
సాక్షి, తిరుపతి: టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే విధులు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అలాగే, బోర్డు సభ్యుడు నరేష్.. వెంటనే టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనం లోపలికి మీడియాను సెక్యూరిటీ అనుమతించడం లేదు. పరిపాలన భవనం లోపల ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్నారు. పరిపాలన భవనం మెయిన్ రోడ్ గేట్ ముందు మీడియాను లోపలికి పంపించడం లేదు.

ఇదిలా ఉండగా..తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్.

అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment