mokkulu
-
తీరొక్క మొక్కు
సమ్మక్క–సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. సమ్మక్క–సారలమ్మ పేరుతో ఉన్న గద్దెలే ఇక్కడ పూజనీయ స్థలాలు. ఈ గద్దెల మధ్య ఉండే కొయ్యదారులు, మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్లు ఇక్కడ దేవతామూర్తులు. నిత్యజీవితంలో భాగమైన పసుపు, కుంకుమ, బెల్లం వంటి వస్తువులతోనే ఇక్కడ పూజలు, మొక్కులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీసమ్మక్క, సారలమ్మ మహాజాతరలో భక్తులు తీరొక్క మొక్కులు చెల్లిస్తుంటారు. సంతానం కలగాలని, ప్రభుత్వ ఉద్యోగం రావాలని, వ్యాపారంలో బాగా స్థిరపడాలని, కూతురికి మంచి వివాహా సంబంధం రావాలని అమ్మలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. కోర్కెలు తీరిన వారు కోళ్లు, యాటలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, చీరసారెలు సమర్పించి వనదేవతల ఆశీర్వాదం పొందుతారు. జాతరలో తీరొక్క మొక్కులపై ప్రత్యేక కథనం. – ఎస్ఎస్తాడ్వాయి జంపన్న వాగులో స్నానం.. జంపన్న వాగుకు సర్వపాప హరిణిగా పేరుంది. ఒకప్పటి సంపెంగ వాగే.. నేటి జంపన్నవాగు. ఇక్కడ స్నానమాచరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్తారు. జంప్నన్న వాగు ఒడ్డున తలనీలాలు సమర్పిస్తారు. బంగారం (బెల్లం) సమర్పణ ప్రపంచంలో ఏ జాతరలో లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సమ్మక్క తల్లికి బెల్లం అంటే ఇష్టమని ప్రతీతి. తాము కోరిన కోర్కెలు నెరవేరితే నిలువెత్తు బం గారం సమర్పిస్తామని చాలా మంది మొక్కుతుంటారు. కోర్కెలు నెరవేరగానే తప్పని సరిగా బెల్లం మొక్కు సమర్పిస్తారు. ఎదుర్కోళ్లు.. అమ్మలను గద్దెలకు తీసుకొచ్చే క్రమంలో భక్తులు ఎదుర్కోళ్లతో ఆహ్వానం పలుకుతా రు. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎ దురుగా వేస్తూ మనసారా మొక్కుతుంటారు. శివసత్తుల పూనకాలు జంపన్న వాగులో శివసత్తుల పూనకాలు మేడారం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలతోపాటు పురుషులు కూడా శివాలూగుతూ జాతరకు వస్తారు. వీరంతా తొలుత జంపన్నవాగులో స్నానం ఆచరిస్తారు. తర్వాత పసుపుతో అలంకరించుకుంటారు. వరం పట్టుట.. సంతానం లేని భక్తులు వచ్చే జాతర నాటికి సంతానం కలగాలని నిష్టతో మొక్కుతుంటారు. ఈ మొక్కులను వరం పట్టడం అంటారు. ముందుగా జంపన్న వాగులో వెదురు వనం, కొబ్బరి కాయతో పూజలు జరిపి స్నానమాచరిస్తారు. అక్కడి నుంచి తడి బట్టలతో నేరుగా సారలమ్మ గుడికి చేరుకుంటారు. సారలమ్మ తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే క్రమంలో దారికి అడ్డంగా పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తారు. సారలమ్మ తల్లి మేడారంలోని గద్దెలపైకి వేళ్లేటప్పుడు పూజారులు వీరిపై నుం చి దాటుతూ వెళ్తారు. సంతానం కలిగిన దంపతులు తమ మొక్కులను తీర్చుకునే క్రమంలో భాగంగా గద్దెల సమీపంలో ఊయల తొట్టెలను కడతారు. తమ పిల్లలు చల్లగా ఉండేలా దీవించమని మొక్కుతుంటారు. ఒడి బియ్యం (కంక బియ్యం) భక్తులు తల్లులను ఆడపడుచులుగా భావిస్తూ ఒడిబియ్యం మొక్కులు చెల్లిస్తారు. తమ ఇళ్లలోనే నూతన వస్త్రంలో ఐదు సోళ్ల బియ్యం పోసుకుని ముడుపుగా నడుముకు కట్టుకుని వస్తారు. ఈ బియ్యంలో పసుపు, కుంకుమ, రవిక ముక్కలు, కుడుకలు, చీరలు ఉంచుతారు. మేకలు, కోళ్లు బలిచ్చుట.. మేడారం జాతరలో కోళ్లు, మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. వనదేవతలను దర్శించుకునే ముందు భక్తులు రెండు కొబ్బరికాయలు కొడతారు. ఈ సమయంలో పసుపు, కుంకుమతో పాటు అగరవత్తులు చెల్లించి దేవతలకు మొక్కుతారు. లక్ష్మీదేవర మొక్కు లక్ష్మీదేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుం ది. నాయకపోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారిపొడవునా నృత్యం చేస్తూ గద్దెలకు వస్తారు. ఆయనకు గద్దెల వద్ద డోలు, గజ్జెల మోతతో చప్పుళ్లు చేస్తారు. తర్వాత ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు. ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం సమ్మక్క తల్లిని నిష్టగా కొలిచే మగ భక్తుల్లో కొందరు శివసత్తులుగా మారుతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ఒళ్లంతా పసుపు రాసుకుంటారు. చీరసారె కట్టుకుని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివాలెత్తుతారు. -
అమ్మలను దర్శించుకున్న భక్తజనం
తాడ్వాయి: మేడారానికి అప్పుడే భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడం, ఈనెల 31నుంచి జాతర నిర్వహించనుండడంతో భక్తజనులు సమ్మక్క, సారలమ్మ తల్లులను ముందస్తుగానే దర్శించుకున్నారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవతల గద్దెలకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, గాజులు, ఒడి బియ్యం, కానుకలను సమర్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రైవేట్ వాహనాల్లో భారీగా మేడారం తరలివచ్చారు. సుమారు 2 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అంచనా. భక్తులు ఇబ్బందులు పడకుండా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
పూలు రాల్చి వరాలిచ్చే తల్లి
బోయకొండ గంగమ్మ బోయకొండ గంగమ్మ క్షేత్రంలో ఒక విశేషముంది. కోరిన కోరిక తీరుతుందో లేదో ఆ తల్లి వెంటనే తేల్చి చెబుతుంది. అలాగని భక్తుల నమ్మకం. ఆ క్షేత్రానికి వచ్చిన భక్తులు మూడు పూలను అమ్మవారి విగ్రహం శిరస్సున ఉంచుతారు. ఆ తర్వాత కళ్లు మూసుకుని తమ మనసులోని కోరికను స్మరిస్తారు. అప్పుడు శిరస్సున ఉన్న మూడు పూలలో ఏదైనా ఒకటి కుడివైపు పడితే ఆ కోరిక వెంటనే తీరుతుందని నమ్మకం. ఎడమ వైపు పడితే ఆలస్యంగా తీరుతుందని భావిస్తారు. మధ్యలో పడితే తటస్థ నిర్ణయంగా స్వీకరిస్తారు. ఇలాంటి ఆచారం ఉన్న క్షేత్రం బహుశా ఇదొక్కటే కావచ్చు. చిత్తూరు జిల్లాలోని బోయకొండలో వెలసిన గంగమ్మ క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాక ఎత్తయిన కొండల నడుమ, పచ్చదనంతో నిండిన వాలుల మధ్య ఉండటం వల్ల పర్యాటక క్షేత్రంగా కూడా ప్రజల ఆదరణ పొందుతోంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన గంగమ్మ తల్లిని దర్శించడానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆది, మంగళ. గురువారాల్లో కిటకిటలాడుతుంటారు. సంతానం లేని దంపతులు సంతానం కోసం ఇక్కడ మొక్కుకోవడం ఆనవాయితీ. ఇక్కడి అమ్మవారి తీర్థాన్ని తీసుకెళ్లి పంటల మీద చల్లితే చీడపీడలు పోతాయని రైతులు భావిస్తారు. కోరికలు తీరుతాయో లేదో పరీక్షించుకునేందుకు పూలపరీక్షకు భక్తులు వస్తుంటారు. కోర్కెలు తీరిన భక్తులు కుటుంబ సమేతంగా పిండి , నెయ్యిదీపాలతో మేళతాళాల నడుమ తరలి వచ్చి అమ్మవారికి మేకపోతులు సమర్పించి విందు భోజనాలతో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అవ్వ రూపంలో వచ్చిన అమ్మ గోల్కొండ నవాబులు దక్షణాదిపై తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్న రోజులు అవి. గోల్కొండ సైనికులు దండయాత్రలు చేస్తూ స్థానిక జమిందారులను పాలేగాళ్ళను జయించి ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో సిరిసంపదలతో కళకళలాడుతున్న పుంగనూరు సంస్థానంపై సేనల కన్ను పడింది. వెంటనే అవి ఆ ప్రాంతంపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం మొదలుపెట్టాయి. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. చౌడేపల్లె అడవులలో ఉన్న బోయల, ఏకిల గూడేల ప్రజలు భయభ్రాంతులు కావడంతో ఆ గూడేలను ఏలే దొరలు వారిని తీసుకొని కొండ గుట్టకు వెళ్ళి తలదాచుకొని జగజ్జననిని ప్రార్థించారు. వీరి మొర ఆలకించిన శక్తి స్వరూపిణి అవ్వ రూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పిందని ప్రతీతి. అంతేకాదు వారిని కాపాడటానికి స్వయంగా తన ఖడ్గంతో సేనలను హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గదాటికి ఇక్కడి రాతిగుండు నిట్టనిలువుగా చీలి ఇప్పటికీ ఆ ఉదంతానికి ఆనవాలుగా నిలిచి ఉంది. సేనలపై అమ్మవారి విజృంభణ కొనసాగిన తర్వాత అందరూ హతమవగా ఆమెను శాంతింపచేయడానికి బోయలు ఒక మేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండిపొమ్మని ప్రార్థించారు. వారి కోరిక మన్నించిన అమ్మ అక్కడే ఉండిపోయింది. ఆ విధంగా అమ్మవారిని దొర బోయకొండ గంగమ్మగా పిలువడం పరిపాటి అయింది. కొండపై బోయలు కట్టుకొన్న సిర్తారికోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టకింద అమ్మ నీరు తాగిన స్థలం గుర్తులు, అమ్మ ఉయ్యాల ఊగిన గుండ్లు నాటి ఘటనకు రుజువులుగా ఉన్నాయి. పవిత్రమైన పుష్కరిణి తీర్థం కొండపై అమ్మవారి ఆలయం సమీపాన అతి సహజంగా ఏర్పడిన పుష్కరిణిలోని నీరు పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వలన రోగాలు మటుమాయం అవుతాయని, పంటలపై చిలకరిస్తే చీడలు తొలగుతాయని దుష్టసంబంధమైన గాలి భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. ఒక లీటరు తీర్థం పది రూపాయలకే బాటిళ్లతో భక్తులకు అధికారులు అందుబాటులో ఉంచారు. సంతానం కోసం రాతి ఊయాలలు సంతానం లేని దంపతులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని సంతానం కలగాలని కోరుతూ పుష్కరిణిలో దుస్తులతో మునుగుతారు. తరువాత ఆలయం వద్ద చేరుకొని తడిబట్టలతో పూజలు చేసి గర్భాలయం ఎదుట అమ్మవారిని స్మరిస్తూ నమస్కారం చేస్తారు. ఆలయం వద్ద గల చెట్లకు చిన్న రాయిని బట్టతో ఉయ్యాలలా కట్టి సంతానం కోసం మొక్కుకుంటారు. సంతానం పుట్టిన తరువాత గంగమ్మ లేదా గంగా అనే తొలి అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. అందుకే ఈ ప్రాంతంలో బోయకొండ, బోయ కొండమ్మ, గంగులప్ప, గంగులమ్మ, గంగరాజు అనే పేర్లు సర్వసాధారణం. - నన్నేసాబ్గారి రసూల్, సాక్షి చౌడేపల్లి ప్రతినిధి రవాణా మార్గాలు: బోయకొండ క్షేత్రానికి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఈ క్షేత్రం తిరుపతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి 17 కిమీ దూరంలో పుంగనూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరుకు బోయకొండ 80 కిలోమీటర్ల దూరం. చౌడేపల్లె నుంచి 12 కిమీ దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి బోయకొండకు కర్ణాటక ఆర్టీసీవారు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. -
ముత్యాలమ్మకు మొక్కులు
-
గోవింద గోవింద
పుణ్యతీర్థం ద్వారకా మహర్షికి స్వామి పుట్టలో స్వయంభువుగా దర్శనమిచ్చాడట. అయితే, స్వామి వారి పాదుకలు పుట్టలో ఉండటంతో ఈ గోవిందుడికి పాదపూజ లేదు. స్వామి పాదపూజ చేసుకోవడానికి వీలుగా సర్వాంగ సంపూర్ణమైన శ్రీనివాసుని తీసుకొచ్చి స్వయంభువు వెనుక ప్రతిష్టించారు. దీంతో నిలువెత్తు గోవిందుడి దర్శనం భక్తులకు కన్నులపండుగ చేస్తుంది. ఒకే అంతరాలయంలో ఇలా ద్విమూర్తులు కొలువై ఉండటం ఈ పుణ్యస్థలి విశేషం. ఏడుకొండలలో తిరుమలేశుడు కొలువున్న క్షేత్రాన్ని పెద్ద తిరుపతిగా చెబుతారు. అలాంటప్పుడు చిన్నతిరుపతి కూడా ఉండాలి కదా! అదే ఈ ద్వారకా తిరుమల. పెద్ద తిరుపతిలో స్వామి వారి మొక్కును ఈ స్వామి సన్నిధానంలో చెల్లించినా అదే ఫలం లభిస్తుందని అయితే, ఇక్కడి మొక్కులు మాత్రం పెద్దతిరుపతిలో చెల్లించకూడదని పురాణాలు చెబుతున్నాయి. భక్తుల ప్రగాఢ విశ్వాసమూ అదే! సుదర్శన క్షేత్రంగా పిలిచే ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డివిజన్లో ఉన్న ఈ ద్వారాకా తిరుమల విశేషాలే ఇవి.. పవిత్ర గౌతమి - కృష్ణవేణి పుణ్యనదుల నడుమ శేషాకార రమణీయ సుందరగిరిపై కొలువైన ఈ పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేలాది మంది యాత్రికులు సందర్శించుకుంటారు. ఈ క్షేత్ర స్వరూపం శేషాకృతిలో ఉండటం వల్ల ఆదిశేషుని అవతారంగానూ, కృతయుగంలో ఈ కొండపై శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుని పేరుతో నరులను ఉద్ధరించేందుకు అర్చారూపాన ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో ఈ క్షేత్రాన్ని శ్రీరామచంద్రుని పితామహుడు అజుడు, తండ్రి దశరథుడితో పాటు స్వయంగా శ్రీరామచంద్రుడూ సేవించుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ద్విమూర్తుల వైభవం ఇద్దరు మూర్తులు ఉండటం వల్ల ఏటా ఈ క్షేత్రంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయ బద్ధమైనది. స్వయం వ్యక్తునిగా వెలసిన చినవెంకన్నకు వైశాఖ మాసంలోను, ప్రతిష్ఠ స్వామి అయిన పెద్ద వెంకన్నకు ఆశ్వయుుజవూసంలోను తిరుకల్యాణ వుహోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతారుు. నాలుగు రాజగోపురాలు గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వరస్వామికి కుడివైపున మంగతాయారు, ఆండాల్ అమ్మవార్లు కొలువుతీరి ఉన్నారు. అమ్మవార్లకు ప్రతీ శుక్రవారం నాడు విశేష కుంకుమపూజ నిర్వహిస్తారు. ఈ ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు రాజగోపురాలు ఉన్నాయి. వీటిలో పెద్దదయిన దక్షిణ గాలి గోపురం ఐదు అంతస్తులతో అలరారుతోంది. పడమరవైపు గోపురం గుండా వెళితే కళ్యాణ కట్ట. ఇక్కడ స్వామి వారికి భక్తులు తలనీలాలు అర్పిస్తారు. పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని సుదర్శన పుష్కరణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్థమని పిలుస్తారు. ఇక్కడ చక్రతీర్థం, రామ తీర్థం అనే రెండు స్నాన ఘట్టాలూ ఉన్నాయి. గుడి ప్రవేశంలో ముందుగా కళ్యాణ మండపం, అది దాటితే మెట్ల భాగం ఉంది. ఇక్కడే ఉన్న పాదుకా మండపం వద్ద స్వామి వారి పాదాలను దర్శించుకుని భక్తులు పైకి చేరుకుంటారు. పైకి ఎక్కే మెట్లమార్గంలో ఇరువైపులా స్వామి వారి దశావతారాలు ప్రతిష్టించి ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ప్రదక్షణ మార్గంలో ప్రహరీని ఆనుకుని 12 మంది అళ్వార్ల మూర్తులు ఉన్నాయి. దక్షిణ మార్గంలో దీపారాధన మండపం, ద్వజస్తంభం వెనుకవైపు ఆంజనేయ, గరుడస్వామి మందిరాలు, ప్రధాన ఆలయానికి తూర్పున యాగశాల, వాహన శాల, మహానివేదన శాల, పడమటి వైపున తిరువంటపడి ఉన్నాయి. ప్రతీ యేటా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్స వం, తొలి ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు, సాయంత్రం తిరువీధి సేవలు అత్యంత వేడుకగా నిర్వహిస్తారు - వైఎన్వీ.శ్రీనివాస్ సాక్షి, ద్వారకాతిరుమల తపోఫలితమే ద్వారకా తిరుమల ద్వారకావుహర్షి తపోఫలితంగా ఉద్భవించిన ఈ క్షేత్రాన్ని ద్వారకాతిరువులగా పిలుస్తున్నారు. ద్వారకుడు అనే మహర్షి స్వామి వారి సేవకై ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేయగా ద్వారకునికి స్వామి దక్షిణాభిముఖంగా ప్రత్యక్షమై సేవ చేసుకునే భాగ్యం కల్పించాడట. అందుకనే ఈ ఆలయంలోని మూలవిరాట్టు దక్షిణాభిముఖంగా కొలువుతీరి ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయుంభువుగా చినవెంకన్న పుట్టలో వెలియడం, స్వామివారి పాదుకలు పుట్టలో ఉండటంతో శ్రీవారికి పాదపూజ లేదు. దీంతో పెద్దతిరుపతి నుంచి పాదపూజ కోసం సర్వాంగ సంపూర్ణమైన శ్రీనివాసుని తీసుకొచ్చి శ్రీవైఖానస ఆగమ శాస్త్రోక్తంగా స్వయుంవ్యక్తుని వెనుక ప్రతిష్టించారు. దీంతో ఒకే అంతరాలయుంలో స్వామి వారు ద్వివుూర్తులుగా కొలువై ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. స్వయంభువుగా వెలిసిన స్వామి వారి అర్థభాగం మాత్రమే దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన భక్తులకు మోక్షం సిద్ధిస్తుందని, ఆ తరువాత ప్రతీష్టించబడిన ప్రతిమను కొలిచినందు వల్ల ధర్మార్ధ, కామ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఇలా చేరుకోవాలి ద్వారకా తిరుమలలో బస్ స్టేషన్ ఉంది. ఏలూరు, జంగారెడ్డి గూడెం, భీమడోలు, తాడేపల్లి గూడెం, హైదరాబాద్ల నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్ భీమడోలు 17 కిలోమీటర్ల దూరం. భీమడోలు రైల్వే జంక్షన్ నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి. -
తిరుమల శ్రీవారికి రూ.5 కోట్ల కానుకలు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలోని మొక్కులన్నీ చెల్లించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల శ్రీవారికి కానుకలు ఇస్తానని మొక్కుకున్నానని వెల్లడించారు. త్వరలోనే శ్రీవారికి రూ. 5 కోట్లు విలువ చేసే కానుకలు స్వయంగా సమర్పిస్తానని తెలిపారు. విజయవాడ కనకదుర్గ, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలు చేయిస్తామని ప్రకటించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి స్వర్ణకంకణం చేయిచేస్తామని చెప్పారు. అజ్మీర్ దర్గాను సందర్శించే భక్తుల కోసం రూ. 5 కోట్లతో వసతి గృహం నిర్మిస్తామన్నారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.