వరంగల్: ‘ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటాయి. వాటిని అరికట్టి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు కల్పించాలి. అందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడం పోలీసుల విధి. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే, అటువంటి ప్రయత్నం చేసేవారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాం.’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ అన్నారు.
జిల్లాలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం.. నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
భారీ బందోబస్తు
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. నలుగురు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 50 మంది ఇన్‌స్పెక్టర్లు, 141 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 525 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, 1,100 మంది కానిస్టేబుళ్లు, 550 మంది హోంగార్డులు, సుమారు 2,400 మంది పారామిలటరీ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
కమిషనరేట్ పరిధిలో 11 నియోజకవర్గాలు
కమిషనరేట్ పరిధిలో 11 నియోజకవర్గాలు (పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజవర్గాలు పూర్తి స్థాయిలో, పాలకుర్తి, జనగామ, హుజూరాబాద్, హుస్నాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు) ఉన్నాయి. కమిషనరేట్ వ్యాప్తంగా 21,55,057 మంది ఓటర్లు ఉన్నారు.
వీరిలో పురుషులు 10,69,716 మంది, స్త్రీలు 10,85,057, ట్రాన్స్‌జెండర్లు 284 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు 2,125 ఉండగా, ఇందులో సమస్మాత్మకవి 551, సాధారణ పోలింగ్‌స్టేషన్లు 1,574 ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు 1,126 ఉండగా వీటిలో సమస్యాత్మక 383, సాధారణ కేంద్రాలు 743 ఉన్నాయి.
అడుగడుగునా తనిఖీలు
ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టకుండా ఉండేందుకు స్థానిక పోలీసులతోపాటు ప్రత్యేకంగా 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. దీంతోపాటు ఎల్కతుర్తి, కేయూసీ, నర్సంపేట, మిల్స్‌కాలనీ, జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల, రాయపర్తి దగ్గర చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. దీంతోపాటు 10 డైనమిక్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాం.
ఈ నెల 9న ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటినుంచి ఇప్పటికే రూ.1.01 కోట్ల నగదు, రూ.14.92 లక్షల విలువ గల 13,400 కిలోల బెల్లం, 1,636 లీటర్ల గుడుంబా, 560 కిలోల పటిక, రూ.87 లక్షల విలువ గల 351 కిలోల గంజాయి, రూ.4 లక్షల విలువ గల బ్యాగులు, చీరలు పట్టుకున్నాం. అడుగడుగునా తనిఖీలు చేపట్టి పంపిణీని ఎక్కడికక్కడ నిరోధిస్తాం.
స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయండి
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మద్యం, డబ్బులు, ఇతర వస్తువులు పంపిణీ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. అది నేరుగా ఎన్నికల సంఘానికి వెళ్తుంది. దీంతోపాటు సీ విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. కమిషనరేట్‌లో గత, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. భూకబ్జాదారులు, రౌడీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదు. చర్యలు కఠినంగా ఉంటాయి. పీడీయాక్టు వంటి చట్టాలను ప్రయోగిస్తాం.
ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలి..
అందరికి ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయి. రాజకీయ పార్టీలు కూడా ఐదుగురు దాటితే ఎన్నికల అధికారి అనుమతి తీసుకుని సమావేశాలు నిర్వహించుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీ నేతలు ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలి. స్థానిక పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలతో ప్లాగ్, రూట్ మార్చ్‌లు నిర్వహిస్తాం. ప్రజలు అన్ని రకాలుగా పోలీసులకు సహకరించాలి.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఎన్నికల నిబంధనలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయి. రాజకీయ పార్టీల నేతలకు ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. గతంలో ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించిన వారిని, వివిధ కేసుల్లో నిందితులను బైండోవర్ చేశాం.
2018 ఎన్నికల సమయంలో కమిషనరేట్ వ్యాప్తంగా 9,600 మందిని బైండోవర్ చేశారు. ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి 1,796 మందిని బైండోవర్ చేశాం. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఆరు నెలలుగా కసరత్తు
ప్రతి ఓటరు తన ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరు నెలలుగా పోలీస్‌శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం 24 గంటల పాటు కమిషనరేట్ వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు 10 డైనమిక్ బృందాలు పనిచేస్తున్నాయి.
ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు జీపీఎస్ అమర్చడంతోపాటు కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రతి బృందంలో ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఎవరు, ఎక్కడ ప్రయత్నం చేసినా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వారిని పట్టుకుని సామగ్రిని సీజ్ చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment