న్యూఢిల్లీ: ప్రస్తుత కష్టకాలంలో మహిళలు పడుతున్న అవస్థలను కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుందని, ఇదే పార్టీ గ్యారెంటీ అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. ఈ మేరకు సోమవారం సోనియా ఒక వీడియో సందేశం ఇచ్చారు. ‘‘ ప్రియమైన సోదరీమణులారా.. మహిళలు దేశ స్వాతంత్రోద్యమం నుంచి నవభారత నిర్మాణం దాకా తమ వంతు అద్భుత తోడ్పాటునందించారు. అయితే మహిళలు ప్రస్తుతం ద్రవ్యోల్బణం మాటున సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మహిళల కష్టానికి సరైన న్యాయం దక్కేలా కాంగ్రెస్ విప్లవాత్మకమైన గ్యారెంటీని ఇస్తోంది. కాంగ్రెస్ మహాలక్ష్మీ పథకం ద్వారా పేద కుటుంబంలోని మహిళకు ఏటా రూ.1లక్ష సాయం అందించనుంది.
ఇప్పటికే అమలవుతున్న పథకాలతో కర్ణాటక, తెలంగాణలో ప్రజల జీవితాలు మెరుగయ్యాయి. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాలలాగే కాంగ్రెస్ తాజాగా కొత్త పథకాన్ని ముందుకు తేనుంది. కష్టకాలంలో ఎల్లప్పుడూ కాంగ్రెస్ ఆపన్నహస్తం అందిస్తుంది’ అని ముగించారు. సోనియా సందేశాన్ని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీ ‘ఎక్స్’లో షేర్‌చేశారు. సోనియా సందేశంపై రాహుల్ స్పందించారు. ‘‘ పేద కుటుంబాల మహిళలు ఒక్కటి గుర్తుంచుకోండి. మీ ఒక్క ఓటు ఏటా మీ ఖాతాలో జమ అయ్యే రూ.1 లక్షతో సమానం. పెరిగిన ధరవరలు, నిరుద్యోగ కష్టాల్లో కొట్టుమిట్లాడుతున్న పేద మహిళలకు మహాలక్ష్మీ పథకం గొప్ప చేయూత. అందుకే ఓటేయండి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment