ములుగు/ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. మహాజాతరకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం, ఆదివారం సెలవు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సుమారు 12 లక్షల మంది భక్తులు అమ్మలను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు అంచనా వేశారు. భక్తుల రాకతో మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్ ఆర్టీసీ పాయింట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
తోపులాట..
మేడారానికి భక్తులతోపాటు వీఐపీలు సైతం భారీగా వచ్చారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాం నాయక్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్‌తోపాటు వచ్చిన ప్రజాప్రతినిధులతో వీఐపీ గేటు వద్ద గందరగోళం ఏర్పడింది. వీఐపీలు అమ్మవార్లను దర్శించుకునేందుకు గద్దెలకు వెళ్లిన క్రమంలో తోపులాట జగింది. వీఐపీ గేటు పక్కనే సాధారణ భక్తులు అమ్మవార్లను దర్శించుకునే క్యూలైనన్లు ఉండడంతో రద్దీ ఎక్కువై ఓ బాలిక మోచేయికి తీవ్రగాయమైంది.
భక్తుడి తలకు గాయాలు
సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలను నేరుగా గద్దెల వద్దకు పంపించారు. ఈ సమయంలో గద్దెల బయట ఉన్న భక్తులు తమ మొక్కులో భాగంగా బంగారం(బెల్లం), కొబ్బరికాయల ముక్కలను గద్దెల లోపలికి విసరడంతో చాలామంది వీఐపీ భక్తులకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన చంద్రారెడ్డి తలపై కొబ్బరికాయపడి రక్తస్రావమైంది. ఇక చిన్నపిల్లలతో వీఐపీ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగారం ముద్దలను సేకరించడానికి వచ్చిన ఆదివాసీ వలంటీర్ల వద్ద ఉన్న హెల్మెట్లను చిన్నారుల తలలపై ఉంచి అప్రమత్తమయ్యారు.
తీరు మారని దేవాదాయ శాఖ..
గత మహాజాతరలో అమ్మలను దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో భక్తులు విసిరిన బంగారం ముద్ద తగిలి స్వయంగా తనకే గాయమైందని, ఈసారి వీఐపీ భక్తులకు గద్దెల వద్ద ఇబ్బందులు రాకుండా చూడాలని, వారం రోజుల క్రితం మేడారానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులకు ఆదేశించారు. భక్తులు సమర్పించేందుకు తమ వెంట తీసుకొచ్చే బంగారం, కొబ్బరికాయలను గద్దెలపై అమ్మవార్లకు అందేలా సులవైన మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని వీఐపీ భక్తులు వాపోతున్నారు.
క్యూలైన్లు కిటకిట...
భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచి భక్తులకు క్యూలైన్ల ద్వారా అనుమతి ఇచ్చారు. రెడ్డిగూడెం వైపు నుంచి అమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గంటపాటు క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతోపాటు వీఐపీలు రావడంతో చాలా సేపు వేచిచూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో మంచినీటి సౌకర్యం లేక అధికారుల ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
హెలీకాపర్ట్‌లో వచ్చిన ఎంపీలు
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బాల్క సుమన్, గుత్త సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ మేడారం పోలీస్ క్యాంపులోని హెలిప్యాడ్‌లో దిగారు. ఎంపీ సీతారాంనాయక్, జేసీ అమయ్‌కుమార్, చైర్మన్ కాక లింగయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు వారికి హెలీప్యాడ్ నుంచి స్వాగతం పలికారు. వారి వెంట ఎంపీ పసులేటి దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీలు వలీయాబీతోపాటు పలువురు అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరిని భారీ పోలీసులు బందోబస్తు మధ్య తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment