సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు భారీ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించనుండటంతో సాధారణ ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈసారి జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారీ సంఖ్యలో బస్సులను సమకూర్చింది. 4,479 ఆర్టీసీ బస్సులతో పాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు మరో 1,500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల సేవలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నిర్దిష్ట ప్రాంతాలకు తరలిపోవడంతో బస్‌స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికుల తిప్పలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం.
‘మహాలక్మి’తో పెరిగిన ప్రయాణికుల సంఖ్య
ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులో ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మహిళల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఆటోలు లాంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారిలో 90 శాతం మంది బస్సుల వైపు మళ్లారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఫలితంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి ఇన్ని బస్సులు అందుబాటులో లేకుండాపోతే పరిస్థితి గందరగోళంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తొలిరోజే అవస్థలు
రాష్ట్రంలోని 51 కేంద్రాల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడవాల్సి ఉంది. దీంతో విడతల వారీగా బస్సులు ఆయా కేంద్రాలకు తరలిపోతున్నాయి. సోమవారం దాదాపు 550 బస్సులు వెళ్లాయి. హైదరాబాద్ నగరం నుంచి కూడా 250 బస్సులు వెళ్లిపోయాయి. సాధారణంగా సోమవారాల్లో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్పేర్ బస్సులు సహా అన్ని బస్సులను తిప్పినా ఆ రోజు రద్దీని తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. గత సోమవారం ఏకంగా 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో తిరిగారు. ఈ సోమవారం కొన్ని బస్సులు మేడారం జాతరకు వెళ్లిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. బస్సులు సరిపోక తోపులాటలు చోటు చేసుకున్నాయి. నగరంలో ఫుట్‌బోర్డులపై వేళ్లాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. ఇక బుధవారం నుంచి మిగతా బస్సులు వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సాధారణ రోజుల్లోలాగే బుధవారం తర్వాత కూడా రద్దీ ఉంటే మేడారం డ్యూటీ బస్సుల్లో కొన్నింటిని తిరిగి వాపస్ పంపే యోచనలో ఉన్నారు. కానీ మేడారం ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి రైల్వే అధికారులు 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు.
ఒక రైలులో 1,500 మంది ప్రయాణికులు వస్తారు. మేడారం వరకు రైల్వే లైన్ లేనందున ఎక్కువ మంది కాజీపేట, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో దిగుతారు. దీంతో రైలు వచ్చే సమయానికి ఒక్కో స్టేషన్ వద్ద 30కి పైగా బస్సులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద వచ్చే ఆదివారం వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment