ఎస్‌ఎస్ తాడ్వాయి/ఏటూరునాగారం: కోరిన వారికి కొంగుబంగారమైన వనదేవత.. వీరవనిత.. సమ్మక్క తల్లి అధికారిక లాంఛనాలు, భక్తుల జయజయధ్వానాలు, ఉయ్యాల పాటలు, ఒడిబియ్యపు జల్లులు, శివసత్తుల పూనకాల నడుమ చిలకలగుట్టను వీడి భక్తులను దీవించేందుకు మేడారంలోని గద్దెను అధిష్టించింది. తొలుత ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు, వడ్డెలు సమ్మక్కను గుట్ట నుంచి కిందకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జయశంకర్‌భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కర్ణన్, ఎస్పీ ఆర్. భాస్కరన్ ప్రభుత్వ లాంఛనాలతో అమ్మకు ఘనస్వాగతం పలికారు. చిలకలగుట్ట నుంచి మేడారంలోని గద్దెల వరకు 2.19 గంటల పాటు జరిగిన సమ్మక్క ప్రయాణం ఆద్యంతం కనుల పండుగగా, ఉద్విగ్నభరితంగా సాగింది.
హోరెత్తిన చిలకలగుట్ట..
సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తోడ్కొని వచ్చేందుకు పూజారులు సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దూప వడ్డే నాగేశ్వర్‌రావు, కొమ్ము బూర జనార్దన్ సాయంత్రం 4 గంటల సమయంలో చిలకలగుట్ట పైకి ఎక్కారు. ఈ సందర్భంగా అమ్మ రాక కోసం భక్తులు, ప్రభుత్వ అధికారులు గుట్ట కింద ఎదురుచూశారు. రెండు గంటల పాటు డప్పు వాయిద్యాలతో ఆది వాసీ నృత్యాలు చేశారు.జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్‌పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ఎస్పీ భాస్కరన్, జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, జాతర చైర్మన్ కాక లింగయ్య నృత్యాలు చేశారు.
గాలిలోకి నాలుగు సార్లు కాల్పులు..
సమ్మక్క ఆగమనం కోసం రెండు గంటలుగా అలుపెరుగకుండా భక్తులు చిలకలగుట్ట కింద ఎదురు చూశారు. ఈ క్రమంలో గుట్టపై నుంచి పూజారులు, వడ్డెలు దిగుతున్న ఆనవాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా భక్తులు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం సరిగ్గా 6:14 గంటలకు సమ్మక్కను తీసుకుని ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్ట దిగారు. ఆయనకు తోడుగా ప్రధాన పూజారులు, వడ్డెలు వచ్చారు. సమ్మక్క రాక సందర్భంగా ప్రభుత్వ లాంఛనంగా జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. గుట్ట నుంచి సమ్మక్క కొద్దిగా ముందుకు కదలగానే మొదటిసారిగా 6:15 గంటలు, రెండోసారి 6:17 గంటలకు, మూడోసారి 6.19, నాలుగోసారి చిలకలగుట్ట ఫెన్సింగ్ గేటు వద్ద 6:32 నిమిషాలకు గాలిలోకి కాల్పులు జరిపి అమ్మ రాకను భక్తులకు తెలిపారు. కాగా, రెండోసారి కలెక్టర్, ఎస్పీ ఇరువురు కలిసి గాలిలోకి కాల్పులు జరిపారు.
దారిపొడవునా నీరాజనం..
మేడారంలోని గద్దెల వైపు సమ్మక్క ప్రయాణం ప్రారంభంకాగానే మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఒడిబియ్యం విసిరారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క రాక అపురూప క్షణాలను పురస్కరించుకుని యాటలు, కోళ్లు బలిచ్చారు. సమ్మక్కను కనులారా వీక్షించేందుకు దారికి ఇరువైపులా ఉన్న గోడలు, ఇళ్లు, చెట్లు, వాహనాలు ఎక్కి వరుసగా నిలబడి చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు.
రాత్రి 8:33 గంటలకు గద్దెపైకి..
గద్దెల ప్రాంగణంలోకి 8:20 గంటలకు సమ్మక్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అక్కడ పది నిమిషాల పాటు పూజారులు రహస్య పూజ లు నిర్వహించారు. తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఆలయ ప్రాంగణంలో వెలు గులు ప్రసరించే సమయానికి పగిడిద్దరాజు గద్దె వద్ద సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సరిగ్గా 8:33 గంటలకు సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిం చారు. అక్కడ పూజ లు నిర్వహించిన తర్వాత 8:40 గంటలకు సారలమ్మ గద్దె వద్దకు వెళ్లిన సమ్మక్క పూజారులు బిడ్డకు తల్లి ఆశీస్సులు అందించారు.
నలుగురు ఒక్కచోట..
సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరా జు లు గద్దెలపై ఉండడంతో తల్లులను దర్శించుకునేందు కు భక్తులు పోటీపడ్డారు. జంపన్నవాగు, గద్దెల అన్ని దారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తొలి రోజు ట్రాఫిక్ జామ్ కారణంగా రాని భక్తులు గురువారం మేడారానికి పెద్దసంఖ్యలో వచ్చారు.తల్లులను దర్శిం చుకున్న భక్తులు తిరుగుపయనమయ్యారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించిన వెంటనే జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జాతర ప్రత్యేక అధికారి ప్రశాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ వీపీ గౌతమ్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు గద్దెపైకి చేరుకుని తొలి మొక్కులు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment