సమ్మక్క–సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. సమ్మక్క–సారలమ్మ పేరుతో ఉన్న గద్దెలే ఇక్కడ పూజనీయ స్థలాలు. ఈ గద్దెల మధ్య ఉండే కొయ్యదారులు, మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్లు ఇక్కడ దేవతామూర్తులు. నిత్యజీవితంలో భాగమైన పసుపు, కుంకుమ, బెల్లం వంటి వస్తువులతోనే ఇక్కడ పూజలు, మొక్కులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి.
శ్రీసమ్మక్క, సారలమ్మ మహాజాతరలో భక్తులు తీరొక్క మొక్కులు చెల్లిస్తుంటారు. సంతానం కలగాలని, ప్రభుత్వ ఉద్యోగం రావాలని, వ్యాపారంలో బాగా స్థిరపడాలని, కూతురికి మంచి వివాహా సంబంధం రావాలని అమ్మలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. కోర్కెలు తీరిన వారు కోళ్లు, యాటలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, చీరసారెలు సమర్పించి వనదేవతల ఆశీర్వాదం పొందుతారు. జాతరలో తీరొక్క మొక్కులపై ప్రత్యేక కథనం. – ఎస్‌ఎస్‌తాడ్వాయి
జంపన్న వాగులో స్నానం..
జంపన్న వాగుకు సర్వపాప హరిణిగా పేరుంది. ఒకప్పటి సంపెంగ వాగే.. నేటి జంపన్నవాగు. ఇక్కడ స్నానమాచరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్తారు. జంప్నన్న వాగు ఒడ్డున తలనీలాలు సమర్పిస్తారు.
బంగారం (బెల్లం) సమర్పణ
ప్రపంచంలో ఏ జాతరలో లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సమ్మక్క తల్లికి బెల్లం అంటే ఇష్టమని ప్రతీతి. తాము కోరిన కోర్కెలు నెరవేరితే నిలువెత్తు బం గారం సమర్పిస్తామని చాలా మంది మొక్కుతుంటారు. కోర్కెలు నెరవేరగానే తప్పని సరిగా
బెల్లం మొక్కు సమర్పిస్తారు.
ఎదుర్కోళ్లు..
అమ్మలను గద్దెలకు తీసుకొచ్చే క్రమంలో భక్తులు ఎదుర్కోళ్లతో ఆహ్వానం పలుకుతా రు. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎ దురుగా వేస్తూ మనసారా మొక్కుతుంటారు.
శివసత్తుల పూనకాలు
జంపన్న వాగులో శివసత్తుల పూనకాలు మేడారం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలతోపాటు పురుషులు కూడా శివాలూగుతూ జాతరకు వస్తారు. వీరంతా తొలుత జంపన్నవాగులో స్నానం ఆచరిస్తారు. తర్వాత పసుపుతో అలంకరించుకుంటారు.
వరం పట్టుట..
సంతానం లేని భక్తులు వచ్చే జాతర నాటికి సంతానం కలగాలని నిష్టతో మొక్కుతుంటారు. ఈ మొక్కులను వరం పట్టడం అంటారు. ముందుగా జంపన్న వాగులో వెదురు వనం, కొబ్బరి కాయతో పూజలు జరిపి స్నానమాచరిస్తారు. అక్కడి నుంచి తడి బట్టలతో నేరుగా సారలమ్మ గుడికి చేరుకుంటారు. సారలమ్మ తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే క్రమంలో దారికి అడ్డంగా పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తారు. సారలమ్మ తల్లి మేడారంలోని గద్దెలపైకి వేళ్లేటప్పుడు పూజారులు వీరిపై నుం చి దాటుతూ వెళ్తారు. సంతానం కలిగిన దంపతులు తమ మొక్కులను తీర్చుకునే క్రమంలో భాగంగా గద్దెల సమీపంలో ఊయల తొట్టెలను కడతారు. తమ పిల్లలు చల్లగా ఉండేలా దీవించమని మొక్కుతుంటారు.
ఒడి బియ్యం (కంక బియ్యం)
భక్తులు తల్లులను ఆడపడుచులుగా భావిస్తూ ఒడిబియ్యం మొక్కులు చెల్లిస్తారు. తమ ఇళ్లలోనే నూతన వస్త్రంలో ఐదు సోళ్ల బియ్యం పోసుకుని ముడుపుగా నడుముకు కట్టుకుని వస్తారు. ఈ బియ్యంలో పసుపు, కుంకుమ, రవిక ముక్కలు, కుడుకలు, చీరలు ఉంచుతారు.
మేకలు, కోళ్లు బలిచ్చుట..
మేడారం జాతరలో కోళ్లు, మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. వనదేవతలను దర్శించుకునే ముందు భక్తులు రెండు కొబ్బరికాయలు కొడతారు. ఈ సమయంలో పసుపు, కుంకుమతో పాటు అగరవత్తులు చెల్లించి దేవతలకు మొక్కుతారు.
లక్ష్మీదేవర మొక్కు
లక్ష్మీదేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుం ది. నాయకపోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారిపొడవునా నృత్యం చేస్తూ గద్దెలకు వస్తారు. ఆయనకు గద్దెల వద్ద డోలు, గజ్జెల మోతతో చప్పుళ్లు చేస్తారు. తర్వాత ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు.
ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం
సమ్మక్క తల్లిని నిష్టగా కొలిచే మగ భక్తుల్లో కొందరు శివసత్తులుగా మారుతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ఒళ్లంతా పసుపు రాసుకుంటారు. చీరసారె కట్టుకుని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివాలెత్తుతారు.
Comments
Please login to add a commentAdd a comment