పూలు రాల్చి వరాలిచ్చే తల్లి | Boyakonda gangamma | Sakshi
Sakshi News home page

పూలు రాల్చి వరాలిచ్చే తల్లి

Published Tue, Oct 18 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

పూలు రాల్చి వరాలిచ్చే తల్లి

పూలు రాల్చి వరాలిచ్చే తల్లి

బోయకొండ గంగమ్మ

 

బోయకొండ గంగమ్మ క్షేత్రంలో ఒక విశేషముంది. కోరిన కోరిక తీరుతుందో లేదో ఆ తల్లి వెంటనే తేల్చి చెబుతుంది. అలాగని భక్తుల నమ్మకం.  ఆ క్షేత్రానికి వచ్చిన భక్తులు మూడు పూలను అమ్మవారి విగ్రహం శిరస్సున ఉంచుతారు. ఆ తర్వాత కళ్లు  మూసుకుని తమ మనసులోని కోరికను స్మరిస్తారు. అప్పుడు శిరస్సున ఉన్న మూడు పూలలో ఏదైనా ఒకటి కుడివైపు పడితే ఆ కోరిక వెంటనే తీరుతుందని నమ్మకం. ఎడమ వైపు పడితే ఆలస్యంగా తీరుతుందని భావిస్తారు. మధ్యలో పడితే తటస్థ నిర్ణయంగా స్వీకరిస్తారు. ఇలాంటి ఆచారం ఉన్న క్షేత్రం బహుశా ఇదొక్కటే కావచ్చు.


చిత్తూరు జిల్లాలోని  బోయకొండలో వెలసిన గంగమ్మ క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాక ఎత్తయిన కొండల నడుమ,  పచ్చదనంతో నిండిన వాలుల మధ్య ఉండటం వల్ల పర్యాటక క్షేత్రంగా కూడా ప్రజల ఆదరణ పొందుతోంది. ఇక్కడ  స్వయంభువుగా వెలసిన గంగమ్మ తల్లిని దర్శించడానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు  ఆది, మంగళ. గురువారాల్లో కిటకిటలాడుతుంటారు. సంతానం లేని దంపతులు సంతానం కోసం ఇక్కడ మొక్కుకోవడం ఆనవాయితీ. ఇక్కడి అమ్మవారి తీర్థాన్ని తీసుకెళ్లి పంటల మీద చల్లితే చీడపీడలు పోతాయని రైతులు భావిస్తారు. కోరికలు తీరుతాయో లేదో పరీక్షించుకునేందుకు పూలపరీక్షకు భక్తులు వస్తుంటారు. కోర్కెలు తీరిన భక్తులు కుటుంబ సమేతంగా పిండి , నెయ్యిదీపాలతో  మేళతాళాల నడుమ తరలి వచ్చి అమ్మవారికి మేకపోతులు సమర్పించి విందు భోజనాలతో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.

 

అవ్వ రూపంలో వచ్చిన అమ్మ
గోల్కొండ నవాబులు దక్షణాదిపై తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్న రోజులు అవి. గోల్కొండ సైనికులు  దండయాత్రలు చేస్తూ స్థానిక జమిందారులను పాలేగాళ్ళను జయించి ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో సిరిసంపదలతో కళకళలాడుతున్న పుంగనూరు సంస్థానంపై సేనల కన్ను పడింది. వెంటనే అవి ఆ ప్రాంతంపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం మొదలుపెట్టాయి. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. చౌడేపల్లె అడవులలో ఉన్న బోయల, ఏకిల గూడేల ప్రజలు భయభ్రాంతులు కావడంతో ఆ గూడేలను ఏలే దొరలు వారిని తీసుకొని కొండ గుట్టకు వెళ్ళి తలదాచుకొని జగజ్జననిని ప్రార్థించారు. వీరి మొర ఆలకించిన శక్తి స్వరూపిణి అవ్వ రూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పిందని ప్రతీతి. అంతేకాదు వారిని కాపాడటానికి స్వయంగా తన ఖడ్గంతో సేనలను హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గదాటికి ఇక్కడి రాతిగుండు నిట్టనిలువుగా చీలి ఇప్పటికీ ఆ ఉదంతానికి ఆనవాలుగా నిలిచి ఉంది. సేనలపై అమ్మవారి విజృంభణ కొనసాగిన తర్వాత అందరూ హతమవగా ఆమెను శాంతింపచేయడానికి బోయలు ఒక మేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండిపొమ్మని ప్రార్థించారు. వారి కోరిక మన్నించిన అమ్మ అక్కడే ఉండిపోయింది. ఆ విధంగా అమ్మవారిని దొర బోయకొండ గంగమ్మగా పిలువడం పరిపాటి అయింది. కొండపై బోయలు కట్టుకొన్న సిర్తారికోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టకింద అమ్మ నీరు తాగిన స్థలం గుర్తులు, అమ్మ ఉయ్యాల ఊగిన గుండ్లు నాటి ఘటనకు రుజువులుగా ఉన్నాయి.

 

పవిత్రమైన పుష్కరిణి తీర్థం
కొండపై అమ్మవారి ఆలయం సమీపాన అతి సహజంగా ఏర్పడిన పుష్కరిణిలోని నీరు పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. ఈ  తీర్థాన్ని సేవించడం వలన రోగాలు మటుమాయం అవుతాయని, పంటలపై చిలకరిస్తే చీడలు తొలగుతాయని దుష్టసంబంధమైన గాలి భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. ఒక లీటరు తీర్థం పది రూపాయలకే బాటిళ్లతో భక్తులకు అధికారులు అందుబాటులో ఉంచారు.

 

సంతానం కోసం రాతి ఊయాలలు
సంతానం లేని దంపతులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని సంతానం కలగాలని కోరుతూ పుష్కరిణిలో దుస్తులతో మునుగుతారు. తరువాత ఆలయం వద్ద చేరుకొని తడిబట్టలతో పూజలు చేసి గర్భాలయం ఎదుట అమ్మవారిని స్మరిస్తూ నమస్కారం చేస్తారు. ఆలయం వద్ద గల చెట్లకు చిన్న రాయిని బట్టతో ఉయ్యాలలా కట్టి సంతానం కోసం మొక్కుకుంటారు. సంతానం పుట్టిన తరువాత గంగమ్మ లేదా  గంగా అనే తొలి అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. అందుకే ఈ ప్రాంతంలో బోయకొండ, బోయ కొండమ్మ, గంగులప్ప, గంగులమ్మ, గంగరాజు అనే పేర్లు సర్వసాధారణం.  - నన్నేసాబ్‌గారి రసూల్, సాక్షి చౌడేపల్లి ప్రతినిధి


రవాణా మార్గాలు: బోయకొండ క్షేత్రానికి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఈ క్షేత్రం తిరుపతి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి 17 కిమీ దూరంలో పుంగనూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరుకు బోయకొండ 80 కిలోమీటర్ల దూరం. చౌడేపల్లె నుంచి 12 కిమీ దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి బోయకొండకు కర్ణాటక ఆర్టీసీవారు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement