సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా అంశాలు అసెంబ్లీలో చర్చకు రావాలని జిల్లావాసులు కోరుతున్నారు.
- గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల ఔటర్ రింగు రోడ్డు పనులకు 2017 అక్టోబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూరల్ జిల్లాలోని టెక్స్‌టైల్ పార్కు స్థలంలోనే శిలాఫలకం వేశారు. నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర పెండింగ్ పడింది.
- వరంగల్ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉండగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే. వరంగల్ నగరాభివృద్ధితో పాటు వరంగల్, వరంగల్ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల శివారు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
- మడికొండలో మూడు నక్షత్రాల హోటల్‌తో స హా, హైదరాబాద్‌లోని హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ సమావేశ, వాణిజ్య ప్రదర్శనల కేంద్రం (వైటెక్స్) నిర్మించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని పీపీపీ మోడ్‌లో నిర్మించి నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది. నిధులిస్తేనే ఇవన్నీ జరిగేది.
- జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు కొత్త జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పాలనపరంగా ఇంకా కుదుటపడేందుకు వసతులు కల్పించాలి. ఉమ్మడి వరంగల్‌లో పలు ప్రాజెక్టులు, పథకాలపై స్పష్టత ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.
- వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరడం లేదు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు 700 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది. మరో 200 నుంచి 400 ఎకరాల భూసేకరణ అవసరమని, గత ప్ర భుత్వం సేకరించి ఇస్తామన్నా సాధ్యం కాలేదు. ఇదివరకే మట్టి నమూనా పరీక్షలు కూడా నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు రెండేళ్లుగా భూకేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు.
- హైదరాబాద్‌లో ఉన్నట్లు వరంగల్‌లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు కాకతీయ పట్ట ణాభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి మూడేళ్ల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారైన నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది.
- కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటు, సౌకర్యాల కల్పనకు గత ప్రభుత్వం రూ.574 కోట్లను మంజూరు చేసి రూ.174 కోట్లు విడుదల చేసింది. ఆమేరకు పలు మౌలిక వసతులు కల్పించగా.. మరో రూ.400 కోట్లు రావాల్సి ఉంది. పార్కులో కొన్ని ప్రాంతాల్లో రహదారులను నిర్మించి, విద్యుత్ సరఫరా కోసం ఉపకేంద్రాన్ని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా 12 ఎంఎల్‌డీ సామర్థ్యం గల వ్యవస్థను ఇంకా నిర్మించుకోవాల్సి ఉంది. మొత్తం 1200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నిధులు, అన్ని రకాల వసతులు తీర్చుదిద్దుకుంటే మరికొన్ని వస్త్ర పరిశ్రమలు వచ్చే వీలుంది.
- భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తి చేయాలి. ములుగు జిల్లాలో ములు గు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పా టు, గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలంటే పెద్దమొత్తంలో బడ్జెట్‌లో నిధులు రాబట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment