
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య ఇప్పటికే వేలల్లోంచి లక్షల్లోకి చేరుతోంది. మరోపక్క జాతర కోసం రూ. 80 కోట్లతో చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది. జాతరకు కోటిమంది భక్తులు వస్తారనే అంచనా. అభివృద్ధి పనులన్నీ జనవరి 15 నాటికి పూర్తి చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ఆదేశాలు జారీ చేశారు.
మంత్రుల ఆదేశాలు, కలెక్టర్ పర్యవేక్షణలెలా ఉన్నా పనులు ఆశించిన మేరకు వేగంతో జరగడం లేదు. జాతర భక్తుల కోసం రూ. 11.75 కోట్లతో పారిశుద్ధ్యపనులు చేపడుతున్నారు. వీటితో 4,000 సెమీ పర్మనెంట్, 1,350 తాత్కాలిక, 60 శాశ్వత, 60 వీఐపీ టాయిలె ట్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు.
చేతులెత్తేసిన ఇరిగేషన్ శాఖ: జాతర పనులు సకాలంలో పూర్తి చేయలేక ఇరిగేషన్ అధికారులు చేతులెత్తేశారు. జంపన్నవాగులో 4 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు రెండేళ్ల క్రితం రూ. 14 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కేవలం రెండు చెక్‌డ్యామ్‌లకు శంకుస్థాపన చేసి, పనులు మధ్యలో వదిలేశారు. దీంతో స్నానాలు చేసేందుకు వీలుగా తాత్కాలికంగా ఇసుకబస్తాలతో ఆనకట్టలు ఏర్పాటు చేస్తున్నారు. జంపన్నవాగు వెంట మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఐరన్‌ఫ్రేములతో గదు లు ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తుల కోసం ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లూ చేయటం లేదు. మేడారం జాతరకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ. 4 కోట్లు కేటాయించారు. విద్యుత్ పనులు వేగంగా సాగుతున్నాయి.