
నేటి నుంచే సమ్మక్క– సారలమ్మ జాతర
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి భక్తుల రాక
ఏర్పాట్లు చేసిన ములుగు జిల్లా అధికార యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, వరంగల్: మినీ మేడారం (మండమెలిగె పండుగ) జాతరకు వేళయ్యింది. వనదే వతలు సమ్మక్క–సారలమ్మ పునఃదర్శనానికి సమ యం ఆసన్నమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి 15వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ జాతర ప్రారంభానికి వారం రోజుల ముందు గుడిమెలిగె నిర్వహించారు.
మండమెలిగె ఇలా..
మేడారంలో నేటినుంచి 15వ తేదీ వరకు మినీ జాతర (మండమెలిగె పండుగ) జరుగనుంది. వారం రోజుల నుంచే భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు.
12న (బుధవారం) మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో మండమెలిగె పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు నిర్వహిస్తారు. మేడారంలో సమ్మక్క పూజారులు అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసి గ్రామ పొలిమేరలోని తూర్పు, పడమరన ధ్వజస్తంభాన్ని పాతి మామిడి తోరణాలు కడతారు.
రాత్రి సమ్మక్క గుడి నుంచి పూజా సామగ్రిని తీసుకొని సమ్మక్క గద్దె వద్దకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కూడా కన్నెపల్లిలో అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి రాత్రి మేడారంలోని గద్దెల ప్రాంగణానికి చేరుకొని అలుకుపూత అనంతరం పూజలు చేస్తారు. రాత్రంతా జాగారం నిర్వహిస్తారు.
13 (గురువారం)న ఉదయం సమ్మక్క– సారలమ్మ గద్దెల నుంచి పూజారులు అమ్మవారి సామగ్రిని తీసుకొని డోలు వాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకుంటారు. తలస్నానాలు ఆచరించి గుడిలో మరోసారి పూజలు నిర్వహి స్తారు. కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు కూడా సారలమ్మ గుడికి వెళ్లి పూజలు చేస్తారు.
14 (శుక్రవారం)న భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారు.
15 (శనివారం)న జాతర ముగియనుంది.
రూ.32 కోట్లతో భక్తులకు ఏర్పాట్లు..
రూ.32 కోట్లతో మినీ మేడారం జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు శాఖల ఆధ్వర్యంలో పనులు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment