లాభాలొస్తున్నా.. ఫలితం సున్నా | Strange situation at RTC | Sakshi
Sakshi News home page

లాభాలొస్తున్నా.. ఫలితం సున్నా

Published Fri, Apr 5 2024 4:27 AM | Last Updated on Fri, Apr 5 2024 4:27 AM

Strange situation at RTC - Sakshi

ఆర్టీసీలో విచిత్ర పరిస్థితి 

మార్చి నెలలో రూ.144 కోట్ల లాభం వచ్చినట్టు లెక్కలుతేల్చిన సంస్థ 

కానీ, రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బందికర పరిస్థితి 

మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్ల మొత్తాన్ని రీయింబర్స్‌ చేయని ప్రభుత్వం 

ఆ నిధులు మొత్తం వస్తేనేసంస్థకు ‘పూట గడిచే’పరిస్థితి 

గత ప్రభుత్వ బడ్జెట్‌కేటాయింపు బకాయిలతో సరిపుచ్చిన ప్రభుత్వం 

మహిళకు ఉచిత ప్రయాణ రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత లేని దుస్థితి 

2023 మార్చి నెలలో ఆర్టీసీకిరూ.528 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల రూపంలో వచ్చింది రూ.428 కోట్లు. ఆ నెలలో సంస్థకు అయిన మొత్తంఖర్చు రూ.605 కోట్లు. ఫలితంగా రూ.77 కోట్ల నష్టం నమోదైంది.  2024 మార్చి నెలలో సంస్థ నమోదు చేసుకున్న మొత్తం ఆదాయం 696 కోట్లు. ఇందులో టికెట్ల ద్వారా వచ్చింది రూ. 598 కోట్లు. మొత్తం వ్యయం రూ.552 కోట్లు. దీంతో రూ.144 కోట్ల ఆదాయం నమోదైంది.  

సాక్షి, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమే అమలవుతున్నా ఆర్టీసీ జీరో టికెట్లు జారీ చేస్తోంది. అలా ప్రతినెలా జారీ అయ్యే మొత్తం జీరో టికెట్ల పూర్తి చార్జీని ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. దీంతో దాన్ని ఆదాయంగానే భావిస్తోంది. ఫలితంగా నష్టాల ఆర్టీసీ ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చింది. నష్టం కనుమరుగై ఒకే నెలలో ఏకంగా రూ.144 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నట్టు తాజాగా లెక్కలు రూపొందించింది. మరి నిజంగా ఇది ఆర్టీసీ లాభాల ఫలితాలు అనుభవిస్తోందా..? 

వాస్తవం ఎలా ఉందంటే... 
మహాలక్ష్మి పథకం రీయింబర్స్‌మెంట్‌ పేరుతో ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతినెలా  ఆ మొత్తాన్ని విడుదల చేయటం లేదు. ఆ రూపంలో నిధులు ఇవ్వటం లేదు. మహిళల ఉచిత ప్రయాణం మొదలైన తర్వాత జారీ అవుతున్న జీరో టికెట్ల మొత్తాన్ని పరిశీలిస్తే, సగటున ప్రతినెలా రూ.350 కోట్ల వరకు అవుతోంది. మార్చి నాటికి ప్రభుత్వం ఆ రూపంలో రూ.1400 కోట్లు విడుదల చేయాలని కోరినట్టు, ఆర్టీసీ ఇటీవల మరో కేసు విషయంలో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

కానీ, వరుసగా గత మూడు నెలల్లో ప్రభుత్వం రూ.285 కోట్లు, రూ.285 కోట్లు, రూ.275 కోట్లు చొప్పున విడుదల చేసింది. కానీ వీటిని మహాలక్ష్మి రీయింబర్స్‌మెంట్‌గా ఇవ్వలేదు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో ఆర్టీసీకి కేటాయించిన మొత్తంలో పేరుకుపోయిన బకాయిలుగానే సంస్థ భావిస్తోంది.  గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కేటాయిస్తూ ప్రతిపాదించింది. కానీ, ఆ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గత డిసెంబరు నుంచి కొత్త ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేసింది.

మార్చి నెలతో చెల్లించిన మొత్తంతో ఆ బడ్జెట్‌ కేటాయింపులు క్లియర్‌ అయ్యాయి. దీంతో వాటిని బడ్జెట్‌ చెల్లింపులుగానే సంస్థ భావిస్తోంది. అదే నిజమైతే, మహాలక్ష్మి పథకం రూపంలో సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు ఇవ్వనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇలా రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులో జాప్యం జరిగితే సంస్థ మళ్లీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవటం ఖాయంగా కనిపిస్తోంది.  

లాభాలు ఉత్తిత్తి లెక్కలే.. 
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. లాభాలకు సంబంధించి కాగితాలపై చూపిన ఉత్తుత్తి లెక్కలుగా తేలిపోతోంది. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో, ఆ లాభాల తాలూకు ఫలితాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆర్టీసీకి సహకార పరపతి సంఘం బకాయిలు, పీఎఫ్‌ బకాయిలు, కరువు భత్యం బకాయిలు పేరుకు పోయి ఉన్నాయి.

2013 వేతన సవరణకు సంబంధించి ఉన్న బకాయిల్లో బాండ్ల తాలూకు చెల్లింపులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి నెలలో రూ.280 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, వాటిల్లో కేవలం కొంతమంది డ్రైవర్లకు మాత్రమే రూ.80 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement