వరంగల్‌: బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు! | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌: బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు!

Published Thu, Mar 14 2024 1:30 AM | Last Updated on Thu, Mar 14 2024 1:22 PM

- - Sakshi

వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌లో వీడిన సస్పెన్స్‌ మహబూబాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా సీతారాంనాయక్‌..

బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన మూడు రోజులకే టికెట్‌ ఖరారు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్‌ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎట్టకేలకు బీఆర్‌ఎస్‌ ‘బీ’ఫామ్‌ దక్కింది. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌ను ఈసారికి పోటీ నుంచి తప్పించారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిట్టింగ్‌ ఎంపీని మార్చడం తథ్యమన్న నేపథ్యంలో వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ మొదలైంది. వరంగల్‌ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో పార్టీలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్‌ఎస్‌కు రాజీ నామా చేయడంతో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌, కడియం కావ్య పేర్లు ప్రధానంగా వినిపించాయి.

అరూరి రమేష్‌ మొదట ఆసక్తి చూపినా.. ఆ తర్వాత ఎందుకో పార్టీ మారాలనే యోచనలో పడటం పార్టీలో గందరగోళానికి తెరతీసింది. ఇదే సమయంలో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రులను కలవడం.. బుధవారం హనుమకొండలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడేకంటే ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఆయనను తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్‌ తీసుకెళ్లి కేసీఆర్‌ను కలిపించారు. ఉమ్మడి వరంగల్‌ కీలక నేతలు, ప్రజాప్రతినిధులతో సుమారు గంటన్నర పాటు చర్చించిన కేసీఆర్‌.. కడియం కావ్య పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు.

ఉన్నత విద్యాభ్యాసం.. సామాజిక సేవలో
సీనియర్‌ రాజకీయ నాయకులు కడియం శ్రీహరి పెద్ద కూతురైన కావ్య దక్కన్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేశాక, ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎండీ (పాథాలజీ) పూర్తి చేసి వరంగల్‌లో కాకతీయ మెడికల్‌ కాలేజీలో సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేశారు.

గతంలో వర్ధన్నపేట సామాజిక వైద్యకేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆమె బాలికల విద్యా వ్యాప్తి కి విశేషించి కృషి చేస్తున్నారు. మెనుస్ట్రువల్‌ హైజీన్‌పై కడియం ఫౌండేషన్‌ ద్వారా వందలాది చైతన్య కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా హైజీన్‌ కిట్స్‌ పంపిణీ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డాక్టర్‌ కావ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

మానుకోట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాంనాయక్‌..
మహబూబాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ను ప్రకటించారు. ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో అలా చేరారో.. లేదో.. ఇలా టికెట్‌ తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాంనాయక్‌ కేయూ ప్రొఫెసర్‌గా కొనసాగుతూనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇలా బీఆర్‌ఎస్‌(అప్పటి టీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌కు దగ్గరైన ఆయన.. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపొందారు.

మానుకోట పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై 34,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన స్థానంలో మాలోత్‌ కవితకు టికెట్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్‌ ఇవ్వాలని కోరగా.. అదీ దక్కలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్న సీతారాంనాయక్‌ టికెట్‌ రాదని తెలిసి, ఈ నెల 10న బీజేపీలో చేరారు. చేరిన మూడు రోజులకే మానుకోట టికెట్‌ కేటాయించడం గమనార్హం.

ఇవి చదవండి: బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement