జై తెలంగాణ నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పక్కన జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ఎమ్యెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
సీఎం పర్యటన సైడ్ లైట్స్
► 3.46 నిమిషాలకు వికాస్‌నగర్‌కు హెలికాప్టర్ చేరుకుంది.
► 3.49 హెలికాప్టర్ ల్యాండ్ అయింది.
► 3.51 నిమిషాలకు మంత్రులు, పల్లా, ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలికారు.
► 3.52 గంటలకు హెలిపాడ్ నుంచి బయలుదేరారు.
► 3.55 సభా వేదికపైకి చేరుకున్నారు.
► 4.21 ప్రసంగం ప్రారంభించి, 4.49 గంటలకు ముగించారు.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్ తొలి ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడం.. ఆపార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. జనగామ నియోజకవర్గంలోని గత పరిస్థితులను.. తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితులను తన ప్రసంగంలో వివరించారు.
ఒక్కో వర్గం వారికి ఏం చేస్తున్నారో.. భవిష్యత్‌లో ఏం చేయబోతున్నారో చెబుతూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జనగామ పట్టణం సిద్దిపేట రోడ్డున ఉన్న మెడికల్ కళాశాల మైదానంలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచే ప్రజలు, పార్టీ శ్రేణుల రాక మొదలవగా.. 11 గంటల వరకే ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది.
ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్, దివంగత సాయిచంద్ బృందం కళాకారుల తెలంగాణ ధూం ధాం పాటలు సభికులను ఉత్తేజపర్చాయి. జనగామ–సిద్దిపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సీపీ అంబర్ కిశోర్ ఝా నేతృత్వంలో డీసీపీ పి.సీతారాం ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
పల్లా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుంచి మెడికల్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు, సిద్ధయ్య పార్టీ శ్రేణులతో కలిసి ఒగ్గుడోలు విన్యాసాలు, మహిళల కోలాటం, బతుకమ్మలు, బోనాలు, ముస్లిం మైనార్టీల కళారూపాలతో ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
సీఎం రాక రెండు గంటలు ఆలస్యం..
సీఎం.. బహిరంగ సభలో మధ్యాహ్నం 1.45 గంటలకు పాల్గొనాల్సి ఉండగా.. రెండు గంటలు ఆలస్యంగా 3.55 గంటలకు వచ్చారు. ఆయనకు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు స్వాగతం పలికారు. ముందుగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. సీఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
సీఎం చలోక్తులు..
సభా వేదికపై సీఎం కేసీఆర్ అడుగుపెట్టగానే.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినదించారు. ప్రజలకు అభివాదం చేస్తూనే.. ‘అమ్మో.. పల్లా హుషార్‌గానే ఉన్నాడు.. నాకు తెలియదు ఇంత దమ్మున్నోడని’ అంటూ తనదైన శైలిలో చలోక్తులు విసిరారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన చిట్టాను రాజేశ్వర్‌రెడ్డి చదివి వినిపించగా.. ‘దొడ్లకు వచ్చిన గోద.. పెండ పెట్టకుండా ఉంటదా.. నేను వచ్చాను కదా.. ఇక ఆ హామీలన్నీ కచ్చితంగా నెరవేర్చి తీరుతా.. లేదంటే పల్లా ఊరుకోడు కదా’ అంటూ మాట్లాడారు.
రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసి తీరుతామంటూ వాగ్దానం చేశారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో కరువుతో అల్లాడిన బచ్చన్నపేటను చూసి ఏడ్చిన.. ఇప్పుడు పచ్చని పొలాలు చూస్తూ మురిసిపోతున్నా.. ఇదే మన తెలంగాణ స్పెషాలిటీ’ అంటూ కేసీఆర్.. నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేశారు. కరువుకు కేరాఫ్‌గా ఉన్న జనగామ రైతుల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్ర ముఖం తెలివికి వచ్చిందంటూ అన్నదాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయాలని సీఎం అనడంతో జనం పెద్ద ఎత్తున స్పందించి కేరింతలు కొట్టారు. ఎన్నికల తర్వాత జనగామకు వచ్చి రోజంతా తిరుగుతానంటూ శ్రేణుల్లో జోష్ నింపారు. ‘జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, లద్నూరులో రెండు, మూడువేల మంది మిత్రులు ఉన్నారు.. మేరా దోస్తోంకో చేర్యాల్.. నా దోస్తులు ఉన్న ఇలాఖాలోనే ఎన్నికల చివరి సభ ఉంటుంది’ అంటూ ప్రసంగం ముగించారు. సభావేదికపై నేతలందరూ ఆసీనులవగా అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. కేసీఆర్ ప్రసంగం ముగిసేంత వరకు పక్కన నిల్చున్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మహిళా కమిషన్ సభ్యురాలు జి.పద్మ, గాంధీ నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ పి.జమునలింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త గుజ్జ సంపత్‌రెడ్డి, నిమ్మతి మహేందర్‌రెడ్డి, బాల్దె సిద్దిలింగం, తాళ్ల సురేశ్‌రెడ్డి, బండ యాదగిరిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment