అటవీ మార్గంలో కాలినడకన బైలెల్లిన పగిడిద్దరాజు.. గద్దెపై పడిగెను ప్రతిష్ఠిస్తున్న పూజారులు ( ఇన్‌సెట్‌లో)
గంగారం(ములుగు): మేడారం మహాజాతర వేదికగా సమ్మక్కను పరిణయమాడేందుకు పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మంగళవారం బయల్దేరారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును గ్రామస్తులు అటవీమార్గంలో కాలినడకన సంప్రదాయ డోలు వాయిద్యాల మధ్య మేడారం తీసుకువెళ్తున్నారు. అంతకుముందు గ్రామంలో పెనుక వంశీయుల పూజారి తలపతి ఇంట్లో పగిడిద్దరాజును నలుగు పూజలతో పెళ్లికుమారుడిగా తయారుచేశారు. అనంతరం ఇక్కడి పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులైన పూజారులు బుచ్చిరాములు, సురేందర్, మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులకు దర్శనమిచ్చారు. పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును తాకి తన్మయత్వం పొందారు. తలపతి ఇంట్లో నుంచి పానుపు (పూజా సామగ్రి) తీసుకువస్తుండగా, ఆలయంలో పూజల తర్వాత పడిగెను మేడారానికి తీసుకెళ్తుండగా గ్రామస్తులు బిందెలతో నీళ్లు తెచ్చి పూజారుల కాళ్లు కడిగి సాగనంపారు.
శివసత్తుల పూజనకాలతో మేడారం బయల్దేరారు. మంగళవారం రాత్రి తాడ్వాయి మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకొని పెనుక వంశీయుల ఇంట్లో నిద్రిస్తారు. అక్కడి నుంచి పోలీసుల బందోబస్తు మధ్య పస్రా, నార్లాపురం, కొండాయి మీదుగా మొత్తం 65 కిలోమీటర్లు కాలినడకన మేడారంలోని చిలుకల గుట్టకు చేరుకుంటారు. పానుపు తరలింపు నుంచి పడిగె వెళ్లే వరకు పూర్తి కార్యక్రమాలను స్థానిక సర్పంచ్ ఈసం కాంతారావు పర్యవేక్షించారు. మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాక లింగయ్య, డైరెక్టర్ ఇర్ప సూరయ్య, మర్రిగూడెం, ఎంపీటీసీ సభ్యురాలు వనిత, టీఆర్‌ఎస్ నాయకుడు ఈసం సమ్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment