గోవింద గోవింద | Punya Tirtha | Sakshi
Sakshi News home page

గోవింద గోవింద

Published Tue, Jul 12 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

గోవింద గోవింద

గోవింద గోవింద

పుణ్యతీర్థం
 

ద్వారకా మహర్షికి స్వామి పుట్టలో స్వయంభువుగా దర్శనమిచ్చాడట. అయితే, స్వామి వారి పాదుకలు పుట్టలో ఉండటంతో ఈ గోవిందుడికి పాదపూజ లేదు. స్వామి పాదపూజ చేసుకోవడానికి వీలుగా సర్వాంగ సంపూర్ణమైన శ్రీనివాసుని తీసుకొచ్చి స్వయంభువు వెనుక ప్రతిష్టించారు. దీంతో నిలువెత్తు గోవిందుడి దర్శనం భక్తులకు కన్నులపండుగ చేస్తుంది.  ఒకే అంతరాలయంలో ఇలా ద్విమూర్తులు కొలువై ఉండటం ఈ పుణ్యస్థలి విశేషం.
 
ఏడుకొండలలో తిరుమలేశుడు కొలువున్న క్షేత్రాన్ని పెద్ద తిరుపతిగా చెబుతారు. అలాంటప్పుడు చిన్నతిరుపతి కూడా ఉండాలి కదా! అదే ఈ ద్వారకా తిరుమల. పెద్ద తిరుపతిలో స్వామి వారి మొక్కును ఈ స్వామి సన్నిధానంలో చెల్లించినా అదే ఫలం లభిస్తుందని అయితే, ఇక్కడి మొక్కులు మాత్రం పెద్దతిరుపతిలో చెల్లించకూడదని పురాణాలు చెబుతున్నాయి. భక్తుల ప్రగాఢ విశ్వాసమూ అదే! సుదర్శన క్షేత్రంగా పిలిచే ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ఎంతో ప్రసిద్ధి చెందింది.   పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డివిజన్‌లో ఉన్న ఈ ద్వారాకా తిరుమల విశేషాలే ఇవి..

పవిత్ర గౌతమి - కృష్ణవేణి పుణ్యనదుల నడుమ శేషాకార రమణీయ సుందరగిరిపై కొలువైన ఈ పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేలాది మంది యాత్రికులు సందర్శించుకుంటారు. ఈ క్షేత్ర స్వరూపం శేషాకృతిలో ఉండటం వల్ల ఆదిశేషుని అవతారంగానూ, కృతయుగంలో ఈ కొండపై శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుని పేరుతో నరులను ఉద్ధరించేందుకు అర్చారూపాన ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో ఈ క్షేత్రాన్ని శ్రీరామచంద్రుని పితామహుడు అజుడు, తండ్రి దశరథుడితో పాటు స్వయంగా శ్రీరామచంద్రుడూ సేవించుకున్నారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ద్విమూర్తుల వైభవం
ఇద్దరు మూర్తులు ఉండటం వల్ల ఏటా ఈ క్షేత్రంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయ బద్ధమైనది. స్వయం వ్యక్తునిగా వెలసిన చినవెంకన్నకు వైశాఖ మాసంలోను, ప్రతిష్ఠ స్వామి అయిన పెద్ద వెంకన్నకు ఆశ్వయుుజవూసంలోను తిరుకల్యాణ వుహోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతారుు.
 
నాలుగు రాజగోపురాలు
 గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వరస్వామికి కుడివైపున మంగతాయారు, ఆండాల్ అమ్మవార్లు కొలువుతీరి ఉన్నారు. అమ్మవార్లకు ప్రతీ శుక్రవారం నాడు విశేష కుంకుమపూజ నిర్వహిస్తారు. ఈ ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు రాజగోపురాలు ఉన్నాయి. వీటిలో పెద్దదయిన దక్షిణ గాలి గోపురం ఐదు అంతస్తులతో అలరారుతోంది. పడమరవైపు గోపురం గుండా వెళితే కళ్యాణ కట్ట. ఇక్కడ స్వామి వారికి భక్తులు తలనీలాలు అర్పిస్తారు.

పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని సుదర్శన పుష్కరణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్థమని పిలుస్తారు. ఇక్కడ చక్రతీర్థం, రామ తీర్థం అనే రెండు స్నాన ఘట్టాలూ ఉన్నాయి. గుడి ప్రవేశంలో ముందుగా కళ్యాణ మండపం, అది దాటితే మెట్ల భాగం ఉంది. ఇక్కడే ఉన్న పాదుకా మండపం వద్ద స్వామి వారి పాదాలను దర్శించుకుని భక్తులు పైకి చేరుకుంటారు. పైకి ఎక్కే మెట్లమార్గంలో ఇరువైపులా స్వామి వారి దశావతారాలు ప్రతిష్టించి ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ప్రదక్షణ మార్గంలో ప్రహరీని ఆనుకుని 12 మంది అళ్వార్‌ల మూర్తులు ఉన్నాయి. దక్షిణ మార్గంలో దీపారాధన మండపం, ద్వజస్తంభం వెనుకవైపు ఆంజనేయ, గరుడస్వామి మందిరాలు, ప్రధాన ఆలయానికి తూర్పున యాగశాల, వాహన శాల, మహానివేదన శాల, పడమటి వైపున తిరువంటపడి ఉన్నాయి. ప్రతీ యేటా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్స వం, తొలి ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు, సాయంత్రం తిరువీధి సేవలు అత్యంత వేడుకగా నిర్వహిస్తారు
 - వైఎన్‌వీ.శ్రీనివాస్ సాక్షి, ద్వారకాతిరుమల
 

తపోఫలితమే ద్వారకా తిరుమల
ద్వారకావుహర్షి తపోఫలితంగా ఉద్భవించిన ఈ క్షేత్రాన్ని ద్వారకాతిరువులగా పిలుస్తున్నారు. ద్వారకుడు అనే మహర్షి స్వామి వారి సేవకై ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేయగా ద్వారకునికి స్వామి దక్షిణాభిముఖంగా ప్రత్యక్షమై సేవ చేసుకునే భాగ్యం కల్పించాడట. అందుకనే ఈ ఆలయంలోని మూలవిరాట్టు దక్షిణాభిముఖంగా కొలువుతీరి ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయుంభువుగా చినవెంకన్న పుట్టలో వెలియడం, స్వామివారి పాదుకలు పుట్టలో ఉండటంతో శ్రీవారికి పాదపూజ లేదు. దీంతో పెద్దతిరుపతి నుంచి పాదపూజ కోసం సర్వాంగ సంపూర్ణమైన శ్రీనివాసుని తీసుకొచ్చి శ్రీవైఖానస ఆగమ శాస్త్రోక్తంగా స్వయుంవ్యక్తుని వెనుక ప్రతిష్టించారు. దీంతో ఒకే అంతరాలయుంలో స్వామి వారు ద్వివుూర్తులుగా కొలువై ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. స్వయంభువుగా వెలిసిన స్వామి వారి అర్థభాగం మాత్రమే దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన భక్తులకు మోక్షం సిద్ధిస్తుందని, ఆ తరువాత ప్రతీష్టించబడిన ప్రతిమను కొలిచినందు వల్ల ధర్మార్ధ, కామ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
 
ఇలా చేరుకోవాలి
ద్వారకా తిరుమలలో బస్ స్టేషన్ ఉంది. ఏలూరు, జంగారెడ్డి గూడెం, భీమడోలు, తాడేపల్లి గూడెం, హైదరాబాద్‌ల నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి.  సమీప రైల్వే స్టేషన్ భీమడోలు 17 కిలోమీటర్ల దూరం. భీమడోలు రైల్వే జంక్షన్ నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement