సిద్ధు(ఫైల్)
సాక్షి, మహబూబాబాద్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని పాత కురవి గేటు ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాగా సదరు యువకుడిని కొట్టి హత్య చేసి రైలు ప్రమాదంలో మృతిచెందినట్లు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రాస్తారోకో చేపట్టి ఆందోళనకు దిగారు.
జీఆర్పీ డోర్నకల్ ఎస్సై కె.శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం చంద్యా తండాకు చెందిన భూక్యా నగేష్, శారద దంపతుల కుమారుడు భూక్యా సిద్ధు(19) శనివారం అర్ధరాత్రి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని పాత కురవి గేటు ప్రాంతంలో రైలు ఢీకొని మృతిచెందాడని తెలిపారు. సమాచారం అందిన వెంటనే తాము సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించి భద్రపరిచామన్నారు.
ఆదివారం ఉదయం సిద్ధు తండ్రి నగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం సిద్ధు మృతిపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ చేసి దోషులను గుర్తించి శిక్షించాలని కోరారన్నారు. కుమారుడి మృతికి విష్ణువర్ధన్, శివపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. విచారణ అనంతరం కేసును మహబూబాబాద్ టౌన్ పోలీసులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
బంధువుల రాస్తారోకో..
భూక్యా సిద్ధు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టు మార్టం చేసేందుకు తీసుకురాగా అతడి బంధువులు, కుటుంబ సభ్యులు సిద్ధు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేపట్టి ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఊరుకోబోమని హెచ్చరిస్తూ సిద్ధు మృతదేహాన్ని పోస్టుమార్టం గది నుంచి బయటకు తీసుకువచ్చి రోడ్డుపై పెట్టి నినాదాలు చేశారు. మృతుడి తండ్రి నగేశ్ మాట్లాడుతూ.. తమ కొడుకు సిద్ధు హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నట్లు తెలిపారు.
తండాలో జరిగిన శుభాకార్యానికి హాజరయ్యాక, తండాకే చెందిన కొందరు యువకులు అతనిని సినిమాకు వెళ్దామని మహబూబాబాద్‌కు తీసుకువచ్చారన్నారు. పథకం ప్రకారం హతమార్చి రైలు ఢీకొని మృతిచెందినట్లు వారే తమకు ఫోన్ చేసి వివరాలు చెప్పినట్లు పేర్కొన్నారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ సీఐ సతీష్, ఎస్సై విజయరాంకుమార్ మృతుడి బంధువులతో మాట్లాడి పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇవి కూడా చదవండి: ఆ ట్రిపుల్‌ఐటీలో అసలేం జరుగుతుంది? విద్యార్థిది హత్యా! లేక మరేంటి?
Comments
Please login to add a commentAdd a comment