Sammakka - Jatara
-
అర్ధరాత్రి గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ
-
'వెన్నెలమ్మ.. వచ్చిందమ్మా..' గుట్ట నుంచి గద్దెపైకి వరాల తల్లిరాక!
వరంగల్: కన్నెపల్లి నుంచి వెన్నెలమ్మ తరలిరాగా.. భక్తజనం పారవశ్యంలో ఓలలాడారు. శివసత్తుల పూనకాలు.. భక్తుల శిగాలతో కన్నెపల్లి ఆలయ ప్రాంగణం మారుమోగింది. జై..సారలమ్మ.. అంటూ భక్తులు గద్దెల వరకు తోడువచ్చారు. మేడారం శ్రీ సమ్మక్క– సారలమ్మ మహాజాతరలో ప్రథమ ఘట్టం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మకు దారిపొడవునా భక్తులు నీరాజనం పలికారు. గుడిలో సాయంత్రం 6 గంటలనుంచి సారలమ్మ తరలివచ్చే తంతు ప్రారంభమైంది. సుమారు గంటన్నరపాటు ఆలయంలో ఒకవైపు కాకవంశీయుల ఆటపాటలతో సందడిగా మారింది. ఇంటినుంచి పూజాసామగ్రితో ఆడపడుచులతో కలిసి ఆలయానికి చేరుకున్న ప్రధాన వడ్డె కాక సారయ్య ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. పూజారి హారతివ్వగా.. కొద్దిసేపటి తరువాత మరో పూజారి బూర ఊదారు. బుధవారం రాత్రి 7.40 గంటలకు ప్రధాన పూజారి కాక సారయ్య.. సారలమ్మను చేతిలో పట్టుకోగా.. హనుమాన్జెండాతో బయటకు తీసుకువచ్చారు. హనుమంతుడి నీడలో రావడం అమ్మవారి అభయంగా ఉంటుందని విశ్వాసం. అమ్మవారి గుడి ముందు పెళ్లికాని కన్నెపిల్లలు, యువకులు, అనారోగ్యం, సమస్యలతో బాధపడుతున్న భక్తులు వరం పట్టారు. నేలపై పడుకున్నవారి పైనుంచి సారలమ్మ వెళ్తే శుభం కలుగుతుందని విశ్వాసం. అక్కడినుంచి మేడారం బయలుదేరారు. కన్నెపల్లిలోని కాక వంశీయులు ఆడబిడ్డల ఇళ్లవద్దకు సారలమ్మ తరలివెళ్లగా వారు మంగళహారతులు ఇచ్చి నీళ్లు ఆరబోశారు. ఎర్రనీళ్లతో దిష్టితీసి కొబ్బరికాయలను కొట్టారు. తల్లివస్తుందని తెలుసుకున్న భక్తులు విడిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరి పసుపు, కుంకుమలను ఎదురుచల్లారు. నాలుగంచెల రోప్‌పార్టీని దాటుకొని వడ్డెలు, పూజారులను తాకాలనే అతృతతో ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వడ్డె సారయ్య.. జంపన్నవాగులో అమ్మవారి కాళ్లుకడిగి మేడారం చేరుకున్నారు. తల్లి సమ్మక్క గుడికి చేరి దర్శించుకోవడానికి ముందుగానే..అప్పటికే సమ్మక్క గుడి వద్దకు చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మ గద్దెలపై కొలువుదీరింది. అమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును వారి వారి గద్దెలపై పూజారులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. సారలమ్మను ప్రతిష్ఠించే సమయంలో గద్దెల దర్శనాలను గంటపాటు నిలిపివేశారు. ఈ క్రమంలో మూడుమార్లు విద్యుత్ లైట్లను నిలిపివేసి మళ్లీ ఆన్‌చేశారు. పోలీసుల భారీ బందోబస్తు.. కన్నెపల్లి నుంచి సారలమ్మను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గద్దెలపైకి తీసుకువచ్చారు. సారలమ్మ గద్దైపె కొలువుదీరడానికి ముందే పోలీసులు నాలుగు రోప్‌పార్టీలు ఏర్పాటు చేసి వాటి మధ్యలో కన్నెపల్లి ఆదివాసీ యువకులు పూజారులతో కలిసి తల్లిని గద్దైపెకి తీసుకొచ్చారు. రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ సారలమ్మను జంపన్నవాగు నీటిలో నుంచి తీసుకురావడం ఆనవాయితీ. ఉదయం ఎస్పీలు శబరీష్, గాష్‌ఆలం, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో జంగిల్ డ్రెస్‌తో కూడిన బలగాల మధ్య రోప్ పార్టీ సాగింది. దగ్గరుండి తరలించిన మంత్రి సారలమ్మను తీసుకురావడానికి రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కన్నెపల్లి గుడికి చేరుకున్నారు. అక్కడ పూజాక్రతువును స్వయంగా పరిశీలించి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సారలమ్మను తీసుకువచ్చారు. కిక్కిరిసిన జనం ఎటు చూసినా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మంగళవారం రాత్రి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం రాత్రివరకు మేడారం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయాయి. జంపన్నవాగు వద్ద ఇసుకేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు చేరడానికి కాలినడకన వస్తుండడంతో ఒక్క వాహనం కూడా ముందుకు కదలలేని పరిస్థిత నెలకొంది. రెడ్డిగూడెం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వనదేవతలను దర్శించుకునేందు కు గద్దెల ప్రాంగణంలో పెద్ద ఎత్తున బారులుదీరా రు. వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ నెలకొంది. మూడు కిలోమీటర్లకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లుల దర్శనం, జంపన్నవాగుకు దారి, ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లపై అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సమాచారాన్ని మైకుల్లో తెలుపుతూ తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. తాడ్వాయి: వరాల తల్లి సమ్మక్క నేడు(గురువారం) చిలకలగుట్ట పైనుంచి గద్దెకు చేరే ఘడియలు ఆసన్నమయ్యాయి. వనం నుంచి జనంలోకి సమ్మక్క రానుంది. ఈ సందర్భంగా వరాల తల్లికి స్వాగతం పలికేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మవారి రాకకు ముందుగా సమ్మక్క పూజారులు గుడిలో శక్తిపీఠాన్ని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి రహస్య క్రతువు చేపడతారు. అనంతరం గుడి నుంచి పూజా సామగ్రి తీసుకువచ్చి గద్దె అలికి కంకవనాలను కట్టి కుంకుమ, పసుపులతో అలంకరిస్తారు.. ఏకాంతంలో నిర్వహించే ఈ ప్రక్రియ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వరు. అలాగే మేడారంలోని ఆడపడుచులు, ఆదివాసీ కుటుంబాలు, పూజారులు, వడ్డెలు సైతం సమ్మక్క రాకకు ఆహ్వానంగా వారి ఇళ్లను ముగ్గులతో అలంకరిస్తారు. ఇదిలా ఉండగా.. పోలీసులు, రోప్‌పార్టీ సిబ్బంది చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రిహార్సల్స్ చేశారు. అమ్మవారు వచ్చే దారికి ఇరువైపులా బారికేడ్లు అమర్చిన పోలీసులు బుధవారం నుంచి బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి ఆగమనం కోసం కోటి మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ -
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
అనుభవం పేరిట అనుయాయులకు..
సాక్షి, వరంగల్ : మేడారంలో సమ్మక్క – సారలమ్మ మహా జాతర సమీపిస్తుండడంతో పనులు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యాన చేపట్టాల్సిన అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు పక్కా స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ శాఖ ద్వారా సుమారు రూ.19 కోట్ల వ్యయంతో పలు పనులు చేపట్టాలని ప్రతిపాదించగా అగ్రభాగం నిధులు మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించారు. ఈ పనులను పొందేందుకు ప్రతీ జాతర సందర్భంగా కాంట్రాక్టర్లు పోటీ పడుతుండడం ఆనవాయితీ. అయితే, ఎక్కువ మందికి పోటీకి రాకుండా.. ఆర్‌డబ్ల్యూఎస్‌లో హవా నడిచే కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా కొత్త నిబంధనలను సృష్టించినట్లు సమాచారం. ఎస్ఈ కార్యాలయంలోని కొందరు అధికారులతో కుమ్మక్కైన సదరు కాంట్రాక్టర్లు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయించడంలో విజయం సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకే ఆన్లైన్లో టెండర్ల నోటిఫికేషన్ రావడంతో ఇదేంటని మిగతా కాంట్రాక్టర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నిస్తే.. తక్కువ సమయం ఉన్నందున అనుభవం ఉన్న వారికే పనులు కేటాయిస్తే త్వరగా పూర్తవుతాయని, తద్వారా ఇబ్బందులు ఇబ్బందులు ఉండవని ఖరాకండిగా చెబుతుండడం గమనార్హం. రూ.6.50 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం మేడారంలో గత జాతరలో 8,500 సెమీ పర్మనెంట్(రేకులతో) టాయిలెట్లు నిర్మించారు. జాతర అనంతరం గద్దెలు, చాంబర్లను తొలగించి సామాగ్రిని భద్రపర్చారు. అదే సామాగ్రితో ఈ జాతరలో మళ్లీ 8,500 సెమీ పర్మనెంట్ మరుగుదొడ్లు నిర్మించేందుకు 13 భాగాలుగా విడగొట్టి రూ.6.50కోట్లు కేటాయించారు. ఈ పనులు పొందేందుకు అడ్డగోలు నిబంధనల అండతో కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మిగిలిన కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అడ్డగోలు నిబంధనలు... ప్రతీ మేడారం జాతరలో నిర్మిస్తున్న మరుగుదొడ్లకు టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ పనులు పొందిన కాంట్రాక్టర్ల నుంచి స్థానిక చోటా కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టు తీసుకొని పూర్తి చేస్తున్నారు. ఈ జాతరలో అడ్డగోలు నిబంధనలను పేర్కొని కొందరికే పనులు దక్కేలా వ్యూహం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే టర్నోవర్ కాకుండా 350 మరుగుదొడ్లు కట్టిన అనుభవం ఉండాలని పేర్కొనడం వివాదానికి దారితీస్తోంది. ఒకే ఏడాదిలో రూ.50 లక్షలు, రూ.కోటి టర్నోవర్ పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు పనుల్లో ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించినా.. కొందరికి కట్టపెట్టేందుకే కొత్త నిబంధనలను తెర పైకి తీసుకొచ్చారని మిగిలిన కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన 12 మంది కాంట్రాక్టర్లు మాత్రమే అర్హత సాధించగా.. వారికే పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు ఆఖరు... మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యాన రూ.11.81కోట్లతో చేపట్టనున్న 31 పనులకు టెండర్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగియనుంది. టెండర్ల షెడ్యూళ్లను సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించి ఈనెల 18న ఉదయం 11.30గంటలకు ఫైనాన్సియల్ బిడ్ తెరుస్తారు. ఇందులో రూ.6.50కోట్లతో నిర్మించనున్న 8,500 టాయిలెట్ల పనులను 13 భాగాలుగా విభజించి రూ.50 లక్షల చొప్పున కేటాయించా రు. అదే విధంగా రూ.కోటి వ్యయంతో ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో పూడికతీత, మిగిలిన నిధులను డ్రింకింగ్ వాటర్ పైపులైన్ల నిర్వహణ తదితర పనుల కోసం కేటాయించారు. కాగా, టెండర్ల నిర్వహణలో జరుగుతున్న అన్యాయాన్ని అధికార పార్టీ నేతలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆధికారులపై అగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో టెండర్ల దాఖలు ప్రక్రియ పొడిగిస్తారా.. లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. నాట్ రీచబుల్ టెండర్ల ప్రక్రియలో కొత్త నిబంధన.. పలువురు కాంట్రాక్టర్ల అభ్యంతరాలు వస్తున్న విషయమై ఎస్ఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఇక ఎస్ఈ సెల్‌ఫోన్ సైతం ‘నాట్ రీచబుల్’ అని వస్తోంది. కాగా, మేడారం పనులకు తక్కువ సమయం ఉన్నందున అనుభవం ఉన్న వారికే ఇస్తే తమకు ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు కార్యాలయ వర్గాలు చెబుతుండడం కాంట్రాక్టర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
శభాష్ అనేలా...
మేడారం (తాడ్వాయి), న్యూస్‌లై న్ :కోటి మందికి పైగా భక్తులు వచ్చే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర విజయవంతానికి పోలీస్ అధికారులు, సిబ్బంది కృషిచేయూలని, ప్రజల చేత శభాష్ అనిపించుకునేలా సేవలందించాలని డీజీపీ ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఐజీ రవిగుప్తా, వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, వరంగల్ రూరల్, ఖమ్మం ఎస్పీలు కాళిదాసు, రంగనాథ్, ఓఎస్డీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి శనివారం ఆయన వనదేవతలను దర్శించుకున్నారు. ఈ మేరకు పూజారులు వారికి గిరిజన సంప్రదాయూల ప్రకారం డోలి వాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు డీజీపీ ఐటీడీఏ అతిథి గృ హంలో పోలీస్ అధికారులతో సమావేశమై జాతరలో పోలీసు శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కాజీపేట నుంచి మేడారం... జంగాలపల్లి నుంచి భూపాలపల్లి... పస్రా నుంచి మేడారం వరకు చేపట్టనున్న ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఆయనకు అధికారులు వివరించారు. ఆ రూట్లలో వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద... ఆర్టీసీ బస్టాండ్ ప్రాంత్లాలో భక్తుల రద్దీపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ మేరకు తగు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత డీజీపీ ప్రసాదరావు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివే సేలా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయూలని, జాతరకు ముందు నుంచే మేడారంలో పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు వచ్చివెళ్లే భక్తుల వాహనాల మళ్లింపులో ప్రధానంగా దృష్టి సారించాలని, ట్రాఫిక్ జాం కాకుండా చూడాలన్నారు. దేవతల గద్దెలపైకి కన్నెపల్లి నుంచి సారలమ్మను, చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో పూజారులకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తూ శాంతియుతంగా పనిచేయాలన్నారు. గత జాతరలో పనిచేసిన అనుభవం గల అధికారులను నియమించనున్నట్లు వెల్లడించారు. విద్యాకేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ రూరల్ ఎస్పీ కాళిదాసు ఆధ్వర్యంలో మేడారంలో ఏర్పాటు చేసిన విద్యాకేంద్రాన్ని డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు. గిరిజన నిరుద్యోగులకు విద్య, ఉపాధి కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయనకు కాళిదాసు వివరించారు. మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కుర్సం రవి... డీజీపీతో మాట్లాడారు. పోలీస్ ఉద్యోగాల కోసం గిరిజన యువకులకు మేడారంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన డీజీపీ మేడారంలో ఈ మేరకు శిక్షణ ఇచ్చేలా రిటైర్డ్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. ఇటీవల మేడారంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలకు యువకుల నుంచి మంచి స్పందన వచ్చిందని డీజీపీకి ఓఎస్డీ అంబర్‌కిషోర్ జా వివరించారు. కార్యక్రమంలో ములుగు డీఎస్పీ మురళీధర్, ఏటూరునాగారం సీఐ కిరణ్‌కుమార్, సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, తాడ్వాయి ఎస్సై హతీరాం ఉన్నారు.