అనుభవం పేరిట అనుయాయులకు.. | Irregularities In Medaram Contract Works | Sakshi
Sakshi News home page

అనుభవం పేరిట అనుయాయులకు..

Published Fri, Nov 15 2019 9:10 AM | Last Updated on Fri, Nov 15 2019 1:00 PM

Irregularities In Medaram Contract Works - Sakshi

సాక్షి, వరంగల్‌ :  మేడారంలో సమ్మక్క – సారలమ్మ మహా జాతర సమీపిస్తుండడంతో పనులు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యాన చేపట్టాల్సిన అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కొందరు కాంట్రాక్టర్లు పక్కా స్కెచ్‌ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ శాఖ ద్వారా సుమారు రూ.19 కోట్ల వ్యయంతో పలు పనులు చేపట్టాలని ప్రతిపాదించగా అగ్రభాగం నిధులు మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించారు. ఈ పనులను పొందేందుకు ప్రతీ జాతర సందర్భంగా కాంట్రాక్టర్లు పోటీ పడుతుండడం ఆనవాయితీ. అయితే, ఎక్కువ మందికి పోటీకి రాకుండా.. ఆర్‌డబ్ల్యూఎస్‌లో హవా నడిచే కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా కొత్త నిబంధనలను సృష్టించినట్లు సమాచారం.

ఎస్‌ఈ కార్యాలయంలోని కొందరు అధికారులతో కుమ్మక్కైన సదరు కాంట్రాక్టర్లు టెండర్ల నోటిఫికేషన్‌ విడుదల చేయించడంలో విజయం సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకే ఆన్‌లైన్‌లో టెండర్ల నోటిఫికేషన్‌ రావడంతో ఇదేంటని మిగతా కాంట్రాక్టర్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ప్రశ్నిస్తే.. తక్కువ సమయం ఉన్నందున అనుభవం ఉన్న వారికే పనులు కేటాయిస్తే త్వరగా పూర్తవుతాయని, తద్వారా ఇబ్బందులు ఇబ్బందులు ఉండవని ఖరాకండిగా చెబుతుండడం గమనార్హం.

రూ.6.50 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం
మేడారంలో గత జాతరలో 8,500 సెమీ పర్మనెంట్‌(రేకులతో) టాయిలెట్లు నిర్మించారు. జాతర అనంతరం గద్దెలు, చాంబర్లను తొలగించి సామాగ్రిని భద్రపర్చారు. అదే సామాగ్రితో ఈ జాతరలో మళ్లీ 8,500 సెమీ పర్మనెంట్‌ మరుగుదొడ్లు నిర్మించేందుకు 13 భాగాలుగా విడగొట్టి రూ.6.50కోట్లు కేటాయించారు. ఈ పనులు పొందేందుకు అడ్డగోలు నిబంధనల అండతో కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మిగిలిన కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. 

అడ్డగోలు నిబంధనలు...
ప్రతీ మేడారం జాతరలో నిర్మిస్తున్న మరుగుదొడ్లకు టెండర్లు నిర్వహిస్తున్నప్పటికీ పనులు పొందిన కాంట్రాక్టర్ల నుంచి స్థానిక చోటా కాంట్రాక్టర్లు సబ్‌ కాంట్రాక్టు తీసుకొని పూర్తి చేస్తున్నారు. ఈ జాతరలో అడ్డగోలు నిబంధనలను పేర్కొని కొందరికే పనులు దక్కేలా వ్యూహం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే టర్నోవర్‌ కాకుండా 350 మరుగుదొడ్లు కట్టిన అనుభవం ఉండాలని పేర్కొనడం వివాదానికి దారితీస్తోంది. ఒకే ఏడాదిలో రూ.50 లక్షలు, రూ.కోటి టర్నోవర్‌ పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు పనుల్లో ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు సూచించినా.. కొందరికి కట్టపెట్టేందుకే కొత్త నిబంధనలను తెర పైకి తీసుకొచ్చారని మిగిలిన కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన 12 మంది కాంట్రాక్టర్లు మాత్రమే అర్హత సాధించగా.. వారికే పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

నేడు ఆఖరు...
మేడారంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యాన రూ.11.81కోట్లతో చేపట్టనున్న 31 పనులకు టెండర్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగియనుంది. టెండర్ల షెడ్యూళ్లను సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించి ఈనెల 18న ఉదయం 11.30గంటలకు ఫైనాన్సియల్‌ బిడ్‌ తెరుస్తారు. ఇందులో రూ.6.50కోట్లతో నిర్మించనున్న 8,500 టాయిలెట్ల పనులను 13 భాగాలుగా విభజించి రూ.50 లక్షల చొప్పున కేటాయించా రు. అదే విధంగా రూ.కోటి వ్యయంతో ఇన్‌ఫిల్టరేషన్‌ బావుల్లో పూడికతీత, మిగిలిన నిధులను డ్రింకింగ్‌ వాటర్‌ పైపులైన్ల నిర్వహణ తదితర పనుల కోసం కేటాయించారు. కాగా, టెండర్ల నిర్వహణలో జరుగుతున్న అన్యాయాన్ని అధికార పార్టీ నేతలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆధికారులపై అగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో టెండర్ల దాఖలు ప్రక్రియ పొడిగిస్తారా.. లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది.

నాట్‌ రీచబుల్‌
టెండర్ల ప్రక్రియలో కొత్త నిబంధన.. పలువురు కాంట్రాక్టర్ల అభ్యంతరాలు వస్తున్న విషయమై ఎస్‌ఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన కార్యాలయంలో అందుబాటులో లేరు. ఇక ఎస్‌ఈ సెల్‌ఫోన్‌ సైతం ‘నాట్‌ రీచబుల్‌’ అని వస్తోంది. కాగా, మేడారం పనులకు తక్కువ సమయం ఉన్నందున అనుభవం ఉన్న వారికే ఇస్తే తమకు ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు కార్యాలయ వర్గాలు చెబుతుండడం కాంట్రాక్టర్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement