమీప ప్రాంతాల్లో దర్శనీయ స్థలాల వివరాలుంటాయని మంత్రి పేర్కొన్నారు. 2006 నుంచి మేడారం జాతరకు ఐ–యుగ సంస్థ సాంకేతిక సాయం అందిస్తుందని వివరించారు. -
మేడారం ప్రయాణంలో విషాదం: బాలింత మృతి
సాక్షి, వరంగల్: మేడారం జాతరలో విషాదం చోటు చేసుకుంది. జాతరకు వచ్చిన ఓ బాలింత ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని మృతి చెందింది. వివరాలు.. నిర్మల్ జిల్లా సాద్గం కు చెందిన కళాభాయ్ కుటుంబం సమ్మక్క- సారక్క జాతరకు వచ్చింది. కళా భాయ్ గర్భిణి కావడంతో ఆమెకు జాతర లో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన ఆమెను ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చిన కలాభాయికి అధిక రక్త స్రావం కావడంతో చికిత్స నిమిత్తం వరంగల్ వెళ్లాల్సిందిగా స్థానిక వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాలింతను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుంగా.. జాతరకు వెళ్లే వాహనాలతో ములుగు నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు, మూడు గంటల పాటు ట్రాఫిక్‌జాం ఏర్పడటంతో మార్గమధ్యలోనే బాలింత మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
జాతరకు ముందే రూ. కోటి ఆదాయం
భూపాలపల్లి: జాతరకు ముందే ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. జాతర బుధవారం నుంచి జరుగనుండగా మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు మేడారం వచ్చారు. 52 పాయింట్ల నుంచి వచ్చిన 2,490 బస్సుల్లో 1,04,000 మంది భక్తులు మేడారం చేరుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆర్టీసీకి ఒక్కరోజే సుమారు రూ.కోటి ఆదాయం లభించింది. కాగా, 48 వేల మంది భక్తులు మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 60 వేల మంది భక్తులు జాతరలోనే ఉన్నారు. బుధవారం సారలమ్మ తల్లి గద్దెలకు రానున్న నేపథ్యంలో భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రస్తుతం నడిపిస్తున్న సుమారు 2,500 బస్సులతోపాటు అదనంగా మరో 2 వేల బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం సూర్యకిరణ్ తెలిపారు. అందుబాటులో అద్దె బండ్లు.. ఎస్ఎస్ తాడ్వాయి: జాతరకు వచ్చిన భక్తులను వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఎడ్ల బండ్లు మేడారానికి చేరుకుంటున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ బస్సులో మేడారం వచ్చే భక్తులను బస్టాండ్ వద్ద దింపుతున్నారు. ఇక ముల్లెమూటలతో వచ్చిన భక్తులు అద్దె బండ్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగు వరకు, అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులను తరలించి వారి నుంచి రూ.200 తీసుకుంటున్నారు. అద్దె బండ్లను తీసుకున్న భక్తులు వాటిపై హైహై నాయక అంటూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ( ఎడ్లబండ్లలో జంపన్నవాగుకు వెళ్తున్న భక్తులు ) -
మేడారంలో అదుపు తప్పిన ట్రాఫిక్
సాక్షి, వరంగల్ : అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క– సారక్క జాతరకు తొలిరోజే భక్తులు పోటెత్తడంతో మేడారంలో గందరగోళం నెలకొంది. పోలీసుల మధ్య సమన్వయం లోపించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. జాతర కోసం ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాల్లో గతరాత్రి బయల్దేరిన ప్రయాణికులు ఇప్పటివరకూ కూడా మేడారం చేరుకోలేని పరిస్థితి నెలకొంది. పోలీస్ క్యాంప్‌లో పోలీస్ సిబ్బందికి, అధికారుల మధ్య కూడా వసతి సౌకర్యాల విషయంలో వివాదం ఏర్పడింది. అలాగే జయశంకర్ జిల్లా ములుగు మండలం గట్టమ్మ వద్ద నుండి పస్రా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో మేడారం వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు తెల్లవారుజాము మూడు గంటల నుంచి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులతో పాటు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి డీజీపీ మేడారంలో ట్రాఫిక్ అదుపు తప్పడంతో డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. హుటాహుటీన ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు సమన్వయ లోపం ఏర్పడటంతో డీజీపీ ...పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. మరోవైపు మహబూబ్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్‌పై రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) చేయి చేసుకోవడంతో, అధికారుల తీరుపై సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెక్టోరియల్ అధికారులతో సమీక్ష నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సెక్టోరియల్ అధికారులతో జిల్లా కలెక్టర్, మహా జాతర ప్రత్యేక అధికారి బుధవారం సమీక్ష నిర్వహించారు. సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన సెక్టార్లలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని, ఎవ్వరూ తమకు కేటాయించిన సెక్టార్‌ను విడిచి వెళ్లకూడదని సూచించారు. క్యూ లైన్ల వద్ద భక్తులు తాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పారిశుద్ద్య పర్యవేక్షణ నిరంతరం సాగాలని, సెక్టోరియల్ అధికారులు సమాచార లోపం లేకుండా సమన్వయంతో పని చేయాలని సూచనలు చేశారు. కాగా ఈ నెల రెండున (ఫిబ్రవరి 2)న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖమంత్రి పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి ముందస్తుగా మేడారంలోనే బస చేసి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మేడారం భక్తులకు కాంటెస్ట్
సాక్షి, వరంగల్ రూరల్: మేడారం జాతరలో ఎక్కడ చూసినా భక్తులు సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు.. ఏంటి ఈ సెల్ఫీ పిచ్చి అనుకుంటున్నారా.. ప్రభుత్వం ఈసారి మేడారం జాతర కాంటెస్ట్–2018 పేరుతో సెల్ఫీ, ఫొటో, షార్ట్‌ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌కు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం ఈ కాంటెస్ట్‌ను భక్తుల ముందుకు తీసుకొచ్చింది. విజేతలకు నగదు బహుమతులు.. పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తం రూ.4.25 లక్షల నగదు బహుమతులను అందించనున్నారు. సెల్ఫీ మొద టి బహుమతి రూ.25 వేల నగదు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, బెస్ట్ ఫొటోగ్రఫీ విభాగంలో మొదటి బహుమతి రూ.75 వే లు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు, షార్ట్ ఫిల్మ్ విభాగంలో మొదటి బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు అందించనున్నారు. ప్రచారం కోసమే.. జాతర విశేషాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కర్ణన్ ఇటీవల స్థానిక యువతతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. కొత్తకొత్త ఆలోచనలతో యువకులు షార్ట్ ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. ఈ పోటీల ద్వారా జాతర ప్రచారం విశ్వ వ్యాప్తమవుతుందనే ప్రభుత్వం భావిస్తోంది. 12,561 మంది లైక్‌లు.. ప్రస్తుతం సోషల్ మీడియాపై అందరూ దృష్టి పెట్టారు. దీంతో ప్రభుత్వం అఫీషియల్ ఫేస్బుక్ లైక్ పేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 12,561 మంది ఫేస్బుక్ లైక్ పేజీకి లైక్ కొట్టారు. సెల్ఫీలు, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్‌ల కాంటెస్ట్ కోసం అఫీషియల్ ఫేస్బుక్ లైక్ పేజీలో పోస్ట్ చేయాలని పేర్కొన్నారు. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గద్దెల వద్ద, గంట కొడుతూ, ఎదురుకోళ్లను ఇస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తున్నారు. జంపన్నవాగులో స్నానం చేస్తున్నవి, ఎడ్ల బండ్లలో జాతరకు వస్తున్న ఫొటోలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 5వ వరకు పోటీలు ఇటీవల హైదరాబాద్‌లో వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ దగ్గర సెల్ఫీ దిగి ప్రమాదం బారిన పడడంతో ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ప్రయాణిస్తూ, గుట్టలు ఎక్కుతూ, విద్యుత్ తీగల దగ్గర, జంతువుల దగ్గర, ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు దిగొవద్దని సూచించారు. ఫిబ్రవరి 5 వరకు ఫేస్బుక్ ద్వారా ఫొటోగ్రఫీ, సెల్ఫీ, షార్ట్ ఫిల్మ్‌లను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. జాతరకు ప్రచారం వస్తుంది.. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్బంగా సెల్ఫీలకు బహుమతులు పెట్టడం చాలా బాగుంది. అన్ని వయస్సుల వారు సెల్ఫీలు ఎక్కువగా దిగుతున్నారు. సెల్ఫీతోపాటు ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మా ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటోను అప్లోడ్ చేశాం. చాలా మంది లైక్‌లు సైతం కొట్టారు. దీంతో జాతరకు చాలా ప్రచారం కూడా వస్తుంది. –మడిపెల్లి సుశీల్, వరంగల్ -
మేడారం బైలెల్లిన పగిడిద్దరాజు
గంగారం(ములుగు): మేడారం మహాజాతర వేదికగా సమ్మక్కను పరిణయమాడేందుకు పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మంగళవారం బయల్దేరారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును గ్రామస్తులు అటవీమార్గంలో కాలినడకన సంప్రదాయ డోలు వాయిద్యాల మధ్య మేడారం తీసుకువెళ్తున్నారు. అంతకుముందు గ్రామంలో పెనుక వంశీయుల పూజారి తలపతి ఇంట్లో పగిడిద్దరాజును నలుగు పూజలతో పెళ్లికుమారుడిగా తయారుచేశారు. అనంతరం ఇక్కడి పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులైన పూజారులు బుచ్చిరాములు, సురేందర్, మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులకు దర్శనమిచ్చారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తాకి తన్మయత్వం పొందారు. తలపతి ఇంట్లో నుంచి పానుపు (పూజా సామగ్రి) తీసుకువస్తుండగా, ఆలయంలో పూజల తర్వాత పడిగెను మేడారానికి తీసుకెళ్తుండగా గ్రామస్తులు బిందెలతో నీళ్లు తెచ్చి పూజారుల కాళ్లు కడిగి సాగనంపారు. శివసత్తుల పూజనకాలతో మేడారం బయల్దేరారు. మంగళవారం రాత్రి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకొని పెనుక వంశీయుల ఇంట్లో నిద్రిస్తారు. అక్కడి నుంచి పోలీసుల బందోబస్తు మధ్య పస్రా, నార్లాపురం, కొండాయి మీదుగా మొత్తం 65 కిలోమీటర్లు కాలినడకన మేడారంలోని చిలుకల గుట్టకు చేరుకుంటారు. పానుపు తరలింపు నుంచి పడిగె వెళ్లే వరకు పూర్తి కార్యక్రమాలను స్థానిక సర్పంచ్ ఈసం కాంతారావు పర్యవేక్షించారు. మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, డైరెక్టర్ ఇర్ప సూరయ్య, మర్రిగూడెం, ఎంపీటీసీ సభ్యురాలు వనిత, టీఆర్ఎస్ నాయకుడు ఈసం సమ్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జాతరలో అతి ముఖ్య ఘట్టం
ఎస్ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తేవడం.. సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి చేరుకోక ముందే అక్కడికి కంకవనం చేరుకుంటుంది. అమ్మలతో పాటు గద్దెలపై కొలువై ఉండే కంకవనాలను ఆలోపే అక్కడ ప్రతిష్ఠిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని ఇక్కడి ఆదివాసీలు పాటిస్తున్నారు. గద్దెలపై వనదేవతలతో పాటు ప్రతిష్ఠించే కంకవనాలను తెచ్చేందుకు పూజారులు, కుటుంబీకులు మంగళవారం సిద్ధమయ్యారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు, మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్తారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేసి, తెల్లవారుజామున 3 గంటల వరకు పూజలు నిర్వహించారు. ఈ పూజల వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. పూజా పద్ధతులను వంశపార్యంపరంగా ఒకతరం నుంచి మరో తరానికి నేర్పుతారు. పూజ ముగిసిన తర్వాత నాలుగు గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుని తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున అడవి నుంచి కంకలను గద్దెల వద్దకు తీసుకొస్తారు. మార్గ మధ్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు నిర్వహిస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. -
ధూపం వేస్తేనే తల్లి గుట్ట దిగేది..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పడిగాపూర్‌కు చెందిన దొబె నాగేశ్వర్రావు.. సమ్మక్క తల్లి ధూపం వడ్డెగా వ్యవహరిస్తారు. వయస్సు పైబడడంతో తండ్రి దొబె పగడయ్య నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2015 మినీ జాతర నుంచి ధూపం వడ్డెగా నాగేశ్వర్రావు కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఆయన తల్లి సేవలో తరిస్తున్నారు. తల్లికి ధూపం వేసే పెద్ద బాధ్యతను ఆయన యుక్తవయస్సులోనే భుజాన వేసుకున్నారు. మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర సందర్భంగా చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దె వద్దకు తీసుకొస్తారు. నాగేశ్వర్రావు ధూపం వేస్తేనే సమ్మక్క తల్లి చిలుకలగుట్ట దిగుతుంది. డోలు దరువు తల్లులకు ఇష్టం జాతరలో డోలు వాయిద్య కళాకారులకు ప్రత్యేక కథ ఉంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువస్తారు. డోలు వాయిద్య కళాకారుల దరువుతోనే తల్లులు కదిలొస్తారు. డోలు దరువు అంటే తల్లులకు మహా ఇష్టం. దరువు కొట్టనిది తల్లులు ఆవహించిన ప్రధాన పూజారుల అడుగు ముందుకు కదలదు. దేవతలను గద్దెలపై తీసుకురావడానికి రెండు గంటల సమయం పడుతుంది. అప్పటి వరకు డోలులు వాయిస్తూనే ఉండాలి. చిలుకలగుట్ట దద్దరిలేలా కళాకారులు తన ఒంట్లో ఉన్న శక్తిని ఉపయోగించి డోలును వాయించాలి. తల్లులను గద్దెలపై తీసుకువచ్చే క్రమంలో సమయం తెలియదని, తమకు ఏమాత్రం అలసట అనిపించదని, ఇదంతా తల్లుల మహిమేనని డోలు వాయిద్య కళాకారులు చెబుతున్నారు. అదేవిధంగా జాతరకు రెండు నెలలపాటు వచ్చిపోయే వందల మంది ప్రముఖులు, అధికారులకు డోలు వాయిద్య కళాకారులు స్వాగతం పలుకుతుంటారు. కానీ, వీరికి దేవాదాయశాఖ అధికారులు ఇచ్చే వేతనం అంతంత మాత్రమే. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డోలు వాయిద్య కళాకారులు కోరుతున్నారు. సమ్మక్కను తీసుకొస్తా జాతరకు పది రోజుల ముందే చిలుకలగుట్ట వనంలో లభించే ఔషధ మూలికలతో గుగ్గిలం తయారు చేస్తాం. ఆ గుగ్గిలంతోనే ధూపం వేస్తా. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను గద్దెకు రప్పిస్తా. తండ్రి నుంచి ధూపం వడ్డె బాధ్యతలను స్వీకరించి సమ్మక్క తల్లికి సేవ చేయడం నేను మహా అదృష్టంగా భావిస్తున్నా. –నాగేశ్వర్రావు, సమ్మక్క ధూపం వడ్డె -
నేడు సమ్మక్క కల్యాణం
సాక్షి ప్రతినిధి, వరంగల్: లక్షలాది మంది భక్తుల సాక్షిగా వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం వైభవంగా జరగనుంది. మాఘమాసంలో మేడారం గ్రామం ఈ వేడుకకు వేదికగా నిలవనుంది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదీవాసీ సంప్రదాయం. ఇందుకోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వారికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంట లేని వారు కోళ్లు, మేకల వంటివాటిని సమర్పించుకునేవారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. సమ్మక్క ఆలయమే వేదిక.. మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. ఈ సారి బుధవారం, పౌర్ణమి ఒకేరోజున(జనవరి 31) రావడం విశేషం. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి బయల్దేరారు. ప్రధాన పూజారి పెనక బుచ్చిరాములుతోపాటు ఇతర పూజారులు సురేందర్, మురళీధర్ పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తీసుకుని 65 కిలోమీటర్లు కాలినడకన మేడారానికి తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో తాడ్వాయి మండలం లక్ష్మీపురంలో పెనక వంశీయుల ఇంట్లో మంగళవారం రాత్రి బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం కాలినడకన మేడారం బయల్దేరుతారు. ఇక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. ఇదే రోజు సాయంత్రం తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారి కాక సారయ్య, కాక కిరణ్ ఇతర పూజారులు తీసుకొస్తారు. సమ్మక్కకు కల్యాణం.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న విడిది గృçహానికి వస్తారు. సమ్మక్క నుంచి ఆహ్వానం రాగానే వీరు మేడారంలోని ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెళ్లికొడుకు పగిడిద్దరాజు వచ్చాడంటూ సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. ఈ కబురు అందుకున్న సమ్మక్క పూజారులు పసుపు, కుంకుమలతో ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. సంప్రదాయబద్ధంగా సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును సమ్మక్క గుడిలోనికి ఆహ్వానిస్తారు. దూరప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు నైవేద్యం సమర్పించి ఆకలి తీరుస్తారు. అనంతరం సమ్మ క్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలిసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతాడు. (ఎడ్లబండ్లపై మేడారానికి తరలివస్తున్న భక్తులు) లక్షలాది మంది రాక సమ్మక్క–పగిడిద్దరాజు వివాహం అనంతరం గద్దెలపై కొలువైన సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. అమ్మలను దర్శించుకుని కోరుకున్న కోరికలన్నీ తీరుతాయనేది వారి నమ్మకం. మరుసటిరోజు(గురువారం) శక్తి రూపంలో చిలకలగుట్టపై కొలువైన సమ్మక్క తల్లి.. మేడారం గద్దెల మీదకు చేరుకుంటుంది. దీంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. సారలమ్మ ఆగమనం నేడే.. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు బుధవారం సాయంత్రం మేడారం గ్రామానికి చేరుకుంటారు. వడేరాల కుండల రూపంలో సమ్మక్క–పగిడిద్దరాజుకు కల్యా ణం జరిగిన తర్వాత సారలమ్మతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. -
అడవి తల్లి అందరి మాత
ఆదివాసీలు పవిత్రంగా భావించే చిలకలగుట్ట మీద సమ్మక్క కొలువై ఉండే చోటు తెలిసిన అతికొద్ది మందిలో ఒకరు సిద్ధబోయిన మునీందర్. చిలకలగుట్టపైకి పూజారులంతా కలిసి వెళ్లినా మార్గమధ్యం నుంచి రహస్య ప్రాంతానికి చేరుకునే ఐదుగురిలో ప్రధానమైన వ్యక్తి ఇతనే. గడిచిన ఇరవై ఏళ్లుగా చిలకలగుట్టపై ఉన్న సమ్మక్కను కిందకు తీసుకువచ్చే బాధ్యతను నిర్వరిస్తున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప మునీందర్ నుంచి వివరాలు వెల్లడి కావు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సమ్మక్క పూజారిగా నియమ నిష్టలతో కూడిన జీవితాన్ని గడిపే మునీందర్ ‘నేను నా దైవం’ కోసం సాక్షితో మాట్లాడారు. సమ్మక్క, సారలమ్మలను పోరాట యోధులు అంటారు. మరి వాళ్లెప్పుడు దేవుళ్లయ్యారు? మాకు వాళ్లు పోరాట యోధులు కాదు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు – సమ్మక్క యుద్ధం అనే ప్రచారంతో ఈ దేవతలతో సంబంధం లేదు. తరతరాలుగా సమ్మక్క సారలమ్మలు మా ఇలవేల్పులు. జాతర మూడు రోజుల్లోనే కాకుండా మిగతా ఏడాది అంతా సమ్మక్క సారలమ్మలకు నిత్య పూజలు ఉంటాయా? మా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మిగిలిన రోజుల్లోనూ పూజలు చేస్తాం. అయితే బు«దవారం నాడు మాత్రం సమ్మక్క వారంగా భావించి పూజలు చేస్తాం. బుధ, గురువారాలు, పౌర్ణమీ రోజుల్లోనూ పూజలు ఎక్కువగా ఉంటాయి. దసరా పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తాం. ఈ మాఘపౌర్ణమి పూజల్లో నియమాలు ఏ విధంగా ఉంటాయి? వాటిని ఉల్లంఘిస్తే కీడు జరిగిన సందర్భాలున్నాయా? వన దేవతలను తీసుకొచ్చే బాధ్యత ఉన్నందున మాకు కట్టుబాట్లు ఉన్నాయి. గ్రామాల్లో ఇండ్లæనుంచి వచ్చే కాలువ నీళ్లు తొక్కం. బయట ఇళ్లలో భోజనాలు చేయం. సాధ్యమైనంత వరకు ఉదయం బయటకు వెళితే సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి చేరుకుంటాం. వనం తీసుకొచ్చేప్పుడు దిష్టి తగలకుండా కోడిగుడ్డు తిప్పి పడేస్తారు. ఇలా చేయకపోతే వనం తెచ్చేవారు ముందుకు కదలకుండా ఆగిపోతారు. గద్దెలకు బయల్దేరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రయాణం విషయంలో ఈ విధానం కొనసాగుతుంది. ఎదురిళ్లు (ఎదుర్కోలు)దగ్గర శాంతిపూజ చేస్తాం. లేని పక్షంలో సమ్మక్క ముందుకు కదలదు. ఎదురిళ్లు దగ్గర ఏదైనా లోపం జరిగితే ప్రాణనష్టం ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి, ఇప్పటివరకు అలాంటి ప్రమాదాలు చూడలేదు. ఇక ఏడాది పొడవునా కూడా నియమాలను ఉల్లంఘించం. నేనైతే బుధ, గురువారాల్లో ఉపవాసం ఉంటాను. ఊరు విడిచి బయటకు వెళ్లను. ఊరంతా చేసే భోజనాల దగ్గర తినను. ఒకవేళ తినాలన్నా ముందుగా భోజనాన్ని తీసి ఉంచుతారు. ఇంట్లో కూడా ఎంగిలికాని అన్నమే తింటాను. జాతర సందర్భంగా పూజారులు మద్యం సేవిస్తారని విన్నాం? జాతర సందర్భంగా పూజారులు మద్యం సేవించడం తప్పనిసరి అని బయట ప్రచారం ఉంది. కానీ, గుడిమెలిగే పండగ నుంచి మా పూజారులందరూ ఉపవాసాలు ఉంటాం. మద్యం జోలికి అస్సలు వెళ్లం. నియమ నిష్టలు పాటించకుండా ఉంటే సమ్మక్క సహించదు. జాతర సందర్భంగా ముఖ్యమైన రోజుల్లో చిలకలగుట్ట పైకి చేరుకుని సమ్మక్కకు మా ఆదీవాసీల పద్ధతిలో పూజలు చేస్తాం. ఈ సందర్భంగా నియమ నిష్టలు పాటించకుండా చిలకలగుట్ట ఎక్కడం ప్రారంభించామే అనుకోండి దాని ప్రభావం పలు రకాలుగా ఉంటుంది. గుట్ట ఎక్కలేం. ఎవరో చేత్తో వెనక్కి నెట్టేసినట్లుగా అవుతుంది. అడుగులు ముందుకు పడవు. కొన్నిసార్లు కనిపించని శక్తి (సమ్మక్క) కొరాడాతో కొడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మధ్యలోనే మా పూజారులు ఆగిపోతారు. చేసిన తప్పులు మన్నించమని అమ్మతల్లిని వేడుకుంటాం. పరిహారం చెల్లిస్తామని మొక్కుకుంటాం. ఆ తర్వాతే ముందుకు కదులుతాం. సమ్మక్క తల్లికి ఎరుపు వర్ణం అంటే ఇష్టం. అందువల్ల చిలకలగుట్టపైకి చేరుకునే సందర్భంలో ఎరుపు రంగు గుడ్డను తలకు చుట్టుకుంటాం. అమ్మకు ఎరుపు రంగు వస్తువులనే ఇచ్చుకుంటాం. మీరు సమ్మక్క, సారలమ్మను కాకుండా ఇంకెవరినైనా పూజిస్తారా? ప్రత్యేకంగా ఇతర దేవతలను పూజించం. పండగ రోజులు, ప్రత్యేక రోజుల్లో మాత్రం వనదేవతలకు దండం పెట్టుకుంటాం. జాతర సందర్భంగా కోటి పాతిక లక్షల మంది వస్తుంటారు. ఇంతమంది ఉన్నప్పుడు భక్తిభావన ఉంటుందా? ఉంటుంది. ఆ భావన కోసమే అందరూ వస్తారు. ధనవంతులు సైతం వచ్చి అడవుల్లో, పొలాల్లో, వాగుల వెంట రెండు మూడు రోజులు బస చేస్తారు. ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగదు. అడవిలో జరిగే జాతర అయినా సరే కనీసం పాము భయం కూడా లేకుండా భక్తులు ఇక్కడే ఉంటారు. భక్తుల రద్దీ ఎంత ఉన్నా అవాంఛనీయ సంఘటనలు జరగడం చాలా అరుదు. అంటే ఇక్కడ ఆ అమ్మతల్లుల దయ ఉండటం వల్లే ఇది సాధ్యమౌతుంది కదా! మీ కుటుంబాల్లో సమ్మక్క, సారలమ్మలు చూపిన మహిమలు ఉన్నాయా? జాతర సమయంలో, రాత్రి సమయంలో గుడి దగ్గరికి వెళ్లినప్పుడు గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. పౌర్ణమి రోజున గద్దెల దగ్గరకు ఓ పెద్ద నాగుపాము వస్తుంది. నాకు చాలాసార్లు కనిపించింది. దేవాదాయశాఖ సిబ్బంది కూడా ఈ విషయం నాకు చెప్పారు. సమ్మక్క దగ్గరికి పాము రూపంలో పగిడిద్దరాజు వస్తాడు. అదే మాకు గుర్తు. బెల్లం బంగారం అంటారు కదా! దీనికి కారణం ఏమైనా ఉందా? మా ఆదివాసీలకు బెల్లం ఇష్టమైన వస్తువు, విలువైన వస్తువు కూడా. నిల్వ ఉంటుంది. తీపి కోసం తేనె మీదనే ఆధారపడేటోల్లు. ఇప్పుడంటే ఆ పరిస్థితులు లేవు కానీ, మరీ వెనుకటి రోజుల్లో బెల్లం తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కష్టమైనదాన్ని సంపాదించి, దేవతలకు మొక్కు చెల్లిస్తే మంచి జరుగుతుందని మా నమ్మకం. అలా అందరి మొక్కు అయ్యింది. పూజారులైన మీకు మిగతా రోజుల్లో ఎలాంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి? సమ్మక్క సారలమ్మ పూజారులం అని మేమెక్కడా బయట ఎవ్వరికీ చెప్పుకోం. దాంతో మా గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్లో వాళ్లకు తెలిసినప్పటికీ ఎవ్వరూ దాని గురించి ప్రస్తావించరు. అందరిలాగే మేము సాధారణ జీవితమే గడుపుతాం. జాతర ముగిస్తే వ్యవసాయం చేసుకుంటాం. లేదా అడవికి వెళ్తాం. ఇప్పుడు పేపరొళ్లు వచ్చి మమ్మల్ని పట్టుకుని ఫోటోలు తీసుకుని మాట్లాడుతున్నారు. ఆ పేపర్లు కూడా మేం చూడం. గత ఐదారేళ్ల నుంచి జాతర నిర్వాహణలో ప్రభుత్వ అధికారులు మా అభిప్రాయాలను కొంత మేరకు పరిగణలోకి తీసుకుంటున్నారు. మమ్మల్ని గుర్తుపట్టే భక్తులు.... మేము బొట్టు పెట్టాలని, బంగారం ప్రసాదం ఇవ్వాలని ఆరాటపడతారు. అంతవరకే మాకు తెలిసింది. సమ్మక్క సారలమ్మ మిమ్మల్ని పూనడం, కల్లోకి వచ్చిన సందర్భాలున్నాయా? జాతర ముందు రోజుల్లో కలలో ముసలమ్మ రూపంలో సమ్మక్క ఎక్కువగా కనిపిస్తది. ఆ సమయంలో ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. ఆ విషయాలు బయటకు చెప్పేవి కావు. ఎక్కడైనా ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ముందే మీకు సూచనలు ఏమైనా కన్పించాయా? అలంటివేవీ లేవు. వనదేవతలైన ఈ అమ్మవార్లను కొలుచుకోవడం, మా పనులు మేం చేసుకోవడం అంతే తప్ప వేరే విషయాలు అంతగా తెలియవు. ఎన్ని తరాలుగా ఈ పూజారి విధానాన్ని మీరు అవలంభిస్తున్నారు. మీ తదనంతరం ఎవరికి ఈ విధానాన్ని, ఎలా పరిచయం చేస్తారు? కచ్చితంగా చెప్పలేం. ఎప్పటి నుంచో వస్తుంది. మా తాతల హయాంలో మాత్రం మా పూర్వీకులు చత్తీస్గడ్ నుంచి గోదావరి దాటి ఇటు వచ్చారని తెలిసింది. అప్పటి నుంచి సమ్మక్క మా ఇలవేల్పు. వంశపార్యంపరంగా పూజలు చేస్తున్నాం. మా ఇండ్లలో మగపిల్లలకు ఒకరి నుంచి మరొకరికి పూజా బాధ్యతలు అప్పగిస్తాం. తొలుత జాతర సందర్భంగా ఇతర బాధ్యతలు అప్పగిస్తాం. ఒక్కో జాతర గడుస్తున్న కొద్ది బాధ్యతలు పెంచుతాం. సరైన సమయం వచ్చినట్లు ఆ దేవతల నుంచి పిలుపు వస్తే అప్పుడు ప్రధాన పూజారి బాధ్యతలు అప్పగిస్తాం. అందరూ శిగమూగుతారు జాతర ప్రారంభానికి ముందురోజు రాత్రి సారలమ్మ పూజారులంతా కన్నెపల్లిలో గుడికి చేరుకుంటాం. ఆవునెయ్యి, ఆవుపాలతో సారలమ్మ ఆలయంలో ఉన్న పూజా వస్తువులను శుభ్రం చేస్తాం. అనంతరం రెండు గంటల పాటు పూజలు చేసి తెల్లవారుజామున ఇంటికి వెళ్తాం. మరుసటి రోజున అమ్మవారిని తీసుకువచ్చాక మా ఆదీవాసీ పద్ధతిలో పూజలు జరుగుతాయి. ఈ సమయంలోనే నాకు సారలమ్మ పూనుతుంది. సారలమ్మ ఆవహించిన తర్వాత నాకు తెలియకుండానే పరుగుల పెడతాను. దీంతో నన్ను(సారలమ్మ తల్లిని) శాంతిప జేసేందుకు నీళ్లు జల్లుతారు. మేడారం వెళ్లే దారిలో సారలమ్మకు కొమ్ము పడతారు. దూపం వేస్తారు. మేడారం బయల్దేరి సారలమ్మకు దారిపొడవునా భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు. శివాలతో ఊగిపోతుంటారు. సంతానం లేని వారు సంతాన ప్రాప్తికి, వరాల కోసం సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. వారిపై నుండి పూజారులం దాటి వెళితే వారికి ఆ తల్లి ఆశీస్సులు వచ్చినట్లు నమ్ముతారు. – కాకసారయ్య, పూజారి అందరిలానే నేను ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని అమ్మ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని ఆ తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏ ఏడుకి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే మాకు మరింత మేలు జరుగుతుంది అందరూ అనుకుంటారు. కానీ, అందరిలానే నేను. అమ్మను తీసుకురావడం అనేది నా బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికీ మేలు చేస్తుంది. – కొక్కెర కృష్ణయ్య, పూజారి మాఘ పౌర్ణమినాడు మనువు ఆదీవాసీల విశ్వాసం ప్రకారం సమ్మక్క భర్త పగిడిద్ద రాజు. వీరి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం రోజుల్లో ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమిరోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదివాసీ సంప్రదాయం. దీనికోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వీరికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంటలేని వారు కోళ్లు, మేకలు వంటి వస్తువులు సమర్పించుకునే వారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క, సారలమ్మలకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. – తాండ్ర కృష్ణగోవింద్, వరంగల్, సాక్షిప్రతినిధి -
వనదేవతల జాతరకుసర్వం సిద్ధం
హుజూరాబాద్ : కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలు సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణకు ఏర్పాట్లు అంతా సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో 10 చోట్ల జరుగనున్నండగా, సమ్మక్క–సారలమ్మలు కొలువుదీరనున్న గద్దెలను ఇప్పటికే ముస్తాబు చేశారు. తెలంగాణలో రెండేళ్లకోసారి ఎంతో వైభంగా జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర సందడి వారం రోజుల ముందుగానే ప్రారంభం కాగా, ఈ నెల 31 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరుగునున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఎత్తు బంగారం (బెల్లం) కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో జాతర సందడి నెలకొంది. నియోజకవర్గంలో ప్రధానంగా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని రంగనాయకులగుట్ట వద్ద జాతర వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతీ రెండేళ్లకోసారి జరిగే జాతరకు 2 లక్షలకు పైగానే భక్తులు హాజరవుతుండగా, ఆయా మండలాల్లో జరుగనున్న ఒక్కో జాతరకు లక్ష మందికిపైగానే భక్తులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జూపాకలో జాతరకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీణవంకలో ముమ్మర ఏర్పాట్లు మినీ మేడారంగా పిలిచే వీణవంక సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 31న వ నం నుంచి సారలమ్మ గద్దెకు రానుండటంతో జాతర ప్రారంభమవుతుంది. ఇక్కడ 1979 నుంచి పాడి వంశీయుల ఆధ్వర్యంలో జాతర జరుగుతుండగా... సుమారు 2లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలో వాగు ఉండటంతో మినీ మేడారంగా పేరుగాంచింది. కరీం నగర్ నుంచి వీణవంక 40కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తుల స్నానాల కోసం పక్కనే చెక్‌డ్యాం నిర్మించారు. ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సహకారంతో ఎస్సారెస్పీ కెనాల్ కాలువ ద్వారా నీటిని నింపడంతో చెక్‌డ్యాం కలకళలాడుతోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎస్సై కిష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంచారు. అదేవిధంగా చల్లూరు, కోర్కల్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో కూడా జాతర జరుగుతుంది. ఇల్లందకుంటలో గద్దెలు ముస్తాబు ఇల్లందకుంట మండలంలోని మల్యాలలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతర కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. 30 ఏళ్లుగా మల్యాలలో ఈ జాతరను నిర్వహిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మలను మేడారంకు చెందిన కోయజాతి కులస్తులు తాటి వనం నుంచి తీసుకొస్తారు. ఇప్పటికే పూజరులు వచ్చి ఉన్నారు. గతంలో వేరు ప్రదేశాలకు మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లేవారు అందరు కలిసి కులమతాలు తేడా లేకుండా జాతరను నిర్వహిస్తున్నా రు. దాదాపు ఈ జాతరకు 20వేలకు పై గా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్ర జలు వచ్చి దర్శించుకుంటారు. మూడు రోజుల పాటు జాతర జరుగనుంది. జమ్మికుంటలో.. జమ్మికుంట పట్టణంలోని కేశవపూర్‌లో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాతకాల సంపత్ అధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జమ్మికుంట, హైదరాబాద్, ఖమ్మం, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం జాతర నిర్వహాకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి నూతనంగా సమ్మక్క గద్దె వద్దకు వెళ్లే సమయంలో మేడారంలో ఉండే విధంగా 5 గంటలను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా భక్తులు స్నానాలు చేసేం దుకు శశ్వాత బాత్రూంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి జరిగే జాతరకు మొక్కులు చెల్లించుకునేందుకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు ççహాజరవుతారనే అంచన వేస్తున్నారు. మానేరు తీర ప్రాంతాన జాతర జమ్మికుంట మండలం వావిలాల, తనుగుల గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతరలు కొసాగుతాయి. వావిలాలలో 1982 నుంచి, తనుగులలో 1984 నుం చి ప్రతి రెండేళ్లకోసారి జాతర కొనసాగుతూ వస్తున్నాయి. రెండు గ్రామాల శివారులో ఉన్న మానేరు తీర ప్రాంతాన జాతర వేడుకలు జరుగుతాయి. వావి లాలలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో నడుస్తుంగా, తనుగులలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, విద్యుత్, రోడ్ల వసతులను ఏర్పాట్లను చేస్తున్నారు. వసతులు ఏర్పాటు చేశాం జాతరకు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే అన్ని వసతులను ఏర్పాటు చేశాం. ప్రధానంగా తాగునీటి వసతి, లైటింగ్ పనులు పూర్తి చేశాం. మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్నానాల కోసం జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు చేశాం. -పోరెడ్డి దయాకర్‌రెడ్డి,జాతర కమిటి చైర్మన్ -
మేడారం.. కథ కాదు ఓ చరిత్ర
సాక్షి, హైదరాబాద్: కోయ, ఆదివాసీల వీరగాథలపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని ప్రముఖ రచయిత, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. సమ్మక్క – సారక్కపై ఎన్నో కట్టు కథలున్నాయని, ఇప్పుడు చారిత్రక దృక్కోణంలోంచి వాటిని చూడాల్సి ఉందన్నారు. మేడారంలో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతర నేపథ్యంలో వారి గాథలపై అధ్యయనం చేసిన ఆయన ‘వీరుల పోరు గద్దె –మేడారం’ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం జయధీర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక్క కథ చరిత్ర సృష్టించింది.. సమ్మక్క–సారలమ్మ ఒక్క గాథే చరిత్రను సృష్టించింది. మరి మిగిలిన ఎనిమిది గాథల మాటేమిటి..? ఈ గాథలోనే కాదు పగిడిద్దరాజు, గడికామరాజు, ఎరమరాజు, గాదిరాజు, గోవిందరాజు, తోటుమనెడి కర్ర, గుంజేటి ముసలమ్మల కథలు కూడా ఈనాటికీ ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో సమక్క సారాలమ్మల చరిత్ర నుండి ప్రేరణ పొందినందుకు వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం పరిశోధనల వైపు దృష్టి సారించాలి. అప్పుడే అసలు గాథలు బయటికి వచ్చి ఆదివాసీలకు మేలు జరుగుతుంది. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తూ స్థానిక కోయ సంస్కృతి, పుజా విధానం మారకుండా కాపాడాలి. బ్రాహ్మణ పురోహితులు అక్కడ కన్పించకూడదు. చరిత్ర విషయంలో చరిత్రకారులు ఇలాంటి పరిశోధనలు చేసి ప్రజల పక్షం వహించినపుడే ఆ చరిత్రకు సార్థకత ఉంటుంది. ఇంతవరకు సమక్క–సారాలమ్మలకు సంబంధించి కాల్పానిక గాథలే ఉన్నాయి. ఇప్పుడు చారిత్రక ఘటనల క్రమం నుంచి వీరి చరిత్రను వెలికి తీశా. అంతేకాదు చరిత్ర ఆధారాలు కనిపించని చోట కోయల జ్ఞాపకాల్లోని మౌఖిక ఆధారాలే చరిత్రగా మార్చాలి. సమ్మక్క – సారక్క జాతరగానే పిలవాలి ఇప్పటి వరకు సమక్క – సారలమ్మ జాతరగా పిలుస్తున్నాం. ఇది సరికాదు. ‘సమ్మక్క–సారక్క’ జాతరగా పిలవడం సుమచితం. ఆదివాసీలకు అక్క దేవతలు ఉంటారు. ‘అక్కలు’ అని పిలవడం సరైన పద్ధతి. ఒకరు ఒకలాగా మరొకరు మరోలా కాకుండా.. అందరూ ఒకే తీరుతలో పిలవాలి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే జాతరను సమ్మక్క – సారక్క జాతరగా పిలవడం ప్రాచర్యంలోకి తేవాలి. ఈ విషయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. కోయ వీరుల పాటలకు ప్రాచుర్యం అవసరం ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క – సారక్క జాతరకి ఎనిమిది మంది కోయ వీరుల పగిడె పాటలు తీసుకరావాలి. వాటికి జాతరలో నాలుగు రోజుల పాటు వారి గాథలు చెప్పించటం అవసరం. అప్పడే ఆ వనదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. చరిత్రకు న్యాయం జరుగుతుంది. గొప్ప చారిత్రక ప్రదేశం.. మేడారంలో సమ్మక్క – సారక్క జాతర జరిగే స్థలం గొప్ప చారిత్రక ప్రదేశం. అక్కడ యుద్ధం జరిగింది. పడిపోయిన తన భర్తను సమక్క మోసుకొని వచ్చింది. మేడారం వద్దకు రాగానే అలసిపోయి అక్కడే ఆగింది. ఆ తర్వాత ఆమె తన కూతురు సారక్క అక్కడే ఉండి, కొంత కాలానికి మరణించారు. కాబట్టి కోయలకు అది పవిత్ర స్థలం. నిజానికి అది ఓ చారిత్రక ప్రదేశం మాత్రమే. 14 ఏళ్ల అన్వేషణ ఇది.. ‘వీరుల పోరు గద్దె–మేడారం’ పేరుతో సమ్మక్క, సారక్కలపై కోయడోలీల కథ పుస్తకం తీసుకరావటానికి 14 ఏళ్లు పట్టింది. ఇది ఒకరితో సాధ్యమైంది కాదు. ప్రొఫెసర్ గూడూరు మనోజ, పద్దం అనసూయ.. వీరితో పాటు ఎంతో మంది శ్రమించారు. తొలుత ఖమ్మం జిల్లా తొగ్గూడెం ప్రారంభించి మేడారం వరకు చరిత్ర అన్వేషణ ప్రయాణం సాగించాం. అక్కడ పగిడె తీశారు. మౌఖిక కథనాలకి ఆధార భూతాలు పగిడెలు మాత్రమే. అవసరమైన చోట పాఠ్యగానం సకిన రామచంద్రయ్య బృందం అందించారు. -
ఇంటింటా సమ్మక్క..
సాక్షి, వరంగల్ రూరల్: సమ్మక్క జాతర నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొలంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ముందుగా ఇంట్లో సమ్మక్కను చేసి జాతరకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవడం అనావాయితీగా వస్తోంది. గత వారం పది రోజుల నుంచి గ్రామాల్లో ఎక్కడ చూసినా సమ్మక్క–సారలమ్మ పూజలే కనిపిస్తున్నాయి. కోరికలు నేరవేడంతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ఎత్తు బంగారం (బెల్లం), కోడి, యాటలతో మొక్కులు చెల్లిస్తున్నారు. పండుగ సందర్భంగా తమ బంధువులందరిని పిలిచి విందు చేస్తున్నారు. జాతరలో సమ్మక్క–సారలమ్మల గద్దెల వద్ద మొక్కులు చెల్లించిన తర్వాత ఎత్తు బంగారాన్ని బంధువులు, ఇంటి చుట్టు ప్రక్కన వాళ్లను పంచిపెట్టడం అనవాయితీగా వస్తోంది. ఒడి బియ్యం కోరుకున్న కోరిక నేరవేరితే ఒడి బియ్యం పోస్తామని మొక్కుతారు. ఇలా మొక్కుకున్న వారు ఒక్కరి నుంచి తొమ్మిది మంది వరకు ఒడి బియ్యం పోస్తున్నారు. ఇంట్లో సమ్మక్కను చేసేప్పుడు జోగినికి (దేవుడు ఉన్న వ్యక్తి) ఒడి బియ్యాలు పోస్తున్నారు. ఊపందుకున్న విక్రయాలు సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో బెల్లం, కొబ్బరి కాయలు, కోళ్లు, గొర్రెలు, మేకల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కొబ్బరికాయ ధరలు కొండెక్కడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదపు రూ.60 కోట్లకు పైగా బెల్లం వ్యాపారం, రూ.2 కోట్లకు పైగా గొర్రెలు, కోళ్లు, కొబ్బరికాయల విక్రయాలు జరగనున్నాయి. -
మేడారంలో ఉచిత వైఫై షురూ...
వరంగల్: మేడారం జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఉచితంగా వైఫై సేవలను సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ పీజీఎం కందగట్ల నరేందర్ ప్రకటించారు. ఉచిత వైఫై సేవలు ఈనెల 31వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ జాతరకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో సోమవారం సాయంత్రం నుంచి సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. జాతర ప్రాంగణంలో 13 టవర్లతో సిగ్నల్స్ అందిస్తున్నామన్నారు. 20 హాట్స్పాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హాట్స్పాట్లకు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ కల్పిస్తున్నామన్నారు. ఒక్కో హాట్‌స్పాట్‌తో ఒకేసారి 12 వేల మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. వైఫై సేవలు ఫ్రీగా అందించేందుకు ఎంపీ సీతారాంనాయక్ కృషితో ప్రభుత్వం రూ.20 లక్షలు బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెల్లించారని తెలిపారు. జాతర పరిసరాలకు వెళ్లడంతోనే సెల్లో లాగిన్ పేజీ వస్తుందని, దానిలో అప్షన్ ఎన్నుకుంటే వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్)తో కనెక్ట్అయి ప్రతి రోజు 500 ఎంబీ డాటాను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఉచిత సేవలు అన్ని నెట్వర్కులతో సంబంధం లేకుండా కేవలం వైఫై ఆప్షన్‌తోనే డాటాను అందిస్తామని నరేందర్ తెలిపారు. -
దాహం.. దాహం
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. తల్లుల దర్శనం కోసం క్యూ లైన్లలో నిల్చున్న వారు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. జాతరలో తాగునీటి వసతి కల్పించేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖకు ప్రభుత్వం రూ.19.80 కోట్లను కేటాయించింది. ఇందులో సుమారు రూ.10 కోట్ల వరకు తాగునీటి వసతికి వెచ్చించారు. కాగా, గత జాతరలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారానే నీళ్లను అందిస్తున్నారు. కేవలం మిషన్ భగీరథ నీళ్లపైనే ఆశలు పెట్టుకుని అధికారులు కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. –ములుగు క్యూ లైన్లలో ఇబ్బందులు భక్తులు సోమవారం భారీగా గద్దెలకు చేరుకోవడంతో రద్దీ ఎక్కువై అమ్మల దర్శనం ఆలస్యమైంది. మధ్యాహ్నం కావడంతో ఎండ ఎక్కువగా ఉండి తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చంటి పిల్లల పరిస్థితి అగమ్యగోచరం. క్యూలో భక్తుల కోసం డ్రమ్ములు, నల్లాల ద్వారా నీటిని అందిస్తామన్న అధికారులు ఇప్పటి వరకు ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వంటావార్పునకు.. భక్తులు నీళ్ల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్‌పాయింట్, నార్లాపూర్, చింతల్‌క్రాస్, వెంగళాపురం, పడిగాపురం, కొత్తూరు, కన్నెపల్లి, ఊరట్టం ప్రాంతాల్లో నీళ్లులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది ప్రైవేట్ వాహనాల ద్వారా సమీపంలోని బోరింగ్ పంపులు, ట్యాప్స్‌ల ద్వార నీటిని తీసుకొస్తున్నారు. మరి కొందరు వాగు నీళ్లను వంటలకు వాడుతున్నారు. మినరల్ వాటర్ క్యాన్‌కు రూ.70 ఆర్డబ్ల్యూఎస్ తరుఫున డిమాండ్ మేర మంచినీరు అందకపోవడంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు మినరల్ వాటర్ క్యాన్ల ధరలను అమాంతంగా పెంచేశారు. 20 రోజుల క్రితం క్యాన్‌కు రూ.15 నుంచి రూ.20 ధర పలుకగా ప్రస్తుతం ఆ ధర రూ.50 నుంచి రూ.70 దాకా పలుకుతూ ఉండడం విశేషం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా మేడారానికి వచ్చే భక్తులకు ఈ సారి శుద్ధమైన గోదావరి జలాలను అందించాలని ప్రభుత్వం యంత్రాంగం భావించింది. అనుకున్న విధంగానే పనులను వేగవంతం చేసింది. కానీ, అధికారుల ప్రయత్నం సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఇంగ్లిష్ మీడియం పాఠశాల సమీపంలో 4 లక్షల లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించింది. ఇదంతా బాగానే ఉన్నా అధికారులు నీటిని అందించని పక్షంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా భగీరథ పథకం ద్వార నీటిని అందిస్తే మేలని భక్తులు సూచిస్తున్నారు. మంచినీటికి ఇబ్బందులు పడుతున్నాం.. జాతరలో మంచినీటి సౌకర్యం ఉంటుంనే భావనతో ఇంటి నుంచి నీళ్లను తీసుకురాలేదు. తీరా ఇక్కడికి వచ్చాక నీళ్లు అందుబాటులో లేవు. మినరల్ వాటర్ ప్లాంట్‌కు వెళితే ఎక్కడా లేని ధరలు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. తాగడానికి, వంట చేయడానికి రెడ్డిగూడెం సమీపంలోని నల్లాల దగ్గరకు వచ్చాం. నీళ్లు బాగాలేకున్నా తాగుతున్నాం. విజయ, సికింద్రాబాద్ -
మేడారం జాతరకు 4200 బస్సులు
సాక్షి, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహా జాతరకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. 50 కేంద్రాల నుంచి 4200 లకు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఈ సందర్బంగా భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు తెలిపారు. రెండేళ్ల క్రితం జాతర సందర్భంగా ఆర్టీసీ 3700 ప్రత్యేక బస్సులను నడపగా.. సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి జాతరకు అదనంగా మరో 500 బస్సులను నడపునున్నట్టు తెలిపారు. ఈసారి సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, గోదావరి ఖని, పెద్దపల్లి వంటి 50 కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. జాతరకు 12 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని మేడారం స్పెషల్ ఆపరేషన్స్ విధుల్లో నియమించారని ఆయన వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్సుల ఏర్పాట్లు చేయడంతో పాటు, మేడారం వద్ద ఆర్టీసీ తాత్కాలిక బస్ టర్మినల్ కూడా ఏర్పాటుచేశామన్నారు. కాగా మేడారంలో ఏర్పాటు చేసిన వసతులను ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. వరంగల్‌లో అధికారులతో ఎండీ సమీక్ష నిర్వహించారు. జాతరలో బస్సుల నిర్వహణ, ప్రయాణికుల కోసం ఏర్పాట్లు, బస్ టర్మినల్, భక్తుల డిమాండ్ మేరకు ఆయా రూట్లలో బస్సుల నిర్వహణపై ఆర్ఎంలు, డిపో మేనేజర్లు, అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. -
తొలిరోజు మేడారానికి 450 బస్సులు
హన్మకొండ: మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన తొలి రోజు 450 బస్సులు నడిచాయి. వరంగల్ నగరంతో పాటు, జిల్లాలోని ఇతర ప్రత్యేక పాయింట్లు, ఇతర జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రాత్రి 8 గంటల వరకు 450 బస్సులు 1800 ట్రిప్పుల ద్వారా 72 వేల మంది భక్తులను జాతరకు చేరవేశాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ తెలిపారు. భక్తుల రాక, సంఖ్యను బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వెంట వెంటనే పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
ఆదివాసీ ఆచారాలతోనే..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరను ఆదివాసీ ఆచారాలతోనే భక్తులు గౌరవంగా జరుపుకోవాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అన్నారు. జాతరలో ఆధునిక టెక్నాలాజీ అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లతోనే జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. వనదేవతలపై ఉన్న నమ్మకం, విశ్వాసంతో జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తున్నారన్నారు. భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని తెలిపారు. జాతరలో భక్తులు, అధికారులు, ప్రజలు పాటించాల్సిన సమన్వయంపై ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తొక్కిసలాటకు గురికావొద్దు.. జాతర సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, మేడారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవతలను తీసుకువచ్చేటప్పుడు భక్తులు దూరం నుంచి దేవతలను తనవితీరా చూడాలి. కాని ఆరాటంతో రోడ్లపై వచ్చి తొక్కిసలాటకు గురికావొద్దు. పోలీసులు పనిభారంతో భక్తులపై దురుసుగా ప్రవర్తించొద్దు. గద్దెల వద్ద భక్తులకు అధికారులు సహకరించాలి. మనోభావాలు దెబ్బతీయొద్దు సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే ఆదివాసీ సంస్కృతి, ఆచారాల మధ్య సాగుతుంది. ఆచారాలను భక్తులు, అధికారులు గౌరవించాలి. ఆచార పద్ధతి ప్రకారం జాతర నిర్వహించడం వల్లే రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులకు దేవతల చల్లని చూపుల కోసం వ్యయప్రయాసలకోర్చి మేడారం తరలివస్తున్నారు. పూజారుల మనోభావాలను దెబ్బతీయొద్దు. అధికారులను గౌరవించాలి.. జాతరలో భక్తులకు సేవలందించే అధికారులకు తల్లుల దీవెనలు ఉంటాయి. కోట్లమంది భక్తజనంలో నాలుగు రోజులు 24 గంటల పాటు ఓపికగా భక్తులకు సేవలందించడం.. అధికారుల పనితనం చాలా గొప్పది. జాతరలో సేవలందించే అధికారులను భక్తులు ఎంతో గౌరవంగా చూడాలి. భక్తులు అధికారుల సూచనలను పాటించి ప్రశాతంగా అమ్మలను దర్శించుకోవాలి. ఫ్రెండ్లీగా పనిచేస్తాం.. జాతరలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా పోలీసులు, అధికారులు ఆదివాసీలు, పూజారులందరం ప్రెండ్లీగా పని చేసి జాతరను సక్సెస్ చేసేందుకు కృషి చేస్తాం. జాతరలో విధులు పనిచేసే అధికారులతో మర్యాదపూర్వకంగా మెదలాలి. ఆదివాసీ యువకులకు, సంఘాల నాయకులకు పూజా రుల సంఘం తరఫున కోరినాం. జాతరలో ఎన్నో ఇబ్బందులు తట్టుకుని భక్తుల భద్రత, సేవల కోసం పని చేసే అధికారుల మనసు నొప్పించకుండా జాతరను విజయవంతం చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందాలని పూజారుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. -
జాతరలో ఏం పనులు చేశారు ?
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఏం పనులు చేశారు.. ఏం విధులు నిర్వర్తిస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్‌లో పది శాఖల సెక్టోరియల్ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు. వనదేవతలను దర్శించుకున్న ఆయన సాయంత్రం అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించి లోపాలను సరిచేయాలన్నారు. ఉదయం ఆయన జంపన్నవాగు నుంచి గద్దెల వరకు కాలినడకన తిరిగి అక్కడ నెలకొన్న సమస్యలు, భక్తులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. మరుగుదొడ్ల వద్ద నీటి సౌకర్యం లేక కంపుకొడుతున్నాయని, వాటి ని క్లీన్ చేయడంతోపాటు నీటి వసతి ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. ఆకస్మికంగా తనిఖీ చేసి మంచిగ లేకుంటే చర్యలు తీసుకుంటానని ఎస్ఈ రాంచంద్రు, ఈఈ నిర్మలపై మండిపడ్డారు. స్కావేంజర్లను ఏర్పాటు చేసి క్లీన్ చేయాలన్నారు. కరెంట్ పనులు ఇంకా చేయడం ఏమిటని ఎస్ఈ నరేష్‌ను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాళ కరెంటు పనులు ముగించుకొని తనకు రిపోర్ట్ చెప్పాలన్నారు. రేపటి నుంచి ఐజీ నాగిరెడ్డి, ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇక్కడే ఉంటూ పర్యవేక్షణ చేస్తారని కడియం అన్నారు. పది కిలోమీటర్ల వరకు భద్రత పోలీసులు గద్దెల వద్ద విధుల్లో ఉన్నా భక్తుల జేబులను దొంగలు కొట్టడం ఏమిటని డీఎస్పీ రాఘవేంద్రరెడ్డిని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అన్నారు. గద్దెల వద్ద దొంగలు లోపలికి వచ్చి జేబులు కొడుతున్నారని స్వయంగా భక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని కడియం అన్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, పోలీసుల రక్షణ చర్యలు అంతగా బాగాలేవన్నారు. ఈ నెల 30 నుంచి ఒక్క వాహనం కూడా జంపన్నవాగు, గద్దెల వద్ద కనిపించొద్దని డీఎస్పీని కడియం తీవ్ర స్వరంతో ఆదేశించారు. అమ్మలకు విశ్రాంతి భక్తులు వేసే బంగారం, కొబ్బరి ఇతర పదార్థాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి శుభ్రంగా ఉంచాలన్నారు. ఫైర్‌సిబ్బంది గద్దెలను నీటితో శుభ్రం చేయాలన్నారు. అమ్మలకు తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు విశ్రాంతి అని భక్తులకు చెప్పి ఆ ప్రాంగణమంతా శుభ్రం చేసి ఉంచాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబును ఆదేశించారు. మురుగు నీరు తొలగించాలి జంపన్నవాగులో ఉన్న మురికి నీరు ప్రధాన జాతర సమయంలో తొలగించేలా చూడాలని ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణకుమార్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ నెల 30 నుంచి భక్తులు తేట నీటిలో స్నానాలు చేసేలా చూడాలన్నారు. వాగులో క్లోరినేషన్ చేయించి భక్తులకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూడాలని ఎస్ఈని ఆదేశించారు. మేడారం గద్దెల నుంచి పది కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా దుమ్ముదూళి ఉండొద్దని, రోజూ బ్లీచింగ్ చల్లించాలని, చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని డీపీఓ చంద్రమౌళిని ఆదేశించారు. ఫిబ్రవరి 2న సీఎం వస్తారు ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, ఆయన పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారని తెలిపారు. ఆ సమయంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాగ్రత్తగా పనిచేసి జాతరను సక్సెస్ చేయాలన్నారు. అనంతరం గద్దెల వద్ద ఉన్న మంచెపైకి వెళ్లి అక్కడ భక్తుల దర్శనాలను పరిశీలించారు. సమీక్షలో కలెక్టర్ కర్ణన్, జేసీ అమయ్ కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, సబ్‌కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ ఆర్ఎం సూర్యకిరణ్, సీపీఓ కొమురయ్యతోపాటు అధికారులు ఉన్నారు. -
మొక్కుల మేడారం
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. మహాజాతరకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం, ఆదివారం సెలవు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సుమారు 12 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు అంచనా వేశారు. భక్తుల రాకతో మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్ ఆర్టీసీ పాయింట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తోపులాట.. మేడారానికి భక్తులతోపాటు వీఐపీలు సైతం భారీగా వచ్చారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాం నాయక్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్‌తోపాటు వచ్చిన ప్రజాప్రతినిధులతో వీఐపీ గేటు వద్ద గందరగోళం ఏర్పడింది. వీఐపీలు అమ్మవార్లను దర్శించుకునేందుకు గద్దెలకు వెళ్లిన క్రమంలో తోపులాట జగింది. వీఐపీ గేటు పక్కనే సాధారణ భక్తులు అమ్మవార్లను దర్శించుకునే క్యూలైనన్లు ఉండడంతో రద్దీ ఎక్కువై ఓ బాలిక మోచేయికి తీవ్రగాయమైంది. భక్తుడి తలకు గాయాలు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలను నేరుగా గద్దెల వద్దకు పంపించారు. ఈ సమయంలో గద్దెల బయట ఉన్న భక్తులు తమ మొక్కులో భాగంగా బంగారం(బెల్లం), కొబ్బరికాయల ముక్కలను గద్దెల లోపలికి విసరడంతో చాలామంది వీఐపీ భక్తులకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన చంద్రారెడ్డి తలపై కొబ్బరికాయపడి రక్తస్రావమైంది. ఇక చిన్నపిల్లలతో వీఐపీ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగారం ముద్దలను సేకరించడానికి వచ్చిన ఆదివాసీ వలంటీర్ల వద్ద ఉన్న హెల్మెట్లను చిన్నారుల తలలపై ఉంచి అప్రమత్తమయ్యారు. తీరు మారని దేవాదాయ శాఖ.. గత మహాజాతరలో అమ్మలను దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో భక్తులు విసిరిన బంగారం ముద్ద తగిలి స్వయంగా తనకే గాయమైందని, ఈసారి వీఐపీ భక్తులకు గద్దెల వద్ద ఇబ్బందులు రాకుండా చూడాలని, వారం రోజుల క్రితం మేడారానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. భక్తులు సమర్పించేందుకు తమ వెంట తీసుకొచ్చే బంగారం, కొబ్బరికాయలను గద్దెలపై అమ్మవార్లకు అందేలా సులవైన మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని వీఐపీ భక్తులు వాపోతున్నారు. క్యూలైన్లు కిటకిట... భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచి భక్తులకు క్యూలైన్ల ద్వారా అనుమతి ఇచ్చారు. రెడ్డిగూడెం వైపు నుంచి అమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గంటపాటు క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతోపాటు వీఐపీలు రావడంతో చాలా సేపు వేచిచూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో మంచినీటి సౌకర్యం లేక అధికారుల ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. హెలీకాపర్ట్లో వచ్చిన ఎంపీలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బాల్క సుమన్, గుత్త సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ మేడారం పోలీస్ క్యాంపులోని హెలిప్యాడ్‌లో దిగారు. ఎంపీ సీతారాంనాయక్, జేసీ అమయ్‌కుమార్, చైర్మన్ కాక లింగయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు వారికి హెలీప్యాడ్ నుంచి స్వాగతం పలికారు. వారి వెంట ఎంపీ పసులేటి దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీలు వలీయాబీతోపాటు పలువురు అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరిని భారీ పోలీసులు బందోబస్తు మధ్య తీసుకొచ్చారు. -
శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరకు..సర్వం సిద్ధం
వన దేవతల జన జాతరకు కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంటల్లోని గద్దెలు సిద్ధమయ్యాయి. మినీ మేడారంగా ప్రాచుర్యం పొంది భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న రేకుర్తి శ్రీ సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్నారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులకు అసౌకర్యాలు కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపల్లి(కరీంనగర్) : ఈనెల 31వ నుంచి వచ్చేనెల 3 వరకు జరిగే జాతరపై వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. దేవాదాయ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, పంచాయతీరాజ్, పోలీస్ తదితర శాఖలను సమన్వయం చేస్తూ పంచాయతీ ఆధ్వర్యంలో జాతర పనులు ఊపందుకున్నాయి. సుమారు నాలుగున్నర లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారన్న అంచనా మేరకు నాలుగు లైన్ల బారీకేడ్లతోపాటు గద్దెల చుట్టు రక్షణ కర్రలు ఏర్పాటు చేశారు. సర్వ, ప్రత్యేక, వీఐపీల దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. అమ్మవార్ల దర్శన అనంతరం భక్తుల విడిది కోసం గద్దెల సమీపంలోని స్థలంతోపాటు దేవుళ్ల గుట్ట, పంచాయతీ పరిసరాలు, ఎస్సారెస్పీ కెనాల్కిరువైపులా, పెంటకమ్మ చెరువు ప్రాంతాలను చదును చేశారు. బంగారం(బెల్లం), కొబ్బరికాయలు, ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. జాతర జరిగే ప్రదేశంతోపాటు పరిసర ప్రాంతాల్లో లైటింగ్, మైకులు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు ఉచితంగా నీటి ప్యాకెట్లను సరఫరా చేసేందుకు రెవెన్యూ, విద్యుత్ శాఖ ముందుకొచ్చింది. ట్యాంకర్ల ద్వారా కరీంనగర్ మున్సిపల్, నల్లాల ద్వారా పంచాయతీ నీటిని సరఫరా చేయనుంది. ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు వార్డు సభ్యుడు రహీం ముందుకొచ్చారు. ఎస్సారెస్పీ కాలువే.. జంపన్న వాగు..! ప్రతి రెండేళ్లకోసారి వైభవోపేతంగా జరిగే జాతరకు భక్తుల తాకిడి పెరుగుతోంది. వారి కోసం ప్రత్యేక స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. జంపన్న వాగును తలపించేలా ఎస్సారెస్పీ కెనాల్లో స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. ఈనెల 30 నుంచి నీటిని అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గంగుల ఆదేశాలిచ్చారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు 4ప్రదేశాల్లో తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. పురుషులకు 15, మహిళలకు 15 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. జాతరలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా 50 మందితో షిఫ్టులవారీగా పనులు చేపట్టనున్నారు. భారీ బందోబస్తు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 139 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 30 సీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచనున్నారు. పార్కింగే ప్రధాన సమస్య రేకుర్తి జాతరలో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారనుంది. కరీంనగర్–జగిత్యాల, రేకుర్తి–యూనివర్సిటీల ప్రధాన రహదారుల గుండా వెళ్లే వాహనాల తాకిడి అధికంగా ఉండి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడనుంది. ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న కోళ్లు, బెల్లం దుకాణాల్లో భక్తులు నిలిచే అవకాశముంది. గతంతో పోల్చితే ఈ ఏడాది జాతర పరిసర ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు అధికమయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పార్కింగ్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. కాళోజీనగర్, పంచాయతీ పరిసరాలు, పెంటకమ్మ ప్రాంతాలను గుర్తించారు. కమిటీ నియామకం ఎమ్మెల్యే కమలాకర్ సూచన మేరకు 13 మందితో రేకుర్తి జాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏర్పాటు చేశారు. రాజశేఖర్(ఎంపీటీసీ), నరేష్, తిరుపతి, నర్సయ్య, లక్ష్మణ్, కనుకయ్య, కత్తరపాక ఆంజనేయులు, మహంకాళి ఎల్లయ్య, పొన్నం అనిల్‌గౌడ్, నేరెళ్ల అజయ్, సుదగోని నారాయణ, గుర్రం శ్రీనివాస్, సొన్నాయిల రాకేశ్ ఎన్నికయ్యారు. 30 ఏళ్లుగా జాతర జాతరను 30 ఏళ్లుగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. తన తండ్రి పిట్ల రాజమల్లయ్య ఆధ్వర్యంలో 1990లో జాతర ప్రారంభమైంది. అప్పటినుంచి ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరకు జనం పెద్దసంఖ్యలో వస్తున్నారు. – పిట్టల శ్రీనివాస్, జాతర వ్యవస్థాపక చైర్మన్ భక్తులు సహకరించాలి రేకుర్తి, చింతకుంటల్లో జాతరకు భద్రత ఏర్పాటు చేస్తున్నాం. రేకుర్తిలో భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి పర్యవేక్షణలో సుమారు 150 మంది బందోబస్తు నిర్వహిస్తారు. జాతర ప్రదేశానికి వాహనాలకు అనుమతివ్వం. భక్తులు సహకరించాలి. – పింగిలి నాగరాజు, ఎస్సై, కొత్తపల్లి(హవేలి) -
నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన స్పీకర్
సాక్షి, భూపాలపల్లి: శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి శనివారం మేడారం సమ్మక్క-సారాలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిలువెత్తు బంగారాన్ని సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ జాతర ఇంకా ప్రారంభం కాకముందే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారన్నారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో తగిన ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. కుంభమేళాలు నదీ పరివాహక ప్రాంతాల్లో జరిగితే.. తెలంగాణలో అటవీ ప్రాంతాన కుంభమేళా జరగడం విశేషమన్నారు. ప్రపంచంలో అరుదైన జాతర మేడారమని అభివర్ణించారు. తెలంగాణ ప్రజల జీవితాలు ప్రకృతితో ముడిపడి ఉన్నాయన్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 31న ఎడ్ల బండి పై మరోసారి వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటానని మధుసూదనాచారి తెలిపారు. -
ఐదు రోజుల పండుగ
ములుగు: జాతర అంటే నా చిన్నతనంలో ఐదు రోజుల మహా పండుగ. జాతర జరిగే ముందు బుధ, గురువారాల్లో తండాల్లోని అన్ని ఇళ్లను శుభ్రం చేసి అమ్మలకు మేడారం పున్నమి పేరుతో కోళ్లను అర్పించే వాళ్లం. అమ్మవార్లకు పెట్టిన బెల్లం ముద్దలు, కొబ్బరి ముక్కలను కలిపి సమ్మక్క–సారలక్క ఫలారముల్లో అంటూ ఇంటి పక్క వారిని ఆహ్వానించి వారికి పంచిపెట్టేవాళ్లం. ప్రస్తుతం జాతర అంటే ఒక రోజు పండుగగా మారింది..ఉదయం వెళ్లి.. సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నారని రాష్ట్ర గిరిజన పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. మంత్రి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే.. ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవాళ్లం మేడారం జాతరకు గతంలో ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవాళ్లం. దారి సరిగ్గా లేకపోవడంతో గ్రామం నుంచి 20 వరకు ఎడ్లబండ్లు కలిసి వెళ్లేవి. మా ఊరు ము లుగు మండలం జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని సారంగపల్లి నుంచి రెండు రోజుల పాటు ప్రయాణించి జాతరకు చేరుకునే వాళ్లం. జంపన్నవాగు వద్ద లోతుగా ఇసుక ఎక్కువగా ఉండేది. దీంతో ఎడ్ల బండ్లు అక్కడే విడిచేవాళ్లం. అప్పటి అనుభూతి వేరుగా ఉండేది. ప్రస్తుతం జాతర తీరు మారింది. రహదారి సౌకర్యాలు పెరిగాయి. ఉదయం జాతరకు వెళితే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు. సమ్మక్క–సారలమ్మను వేడుకుంటే ఇబ్బందులు తొలుగుతాయని మా కుటుంబమంతా నమ్మేది. 38 సెక్టార్లుగా జాతర ప్రభుత్వం తరపున 2016 జాతరలో సుమారు రూ.170 కోట్లను కేటాయించి శాశ్వత ప్రాతిపాదికన రహదారులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేశాం. ఈ సారి జాతరలో రూ 80.55 కోట్లు కేటాయించాం. గతంలో కంటే భిన్నంగా లగ్జరీటెంట్లు, మరుగుదొడ్లు, కార్పెట్ సౌకర్యాలున్నాయి. రూ.2కోట్లతో మ్యూజియం, 10 హరిత కాటేజీలు ఆదివాసీ నృత్యాలు, చిత్ర ప్రదర్శనకు హంపీ థియేటర్‌ను నిర్మిస్తున్నాం. భక్తుల కోసం పర్యాటకశాఖ తరపున మూడు హెలీకాప్టర్లను నడుపనున్నాం. ఈ జాతరకు వన్‌వే కొనసాగుతుంది. సుమారు 12వేల మంది పోలీసులను కేటాయించాం. పోలీసుశాఖ కొత్త టెక్నాలజీతో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, యాప్‌లను వాడుతోంది. అన్ని శాఖలను కలుపుకొని 38 సెక్టార్లను నియమించాం. భక్తులకు సింగరేణీ క్యాలరీస్ నుంచి 10లక్షల వాటర్ బాటిళ్లు, జెన్కో నుంచి 10లక్షల వాటర్ బాటిళ్లు, ఆర్టీసీ నుంచి మరో 5 లక్షల వాటర్ బాటిళ్లను ఉచితంగా అందించనున్నాం. జాతీయ హోదా కల్పిస్తుందని ఆశిస్తున్నా.. 1996లో మేడారానికి రాష్ట్ర పండుగగా గుర్తించిన సమయంలో నేను వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా. మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తాం. కేంద్రాన్ని కోరాం. టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించారు. గత 2016 జాతర నుంచి కేంద్రాన్ని కోరుతున్నా అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. గత రెండు జాతరల నుంచి రాష్ట్రం నుంచి నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం జాతీయ హోదా కల్పిస్తుందని ఆశిస్తున్నా. ఆర్టీసీ, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ తరుఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. 4200 బస్సులను ఏర్పాటు చేసి 1100 మంది సిబ్బంది రవాణా శాఖ తరుపున విధులకు నియమించాం. బస్సులు సరిపోకపోతే మరికొన్ని బస్సులను అందుబాటులో ఉంచుతున్నాం. వరంగల్ నుంచి పస్రా మీదుగా ప్రైవేట్ వాహనాల ద్వార వచ్చే భక్తులను చింతల్ క్రాస్ వద్ద దింపి అక్కడి నుంచి 40 ఉచిత షటిల్ బస్సులను నడపనున్నాం. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. సుమారు 35 ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తాం. జాతర పరిసరాల్లో ఈ సారి 100 తాత్కాలిక చెత్త కుండీలను ఏర్పాటు చేసి 3600 మంది కార్మికులను చెత్త సేకరణకు నియమించాం. ఫిబ్రవరి 2న సీఎం, ఉప రాష్ట్రపతి రాక జాతరకు ఫిబ్రవరి 2వ తేదీన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రానున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య, రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఉప రాష్ట్రపతికి కల్లార చూపించనున్నాం. -
మేడారంలో అటవీశాఖ గుడారాలు
ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగు వెనుకభాగం (ఊరట్టం నుంచి గద్దెలకు వెళ్లే మార్గం మధ్యలో) సుమారు 100 గుడారాలను ఏర్పాటు చేశారు. ఒక్కో గుడారంలో ఫైర్‌సెప్టీ కవర్స్, లైటింగ్, వాటర్, షాంపులు, సబ్బులు, ఒక బెడ్ అందుబాటులో ఉంచుతారు. ప్రతి 10 గుడారాలకు ఒక మొబైల్ టాయిలెట్, ఆరు గుడారాలకు ప్రత్యేక గార్డును నియమిస్తారు. మహా జాతరకు వచ్చే భక్తులు ఈ గుడారాలను బుకింగ్ చేసుకోవడానికి అటవీశాఖ, ఎకో టూరిజం అదికారులు ప్రత్యేక పేటీఎం నంబర్‌ను కేటాయించారు. 12 గంటల పాటు బస చేయడానికి రూ.1000, 24 గంటల పాటు బస చేయడానికి రూ.2 వేల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఒక్కో గుడారంలో సుమారు ఐదుగురు సభ్యులు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. బుకింగ్ చేసుకోవల్సిన భక్తులు పేటీఎం నంబర్ 9553142346కు చెల్లింపులు చేయవల్సి ఉంటుంది. మిగతా వివరాలకు 8096210513, 9989585287 నంబర్లను సంప్రదించాలి. బుకింగ్ పూర్తయిన సమయంలో పేటీఎం నెంబర్‌కు చెల్లింపులు నిలిపివేయనున్నట్లు ఏకో టూరిజం జిల్లా కో ఆర్డినేటర్ కల్యాణపు సుమన్ , తాడ్వాయి అటవీశాఖ రేంజ్ అధికారి అల్లెం గౌతమ్ తెలిపారు. భక్తుల తర్జనభర్జన ఏకోటూరిజం తరఫున ఏర్పాటు చేసిన గుడారాల బుకింగ్ విషయంలో భక్తులు తర్జన భర్జన పడుతున్నారు. అధికారులు పేటీఎం ద్వారా చెల్లింపులు చేయాలని ప్రకటించారు. అయితే ఎన్ని గుడారాలు అందుబాటులో ఉన్నాయనే విషయంపై పేటీఎం ద్వారా పూర్తి సమాచారం భక్తులకు అందే పరిస్థితి లేకుండా పోయింది. శాఖ తరుఫున ప్రత్యేక ఆన్లైన్ చెల్లింపులు, రోజు ఖాళీగా ఉండే గుడారాల సంఖ్య బుకింగ్ సమయంలో తమ కేటాయించే గుడారాల నంబర్లను అందుబాటులో ఉంచితే బాగుంటుందని భక్తులు సూచిస్తున్నారు. -
సమ్మక్క వంశీయుల పూజలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క గద్దె వద్ద బయ్యక్కపేటకు చెందిన చందా వంశస్తులు గురువారం మొక్కులు చెల్లించారు. సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేట అనే చరిత్ర ఉంది. అయితే ప్రతి ఏటా జాతర సందర్భంగా సమ్మక్కకు తొలి మొక్కులు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు చందా వంశస్తులు బయ్యక్కపేట నుంచి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, చీరసారె, గాజులు, పూలు తీసుకువచ్చి సమ్మక్క గద్దె వద్ద పూజలు నిర్వహించారు. జాతర సమయంలోనే సమ్మక్కకు ఆనవాయితీగా పూజలు నిర్వహించాల్సిన ఉన్నప్పటికీ రద్దీ కారణంగా ముందుగానే తల్లికి మొక్కు చెల్లించినట్లు చందా వంశీయులు తెలిపారు. డోలు వాయిద్యాలతో సమ్మక్క గద్దెపైకి వెళ్లి మొక్కులు సమర్పించారు. సమ్మక్కకు తొలి పూజల సందర్భంగా చందా వంశస్తులు, వడ్డెల ఇళ్లలో ప్రత్యేక పూజలు చేశారు. -
తీరొక్క మొక్కు
సమ్మక్క–సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. సమ్మక్క–సారలమ్మ పేరుతో ఉన్న గద్దెలే ఇక్కడ పూజనీయ స్థలాలు. ఈ గద్దెల మధ్య ఉండే కొయ్యదారులు, మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్లు ఇక్కడ దేవతామూర్తులు. నిత్యజీవితంలో భాగమైన పసుపు, కుంకుమ, బెల్లం వంటి వస్తువులతోనే ఇక్కడ పూజలు, మొక్కులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీసమ్మక్క, సారలమ్మ మహాజాతరలో భక్తులు తీరొక్క మొక్కులు చెల్లిస్తుంటారు. సంతానం కలగాలని, ప్రభుత్వ ఉద్యోగం రావాలని, వ్యాపారంలో బాగా స్థిరపడాలని, కూతురికి మంచి వివాహా సంబంధం రావాలని అమ్మలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. కోర్కెలు తీరిన వారు కోళ్లు, యాటలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, చీరసారెలు సమర్పించి వనదేవతల ఆశీర్వాదం పొందుతారు. జాతరలో తీరొక్క మొక్కులపై ప్రత్యేక కథనం. – ఎస్‌ఎస్‌తాడ్వాయి జంపన్న వాగులో స్నానం.. జంపన్న వాగుకు సర్వపాప హరిణిగా పేరుంది. ఒకప్పటి సంపెంగ వాగే.. నేటి జంపన్నవాగు. ఇక్కడ స్నానమాచరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్తారు. జంప్నన్న వాగు ఒడ్డున తలనీలాలు సమర్పిస్తారు. బంగారం (బెల్లం) సమర్పణ ప్రపంచంలో ఏ జాతరలో లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సమ్మక్క తల్లికి బెల్లం అంటే ఇష్టమని ప్రతీతి. తాము కోరిన కోర్కెలు నెరవేరితే నిలువెత్తు బం గారం సమర్పిస్తామని చాలా మంది మొక్కుతుంటారు. కోర్కెలు నెరవేరగానే తప్పని సరిగా బెల్లం మొక్కు సమర్పిస్తారు. ఎదుర్కోళ్లు.. అమ్మలను గద్దెలకు తీసుకొచ్చే క్రమంలో భక్తులు ఎదుర్కోళ్లతో ఆహ్వానం పలుకుతా రు. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎ దురుగా వేస్తూ మనసారా మొక్కుతుంటారు. శివసత్తుల పూనకాలు జంపన్న వాగులో శివసత్తుల పూనకాలు మేడారం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలతోపాటు పురుషులు కూడా శివాలూగుతూ జాతరకు వస్తారు. వీరంతా తొలుత జంపన్నవాగులో స్నానం ఆచరిస్తారు. తర్వాత పసుపుతో అలంకరించుకుంటారు. వరం పట్టుట.. సంతానం లేని భక్తులు వచ్చే జాతర నాటికి సంతానం కలగాలని నిష్టతో మొక్కుతుంటారు. ఈ మొక్కులను వరం పట్టడం అంటారు. ముందుగా జంపన్న వాగులో వెదురు వనం, కొబ్బరి కాయతో పూజలు జరిపి స్నానమాచరిస్తారు. అక్కడి నుంచి తడి బట్టలతో నేరుగా సారలమ్మ గుడికి చేరుకుంటారు. సారలమ్మ తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే క్రమంలో దారికి అడ్డంగా పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తారు. సారలమ్మ తల్లి మేడారంలోని గద్దెలపైకి వేళ్లేటప్పుడు పూజారులు వీరిపై నుం చి దాటుతూ వెళ్తారు. సంతానం కలిగిన దంపతులు తమ మొక్కులను తీర్చుకునే క్రమంలో భాగంగా గద్దెల సమీపంలో ఊయల తొట్టెలను కడతారు. తమ పిల్లలు చల్లగా ఉండేలా దీవించమని మొక్కుతుంటారు. ఒడి బియ్యం (కంక బియ్యం) భక్తులు తల్లులను ఆడపడుచులుగా భావిస్తూ ఒడిబియ్యం మొక్కులు చెల్లిస్తారు. తమ ఇళ్లలోనే నూతన వస్త్రంలో ఐదు సోళ్ల బియ్యం పోసుకుని ముడుపుగా నడుముకు కట్టుకుని వస్తారు. ఈ బియ్యంలో పసుపు, కుంకుమ, రవిక ముక్కలు, కుడుకలు, చీరలు ఉంచుతారు. మేకలు, కోళ్లు బలిచ్చుట.. మేడారం జాతరలో కోళ్లు, మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. వనదేవతలను దర్శించుకునే ముందు భక్తులు రెండు కొబ్బరికాయలు కొడతారు. ఈ సమయంలో పసుపు, కుంకుమతో పాటు అగరవత్తులు చెల్లించి దేవతలకు మొక్కుతారు. లక్ష్మీదేవర మొక్కు లక్ష్మీదేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుం ది. నాయకపోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారిపొడవునా నృత్యం చేస్తూ గద్దెలకు వస్తారు. ఆయనకు గద్దెల వద్ద డోలు, గజ్జెల మోతతో చప్పుళ్లు చేస్తారు. తర్వాత ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు. ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం సమ్మక్క తల్లిని నిష్టగా కొలిచే మగ భక్తుల్లో కొందరు శివసత్తులుగా మారుతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ఒళ్లంతా పసుపు రాసుకుంటారు. చీరసారె కట్టుకుని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివాలెత్తుతారు. -
బంగారంపై తీరిన బెంగ
పాల్వంచ (రూరల్) : ప్రతి రెండేళ్లకోసారి మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) చెల్లిస్తారు. ఈ నెల 31 నుంచి నాలుగు రోజులపాటు జాతర జరగనుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో మేడారం తరలివెళ్తున్నారు. అయితే మొక్కలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బెల్లం స్థానికంగా ఎక్కువగా అమ్మకపోవడంతో మేడారం వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. నాటుసారా(గుడుంబా) నియంత్రణ పేరుతో ప్రభుత్వం సంక్రాంతి పండగ ముందునుంచే ఆంక్షలు విధించింది. ఒక్కరికి 2 కేజీలకు మించి విక్రయించొద్దని, అది కూడా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని విక్రయించాలని వ్యాపారులను ఆదేశించింది. ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు కేసులు నమోదు చేయడంతో వ్యాపారులు విక్రయాలను నిలిపివేశారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బెల్లం కొరత ఏర్పడింది. జాతర సమయంలో ఈ నిబంధన ఇటు వ్యాపారులకు, అటు భక్తులకు ఇబ్బంది కలిగించింది. ఆయా ప్రాంతాల్లో బెల్లం విక్రయాలు లేకపోవడంతో భక్తులు మేడారం వెళ్లి కొనుగోలు చేసి మొక్కలు చెల్లిస్తున్నారు. మార్కెట్లో బెల్లం కేజీ ధర సుమారు రూ.50 ఉంటే అక్కడ రూ.100పైగా విక్రయిస్తున్నారు. దీంతో భక్తుల్లో ఒకింత అసహనం ఏర్పడింది. ఈ క్రమంలో నిబంధనలు సడలించాలని ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటినుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆంక్షలు లేకుండా విక్రయాలు జరుపుకునేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతించింది. నిబంధనలను సడలించడంతో పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నేడు మహాజాతరకు అంకురార్పణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరలో తొలిఘట్టమైన గుడిమెలిగె పండుగ బుధవారం జరగనుంది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ ఆలయాలతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసి అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ తంతుతో మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క– సారలమ్మ మహాజాతర జరగనుంది. ఈ జాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన ఈ జాతర గుడిమెలిగె పండుగతోనే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మలకు గుళ్లుగా గుడిసెలు ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలకు మరమ్మతులు చేసేవారు. గుడిసెలకు కొత్తగా పైకప్పు అమర్చడం(కప్పడం) చేసేవారు. దీన్ని గుడి మెలగడం అంటారు. ఈ ప్రక్రియతోనే జాతర తొలిపూజ కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడిసెలు లేవు. వీటి స్థానంలో భవనాలు కట్టారు. గుడిసెలు లేకున్నా.. జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగెను నిర్వహిస్తున్నారు. -
జాతర పనుల్లో జాప్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య ఇప్పటికే వేలల్లోంచి లక్షల్లోకి చేరుతోంది. మరోపక్క జాతర కోసం రూ. 80 కోట్లతో చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది. జాతరకు కోటిమంది భక్తులు వస్తారనే అంచనా. అభివృద్ధి పనులన్నీ జనవరి 15 నాటికి పూర్తి చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల ఆదేశాలు, కలెక్టర్ పర్యవేక్షణలెలా ఉన్నా పనులు ఆశించిన మేరకు వేగంతో జరగడం లేదు. జాతర భక్తుల కోసం రూ. 11.75 కోట్లతో పారిశుద్ధ్యపనులు చేపడుతున్నారు. వీటితో 4,000 సెమీ పర్మనెంట్, 1,350 తాత్కాలిక, 60 శాశ్వత, 60 వీఐపీ టాయిలె ట్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు. చేతులెత్తేసిన ఇరిగేషన్ శాఖ: జాతర పనులు సకాలంలో పూర్తి చేయలేక ఇరిగేషన్ అధికారులు చేతులెత్తేశారు. జంపన్నవాగులో 4 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు రెండేళ్ల క్రితం రూ. 14 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కేవలం రెండు చెక్‌డ్యామ్‌లకు శంకుస్థాపన చేసి, పనులు మధ్యలో వదిలేశారు. దీంతో స్నానాలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా ఇసుకబస్తాలతో ఆనకట్టలు ఏర్పాటు చేస్తున్నారు. జంపన్నవాగు వెంట మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఐరన్‌ఫ్రేములతో గదు లు ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తుల కోసం ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లూ చేయటం లేదు. మేడారం జాతరకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ. 4 కోట్లు కేటాయించారు. విద్యుత్ పనులు వేగంగా సాగుతున్నాయి. -
మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రతిపాదిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం తెలిపారు. జాతర విశిష్టతను అన్ని గిరిజన ప్రాంతాల ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేడారం జాతరకు జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి గిరిజనులు లక్షల సంఖ్యలో హాజరవుతారు. దేశ వ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర నేతలు సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, లింగయ్య దొర, వినాయక్ నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతర విశిష్టతను తెలిపేలా డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అంతకుముందు ఉదయం బీజేపీ నేతలు 11 మంది కేంద్ర మంత్రులను కలసి జాతరకు ఆహ్వానించారు. జాతరకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించాలనే ఉద్దేశంతోనే కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్టు మురళీధరరావు మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. యునెస్కొ గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు సంబంధించి ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను జాతరకు ఆహ్వానించాలని ఆయన కోరారు. -
మేడారం జాతర యాప్, వెబ్సైట్
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాశస్త్యం ఏడాదికేడాది విశ్వవ్యాప్తమవుతోంది. భక్తుల సౌకర్యార్థం యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే అనంతమైన సమాచారం ఇందులో పొందవచ్చు. ‘సమ్మక్క–సారలమ్మ జాతర మేడారం’పేరుతో కాకతీయ సొల్యూషన్స్ సహకారంతో ఈ యాప్ రూపొందించారు. అందులో జాతరలో భక్తులకు సేవలందించే సెక్టార్ అధికారులు, జాతర జరిగే తేదీలు, సంస్కృతి, సంప్రదాయాలు, కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణ, చూడదగిన ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, స్నానఘట్టాలు, వైద్య శిబిరాలు, హెల్ప్‌లైన్, బస్సులు వెళ్లు, ఆగు స్థలాలు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ సిబ్బంది, మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఎక్కడ ఉన్నాయనే సమాచారం ఆ యాప్‌లో పొందుపరిచారు. జాతరకు వచ్చే భక్తులకు దారి మధ్యలో చూడదగిన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయని కూడా ఇందులో నిక్షిప్తం చేశారు. గిరిజన జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమాచారం కోసమైనా ఈ యాప్‌తోపాటు వెబ్‌సైట్‌ను రూపొందించారు. www.medaramjathara.com వెబ్సైట్లో కూడా సమాచారం నిక్షప్తం చేయడం మూలంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ సమాచారం ఎంతగానో దోహదపడుతుంది. -
మేడారంలో ఉద్రిక్తత!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ధర్మకర్తల మండలి ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ట్రస్టు బోర్డు నుంచి లంబాడీలను తొలగించాలంటూ ఆదివాసీలు ఎండోమెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. జయశంకర్ జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సమ్మక్క–సారలమ్మ జాతర జరగనుంది. జాతర నిర్వహణకు సంబంధించి 14 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్‌తో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఆదివాసీలు ఎండోమెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు, ఆదివాసీలకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన ఆదివాసీ యువకులు అక్కడున్న కుర్చీలను గాల్లోకి విసిరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ కారుపైకి రాళ్లు విసిరారు. మరో పది కార్ల అద్దాలు పగిలాయి. ఆదివాసీల డిమాండ్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జాతర కార్యనిర్వహణాధికారి రమేశ్‌బాబు హామీనివ్వడంతో ఆందోళన విరమించిన ఆదివాసీలు ర్యాలీగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు. ఓ వైపు ఆందోళన కొనసాగుతుండగా అక్కడే ఉన్న ఐటీడీఏ అతిథిగృహం నుంచి పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. పెసా చట్టం ప్రకారం జాతర పాలకమండలిలో ఆదివాసీలనే నియమించాలని ఆం దోళన కారులు డిమాండ్ చేశారు. రాజకీయ జోక్యమే కారణమా? మేడారం జాతర ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం రసా భాస కావడానికి రాజకీయ జోక్యమే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. జాతర సందర్భంగా తలనీలాల సేకరణ, గద్దెలపై పోగైన బెల్లం అమ్మకాలు నామినేషన్ పద్ధతిపై కేటాయిస్తున్నారు. ఈ విషయంలో ట్రస్టుబోర్డు నిర్ణయమే కీలకం. దీంతో ట్రస్టు బోర్డులో తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికార పార్టీ నేతలు స్థానం కల్పించారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ట్రస్టు బోర్డులో 14 మంది సభ్యులకుగాను ఇద్దరు ఆదివాసీలకు చోటు కల్పి ంచడం ఇందుకు ఉదాహరణ అని వారు పేర్కొంటున్నారు. దీనిపై ఏడాదికాలంగా పూజా రుల సంఘం, దేవాదాయశాఖకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇటీవల లంబాడీ–ఆదివాసీల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. -
సారలమ్మ ఆగమనం..
మేడారం గద్డెపైకి చేరిన కన్నెపల్లి వెన్నెలమ్మ సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో మేడారం తొలి జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. మొక్కులు తీర్చే సారలమ్మ గద్దెపై కొలువుదీరారు. కొత్తగూడ మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు సైతం సారలమ్మతోపాటే మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. ముగ్గురి రాకతో మేడారం వనజాతర ఘనంగా ప్రారంభమైంది. సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆది వాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.44గంటలకు గుడి నుంచి మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరా రు. జంపన్నవాగులో నుంచి మేడా రం గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి వడ్డెలు ముగ్గురిని రాత్రి 9.59కు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను చేర్చే అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారి తమ పైనుంచి దాటుకుంటూ వెళ్తే సంతానభాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె(వెదురు బుట్ట)లో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవున భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు వీరిపైనుంచి దాటి వెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. పూజారులు కాక సారయ్య, లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకువచ్చారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. సీఆర్పీఎఫ్ పోలీసులు వలయంగా వీరికి భద్రత కల్పించారు. ప్రభుత్వం తరుఫున జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఐటీడీఏ పీవో డి.అమయ్‌కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి బందోబస్తును పర్యవేక్షించారు. భక్తజన సందోహం... సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజు లు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారంని కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూ రు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవిదారులన్నీ పోటెత్తా యి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో ఆరు కిలోమీటర్ల పొడవునా దారులు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. 6కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై బారులు తీరారు. దర్శనానికి గంట సమయం పడుతోంది. వీఐపీలతో ఆలస్యం: సారలమ్మను మేడా రం గద్దెలపై చేర్చే ప్రక్రి య ఈసారి ఆలస్యమైంది. మేడారం జాతరలో గతంలో లేని విధంగా ఈసారి దేవాదాయ మంత్రి సారలమ్మ గుడికి వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ సాయంత్రం ఆరుగంటలకు సారలమ్మ గుడికి వచ్చారు. మంత్రి వెంటన వచ్చిన సమాచార శాఖ అధికారుల గుడిలోపలికి పలుసార్లు వెళ్లడంతో పూజల ప్రక్రియ ఆల స్యమైంది. అధికారులు, పోలీసులు పూర్తిగా భక్తులను పట్టిం చుకోకుండా వీఐపీలను తీసుకువెళ్లడంపైనే దృష్టి పెట్టారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని భక్తులు అంటున్నారు. నేడు సమ్మక్క రాక... జాతరలో అద్భుత సన్నివేశంగా భావించే సమ్మక్క గద్దెలపైకి చేరే ప్రక్రియ గురువారం జరుగుతుంది. మేడారం సమీపంలోని చిలుకలగుట్టపై నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగు లో భద్రపర్చుకుని చిలుకలగుట్టపై నుంచి తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కరుణ సమ్మక్కను తీసుకొస్తారు. వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఏకే47తో గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు. వనదేవతలు నలుగురు గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. -
మేడారం జాతరకు మొబైల్ యాప్
ఆవిష్కరించిన డీజీపీ అనురాగ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు దర్శనం మరింత సులభతరం కానుంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరిగే జాతరకు రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాలు, స్నాన ఘట్టాలు, ట్రాఫిక్ జామ్ తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వరంగల్ పోలీసులు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వరంగల్ నిట్ విద్యార్థుల సహకారంతో రూపొం దించిన ఈ యాప్‌ను శుక్రవారం డీజీపీ అనురాగ్‌శర్మ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.రవీందర్, విద్యార్థులు సాయితేజ, రాహుల్, దేవేంద్ర, శివం యాప్ పనిచేసే విధానాన్ని వివరించారు. జాతరపై వరంగల్ జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన వీడియోను డీజీపీ పరిశీలించారు. తెలంగాణ నార్త్‌జోన్ ఐజీ నవీన్ చంద్, వరంగల్ ఎస్పీ అంబార కిశోరే ఝా పాల్గొన్నారు. -
గిరిజనులు లేకుండా వనజాతర
పెత్తనం కోసం దేవాదాయ శాఖ యత్నాలు * రెండేళ్ల క్రితమే ముగిసిన మేడారం ట్రస్ట్ బోర్డు కాలపరిమితి * కొత్త కమిటీ ఏర్పాటును పట్టించుకోని సర్కారు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం.. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతర ఏర్పాట్లలో స్థానిక గిరిజన ఆదివాసీల ప్రమేయం కనిపించడం లేదు. జాతరపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మేడారం జాతర కమిటీ ఏర్పాటులో కాలయూపన చేస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది. పూర్తిగా గిరిజన సంప్రదాయాల ప్రకారం ఈ జాతర జరుగుతుంది. కోటి మంది భక్తులు వస్తారనే అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సమ్మక్క-సారలమ్మ జాతర పాలకమండలి పదవీకాలం 2014 జనవరి 8న ముగిసింది. 2014లో జరిగిన జాతరను ట్రస్టుబోర్డు లేకుండానే నిర్వహించారు. ఇక ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి జాతర కావడంతో ఆదివాసీలకు ప్రాధాన్యత కల్పిస్తారని ఈ వర్గం వారు భావించారు. మేడారం ట్రస్టు బోర్డు ఏర్పాటు కోసం 2015 జూలైలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కమిటీని మాత్రం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. 2014 తరహాలో ఈసారి ఆలయ ట్రస్టీ ఏర్పాటు చేయకుండా, ఆదివాసీల ప్రమేయం లేకుండానే జాతరను పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డు నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆరు నెలలు గడుస్తున్నా దేవాదాయ శాఖ ఇప్పటికీ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరో నెలే గడువు.. మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ.101 కోట్లతో పనులు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. జాతర దగ్గరపడుతున్న సమయంలో స్థానిక ఆదివాసీ గిరిజనులకు పనుల్లో భాగస్వాములను చేయాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు. కొత్త కమిటీ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసినా... ఎంపిక ప్రక్రియకు గడువు లేదనే సాకుచెప్పి దాటవేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు ఎంపికకు నోటిఫికేషన్ ప్రకారం... దరఖాస్తులను పరిశీలించి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి, సీఎం ఆమోదం తర్వాత పాలకమండలి ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేస్తుంది. మేడారం మహా జాతర మరో నెల రోజుల్లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచే భక్తులు భారీగా తరలివస్తారు. ఆలోపు మేడారం ఆలయ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ గిరిజన జాతరలో తమకు చోటు దక్కకుండా చేస్తున్నారంటూ ఈ వర్గం వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ జోక్యమూ... మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ట్రస్టుబోర్డులో చైర్మన్ సహా తొమ్మిది మంది సభ్యులు ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే కచ్చితంగా ఉండాలి. ఒకరు మహిళా సభ్యురాలు తప్పనిసరి. రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడితో ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంపై జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల్లో ఎవరికి ట్రస్టు బోర్డులో స్థానం కల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడమే ఈ ఆలస్యానికి కారణమని సమాచారం. గత జాతర సమయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొనడంతో ట్రస్టుబోర్డు లేకుండానే జాతరను నిర్వహించారు. ఈ సారి కూడా అదే విధంగా వ్యవహరిస్తారా.. లేక ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేస్తారో చూడాల్సిందే. -
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తా
హన్మకొండ, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎడవెల్లి బస్వారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు జిల్లాకు హామీల వర్షం గుప్పించారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని, అందుకు సరపడా నిధులు కేటాయిస్తామన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు కేవలం గంట సమయంలో వెళ్లే విధంగా 6లేన్, 8లేన్ రోడ్లను నిర్మాణం చేస్తామన్నారు. అంతేకాకుండా రైల్వే లైన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో లోకల్లో ఫాస్ట్‌ట్రాక్ రైలును నడుపుతామన్నారు. కరీంనగర్, ఖమ్మం, మధ్యప్రదేశ్ ప్రాంతాలను కలుపుతూ ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డులను నిర్మానం చేస్తామని చెప్పారు. భూపాలపల్లిలో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా ప్లాంట్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఉత్తర తెలంగాణకు ప్రధానమైన ఎంజీఎంను ఆల్ ఇండియా లెవల్లో తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్‌ను ఐటీ హబ్‌గా చేసి, ఇక్కడ చదువుకున్న వారికి ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టులకు పూర్తి చేస్తామని, అపెరల్ పార్కును అభివృద్ధి చేస్తామని, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకువస్తామన్నారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌గా చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. టూరిజం హబ్‌గా చేస్తామని కాకతీయ ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ మంత్రులు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికే మరిచిపోయారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే టూరిజానికి కొత్త వెలుగులు తీసుకువస్తామన్నారు. రాజధానికి మిన్నగా మెగా టౌన్‌గా చేసే బాధ్యతను తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నేను సీఎం అవుతానని ఆశపడ్డా తెలంగాణ తర్వాత తాను కూడా సీఎం అవుతానని ఆశపడ్డాన ని, కానీ... టీడీపీ చాలా గొప్ప నిర్ణయం తీసుకుందని, బీసీని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ బలంగా ఉందని టీడీపీ ఎన్నిక ల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయూకర్‌రావు అన్నా రు. కేసీఆర్ టికెట్లు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారిని పార్టీలోకి తీసుకుంటూ జెండాలు మోసిన వారికి మోసం చేస్తున్నారని విమర్శించారు. ‘అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వాలంటే శంకరమ్మకు ఆంధ్రా సరిహద్దులోని హుజూర్నగర్ సెగ్మెంట్ ఇస్తారట. కోదండరాం, లక్ష్మయ్యలకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇస్తారట. గెలవలేని సీట్లు వీరికి... గెలిచే సీట్లు కొడుక్కు, అల్లుడు, బిడ్డకు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే... మళ్లీ గడీల పాలన వస్తుంది’ అని అన్నారు. సాగునీరిచ్చింది మేమే.. జిల్లాలో ఇప్పుడు పండుతున్న పంటలకు సాగునీరు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ-1, ఎస్సారెస్పీ-2, దేవాదుల ప్రాజెక్టులను తీసుకువచ్చింది తామేనని, 14 ఏళ్లు ఉద్యమం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ... కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. టీడీపీని ఖాళీ చేయిస్తామని కేసీఆర్ కథలు చెబుతున్నాడని, కానీ తెలంగాణలో కేసీఆర్ దుకాణం ఖాళీ అవుతుంన్నారు. టీడీపీకి ఓటేయకుంటే ద్రోహులుగా ఉంటాం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన టీడీపీకి ఓటేయకుంటే 56 శాతం ఉన్న బీసీలంతా ద్రోహులుగా మిగిలిపోతామ ని ఆర్.కృష్ణయ్య అన్నారు. కేసీఆర్ పాలన వస్తే... మళ్లీ దోరల పాలన వస్తుందని, ఇప్పటికే అల్లునికో జిల్లా, కొడుక్కొకటి, బిడ్డకొకటి చొప్పున జిల్లాలు రాసిచ్చాడని, విద్యార్థులు, ఉద్యోగులు, యువత బాధలు పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్సో, మరే పార్టీకో అధికారం అప్పగిస్తే బీసీలు మరో 100 ఏళ్లు ఇలాగే ఉండాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రమేష్ రాథోడ్, మోహన్‌రావు, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు సీతక్క, విజయరమణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్చార్జి అరవింద్‌కుమార్‌గౌడ్, నేత లు వేం నరేందర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, బానో తు మోహన్‌లాల్, గండ్ర సత్యనారాయరావు, చల్లా ధర్మారెడ్డి, మనోజ్‌రెడ్డి, ఈగమల్లేషం, బాబూరావు, బాలూ చౌహాన్, నెహ్రూ నాయక్, అనిశెట్టి మురళి, గట్టు ప్రసాద్, వెంకటనారాయణ గౌడ్, చాడ సురేశ్‌రెడ్డి, మండల శ్రీరాములు, గండు సా విత్రమ్మ, బాబా ఖాదర్ అలీ, బయ్య స్వామి, కృష్ణ, ఎం.సుధాకర్, కక్కె సారయ్య, గోపాల్, బొట్ల శ్రీనివాస్, పుల్లూరి అశోక్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
అపూర్వం అమ్మల దర్శనం
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఆడబిడ్డల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. తూర్పు ప్రాంతంలో బుధవారం నుంచి మంచిర్యాల గోదారి వద్ద, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, రెబ్బెన, బెజ్జూర్ ప్రాంతాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. బుధవారం బిడ్డ సారలమ్మ, గురువారం తల్లి సమ్మక్క గద్దెలపై కొలువుదీరగా.. శుక్రవారం భక్తులు బంగారం(బెల్లం) పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజులపాటు కన్నుల పండువగా సాగిన గిరిబిడ్డల జాతర శనివారం సాయంత్రం వనాలకు చేరుకోవడంతో అపూర్వ ఘట్టం ముగియనుంది. మళ్లీ రెండేళ్లకు అంటే 2016లో జాతర వస్తుంది. నేడు వనానికి ఆరాధ్యదైవాలు మంచిర్యాల గోదావరి తీరంలో వెలసిన సమ్మక్క-సారలమ్మలు శనివారం తిరిగి వనానికి చేరుకోనున్నారు. స్నానాల ఘట్టం సమీపం నుంచి బుధవారం సారలమ్మను, శ్రీ సరస్వతి శిశుమందిర్ సమీపం నుంచి గురువారం సమ్మక్కను మేళతాళాల మధ్య ఆర్భాటంగా తీసుకొచ్చారు. భక్తులకు దర్శనం ఇచ్చిన వనదేవతలు తిరిగి శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిరాడంబరంగా ఆదివాసీ పూజారులు వనాలకు తోడ్కొని పోతారు. బుధవారం మళ్లీ తిరుగువారం నిర్వహించనున్నారు. సల్లంగా సూడు తల్లి, మళ్లీ జాతరకు వస్తాం అంటూ భక్తులు తిరుగుపయనం అయ్యారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తూర్పు ప్రాంతంలోని జాతరకు తరలి వచ్చారు. పిల్లాపాపలు, చేతిలో వంట, పూజా సామగ్రితో చేరుకున్నారు. గుడారాలు వేసుకుని రాత్రంతా చీకటిలోనే గడిపారు. మూడు లక్షల జనం మంచిర్యాలలోని గోదావరి వద్ద వెలిసిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి దాదాపు మూడు లక్షల మంది వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న కరీంనగర్ జిల్లా గోలివాడలో కూడా సమ్మక్క-సారలమ్మ జాతర జరిగింది. అయినా మంచిర్యాల జాతరకు భక్తులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనంతో గోదారి తీరం జనప్రవాహాన్ని తలపించింది. జాతర ముగింపు దగ్గర పడుతుండడంతో భక్తుల తాకిడి పెరిగింది. మంచిర్యాల ఆర్డీవో చక్రధర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇతర ప్రముఖులు వన దేవతలను దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు. కాగా, దుకాణాల వద్ద భక్తుల సందడి కనిపించింది. జాతరకు వచ్చిన భక్తులు తిరుగు పయనంలో దుకాణాల్లో షాపింగ్ చేశారు. ప్రసాదం కొనుగోలు చేశారు. చిన్న పిల్లలకు బొమ్మలు, మహిళలు గాజులు, గిల్టు నగలు కొనుగోలు చేశారు. శుక్రవారం అకస్మాత్తుగా పది నిమిషాలు చిరుజల్లులు పడటంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. తడవకుండా గుడారాల్లో తలదాచుకున్నారు. పోలీసు, పురపాలక శాఖల సహకారం సమ్మక్క-సారలమ్మ జాతర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగగా పురపాలక శాఖ తన వంతు సహకారం అందించింది. దేవాదాయ శాఖ గద్దెల నిర్వహణ, విద్యుత్ దీపాలు, షామియానాలు ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ భక్తులకు మౌలిక సదుపాయా లు క ల్పించింది. ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసింది. పారిశుధ్యం లోపం లేకుండా చర్యలు తీసుకుంది. 40 మంది సిబ్బంది జాతరలో విధులు నిర్వహించారు. శాంతి భద్రతలు పర్యవేక్షణలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, 20 మంది హెడ్ కానిస్టేబుళ్లు మొత్తం 50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అన్ని పార్టీల వారితో కమిటీలు వేయగా జాతరకు తమ వంతు సహకారం అందించారు. -
సింగరేణికి ‘సమ్మక్క’ దెబ్బ
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సమ్మక్క-సారలమ్మ జాతర పోటు తగిలింది. జాతర సందర్భంగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. నాలుగైదు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కార్మికుల హాజరుశాతం తగ్గింది. దీంతో రోజువారీగా సంస్థకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లుతోంది. ప్రతి గనిలో 20 నుంచి 25 శాతం మంది కార్మికులు జాతర కోసం వెళ్లారు. రెండేళ్ల కోసారి జాతర సందర్భంగా కం పెనీకి ఈ ఐదు రోజులు గండమే. పెద్ద ఎత్తున కార్మికుల కుటుంబాలు మొక్కులు తీర్చుకోవడానికి మొదటికి(మేడారం)కు వెళ్తున్నారు. దీంతో భారీగా హాజరుశాతం పడిపోవడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. పని స్థలాల్లో యంత్రాలు బంద్ బొగ్గు ఉత్పత్తి ప్రభావం అధికంగా భూగర్భ గనులపై పడింది. కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంలో కొన్ని గనుల్లో వచ్చిన సంఖ్య ఆధారంగా కొన్ని మిషన్లు నడుపుతున్నారు. దీంతో కొన్ని పనిస్థలాలు బంద్ అవుతున్నాయి. బుధ, గురువారం, శుక్రవారం కూడా చాలా గనుల్లో ఇదే పరిస్తితి ఉంటుంది. దీనికి తోడు సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టర్లు సమ్మె చేయడంతో కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధులు లేక ఉన్నారు. దీంతో సివిల్ డిపార్టుమెంట్లో నిర్మాణ పనులు కూడా ఆగిపోయాయి. దీని ప్రభావం పరోక్షంగా కంపెనీపై పడింది. నేరుగా ఉత్పత్తిపై లేకున్నా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు లేక చాలా డిపార్టుమెంట్లు బోసిపోతున్నాయి. ఇప్పటికే 5 మిలియన్ టన్నుల లోటు సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 5 మిలియన్ టన్నుల లోటు ఉంది. దీనికి జాతర తోడవడంతో మరింత పెరుగుతోంది. రోజు కార్మికుల హాజరు శాతం 20 నుంచి 25 శాతం తగ్గుతోంది. కంపెనీ రోజు వారి ఉత్పత్తి లక్ష్యం 2.10 లక్షల టన్నులు ఉండగా సాధారణ రోజుల కంటే కూడా జాతర వల్లే 30 వేల వరకు తక్కువగా వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఉత్పత్తి చూస్తే శ్రీరాంపూర్ డివిజన్ రోజు వారి లక్ష్యం 22,621 గాను 17,044 టన్నులు వస్తుండగా, మందమర్రి ఏరియాలో 10,788కి గాను 7,017, బెల్లంపల్లిలో 23,397కు గాను 18,012 టన్నులు వస్తుంది. సాధారణ రోజుల్లో రీజియన్ సరాసరి తీసుకుంటే 90 శాతం వరకు వస్తుంటే ఇప్పుడు 65 శాతం వరకే జాతర వల్ల వస్తుంది. కాగా, 15వ తేదీ నాటికి సమ్మక్క సారలమ్మలు వనం వెళ్లిన తరువాతే కంపెనీ ఉత్పత్తి చక్కబడనుంది.