సారలమ్మను తీసుకువస్తున్న వడ్డె పూజారులు (ఇన్‌సెట్‌లో)
వరంగల్: కన్నెపల్లి నుంచి వెన్నెలమ్మ తరలిరాగా.. భక్తజనం పారవశ్యంలో ఓలలాడారు. శివసత్తుల పూనకాలు.. భక్తుల శిగాలతో కన్నెపల్లి ఆలయ ప్రాంగణం మారుమోగింది. జై..సారలమ్మ.. అంటూ భక్తులు గద్దెల వరకు తోడువచ్చారు. మేడారం శ్రీ సమ్మక్క– సారలమ్మ మహాజాతరలో ప్రథమ ఘట్టం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మకు దారిపొడవునా భక్తులు నీరాజనం పలికారు. గుడిలో సాయంత్రం 6 గంటలనుంచి సారలమ్మ తరలివచ్చే తంతు ప్రారంభమైంది. సుమారు గంటన్నరపాటు ఆలయంలో ఒకవైపు కాకవంశీయుల ఆటపాటలతో సందడిగా మారింది.
ఇంటినుంచి పూజాసామగ్రితో ఆడపడుచులతో కలిసి ఆలయానికి చేరుకున్న ప్రధాన వడ్డె కాక సారయ్య ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. పూజారి హారతివ్వగా.. కొద్దిసేపటి తరువాత మరో పూజారి బూర ఊదారు. బుధవారం రాత్రి 7.40 గంటలకు ప్రధాన పూజారి కాక సారయ్య.. సారలమ్మను చేతిలో పట్టుకోగా.. హనుమాన్‌జెండాతో బయటకు తీసుకువచ్చారు. హనుమంతుడి నీడలో రావడం అమ్మవారి అభయంగా ఉంటుందని విశ్వాసం. అమ్మవారి గుడి ముందు పెళ్లికాని కన్నెపిల్లలు, యువకులు, అనారోగ్యం, సమస్యలతో బాధపడుతున్న భక్తులు వరం పట్టారు.
నేలపై పడుకున్నవారి పైనుంచి సారలమ్మ వెళ్తే శుభం కలుగుతుందని విశ్వాసం. అక్కడినుంచి మేడారం బయలుదేరారు. కన్నెపల్లిలోని కాక వంశీయులు ఆడబిడ్డల ఇళ్లవద్దకు సారలమ్మ తరలివెళ్లగా వారు మంగళహారతులు ఇచ్చి నీళ్లు ఆరబోశారు. ఎర్రనీళ్లతో దిష్టితీసి కొబ్బరికాయలను కొట్టారు. తల్లివస్తుందని తెలుసుకున్న భక్తులు విడిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరి పసుపు, కుంకుమలను ఎదురుచల్లారు. నాలుగంచెల రోప్‌పార్టీని దాటుకొని వడ్డెలు, పూజారులను తాకాలనే అతృతతో ముందుకు సాగేందుకు ప్రయత్నించారు.
వడ్డె సారయ్య.. జంపన్నవాగులో అమ్మవారి కాళ్లుకడిగి మేడారం చేరుకున్నారు. తల్లి సమ్మక్క గుడికి చేరి దర్శించుకోవడానికి ముందుగానే..అప్పటికే సమ్మక్క గుడి వద్దకు చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మ గద్దెలపై కొలువుదీరింది. అమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును వారి వారి గద్దెలపై పూజారులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. సారలమ్మను ప్రతిష్ఠించే సమయంలో గద్దెల దర్శనాలను గంటపాటు నిలిపివేశారు. ఈ క్రమంలో మూడుమార్లు విద్యుత్ లైట్లను నిలిపివేసి మళ్లీ ఆన్‌చేశారు.
పోలీసుల భారీ బందోబస్తు..
కన్నెపల్లి నుంచి సారలమ్మను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గద్దెలపైకి తీసుకువచ్చారు. సారలమ్మ గద్దైపె కొలువుదీరడానికి ముందే పోలీసులు నాలుగు రోప్‌పార్టీలు ఏర్పాటు చేసి వాటి మధ్యలో కన్నెపల్లి ఆదివాసీ యువకులు పూజారులతో కలిసి తల్లిని గద్దైపెకి తీసుకొచ్చారు. రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ సారలమ్మను జంపన్నవాగు నీటిలో నుంచి తీసుకురావడం ఆనవాయితీ. ఉదయం ఎస్పీలు శబరీష్, గాష్‌ఆలం, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో జంగిల్ డ్రెస్‌తో కూడిన బలగాల మధ్య రోప్ పార్టీ సాగింది.
దగ్గరుండి తరలించిన మంత్రి
సారలమ్మను తీసుకురావడానికి రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కన్నెపల్లి గుడికి చేరుకున్నారు. అక్కడ పూజాక్రతువును స్వయంగా పరిశీలించి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సారలమ్మను తీసుకువచ్చారు.
కిక్కిరిసిన జనం
ఎటు చూసినా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మంగళవారం రాత్రి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం రాత్రివరకు మేడారం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయాయి. జంపన్నవాగు వద్ద ఇసుకేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు చేరడానికి కాలినడకన వస్తుండడంతో ఒక్క వాహనం కూడా ముందుకు కదలలేని పరిస్థిత నెలకొంది. రెడ్డిగూడెం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి.
వనదేవతలను దర్శించుకునేందు కు గద్దెల ప్రాంగణంలో పెద్ద ఎత్తున బారులుదీరా రు. వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ నెలకొంది. మూడు కిలోమీటర్లకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లుల దర్శనం, జంపన్నవాగుకు దారి, ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్‌లపై అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సమాచారాన్ని మైకుల్లో తెలుపుతూ తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.
తాడ్వాయి: వరాల తల్లి సమ్మక్క నేడు(గురువారం) చిలకలగుట్ట పైనుంచి గద్దెకు చేరే ఘడియలు ఆసన్నమయ్యాయి. వనం నుంచి జనంలోకి సమ్మక్క రానుంది. ఈ సందర్భంగా వరాల తల్లికి స్వాగతం పలికేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మవారి రాకకు ముందుగా సమ్మక్క పూజారులు గుడిలో శక్తిపీఠాన్ని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి రహస్య క్రతువు చేపడతారు. అనంతరం గుడి నుంచి పూజా సామగ్రి తీసుకువచ్చి గద్దె అలికి కంకవనాలను కట్టి కుంకుమ, పసుపులతో అలంకరిస్తారు..
ఏకాంతంలో నిర్వహించే ఈ ప్రక్రియ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వరు. అలాగే మేడారంలోని ఆడపడుచులు, ఆదివాసీ కుటుంబాలు, పూజారులు, వడ్డెలు సైతం సమ్మక్క రాకకు ఆహ్వానంగా వారి ఇళ్లను ముగ్గులతో అలంకరిస్తారు. ఇదిలా ఉండగా.. పోలీసులు, రోప్‌పార్టీ సిబ్బంది చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రిహార్సల్స్ చేశారు. అమ్మవారు వచ్చే దారికి ఇరువైపులా బారికేడ్లు అమర్చిన పోలీసులు బుధవారం నుంచి బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి ఆగమనం కోసం కోటి మంది భక్తులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment