Medaram Sammakka Saralamma Jatara 2022: What Is Mandameligi Event Explained In Telugu - Sakshi
Sakshi News home page

Medaram Jatara 2022: మేడారంలో నేడు మండమెలిగె పండుగ.. జాతరలో ఇది కీలక ఘట్టం 

Published Wed, Feb 9 2022 2:10 AM | Last Updated on Wed, Feb 9 2022 9:36 AM

Medaram Jathara 2022: Telangana Kumbhamela Mandameligi Event - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతుంది. మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. 

నాలుగు రోజులు కార్యక్రమాలు...
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారానికి పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు క్రితంసారి 1.20 కోట్లమందికిపైగా హాజరు కాగా.. ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. మేడారం జాతరలో ప్రధానంగా నాలుగు రోజులు 4 ఘట్టాలు ఉంటాయి. 

ఫిబ్రవరి 16న సారలమ్మ ఆగమనం..
కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. సమ్మక్క కూతురైన సా రలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సు మారు 3 కి.మీ. దూరంలో ఉండే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించిన సారలమ్మను ఫిబ్రవరి 16న బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే కొండాయి నుంచి గోవిందరాజును.. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.

ఫిబ్రవరి 17న సమ్మక్క ఆగమనం..
జాతరలో ముఖ్యమైన దినం రెండోరోజు. ఫిబ్రవరి 17న గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. సాయంత్రం 6గం. సమయంలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోతుంది.

ఫిబ్రవరి 18న గద్దెలపై తల్లులు..
గద్దెలపై ఆసీనులైన సమ్మక్క–సారలమ్మలు శుక్రవారం భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతరలో ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు. 

ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశం..
నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు.

మండ మెలిగే ప్రక్రియ ఇలా...
ప్రధాన పూజారి(వడ్డె) నేతృత్వంలోని బృందం బుధవారం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తా రు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేధ్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement