హన్మకొండ కల్చరల్: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారక్క మహాజాతర హుండీల లెక్కింపు మూడో రోజు గురువారం కొనసాగింది. హన్మకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు రాత్రి 8 గంటల వరకు జరిగింది. దేవాదాయ శాఖ ఎస్‌జీఎఫ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయశాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, మేడారం జాతర ఈఓగా వ్యవహరించిన తాళ్లూరి రమేష్‌బాబు, దేవాదాయశాఖ జేఈఓ కట్టా అంజనీదేవి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రాముల సునీత, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ బెయిల్‌సింగ్, మేడారం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, ధర్మకర్తలు జవహర్‌లాల్, సారయ్య, లింగయ్య, ట్రస్ట్ బోర్డు కోఆప్షన్ సభ్యులు, మేడారం జాతర పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర వడ్డె చింతబోయిన నర్సింగరావు పాల్గొని పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు మూడో రోజు లెక్కింపు ముగించిన తర్వాత తాళ్లూరి రమేష్‌బాబు ఆదాయం వివరాలు ప్రకటించారు. మూడో రోజు 140 హుండీలను లెక్కించగా ఆదాయం రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల నలభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ.2,48,46,341 ) రూపాయలు లభించాయని, మొదటి రోజు ఆదాయం రూ. 1,72,40,000, రెండో రోజు ఆదాయం రూ. 3,15,00,000లతో కలుపుకుని ఏడు కోట్ల మూఫ్పై ఏడు లక్షల ఎనభై ఆరువేల మూడు వందల నలభై ఒకటి (రూ. 7,35,86,341) ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత మూడు రోజులుగా 342 హుండీలను తెరిచి లెక్కించామని పేర్కొన్నారు. గురువారం నగదును హెచ్‌డీఎఫ్‌ఫీ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు నక్కలగుట్ట బ్రాంచ్‌లో జమ చేశారు. పోలీస్ బందోబస్తు కొనసాగింది. 350 మంది సిబ్బంది లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
భక్తుల మొక్కుబడుల్లో వింతలు..
ఒకే భక్తుడు రూ.2 లక్షల యాబై వేల రూపాయలను.. రూ.2 వేలు, రూ.5 వందల నోట్ల కట్టలను మూటగా కట్టి వేశాడు. మరో భక్తుడు రూ.లక్ష పదహారువేలను హుండీలో వేసి ‘తన కూతురికి వివాహం కావాలని, మనవడు పుట్టాలని.. వచ్చే జాతర నాటికి తన భార్య కూతురు, అల్లుడు మనవడితో జాతరకు వస్తానని ఓ పేపర్‌పై రాశాడు. మరొకరు రూ.5 వందల నోటుపై ‘సేవ్ వాటర్, సేవ్ ట్రీస్’ అని రాశారు. అలాగే, ఒకే వ్యక్తి 400 అమెరికన్ డాలర్లు వేయడం విశేషం. కంబోడియా, నేపాల్ మలేషియా, అరబ్ దేశాల కరెన్సీ ఎక్కువగా వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment