చీరకానుకలతో గద్దెల వద్దకు వస్తున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తింపజేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహాజాతరపై మరో మంత్రి కొండా సురేఖతో కలిసి బుధవారం ఉన్నత స్థాయిలో సమీక్షించారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ అందరి సహకారంతో జాతరను విజయవంతం చేయాలన్నారు. అభివృద్ధి పను ల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చూడాలని సూచించారు.
కాంట్రాక్టర్లకు వంతపాడే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాజాతర అంటే ఎన్ని సౌకర్యాలు కల్పించినా, అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. వాటిని తన దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2014 మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మలు గద్దెనెక్కిన రోజు, తెలంగాణబిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా తల్లుల దీవెనలతోనే ఏర్పడిందని, సోనియాగాంధీ ఇచి్చన తెలంగాణ రాష్ట్రంలో జరిగే మహాజాతరకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీతక్క వివరించారు.
జాతరను విజయవంతం చేస్తాం: మంత్రి కొండా సురేఖ
మహాజాతరను విజయవంతం చేసేందుకు సమ్మక్క–సారలమ్మల స్ఫూర్తితో మంత్రి సీతక్కతో కలిసి పనిచేస్తానని మంత్రి సురేఖ అన్నారు. వరంగల్ ఆడబిడ్డలుగా జాతరలో పనిచేయడం తమ అదృష్టమన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృదిŠధ్ పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజాధనం దుర్వింనియోగం కాకుండా చూస్తూ అధికారుల వెంట పడి పరిగెత్తించి పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి రూ.1.50కోట్లతో పూజారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత లేదని, సలహాలు, సూచనలు అందించి జాతర విజయవంతానికి సహకరించాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో యాదాద్రిలో అభివృద్ధి పేరిట మూల విరాట్‌ను కదిలించి యాదాద్రిని నిర్మించారని, అది శాస్త్రీయంగా తప్పిదమని తెలిపారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10 గదులతో అతిథి గృహనిర్మాణం చేపడుతుందని, వచ్చే మినీ జాతర నాటికి అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, అడిషనల్ ఎస్పీ సదానందం, అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ పీఓఅంకిత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, ఓఎస్డీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మొదలైన భక్తుల సందడి
మేడారం జాతరకు నెల రోజుముందుగానే భక్తుల తాకిడి మొదలైంది. సంక్రాంతి సెలవుల చివరి రోజు కావడంతో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద బంగారం, చీర, సారె, పూలు, పండ్లు, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment