సాక్షి ప్రతినిధి, వరంగల్: నా పేరు గౌతమ్.. మేడారం జాతర అంటేనే నెట్టేసుడు.. ఇక్కడ ఇలాగే ఉంటది. ఎవరికి చెప్పుకుంటవో చెప్పుకో.. అంటూ మేడారం వచ్చిన మహిళా భక్తులతో ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. జాతరలో అతడి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతర సందర్భంగా సమ్మక్క , సారలమ్మలను దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులు వస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు గద్దెల వద్ద కానిస్టేబుళ్లను, వలంటీర్లను నియమించారు. వీఐపీ దర్శనాలు, సిఫార్సు దర్శనాల విషయంలో దేవాదాయశాఖ అధికారులు స్పష్టమైన విధానం అమలు చేయడం లేదు. గద్దెలపైకి వెళ్లేందుకు కొందరికి అనుమతి ఇస్తూ మరికొందరని అడ్డంగా ఆపేస్తున్నారు. దీంతో గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్ గేటు తాళం తీసినప్పుడుల్ల అక్కడున్న ఇతర భక్తులు గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ప్రయత్నించడం నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం ఓ యువ అధికారి కుటుంబం, స్నేహితులతో కలిసి దర్శనానికి వచ్చారు. వారి కోసం గేటు తాళం తీశారు. గద్దెలపైకి వెళ్లేందుకు అక్కడే ఉన్న ఓ కుటుంబం అలాగే ప్రయత్నించగా అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మహిళా భక్తులని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ... విచక్షణారహితంగా నెట్టివేశాడు.
ఇదేం పద్ధతి అని ఆ మహిళల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. మేడారం జాతర అంటేనే నెట్టేసుడు.. ఆ మాత్రం తెల్వకుండా ఇక్కడికి వచ్చిళ్ల అంటూ హేళనగా మాట్లాడాడు. నువ్వు ఎవరు, ఏ స్టేషన్ అని భక్తులు ప్రశ్నిస్తే.. నా పేరు గౌతమ్, నేను కానిస్టేబుల్‌ను ఏం చేసుకుంటారో చేసుకో అంటూ మరింత దురుసుగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న యువ అధికారి సారీ అని సర్ధిచెబుతున్న కానిస్టేబుల్ ప్రవర్తనలో మార్పు రాలేదు. సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ గద్దె వరకు ఆ కుటుంబాన్ని వెంటాడుతూ ఎక్కడికక్కడ నెట్టివేశాడు. కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం జాతరకు పోలీసు శాఖ వేలాది మంది సిబ్బందిని నియమిస్తోంది. రాత్రీపగలు తేడా లేకుండా వారు మేడారం పరిసరాల్లో విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. కానీ జాతరకు కీలక స్థానమైన గద్దెల వద్ద కొందరు సిబ్బంది అనుచిత, దురుసు ప్రవర్తన కారణంగా ఆ శాఖకు పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. గద్దెలవంటి రద్దీ ప్రదేశాల్లో భక్తుల నియంత్రణకు మహిళా కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదం చెబుతూ.. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించకపోవడాన్ని తప్పుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment