శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సమ్మక్క-సారలమ్మ జాతర పోటు తగిలింది. జాతర సందర్భంగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. నాలుగైదు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కార్మికుల హాజరుశాతం తగ్గింది. దీంతో రోజువారీగా సంస్థకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లుతోంది. ప్రతి గనిలో 20 నుంచి 25 శాతం మంది కార్మికులు జాతర కోసం వెళ్లారు. రెండేళ్ల కోసారి జాతర సందర్భంగా కం పెనీకి ఈ ఐదు రోజులు గండమే. పెద్ద ఎత్తున కార్మికుల కుటుంబాలు మొక్కులు తీర్చుకోవడానికి మొదటికి(మేడారం)కు వెళ్తున్నారు. దీంతో భారీగా హాజరుశాతం పడిపోవడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది.
పని స్థలాల్లో యంత్రాలు బంద్
బొగ్గు ఉత్పత్తి ప్రభావం అధికంగా భూగర్భ గనులపై పడింది. కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంలో కొన్ని గనుల్లో వచ్చిన సంఖ్య ఆధారంగా కొన్ని మిషన్లు నడుపుతున్నారు. దీంతో కొన్ని పనిస్థలాలు బంద్ అవుతున్నాయి. బుధ, గురువారం, శుక్రవారం కూడా చాలా గనుల్లో ఇదే పరిస్తితి ఉంటుంది. దీనికి తోడు సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టర్లు సమ్మె చేయడంతో కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధులు లేక ఉన్నారు. దీంతో సివిల్ డిపార్టుమెంట్‌లో నిర్మాణ పనులు కూడా ఆగిపోయాయి. దీని ప్రభావం పరోక్షంగా కంపెనీపై పడింది. నేరుగా ఉత్పత్తిపై లేకున్నా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు లేక చాలా డిపార్టుమెంట్‌లు బోసిపోతున్నాయి.
ఇప్పటికే 5 మిలియన్ టన్నుల లోటు
సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 5 మిలియన్ టన్నుల లోటు ఉంది. దీనికి జాతర తోడవడంతో మరింత పెరుగుతోంది. రోజు కార్మికుల హాజరు శాతం 20 నుంచి 25 శాతం తగ్గుతోంది. కంపెనీ రోజు వారి ఉత్పత్తి లక్ష్యం 2.10 లక్షల టన్నులు ఉండగా సాధారణ రోజుల కంటే కూడా జాతర వల్లే 30 వేల వరకు తక్కువగా వస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా ఉత్పత్తి చూస్తే శ్రీరాంపూర్ డివిజన్ రోజు వారి లక్ష్యం 22,621 గాను 17,044 టన్నులు వస్తుండగా, మందమర్రి ఏరియాలో 10,788కి గాను 7,017, బెల్లంపల్లిలో 23,397కు గాను 18,012 టన్నులు వస్తుంది. సాధారణ రోజుల్లో రీజియన్ సరాసరి తీసుకుంటే 90 శాతం వరకు వస్తుంటే ఇప్పుడు 65 శాతం వరకే జాతర వల్ల వస్తుంది. కాగా, 15వ తేదీ నాటికి సమ్మక్క సారలమ్మలు వనం వెళ్లిన తరువాతే కంపెనీ ఉత్పత్తి చక్కబడనుంది.
సింగరేణికి ‘సమ్మక్క’ దెబ్బ
Published Fri, Feb 14 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement
Advertisement