సమక్క తల్లికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారంలో సమ్మక్క–సారలమ్మకు నేడు (బుధవారం) తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగిన మహా జాతర తల్లుల వనప్రవేశంతో ముగిసిన విషయం తెలిసిందే. గుడిమెలిగె పండుగ నుంచి తల్లుల వనప్రవేశం అయ్యేంత వరకు పూజ కార్యక్రమాలు నిర్వహించిన పూజారులు బుధవారం తిరుగు వారం పండుగ నిర్వహించనున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఒర్చుకుని తల్లుల చెంతకు వచ్చిన మొక్కులు చెల్లించిన భక్తజనాన్ని, గ్రామస్తులను చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ తిరుగువారం పండుగ సందర్భంగా దేవతలను వేడుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా దేవతలను మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలిరానున్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు తిరుగువారం పండుగా నిర్వహిస్తారు. పూజారులు గుడిని నీటితో శుద్ధి చేయనున్నారు. పూజారులు తలస్నానాలు అచారించి గుడిలో సమ్మక్క తల్లికి ధూప, దీపాలతో ప్రత్యేక పూజాలు నిర్వహిస్తారు. యాటను బలిచ్చి నైవేద్యంగా పెడతారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో కూడా పూజారులు తిరుగువారం పండుగాను నిర్వహిస్తారు. ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి వస్త్రాలు, పూజ సామగ్రిని శుద్ధి చేస్తారు. వడెరాల కుండాలను పసుపు, కుంకుమలతో అలకరిస్తారు. సారలమ్మకు ధూప, దీపాలతో పూజలు నిర్వహిస్తారు. తిరుగువారం పండుగతో తల్లుల పూజలు ముగిస్తాయి. మహా జాతరలో తల్లుల సేవలో తరించిపోయిన పూజారులు తిరుగువారం పండుగ పూజల అనంతరం మళ్లీ ఏడాది మధ్యలో నిర్వహించే మినీ జాతర వరకు సా«ధారణ వ్యక్తులుగా మారిపోతారు.
పూజారుల ఇళ్లలో కూడా..
మేడారం కన్నెపల్లిలోని సమ్మక్క–సారలమ్మ పూజారులు, ఆదివాసీలు తమతమ ఇళ్లలో తిరుగువారం పండుగాను ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసుకుని ఇంటిì గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. అమ్మవార్ల గుడికి వెళ్లి కూడా పూజలు నిర్వహిస్తారు. కోళ్లు, యాటలను సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. పండుగ సంరద్భంగా సమ్మక్క గుడి వద్ద కూడా ఆదివాసీలు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా ఇంటికి ఆహ్వానించిన బంధువులు, ఆడబిడ్డలకు కొత్త దుస్తులు పెట్టి సాగనంపుతారు. ఈ సందర్భంగా బంధువులు పూజారుల ఆశీస్సులు తీసుకుంటారు.
మంగపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ముగిసి మూడు రోజులు అవుతోంది. నేడు తిరుగువారం పండుగ అయినప్పటికీ భక్తులు ఇంకా మేడారానికి వస్తూనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించి గద్దెల సమీపం ప్రాంతాలు, ఆర్టీసీ బస్‌పాయింట్ వద్ద వంటలు వండుకుని భోజనాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. బుధవారం తిరుగువారం పండుగ రోజు సమక్క–సారలమ్మను దర్శించుకునేందుకు కూడా భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం సుమారు 15 నుంచి 20 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment