
సారలమ్మ ఆగమనం..
మేడారం గద్డెపైకి చేరిన కన్నెపల్లి వెన్నెలమ్మ
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో మేడారం తొలి జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. మొక్కులు తీర్చే సారలమ్మ గద్దెపై కొలువుదీరారు. కొత్తగూడ మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు సైతం సారలమ్మతోపాటే మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. ముగ్గురి రాకతో మేడారం వనజాతర ఘనంగా ప్రారంభమైంది. సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆది వాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.44గంటలకు గుడి నుంచి మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరా రు. జంపన్నవాగులో నుంచి మేడా రం గుడికి చేరుకున్నారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి వడ్డెలు ముగ్గురిని రాత్రి 9.59కు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను చేర్చే అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారి తమ పైనుంచి దాటుకుంటూ వెళ్తే సంతానభాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె(వెదురు బుట్ట)లో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవున భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు వీరిపైనుంచి దాటి వెళ్లారు.
సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. పూజారులు కాక సారయ్య, లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకువచ్చారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. సీఆర్‌పీఎఫ్ పోలీసులు వలయంగా వీరికి భద్రత కల్పించారు. ప్రభుత్వం తరుఫున జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఐటీడీఏ పీవో డి.అమయ్‌కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి బందోబస్తును పర్యవేక్షించారు.
భక్తజన సందోహం...
సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజు లు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారంని కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూ రు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవిదారులన్నీ పోటెత్తా యి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో ఆరు కిలోమీటర్ల పొడవునా దారులు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. 6కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై బారులు తీరారు. దర్శనానికి గంట సమయం పడుతోంది.
వీఐపీలతో ఆలస్యం: సారలమ్మను మేడా రం గద్దెలపై చేర్చే ప్రక్రి య ఈసారి ఆలస్యమైంది. మేడారం జాతరలో గతంలో లేని విధంగా ఈసారి దేవాదాయ మంత్రి సారలమ్మ గుడికి వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ సాయంత్రం ఆరుగంటలకు సారలమ్మ గుడికి వచ్చారు. మంత్రి వెంటన వచ్చిన సమాచార శాఖ అధికారుల గుడిలోపలికి పలుసార్లు వెళ్లడంతో పూజల ప్రక్రియ ఆల స్యమైంది. అధికారులు, పోలీసులు పూర్తిగా భక్తులను పట్టిం చుకోకుండా వీఐపీలను తీసుకువెళ్లడంపైనే దృష్టి పెట్టారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని భక్తులు అంటున్నారు.
నేడు సమ్మక్క రాక...
జాతరలో అద్భుత సన్నివేశంగా భావించే సమ్మక్క గద్దెలపైకి చేరే ప్రక్రియ గురువారం జరుగుతుంది. మేడారం సమీపంలోని చిలుకలగుట్టపై నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగు లో భద్రపర్చుకుని చిలుకలగుట్టపై నుంచి తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కరుణ సమ్మక్కను తీసుకొస్తారు. వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఏకే47తో గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు. వనదేవతలు నలుగురు గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు.